వ్యవసాయ మంత్రిత్వ శాఖ
మొబైల్‌లోనే ప్రభుత్వ సేవలు.. రైతుల కోసం కొత్త పోర్టల్‌ను ప్రారంభించిన శివరాజ్ సింగ్
వ్యవసాయ పథకాల ప్రయోజనాలన్నీ రైతులు మొబైల్ ఫోన్లలోనే పొందే అవకాశం: శివరాజ్ సింగ్ చౌహాన్
ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండానే రైతులకు నేరుగా ప్రభుత్వ సాయం: శివరాజ్ సింగ్ చౌహాన్
రైతులకు డిజిటల్ సాధికారత కల్పించేలా వ్యవసాయ మంత్రిత్వ శాఖ సేవలన్నీ ఒకే పోర్టల్‌లో: కేంద్ర వ్యవసాయ మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
19 OCT 2026 4:41PM by PIB Hyderabad
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్దేశించిన డిజిటల్ ఇండియా లక్ష్యాన్ని, రైతుల సంక్షేమం పట్ల ఆయన నిబద్ధతను ముందుకు తీసుకెళ్తూ నవీకరించిన అగ్రి వెల్ఫేర్ పోర్టల్‌ను కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేడు అధికారికంగా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా రైతులు తమ మొబైల్ ఫోన్ల ద్వారానే ప్రభుత్వ పథకాలు, ఆర్థిక సాయం, విశ్వసనీయ వ్యవసాయ సమాచారాన్ని నేరుగా, సులభంగా పొందేలా చేయడం ఈ పోర్టల్ లక్ష్యం. తద్వారా విధానపరమైన అడ్డంకులు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.
పోర్టల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, ప్రజలకు, రైతులకు ఎల్లప్పుడూ మొబైల్ ఫోన్ల ద్వారానే ప్రభుత్వం అందుబాటులో ఉండాలన్నది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టమైన లక్ష్యమని తెలిపారు. సాంకేతికత వ్యవసాయ క్షేత్రాలకు, గ్రామీణ సమాజాలకు చేరి రైతుల జీవితాలను సులభతరం చేసినప్పుడే దాని అసలైన ప్రయోజనం నెరవేరుతుందని అన్నారు. అప్‌గ్రేడ్ చేసిన ఈ పోర్టల్ ద్వారా పథకాల వివరాలు తెలుసుకోవడానికి, దరఖాస్తులు సమర్పించడానికి రైతులు ఇకపై పలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. వివిధ వెబ్‌సైట్లను వెతకాల్సిన ఇబ్బంది కూడా తొలగుతుంది. రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్పీఓలు), ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (పీఏసీలు), వ్యవసాయ శాస్త్రవేత్తలు, పరిశోధకులు, అంకుర సంస్థలను కూడా ఈ వేదికపైకి తీసుకురానున్నారు. తద్వారా వ్యవసాయ రంగానికి సంబంధించిన విస్తృత వ్యవస్థకు ఒకే ఉమ్మడి డిజిటల్ వేదిక అందుబాటులోకి వస్తుంది. విశ్వసనీయ సమాచార ప్రాధాన్యాన్ని స్పష్టం చేస్తూ, పోర్టల్‌లోని వివరాలు కచ్చితంగా ఉండటంతో పాటు ఎప్పటికప్పుడు నవీకరించేలా చూడాలని అధికారులను శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశించారు. పాతబడిన లేదా అసంపూర్ణ సమాచారం వల్ల వ్యవస్థపై ప్రజల నమ్మకం దెబ్బతినే అవకాశం ఉందని, అందువల్ల పోర్టల్ విజయవంతం కావాలంటే నిరంతర నవీకరణలు తప్పనిసరని ఆయన స్పష్టం చేశారు. విద్య పరిమితంగా ఉన్నవారితో సహా చిన్న, సన్నకారు రైతులందరికీ సులభంగా అర్థమయ్యే భాషలో వివరాలు ఉండాలని, ప్రక్రియలు కూడా సరళంగా ఉండాలని ఆయన సూచించారు. అప్పుడే రైతులు ఈ డిజిటల్ వేదికను ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉపయోగించుకోగలరని పేర్కొన్నారు. పోర్టల్‌తో పాటు ఇతర డిజిటల్ సాధనాలను రైతులు సమర్థంగా వినియోగించుకునేలా దేశవ్యాప్తంగా కృషి విజ్ఞాన కేంద్రాల ( ద్వారా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
పోర్టల్ నవీకరణను నిర్ణీత గడువులోగా పూర్తి చేసిన సాంకేతిక బృందం మొత్తాన్ని శివరాజ్ సింగ్ చౌహాన్ అభినందించారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ రూపొందించిన డిజిటల్ బ్రాండ్ ఐడెంటిటీ మాన్యువల్ 3.0, భారత ప్రభుత్వ వెబ్‌సైట్ల మార్గదర్శకాలు 3.0కు అనుగుణంగా ఈ పోర్టల్‌ను అభివృద్ధి చేశారు. దివ్యాంగులు సహా ప్రతి ఒక్కరూ సులభంగా వినియోగించుకునేలా, మొబైల్ ఫోన్లకు అనుకూలంగా, భద్రతతో కూడిన డిజిటల్ సేవలను అందించేలా దీనిని రూపొందించారు. పీఎం - కిసాన్, అగ్రిస్టాక్, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన సహా ప్రధాన ప్రభుత్వ పథకాలకు ఈ పోర్టల్ ఏకగవాక్ష వేదికగా పనిచేయనుంది. ఒకే ఇంటర్‌ఫేస్ ద్వారా సంబంధిత సేవలు, సమాచారాన్ని రైతులు సులభంగా పొందేందుకు ఇది దోహదపడుతుంది. పోర్టల్ ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ కార్యదర్శి అతిష్ చంద్ర, అదనపు కార్యదర్శి ప్రమోద్ మెహెర్దా, డిజిటల్ వ్యవసాయ విభాగానికి చెందిన ఉన్నతాధికారులు, మంత్రిత్వ శాఖ, జాతీయ సమాచార కేంద్రం అధికారులు పాల్గొన్నారు.
అగ్రి వెల్ఫేర్ పోర్టల్ ప్రధాన ప్రయోజనాలు
అన్ని సేవలు ఒకే చోట: వ్యవసాయ మంత్రిత్వ శాఖ పథకాలు, సబ్సిడీలు, నిబంధనలు, డిజిటల్ సేవలకు సంబంధించిన సమాచారం ఒకే పోర్టల్‌లో అందుబాటులో ఉంటుంది. దీంతో వివిధ వేదికల్లో సమాచారం కోసం వెతికేందుకు రైతులు వెచ్చించే సమయం, శ్రమ తగ్గుతాయి.
పారదర్శకత పెంపు.. మధ్యవర్తుల ప్రమేయం తగ్గింపు: ఆన్‌లైన్‌లో అర్హతలను తనిఖీ చేసుకోవడం, నేరుగా దరఖాస్తు చేసుకునే సదుపాయం, ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా ఆర్థిక సాయం అందించడం వల్ల ప్రక్రియల్లో పారదర్శకత పెరుగుతుంది. మధ్యవర్తుల ప్రమేయం తగ్గుతుంది.
గ్రామీణ ప్రాంతాల్లోనూ సులభ వినియోగం: గ్రామీణ వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ పోర్టల్‌ను రూపొందించారు. తక్కువ సామర్థ్యం ఉన్న స్మార్ట్‌ఫోన్లలోనూ, ఇంటర్నెట్ కనెక్టివిటీ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లోనూ సజావుగా పనిచేసేలా దీన్ని సరళంగా, వినియోగదారులకు అనుకూలంగా తీర్చిదిద్దారు.
సకాలంలో విశ్వసనీయ వ్యవసాయ సమాచారం: వాతావరణ పరిస్థితులు, శాస్త్రీయ సాగు పద్ధతులు, విత్తనాలు, ఎరువుల లభ్యత, వ్యవసాయ ఉత్పత్తుల ప్రస్తుత మార్కెట్ ధరలకు సంబంధించిన ప్రామాణిక సమాచారాన్ని రైతులు సులభంగా పొందగలుగుతారు.
దివ్యాంగులకు సులభంగా అందుబాటు: ప్రజలకు చేరువగా ప్రభుత్వ ప్రమాణాలకు అనుగుణంగా ఈ పోర్టల్‌ను రూపొందించారు. స్క్రీన్ రీడర్‌లు, సులభమైన నావిగేషన్‌కు ఇది సహకరిస్తుంది. దీని ద్వారా దృష్టి లోపం ఉన్నవారు, ఇతర దివ్యాంగులు కూడా పోర్టల్ సేవలను మరింత సులభంగా వినియోగించుకోవడానికి అవకాశం లభిస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 2325247)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9