ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

తమిళనాడులో తీరప్రాంత డ్రగ్స్ ముఠా గుట్టురట్టు


డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ దాడుల్లో 137 కేజీల క్రిస్టల్ మెథ్ స్వాధీనం, నలుగురు అరెస్ట్

నిఘా సమాచారం ఆధారంగా చేపట్టిన భారీ ఆపరేషన్ తో సముద్ర మార్గంలో శ్రీలంకకు డ్రగ్స్ స్మగ్లింగ్.. భగ్నం

నాడు పోస్టు చేయడమైనది: 18 OCT 2026 1:17PM by PIB Hyderabad

వ్యవస్థీకృత మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు తమిళనాడులో భారీ ఆపరేషన్ చేపట్టారు. నాగపట్నం జిల్లాలోని ఒక తీర ప్రాంత గ్రామంలో అధికారులు నిర్వహించిన సోదాల్లో 137 కేజీల నిషేధిత సింథటిక్ డ్రగ్ -  క్రిస్టల్ మెథ్ -  ను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల కాలంలో రాష్ట్ర తీరప్రాంతంలో ఇంత పెద్దఎత్తున మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారి. 

పక్కా నిఘా సమాచారం ఆధారంగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్  అధికారులు 2026 అక్టోబర్ 16 - 17 తేదీలలో విస్తృత నిఘా,  తనిఖీ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో సముద్రం మధ్యలో సరుకును మార్చే (మిడ్ - సీ ట్రాన్స్‌ఫర్) పద్ధతి ద్వారా శ్రీలంకకు మాదకద్రవ్యాలను అక్రమంగా తరలించేందుకు యత్నిస్తున్న తీరప్రాంత డ్రగ్స్ స్మగ్లింగ్ నెట్‌వర్క్ గుట్టును అధికారులు విజయవంతంగా ఛేదించారు. స్వాధీనం చేసుకున్న ఈ నిషేధిత పదార్థాల విలువ రూ. 100 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేశారు.

శ్రీలంకకు అక్రమంగా తరలించేందుకు వీలుగా నాగపట్నం జిల్లాలోని ఒక తీర ప్రాంతానికి భారీ మొత్తంలో మాదకద్రవ్యాలను రవాణా చేసి నిల్వ ఉంచినట్లు అందిన పక్కా నిఘా సమాచారం ఆధారంగా ఈ ఆపరేషన్ చేపట్టారు. ఆ మేరకు అధికారులు నిర్వహించిన సోదాల్లో, ఒక్కో ప్యాకెట్ సుమారు 5 కిలోల బరువున్న 27 వెండి రేకు కాగితం ప్యాకెట్లతో కూడిన ఆరు డఫెల్ బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు.

ఆ ప్యాకెట్లలో అధిక స్వచ్ఛత కలిగిన మెథాంఫెటమైన్‌ అయి ఉండవచ్చని అనుమానిస్తున్న తెల్లటి స్ఫటికాకార పదార్థం ఉన్నట్లు గుర్తించారు. 1985 నాటి మాదకద్రవ్యాలు, మనోప్రభావిత (సైకోట్రోఫిక్) పదార్థాల నియంత్రణ (ఎన్డీపీఎస్) చట్టం నిబంధనల కింద ఈ అక్రమ పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు.

అనుమానిత నిర్వాహకుడి నివాసంలో ఏకకాలంలో సోదాలు నిర్వహించిన డీఆర్ఐ అధికారులు, మాదకద్రవ్యాల విక్రయం ద్వారా వచ్చిన సొమ్ముగా భావిస్తున్న రూ.10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. మాదకద్రవ్యాల రవాణాకు ఉపయోగించినట్లు భావిస్తున్న రెండు కార్లు, ఒక ద్విచక్ర వాహనాన్ని కూడా సీజ్‌ చేశారు. తీర ప్రాంతం నుంచి విదేశాలకు మాదకద్రవ్యాలను తరలించే ఏర్పాట్లు, రవాణా, నిల్వ, సరుకు నిర్వహణ వంటి కార్యకలాపాల్లో పాల్గొన్న వ్యక్తులతో కూడిన అక్రమ రవాణా నెట్‌వర్క్‌ను ఈ ఆపరేషన్‌ విజయవంతంగా ఛేదించింది. ఎన్డీపీఎస్ చట్టం  కింద నలుగురిని అరెస్టు చేసి, న్యాయస్థానం ఆదేశాల మేరకు జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించారు.

ఈ ఆపరేషన్‌ ద్వారా డీఆర్ఐ భారీ పరిమాణంలో నిషేధిత మాదకద్రవ్యాలను అక్రమ చలామణి నుంచి తొలగించడమే కాకుండా, వాటి అక్రమ రవాణా నెట్‌వర్క్‌ను కూడా విజయవంతంగా ఛేదించింది. వ్యవస్థీకృత మాదకద్రవ్యాల అక్రమ రవాణా ముఠాల కార్యకలాపాలను అడ్డుకోవడం, భారత తీరప్రాంతాన్ని నిషేధిత మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు మార్గంగా ఉపయోగించకుండా నిరోధించడంలో డీఆర్ఐ నిరంతరంగా చేస్తున్న కృషికి, నిర్వహణ సామర్థ్యాలకు ఈ భారీ ఆపరేషన్ నిదర్శనంగా నిలుస్తోంది.

***


(రిలీజ్ ఐడి: 2324961) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Punjabi , Gujarati , Urdu , हिन्दी , Assamese , Tamil