రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

భారత్‌ - మంగోలియా రక్షణ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలన్న సంకల్పాన్ని పునరుద్ఘాటించిన 14వ సంయుక్త అధ్యయన బృందం

నాడు పోస్టు చేయడమైనది: 16 OCT 2026 4:42PM by PIB Hyderabad

భారత్, మంగోలియా రక్షణ మంత్రిత్వ శాఖల మధ్య 14వ సంయుక్త అధ్యయన  బృందం సమావేశం 2026 అక్టోబర్‌ 16న ఉలాన్‌బాటర్‌లో జరిగింది. కొనసాగుతున్న ద్వైపాక్షిక రక్షణ సహకార కార్యక్రమాలను ఇరు దేశాలూ సమగ్రంగా సమీక్షించాయి. ఇప్పటికే అమల్లో ఉన్న కార్యక్రమాల పురోగతిని పరిశీలించి పరస్పరం గుర్తించిన రంగాల్లో సహకారాన్ని విస్తరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. నిరంతర సంభాషణ ద్వారా దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలన్న తమ నిబద్ధతను పునరుద్ఘాటించాయి. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై పరస్పరం అభిప్రాయాలను పంచుకున్నాయి.

 

భారత్, మంగోలియా దేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయాలనే నిబద్ధతను స్పష్టం  చేస్తూ  'నోమాడిక్ ఎలిఫెంట్' సంయుక్త సైనిక విన్యాసాలు విజయవంతంగా ముగియడంపై ఇరు దేశాలు హర్షం వ్యక్తం చేశాయి. మంగోలియా సాయుధ దళాల సిబ్బందికి శిక్షణ ఇవ్వడంలోనూ, వారి సామర్థ్యాన్ని పెంపొందించడంలోనూ భారత్ అందిస్తున్న నిరంతర సహకారాన్ని మంగోలియా పక్షం ప్రత్యేకంగా అభినందించింది. భారత రక్షణ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి డాక్టర్ ఇషిత గంగులి త్రిపాఠి, మంగోలియా డిప్యూటీ స్టేట్ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ బ్రిగేడియర్ జనరల్ గాన్సుఖ్ ఇ. ఈ సమావేశానికి సంయుక్తంగా అధ్యక్షత వహించారు.

 

భారత రక్షణ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి డాక్టర్‌ ఇషితా గంగూలీ త్రిపాఠి మంగోలియా సాయుధ దళాల జనరల్‌ స్టాఫ్‌ డిప్యూటీ చీఫ్‌ మేజర్‌ జనరల్‌ ఉసుఖ్‌బయార్‌ జేతో కూడా సమావేశమయ్యారు. ఇరు దేశాల రక్షణ దళాల మధ్య సహకార పురోగతిపై ఇరువురు సంతృప్తి వ్యక్తం చేశారు. పరస్పర సంబంధాలను మరింత విస్తరించడం, రక్షణ బంధాలను బలోపేతం చేయడం, భారత్‌ - మంగోలియా వ్యూహాత్మక భాగస్వామ్యానికి భవిష్యత్‌ కార్యాచరణను రూపొందించడంపై వారు చర్చించారు.

భారత ప్రతినిధి బృందం నేషనల్‌ డిఫెన్స్‌ యూనివర్సిటీని సందర్శించి  భారత్‌ సహకారంతో ఏర్పాటు చేసిన సైబర్‌ సెక్యూరిటీ శిక్షణ కేంద్రం పనితీరును సమీక్షించింది. భాషా శిక్షణ, సైబర్‌ భద్రత రంగాల్లో భారత్‌ నిరంతరం అందిస్తున్న మద్దతును మంగోలియా ప్రతినిధులు ప్రశంసించారు. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో సామర్థ్యాల పెంపు, విజ్ఞాన వినిమయం, రక్షణ రంగంలో పూర్తి  హకారం కీలకమని వారు పేర్కొన్నారు.

భారత్‌, మంగోలియా దేశాల మధ్య చారిత్రక, సాంస్కృతిక, నాగరికతాపరమైన బంధాలు శతాబ్దాలుగా కొనసాగుతున్నాయి. ఈ బలమైన పునాదులపైనే ఇరు దేశాల ప్రస్తుత భాగస్వామ్యం మరింత విస్తరిస్తోంది. ఉమ్మడి విశ్వాసం, సాంస్కృతిక వారసత్వం రెండు దేశాలను మరింత చేరువ చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని ఈ పర్యటన స్పష్టం చేసింది.

 

***


(రిలీజ్ ఐడి: 2324570) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Tamil