యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సవరించిన సహాయ పథకంపై జాతీయ క్రీడా సమాఖ్యలకు కార్యాచరణ మార్గదర్శకాలు జారీ


భారత దీర్ఘకాలిక క్రీడా దార్శనికత.. కామన్వెల్త్ గేమ్స్ 2030.. ఒలింపిక్స్‌-2036కు బిడ్ తదితరాల కోసం కొత్త వ్యూహాత్మక అంశాలు

ప్రధాన అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాలకు సంసిద్ధతలో భారత క్రీడాకారులకు ‘ఏఎన్‌ఎస్‌ఎఫ్‌’ చేయూత

నాడు పోస్టు చేయడమైనది: 16 OCT 2026 4:50PM by PIB Hyderabad

   జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్‌ఎస్‌ఎఫ్‌)ల కోసం సవరించిన సహాయ పథకం సంబంధిత కార్యాచరణ మార్గదర్శకాలను కేంద్ర క్రీడా-యువజన వ్యవహారాల మంత్రిత్వశాఖ ఇవాళ జారీ చేసింది. ఈ మేరకు 2026-27 నుంచి 2030-31 (16వ ఆర్థిక సంఘం కాలం) వరకు ₹7,386.74 కోట్ల వ్యయంతో పథకం కొనసాగించేందుకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. పథకంలోని వివిధ భాగాల సంబంధిత సవరించిన సహాయ నిబంధనలను కూడా ఈ మార్గదర్శకాలు నిర్దేశిస్తున్నాయి.

ఒలింపిక్స్‌, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, పారాలింపిక్స్‌, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ తదితర ప్రధాన అంతర్జాతీయ క్రీడా స్పర్థలలో పాల్గొనే భారత క్రీడాకారులకు మద్దతు దిశగా ఈ పథకం ఓ కీలక యంత్రాంగంగా ఉంటుంది.

జాతీయ కోచింగ్ శిబిరాల నిర్వహణ, అకాడమీలలో శిక్షణతోపాటు క్రీడాకారులకు వసతి, భోజనం, క్రీడా పరికరాలు (కిట్లు), బీమా, క్రీడా విజ్ఞాన సేవలు సహా ఈ పథకం కింద మద్దతు లభిస్తుంది. విదేశీ కోచ్‌లు, హై పెర్ఫార్మెన్స్ డైరెక్టర్లు, ఫిజియోథెరపిస్టులు, క్రీడా శాస్త్రవేత్తలు, వైద్యుల తదితర సహాయ సిబ్బంది నియామకం, అంతర్జాతీయ శిక్షణ, పోటీల ద్వారా విదేశీ అనుభవం, సీనియర్-జూనియర్, సబ్-జూనియర్ జాతీయ ఛాంపియన్‌షిప్‌ల నిర్వహణ, క్షేత్రస్థాయి-జూనియర్ క్రీడాకారులకు ప్రోత్సాహం, జాతీయ క్రీడా సమాఖ్యలకు నిర్వహణ, పాలనాపరమైన చేయూత ఉంటుంది.

భారత దీర్ఘకాలిక క్రీడా దార్శనికత సహా 2036 ఒలింపిక్ బిడ్, 2030 కామన్వెల్త్ గేమ్స్ సన్నాహాలకు తగినట్లుగా అనేక కొత్త వ్యూహాత్మక అంశాలను కూడా సవరించిన పథకంలో చేర్చారు.

అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాల నిర్వహణకు సహాయ మొత్తం పెంపు: దేశంలో అంతర్జాతీయ టోర్నమెంట్ల నిర్వహణకు ఇచ్చే ఆర్థిక సహాయాన్ని సవరించిన పథకంలో గణనీయంగా పెంచారు. దీని ప్రకారం... ఇకపై ఒక అంతర్జాతీయ కార్యక్రమం నిర్వహణకు దాని స్థాయి, ప్రాధాన్యం, పాల్గొనే దేశాలు-క్రీడాకారుల సంఖ్యను బట్టి ‘ఎన్‌ఎస్‌ఎఫ్‌’లకు రూ.50 కోట్ల దాకా సహాయం అందుతుంది. దీనికి సంబంధించి మంత్రిత్వశాఖలోని క్రీడల విభాగం కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ ఆయా సమాఖ్యల ప్రతిపాదనలను మదింపు చేస్తుంది.

ఒలింపిక్ శిక్షణ కేంద్రాలలో శిక్షణ: ఒలింపిక్స్‌ సహా భారీ అంతర్జాతీయ క్రీడా పోటీలకు సిద్ధమయ్యే క్రీడాకారులకు ప్రస్తుతం ‘నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్’, అకాడమీలు, ప్రైవేట్ క్రీడా ప్రాంగణాలతోపాటు విదేశీ శిక్షణ కేంద్రాల్లోనూ శిక్షణ ఇస్తున్నారు. మరోవైపు ఉన్నత ప్రమాణాలతో ప్రత్యేక శిక్షణ ఇవ్వడానికి, అత్యాధునిక క్రీడా విజ్ఞాన పరికరాలతో ఒలింపిక్ శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రతి క్రీడకూ ప్రత్యేకంగా ఈ కేంద్రాలు ఏర్పాటవుతాయి. వీటిలో అత్యుత్తమ, ఆధునిక శిక్షణ సౌకర్యాలు, నిపుణులు ఉంటారు. దీనివల్ల భారత క్రీడాకారులు విదేశీ శిక్షణపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. ఈ కేంద్రాల్లో శిక్షణ పొందే అగ్రశ్రేణి క్రీడాకారులకు కోచ్‌లు, సాంకేతిక సిబ్బంది, క్రీడా విజ్ఞాన సేవలు, ప్రత్యేక పరికరాలు, సాంకేతిక మద్దతు దిశగా సహాయం లభిస్తుంది.

జాతీయ క్రీడలకు మద్దతు: జాతీయ క్రీడల ప్రాధాన్యం, సముచిత రీతిన, తగిన స్థాయిలో వాటి నిర్వహణ అవసరాన్ని సవరించిన పథకంలో పరిగణనలోకి తీసుకున్నారు. ఆ మేరకు జాతీయ క్రీడల నిర్వహణ కోసం క్రీడా పరికరాలు, టైమింగ్, స్కోరింగ్, ఫలితాల సేవలు, సాంకేతిక అధికారుల పారితోషికం, సాంకేతిక నిర్వహణ తదితరాల కోసం రూ.50 కోట్లదాకా సహాయం అందించడానికి వీలుగా నిధులు కేటాయించారు.

ప్రపంచవ్యాప్త విస్తరణ కోసం స్వదేశీ క్రీడల జాతీయ సమాఖ్యలకు సహాయం: స్వదేశీ క్రీడల ప్రపంచవ్యాప్త విస్తరణ లక్ష్యంగ సవరించిన పథకంలో ఒక మద్దతు విభాగాన్ని జోడించారు. ఒలింపిక్స్, ఆసియా క్రీడలు లేదా కామన్వెల్త్ క్రీడలు వంటి అంతర్జాతీయ పోటీలలో వీటిని ప్రదర్శన ఈవెంట్లుగా చేర్చడంలో జాతీయ సమాఖ్యల కృషికి తోడ్పాటుగా ఇతర దేశాలలో జాతీయ సమాఖ్యల స్థాపకు ఈ మద్దతు ఉపయోగపడుతుంది. అలాగే, భారత్‌లో కార్యాలయాలు గల స్వదేశీ క్రీడల అంతర్జాతీయ, ఖండాంతర సమాఖ్యలకు చేయూత లభిస్తుంది.

వర్ధమాన దేశాలతో అంతర్జాతీయ క్రీడా సహకార కార్యక్రమాలు: దేశంలోని భారత క్రీడా ప్రాధికార సంస్థ (ఎస్‌ఏఐ) ప్రాంగణాలలోనే కాకుండా ఇతర కేంద్రాలలోనూ ‘హై పెర్ఫార్మెన్స్ సెంటర్లు’, శిక్షణ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. స్కాలర్‌షిప్‌, రాయితీ సహిత సదుపాయాల వినియోగం ద్వారా క్రీడాకారులు, కోచ్‌లకు శిక్షణ సౌలభ్యం ఉంటుంది. కాబట్టి, వర్ధమాన దేశాలకు భారత్‌ ఒక అగ్రశ్రేణి క్రీడా భాగస్వామి కాగలదు. తదనుగుణంగా అంతర్జాతీయ సహకారానికి సహాయం దిశగానూ సవరించిన పథకంలో ఒక నిబంధనను జోడించారు.

బ్రిక్స్‌.. బిమ్‌స్టెక్‌ వంటి బహుళపక్ష సంస్థల క్రీడా పోటీలకు మద్దతు: బ్రిక్స్‌, బిమ్‌స్టెక్‌ సహా అటువంటి ఇతర బహుళపక్ష సంస్థల కోసం నిర్వహించే క్రీడా పోటీలు, క్రీడల సంబంధిత సమావేశాలు, సదస్సులు, పరిశోధన కార్యకలాపాలు, వర్కుషాప్‌ల నిర్వహణకు ఆర్థిక సహాయం అందించే నిబంధనను కూడా సవరించిన పథకంలో చేర్చారు.

భారత్‌లో కార్యాలయాలు గల గుర్తింపు పొందిన అంతర్జాతీయ-ఖండాంతర సంస్థలకు మద్దతు: భారత్‌లోగల గుర్తింపు పొందిన అంతర్జాతీయ, ఖండాంతర సంస్థలకు మద్దతు దిశగానూ సవరించిన పథకంలో ‘ఎన్‌ఎస్‌ఎఫ్‌, ఎన్‌ఓసీ’ల కింద నిధులను కేటాయించారు. దీనిద్వారా క్రీడల మంత్రిత్వశాఖ కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ సిఫారసుల మేరకు ప్రతి క్రీడా కార్యక్రమానికీ చేయూతనివ్వవచ్చు.

మరిన్ని వివరాల కోసం దయచేసి ఈ లింకుపై క్లిక్ చేయండి:

***


(రిలీజ్ ఐడి: 2324568) సందర్శకుల సూచీ సంఖ్య : : 13
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Gujarati