జౌళి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రత్యేక ప్రచార కార్యక్రమం-6 ద్వారా సైబర్ సెక్యూరిటీ, సురక్షిత డిజిటల్ డిస్పోజల్, ఈ-వ్యర్థాల నిర్వహణ అవగాహనపై కార్యశాలను నిర్వహించిన జౌళి మంత్రిత్వశాఖ

నాడు పోస్టు చేయడమైనది: 16 OCT 2026 11:42AM by PIB Hyderabad

ప్రత్యేక ప్రచార కార్యక్రమం-6 లో భాగంగా ఈ-వ్యర్థాల నిర్వహణపై అవగాహన, సైబర్ సెక్యూరిటీ, సురక్షిత డిజిటల్ డిస్పోజల్ అంశాలపై అక్టోబర్ 15, 2026న  కేంద్ర జౌళి మంత్రిత్వశాఖ కార్యశాలను నిర్వహించింది. నోడల్ అధికారులతో సహా 85 మందికిపైగా అధికారులు ఇందులో పాల్గొన్నారు. బాధ్యతాయుత ఈ-వ్యర్థాల నిర్వహణను ప్రోత్సహించటం, సైబర్ భద్రతపై అవగాహనను పెంపొందించటం, కార్యాలయాల్లో సురక్షితమైన డిజిటల్ పద్ధతులను ప్రోత్సహించటం ఈ కార్యశాల ప్రధాన ఉద్దేశం.

ఫిషింగ్ దాడులు, మాల్ వేర్, మోసపూరిత వాట్సాప్ సందేశాలు, డిజిటల్ అరెస్టు స్కాముల వంటి మారుతున్న సైబర్ ముప్పులపై సిబ్బందికి అధికారులు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సైబర్ భద్రతా అవగాహన సదస్సును నిర్వహించారు. తెలిసిన వ్యక్తుల్లా నటిస్తూ, డబ్బు, వన్-టైమ్ పాసువర్డులు (ఓటీపీలు), వ్యక్తిగత సమాచారాన్ని కోరే అనుమానాస్పద ఈ-మెయిల్స్, లింకులు, అటాచ్‌మెంట్లు, సందేశాలను గుర్తించాల్సిన ఆవశ్యకతను ఈ సదస్సు స్పష్టం చేసింది.

డిజిటల్ సమాచార మార్పిడి విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని, తెలియని లింకులపై క్లిక్ చేయటం, ధ్రువీకరించని ఫైళ్లను డౌన్‌లోడ్ చేయవద్దని, సున్నితమైన సమాచారాన్ని పంచుకోకూడదని, ఏదైనా చర్య తీసుకునే ముందు అనుమానాస్పద సందేశాల వాస్తవికతను నిర్ధారించుకోవాలని సదస్సులో పాల్గొన్న వారికి సూచించారు. అధికారిక, వ్యక్తిగత సమాచారాన్ని సురక్షితంగా ఉంచటానికి సైబర్ భద్రతా నియమాలు, నిరంతర అప్రమత్తత, సైబర్ ఘటనలను సకాలంలో నివేదించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

 

 

సరైన పద్ధతిలో ఈ-వ్యర్థాలను తొలగించకపోవటం వల్ల నేల, నీరు కలుషితం కావడంతో పాటు మానవ ఆరోగ్యానికి, పర్యావరణ వ్యవస్థలకు ముప్పును కలిగించే ప్రమాదకర పదార్థాలు విడుదల అవుతాయి. ఈ-వ్యర్థాల నిర్వహణ అవగాహన సదస్సు ద్వారా ప్రతికూల పర్యావరణ ప్రభావాలపై అధికారులకు అవగాహన కల్పించారు. విలువైన పదార్థాలను తిరిగి పొందేందుకు, ముడి సరుకుల డిమాండ్‌ను తగ్గించేందుకు, డంపింగ్ యార్డులకు చేరే వ్యర్థాల పరిమాణాన్ని కనిష్ఠ స్థాయికి తగ్గించేందుకు వీలుగా.. సాధ్యమైన ప్రతిచోటా ఎలక్ట్రానిక్ పరికరాల పునర్వినియోగం, మరమ్మతు చేసి వినియోగించటం, రీసైక్లింగ్ ద్వారా వనరులను సంరక్షించాల్సిన ప్రాముఖ్యతను వివరించారు. అమల్లో ఉన్న ఈ-వ్యర్థాల నిర్వహణ నిబంధనలకు అనుగుణంగా కాలం చెల్లిన ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ పరికరాలను సరైన రీతిలో వేరుచేయటం, సురక్షితంగా నిర్వహించటం, అధికారిక మార్గాల ద్వారా మాత్రమే వాటిని తొలగించాల్సిన ఆవశ్యకతపైనా అధికారులకు అవగాహన కల్పించారు.

పర్యావరణ పరిరక్షణకు, వనరుల సమర్థవంతమైన వినియోగానికి, సర్క్యులర్ ఎకానమీ వృద్ధికి బాధ్యతాయుత ఈ-వ్యర్థాల నిర్వహణ దోహదపడుతుందని స్పష్టం చేస్తూ.. కార్యాలయాల్లో సుస్థిర పద్ధతులను అవలంబించటాన్ని ఈ సదస్సులు ప్రోత్సహించాయి.

పరిశుభ్రమైన కార్యాలయ వాతావరణాన్ని ప్రోత్సహించటం, బాధ్యతాయుతంగా వనరుల నిర్వహణ జరిగేలా చూడటం, సురక్షితమైన డిజిటల్ వాతావరణాన్ని పెంపొందించటం పట్ల కేంద్ర జౌళి మంత్రిత్వశాఖకున్న నిబద్ధతను ఈ కార్యక్రమాలు ప్రతిబింబిస్తున్నాయి. పర్యావరణ సుస్థిరతను సైబర్ భద్రతా అవగాహనతో అనుసంధానించటం ద్వారా మెరుగైన కార్యాలయ పద్ధతులు, వనరుల సంరక్షణ, పటిష్టమైన డిజిటల్ భద్రతతో ప్రత్యేక ప్రచార కార్యక్రమం లక్ష్యాలను మంత్రిత్వశాఖ ముందుకు తీసుకెళ్తోంది.

అమల్లో ఉన్న మార్గదర్శకాలకు అనుగుణంగా కాలం చెల్లిన, నిరుపయోగమైన ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ పరికరాలను బాధ్యతాయుతంగా తొలగించాల్సిన అంశాన్ని స్పష్టం చేస్తూ.. కార్యాలయాల ప్రాంగణంలో వెలువడే ఈ-వ్యర్థాల సేకరణ, సరైన నిర్వహణకు కూడా మంత్రిత్వశాఖ చర్యలు చేపట్టింది.

డెస్క్‌టాప్ కంప్యూటర్లు, కీబోర్డులు, ఫోటోకాపియర్లు (జిరాక్స్ మెషీన్లు), ఎయిర్ ప్యూరిఫైయర్లు, ఎలక్ట్రిక్ హాట్ కేసులతో సహా కాలం చెల్లిన ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ పరికరాలను అమల్లో ఉన్న ఈ-వ్యర్థాల నిర్వహణ నిబంధనలకు అనుగుణంగా సరైన విధంగా నిర్వహించటం, తొలగించటం అవసరం.

 

    

కాలం చెల్లిన ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ పరికరాలను గుర్తించి, సరైన విధంగా వేరు చేయటం, అధికారిక మార్గాల ద్వారా వాటిని తొలగించటం వంటి అంశాల ప్రాముఖ్యతను ఈ కార్యక్రమం స్పష్టం చేస్తుంది. బాధ్యతాయుతమైన ఈ-వ్యర్థాల నిర్వహణ పర్యావరణ కాలుష్యాన్ని నివారించటంలో సహాయపడటమే కాక, విలువైన వాటిని తిరిగి పొందేందుకు తోడ్పడుతుంది. వనరుల సమర్థవంతమైన వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది.

సుస్థిర కార్యాలయ పద్ధతులు, ఈ-వ్యర్థాలను సరైన పద్దతిలో తొలగించాల్సిన ప్రాముఖ్యతపై అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పించటాన్ని మంత్రిత్వశాఖ ప్రోత్సహిస్తోంది. ఇటువంటి ప్రయత్నాలు స్వచ్ఛమైన పని వాతావరణానికి, జాతీయ లక్ష్యమైన సుస్థిరాభివృద్ధి సాధనకు దోహదపడతాయి.

ఈ కార్యక్రమాల ద్వారా బాధ్యతాయుతమైన వనరుల నిర్వహణ, పర్యావరణ సుస్థిరత, డిజిటల్ భద్రత పట్ల కేంద్ర జౌళి మంత్రిత్వశాఖకున్న నిబద్ధత స్పష్టమవుతుంది. మంత్రిత్వశాఖ కార్యాలయాలన్నింటిలో పరిశుభ్రత, కాలం చెల్లిన పరికరాలను సరైన విధంగా తొలగించటం, వనరుల సమర్థవంతమైన వినియోగం, సురక్షితమైన డిజిటల్ వాతావరణాన్ని ప్రోత్సహించటం ద్వారా ఈ కార్యకలాపాలు ప్రత్యేక ప్రచార కార్యక్రమం-6 లక్ష్యాలను మరింత బలోపేతం చేస్తున్నాయి.

 

***


(రిలీజ్ ఐడి: 2324298) సందర్శకుల సూచీ సంఖ్య : : 3
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati , Tamil