వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
ఈశాన్య ప్రాంతంలో ఉల్లిపాయల లభ్యతను పెంచడానికి మొదటి సారి అగర్తల వెళ్లనున్న కాందా ఎక్స్ప్రెస్
రెండు కాందా ఎక్స్ప్రెస్ ర్యాకులు, 44 ట్రక్ కన్సైన్మెంట్లలో
2,800 మెట్రిక్ టన్నులకు పైగా బఫర్ ఉల్లిపాయల తరలింపు
ఈ నెల 18 కల్లా అగర్తలకు చేరనున్న
సుమారు 440 మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్
నాడు పోస్టు చేయడమైనది:
16 OCT 2026 1:23PM by PIB Hyderabad
రానున్న పండుగల కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఉల్లిపాయల లభ్యతను పెంచడంతో పాటు ఉల్లి తక్కువ ధరలకు అందేటట్లు చూడటానికిగాను వినియోగదారు వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ ముఖ్య చర్యను తీసుకుంది.. ధరల స్థిరీకరణ నిధి (పీఎస్ఎఫ్)లో భాగంగా అత్యవసర పరిస్థితులలో వినియోగార్థం అట్టిపెట్టిన ఆహార నిల్వల (బఫర్ స్టాక్)లో నుంచి ఉల్లిగడ్డల పంపిణీని విస్తరిస్తున్నది. ఈ క్రమంలో మొదటి సారి కాందా ఎక్స్ప్రెస్లో త్రిపుర లోని అగర్తలకు ఉల్లిపాయలను పంపుతున్నారు. దాదాపుగా 440 మెట్రిక్ టన్నుల ఉల్లిగడ్డలను నింపిన ఈ కన్సైన్మెంట్ ఈ నెల 18 నాటికి అగర్తలకు చేరుకొనే అవకాశం ఉంది.
ఈ కార్యక్రమం ఈశాన్య ప్రాంతంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉల్లిపాయ పంపిణీ నెట్వర్క్ విస్తరణను సూచిస్తోంది. కాందా ఎక్స్ప్రెస్ ద్వారా అస్సాముకు బఫర్ ఉల్లిగడ్డలను విజయవంతంగా చేరవేసిన తరువాత, ఈ సరకు సరఫరాను చేపట్టారు. అగర్తలకు సరకు తరలింపు చర్య సరఫరా వ్యవస్థను విస్తరించాలన్న, చివరి మజిలీ వరకు లభ్యతను మెరుగుపరచాలన్న, దేశంలో అన్ని ప్రాంతాల్లో వినియోగ కేంద్రాల వరకు తక్కువ ధర ఉల్లిపాయలను సకాలంలో చేరేవేయాలన్న ప్రభుత్వ నిబద్ధతను ప్రస్ఫుటం చేస్తోంది.
త్రిపురలో ఉల్లిపాయల పంపిణీని పటిష్టపరచడానికి
కాందా ఎక్స్ప్రెస్ సేవలు మొదలు
ఈ కార్యక్రమం త్రిపుర లోని ఎనిమిది జిల్లాలకు గాను ఏడు జిల్లాల్లో మార్కెట్టు లభ్యత విస్తరించగలదని ఆశిస్తున్నారు. ఆ ఏడు జిల్లాలు ఇవి.. ధలాయి, దక్షిణ త్రిపుర, ఖోవై, ఉనాకోటి, పశ్చిమ త్రిపుర, గోమతి, సోపాహిజాలా.
ఇంతవరకు, కాందా ఎక్స్ప్రెస్కు చెందిన రెండు ర్యాకుల్లో (వీటిలో క్రమానుగతంగా 840 మెట్రిక్ టన్నులు, 452 మెట్రిక్ టన్నుల ఉల్లిగడ్డను నింపారు) పాటు, 44 ట్రక్కుల (వీటిలో మొత్తం 1,513.46 మెట్రిక్ టన్నుల ఉల్లిగడ్డ నింపారు) ద్వారా ఈశాన్య ప్రాంతానికి బఫర్ ఉల్లిపాయల సరకును సరఫరా చేశారు. ఉల్లిపాయ సరకును అస్సామ్, త్రిపుర, నాగాలాండ్లలోని ప్రధాన ప్రాంతాలైన కామరూప్, గువాహాటీ, గోమతీ, దీమాపూర్, సోపాహిజాలా, కోహిమా, నియులాండ్, చుమౌకేదిమాలకు పంపిణీ చేశారు.
రైలు, రోడ్డు మార్గాల ద్వారా పంపిణీని విస్తరించడంలో బఫర్ స్టాకు రవాణాను మెరుగుపరచడంతో పాటు పూర్తి ఈశాన్య ప్రాంతంలోని ప్రధాన వినియోగ కేంద్రాలు అన్నిటికీ సరఫరాలను అందించాలన్నదే ముఖ్యోద్దేశం.
తాజా ఖరీఫ్ సరకు రాకతో మెరుగుపడనున్న
మార్కెట్టు లభ్యత.. అంగడి ధరల తగ్గుముఖం
ఖరీఫ్ తాలూకు కొత్త పంట దిగుబడి పెరగడంతో పాటే ప్రధాన మార్కెట్లలో ఉల్లిపాయల అంగడి ధరలూ తగ్గాయి. అఖిల భారతీయ సగటు సంత ధర సెప్టెంబర్లో క్వింటాలుకు దాదాపు రూ.3,600 ఉండగా ఈ నెలలో ఇది సుమారు రూ.3,300కు దిగివచ్చింది.
ఉల్లి నిల్వలలో నుంచి క్రమం తప్పక ఉల్లిగడ్డలను విడుదల చేస్తుండటంతో, మార్కెట్టులో సరఫరాలు పెరుగుతున్నాయి. సరకు అందుబాటు కూడా మెరుగు పడుతోంది. చిల్లర ధరలను నియంత్రించడంలో తోడ్పాటు లభిస్తోంది. వినియోగదారు వ్యవహారాల విభాగం ఇప్పటి మార్కెట్టు పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, వినియోగదారులకు తక్కువ ధరలకు ఉల్లిని అందించడానికి తగిన చర్యలను తీసుకుంటోంది.
211 నగరాల్లో రిటైల్ ఉల్లి ధరల క్షీణత..
ప్రాంతీయ స్థాయిలో ధరల అంతరాలు తగ్గాయి
గత రెండు వారాల్లో, 211 నగరాల్లో ఉల్లి చిల్లర విక్రయ ధరలలో ఒక్కో కిలోకు రూ.1 మొదలు రూ.3 వరకు తగ్గుదల నమోదైంది. ఈ తగ్గుదల ఆంధ్రప్రదేశ్, అస్సామ్, చండీగఢ్, ఛత్తీస్గఢ్, దాద్రా, నగర్ హవేలీ, దమన్, దీవ్, గోవా, హిమాచల్ ప్రదేశ్, కర్నాటక, కేరళ, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరమ్, ఒడిశా, పంజాబ్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బంగాల్ సహా ప్రధాన వినియోగదారు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో చోటు చేసుకుంది.
అస్సాంలో కూడా ఇటీవలి వారాల్లో రిటైల్ ఉల్లి ధరలు దిగివచ్చాయి. సుమారు 12 కేంద్రాల్లో ఒక్కో కిలోకు ధరలో రూ.1 నుంచి రూ.8 వరకు తగ్గుదల కనిపించింది.
గత రెండు సంవత్సరాల్లో అస్సాంలో ఉల్లిగడ్డల సగటు చిల్లర ధరకు, అఖిల భారతీయ సగటు ధరకు మధ్య తేడా చాలా వరకు తగ్గింది. రెండు సంవత్సరాల కిందట అస్సాంలో సగటు చిల్లర ధర కిలోకు రూ.61.96 గా ఉంది. కాగా అఖిల భారతీయ సగటు ధర కిలోకు రూ.54.13 ఉంది. అంటే, ఒక్కో కిలోకు ధరలో రూ.7.83 తేడా ఉండేది. ప్రస్తుతం అస్సాంలో సగటు చిల్లర ధర కిలోకు రూ.54.30 ఉంది. దీంతో తేడా తగ్గిపోయి, ఒక్కో కిలోకు రూ.1.23కు పరిమితమైంది.
ఈ సమరూపత ప్రాంతీయ ధరలో వ్యత్యాసాన్ని చాలా వరకు తగ్గిపోవడాన్ని సూచిస్తున్నది. అస్సాంలో చిల్లర ఉల్లిగడ్డ ధరలు ప్రస్తుతం స్థూలంగా చూస్తే, జాతీయ సగటు ధరకు అనుగుణంగా ఉన్నాయి.
మార్కెట్టు పరిస్థితుల ఆధారంగా కొనసాగనున్న ఉల్లిపాయల బఫర్ స్టాకు పంపిణీ
దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు, మార్కెట్టులోకి సరకు రాకడ, సరఫరా స్థితులపై ప్రభుత్వం నిరంతరాయంగా దృష్టి పెడుతోంది. మార్కెట్టు తాజా స్థితులు, ధరల ధోరణులతో పాటు లభ్యత అవసరాలను ప్రాతిపదికలుగా తీసుకొని ధరల స్థిరీకరణ నిధి (ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్.. పీఎస్ఎఫ్) నుంచి ఉల్లి బఫర్ స్టాకు తరలింపులను చేపడుతున్నారు.
మార్కెట్టులో తగినంత లభ్యమయ్యేటట్లు పూచీ పడడానికి, ధరలలో అనుచిత హెచ్చుతగ్గులను అరికట్టడానికి, ఆమోదిత కార్యకలాపాల సంబంధిత నిర్ణయాల ప్రకారం అవసరాలను గమనించి ఉల్లి సరకును విడుదల చేయడాన్ని ఇక ముందూ కొనసాగించనున్నారు.
***
(రిలీజ్ ఐడి: 2324576)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8