వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నియంత్రిత, ప్రమాదకర పేలుడు పదార్థాల ఆన్‌లైన్‌ జాబితా, హోస్టింగ్‌, ప్రకటనలు, విక్రయాలపై సీసీపీఏ చర్యలు

సీసీపీఏ జోక్యంతో 7 ఆన్‌లైన్‌ వేదికల నుంచి 3,940 మంది విక్రేతల తొలగింపు



ఆన్‌లైన్‌ వేదికల్లో పేలుడు పదార్థాల విక్రయాలపై జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1915కు ఫిర్యాదు చేయవచ్చు

నాడు పోస్టు చేయడమైనది: 19 OCT 2026 4:38PM by PIB Hyderabad

వినియోగదారుల రక్షణ చట్టం–2019, వినియోగదారుల రక్షణ (ఈ-కామర్స్‌) నిబంధనలు–2020, పేలుడు పదార్థాల చట్టం–1884, అమ్మోనియం నైట్రేట్‌ నిబంధనలు–2012, ఇతర వర్తించే నిబంధనల ప్రకారం కేంద్ర వినియోగదారుల రక్షణ ప్రాధికార సంస్థ (సీసీపీఏ).. నియంత్రిత, ప్రమాదకర పేలుడు పదార్థాలను అనధికారికంగా ఆన్‌లైన్‌లో జాబితా చేయడం, అందుబాటులో ఉంచడం, ప్రకటనలు చేయడం, వాటి విక్రయాలకు సహకరించడం వంటి చర్యలపై నియంత్రణ చర్యలు ప్రారంభించింది. అమ్మోనియం నైట్రేట్‌, గన్‌పౌడర్‌, పిక్రిక్‌ యాసిడ్‌, పెంటాఎరిథ్రిటాల్‌ టెట్రానైట్రేట్‌ (పీఈటీఎన్‌) పదార్థాల విక్రయాలకు సంబంధించి ఈ చర్యలు చేపట్టింది. వినియోగదారుల భద్రత, ప్రజా భద్రతను బలోపేతం చేయడం, బాధ్యతాయుతమైన ఈ-కామర్స్‌ విధానాలను ప్రోత్సహించడం ఈ చర్యల లక్ష్యం.

ఈ పదార్థాలను పేలుడు పదార్థాలుగా వర్గీకరించారు. పేలుడు పదార్థాల చట్టం–1884, దాని కింద రూపొందించిన నిబంధనల ప్రకారం వీటిని నియంత్రిస్తారు. వీటిని చట్టబద్ధంగా విక్రయించడానికి, కొనుగోలు చేయడానికి నిర్దేశిత లైసెన్సు తప్పనిసరి. ఆన్‌లైన్‌ వేదికలు విక్రేతల చెల్లుబాటు అయ్యే పీఈఎస్‌ఓ (పెట్రోలియం, పేలుడు పదార్థాల భద్రతా సంస్థ) లైసెన్సు వివరాలను వెల్లడించాలి. కొనుగోలుకు ముందు కొనుగోలుదారుల గుర్తింపును, వారికి సంబంధిత లైసెన్సు ఉందో లేదో కూడా ధ్రువీకరించాలి.

ఇలాంటి పదార్థాలను ఆన్‌లైన్‌ వేదికల్లో జాబితా చేయడం, విక్రయించడంపై సీసీపీఏ చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా పలు ఆన్‌లైన్‌ వేదికలకు సంబంధించి చర్యలు చేపట్టింది.

ఇండియామార్ట్

ట్రేడ్ ఇండియా

డయల్4ట్రేడ్

జస్ట్‌డయల్

సిగ్మా-ఆల్డ్రిచ్ ఇండియా

ఎక్స్‌పోర్టర్స్ ఇండియా

ఐబైకెమికల్స్

 ఈ ఆన్‌లైన్‌ వేదికలు మొత్తం 3,940 మంది విక్రేతలు, వారి ఉత్పత్తుల జాబితా వివరాలను సమర్పించాయి. ఈ అన్ని వేదికల నుంచి సంబంధిత జాబితాలను తొలగించారు.

ఈ కింది కేసుల్లో సీసీపీఏ ఇప్పటివరకు తుది ఉత్తర్వులు జారీ చేసింది.

డయల్‌4ట్రేడ్‌: అమ్మోనియం నైట్రేట్‌ విక్రయానికి సంబంధించి రూ.10 లక్షల జరిమానా విధించింది.

ఎక్స్‌పోర్టర్స్‌ఇండియా (వెబ్‌లింక్‌.ఇన్‌ ప్రైవేటు లిమిటెడ్‌): అమ్మోనియం నైట్రేట్‌, పెంటాఎరిథ్రిటాల్‌ టెట్రానైట్రేట్‌ విక్రయాలకు సంబంధించి రూ.10 లక్షల జరిమానా విధించింది.

ఎక్స్‌పోర్టర్స్‌ఇండియా (వెబ్‌లింక్‌.ఇన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌): పిక్రిక్‌ యాసిడ్‌ విక్రయానికి సంబంధించి రూ.10 లక్షల జరిమానా విధించింది.

1. డయల్‌4ట్రేడ్‌ టెక్నాలజీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌

అమ్మోనియం నైట్రేట్‌ను విక్రయించేందుకు తమ ఆన్‌లైన్‌ వేదికలో జాబితా చేయడం, విక్రయాలకు సహకరించడం వంటి చర్యలను నిలిపివేయాలని కంపెనీని ఆదేశిస్తూ, కేంద్ర వినియోగదారుల రక్షణ ప్రాధికార సంస్థ ఆ సంస్థకు రూ.10 లక్షల జరిమానా విధించింది. ఇతర పేలుడు పదార్థాల జాబితా, విక్రయాలకు సహకరించే చర్యలను కూడా నిలిపివేయాలని ఆదేశించింది.

ఈ ఉత్తర్వును సవాలు చేస్తూ కంపెనీ వినియోగదారుల రక్షణ చట్టంలోని సెక్షన్‌ 24 కింద జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ (ఎన్‌సీడీఆర్‌సీ)ను ఆశ్రయించింది. 2026 అక్టోబర్‌ 9న ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం ఎన్‌సీడీఆర్‌సీ ఆ అప్పీల్‌ను కొట్టివేసింది.

ఈ కేసులో ఆన్‌లైన్‌ జాబితాలను చట్టంలోని సెక్షన్లు 2(28), 2(47) ప్రకారం తప్పుదారి పట్టించే ప్రకటనలు, అన్యాయమైన వ్యాపార పద్ధతులుగా ఉత్తర్వులో పేర్కొన్నారు. సంబంధిత పదార్థాలను తమ వేదికలో జాబితా చేయడం, వాటి విక్రయాలకు సహకరించడం నిలిపివేయాలని కంపెనీని ఆదేశించారు.

2. ఎక్స్‌పోర్టర్స్‌ఇండియా (వెబ్‌లింక్‌.ఇన్‌ ప్రైవేటు లిమిటెడ్‌) 

పేలుడు పదార్థాల చట్టం–1884, దాని కింద రూపొందించిన నిబంధనల ప్రకారం అమ్మకాలను నియంత్రించే అమ్మోనియం నైట్రేట్‌, పెంటాఎరిథ్రిటాల్‌ టెట్రానైట్రేట్‌ పదార్థాలను ఆన్‌లైన్‌లో జాబితా చేయడం, అందుబాటులో ఉంచడం, ప్రకటనలు చేయడం, వాటి విక్రయాలకు సహకరించడం వంటి చర్యలకు సంబంధించి కేంద్ర వినియోగదారుల రక్షణ ప్రాధికార సంస్థ (సీసీపీఏ) కంపెనీకి రూ.10 లక్షల జరిమానా విధించింది.

మరో కేసులో పేలుడు పదార్థాల చట్టం–1884, దాని కింద రూపొందించిన నిబంధనల ప్రకారం విక్రయాలను నియంత్రించే పిక్రిక్‌ యాసిడ్‌ను ఆన్‌లైన్‌లో జాబితా చేయడం, అందుబాటులో ఉంచడం, ప్రకటనలు చేయడం, దాని విక్రయానికి సహకరించడం వంటి చర్యలకు సంబంధించి కంపెనీకి రూ.10 లక్షల జరిమానా విధించింది.

ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎక్స్‌పోర్టర్స్‌ఇండియా వినియోగదారుల రక్షణ చట్టంలోని సెక్షన్‌ 24 కింద జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ (ఎన్‌సీడీఆర్‌సీ) ముందు అప్పీళ్లు దాఖలు చేసింది. వీటిని రానున్న కాలంలో విచారణకు స్వీకరించే అవకాశం ఉంది.

3. ఇండియామార్ట్‌ ఇంటర్‌మెష్‌ లిమిటెడ్‌

అమ్మోనియం నైట్రేట్‌, పెంటాఎరిథ్రిటాల్‌ టెట్రానైట్రేట్‌, గన్‌పౌడర్‌, పిక్రిక్‌ యాసిడ్‌ వంటి ప్రమాదకర పదార్థాలను తమ ఆన్‌లైన్‌ వేదికలో జాబితా చేయడం, అందుబాటులో ఉంచడం, ప్రకటనలు చేయడం, వాటి విక్రయాలకు సహకరించడం వంటి అంశాలకు సంబంధించి కేంద్ర వినియోగదారుల రక్షణ ప్రాధికార సంస్థ ఇండియామార్ట్‌ ఇంటర్‌మెష్‌ లిమిటెడ్‌కు నోటీసులు జారీ చేసింది.

ఈ వ్యవహారంపై దర్యాప్తు విభాగం డైరెక్టర్‌ జనరల్‌ తన విచారణను పూర్తి చేశారు. విచారణ నివేదికను కంపెనీకి అందజేశారు. ఈ నివేదికపై ఇండియామార్ట్‌ తన సమాధానాన్ని సమర్పించింది.

వినియోగదారుల రక్షణ చట్టం–2019 నిబంధనలకు అనుగుణంగా తుది ఉత్తర్వులు జారీ చేసే ముందు కంపెనీకి తన వాదనలు వినిపించేందుకు పలుమార్లు అవకాశం కల్పించారు. ఈ విచారణ సందర్భంగా కంపెనీ తన వాదనలను సమగ్రంగా సమర్పించింది.

సీసీపీఏ జారీ చేసిన షో కాజ్ నోటీసులను సవాలు చేస్తూ కంపెనీ రిట్‌ పిటిషన్‌ ద్వారా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.

4. జస్ట్‌డయల్‌

అమ్మోనియం నైట్రేట్‌ను ఆన్‌లైన్‌లో జాబితా చేయడం, అందుబాటులో ఉంచడం, ప్రకటనలు చేయడం, దాని విక్రయాలకు సహకరించడం వంటి అంశాలకు సంబంధించి సీసీపీఏ జస్ట్‌డయల్‌ లిమిటెడ్‌కు నోటీసులు జారీ చేసింది.

ఈ వ్యవహారంపై దర్యాప్తు విభాగం డైరెక్టర్‌ జనరల్‌ తన విచారణను పూర్తి చేశారు. విచారణ నివేదికను కంపెనీకి అందజేశారు. ఈ నివేదికపై జస్ట్‌డయల్‌ తన సమాధానాన్ని సమర్పించింది.

వినియోగదారుల రక్షణ చట్టం–2019 ప్రకారం తుది ఉత్తర్వులు జారీ చేసే ముందు కంపెనీకి తన వాదనలు వినిపించేందుకు అవకాశం కల్పించాలి. ఈ కేసులో ఇప్పటివరకు కంపెనీకి నాలుగుసార్లు విచారణకు హాజరయ్యే అవకాశం ఇచ్చారు. అయితే ప్రతి సందర్భంలోనూ కంపెనీ విచారణను వాయిదా వేయాలని కోరింది. ఈ కేసులో తదుపరి, తుది విచారణను 2026 అక్టోబర్‌ 23న నిర్వహించనున్నారు.

దర్యాప్తు విభాగం డైరెక్టర్‌ జనరల్‌ విచారణలో ఉన్న కేసులు

సిగ్మా-ఆల్డ్రిచ్‌ కెమికల్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌: అమ్మోనియం నైట్రేట్‌, పెంటాఎరిథ్రిటాల్‌ టెట్రానైట్రేట్‌ (PETN), పిక్రిక్‌ యాసిడ్‌ వంటి పదార్థాలను ఆన్‌లైన్‌లో జాబితా చేయడం, అందుబాటులో ఉంచడం, ప్రకటనలు చేయడం, వాటి విక్రయాలకు సహకరించడం వంటి అంశాలపై విచారణ జరుగుతోంది.

ట్రేడ్‌ఇండియా (ఇన్ఫోకామ్‌ నెట్‌వర్క్‌ ప్రైవేటు లిమిటెడ్‌): పిక్రిక్‌ యాసిడ్‌, పెంటాఎరిథ్రిటాల్‌ టెట్రానైట్రేట్‌ పదార్థాలను ఆన్‌లైన్‌లో జాబితా చేయడం, అందుబాటులో ఉంచడం, ప్రకటనలు చేయడం, వాటి విక్రయాలకు సహకరించడం వంటి అంశాలపై విచారణ జరుగుతోంది.

ఐబైకెమికల్స్‌: పిక్రిక్‌ యాసిడ్‌ను ఆన్‌లైన్‌లో జాబితా చేయడం, అందుబాటులో ఉంచడం, ప్రకటనలు చేయడం, దాని విక్రయానికి సహకరించడం వంటి అంశాలపై విచారణ జరుగుతోంది. 

వర్తించే చట్టాలు, వినియోగదారుల భద్రతా ప్రమాణాలను ఉల్లంఘిస్తూ నియంత్రిత లేదా ప్రమాదకర పదార్థాలను అనధికారికంగా పొందేందుకు డిజిటల్‌ మార్కెట్‌ప్లేస్‌లు సహకరించకుండా చూడాలనే ప్రభుత్వ నిబద్ధతను ఈ చర్యలు బలపరుస్తున్నాయి.

వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ-కామర్స్‌ వ్యవస్థలో వినియోగదారుల హక్కులను పరిరక్షించడం, సురక్షితమైన డిజిటల్‌ మార్కెట్‌ప్లేస్‌లను నిర్ధారించడం, అన్యాయమైన వ్యాపార పద్ధతులను నివారించడం, వినియోగదారుల విశ్వాసాన్ని బలోపేతం చేయడం పట్ల కేంద్ర వినియోగదారుల రక్షణ ప్రాధికార సంస్థ తన నిబద్ధతను కొనసాగిస్తోంది.

****


(రిలీజ్ ఐడి: 2325306) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , Urdu , Marathi , हिन्दी , Kannada