యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆసియా క్రీడలపై సమీక్ష.. విజేతల తరం సృష్టి దిశగా జాతీయ క్రీడా సమాఖ్యలకు డాక్టర్ మాండవీయ పిలుపు

నాడు పోస్టు చేయడమైనది: 15 OCT 2026 6:15PM by PIB Hyderabad

ఈ ఏడాది (2026) ఆసియా క్రీడలలో భారత్‌ 4వ స్థానంలో నిలిచిన నేపథ్యంలో కేంద్ర క్రీడా-యువజన వ్యవహారాల శాఖల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఇవాళ జాతీయ క్రీడా సమాఖ్యల (ఎన్‌ఎస్‌ఎఫ్‌) అధిపతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. భారత క్రీడా ప్రతిభను మరింత మెరుగ్గా తీర్చిదిద్దే బాధ్యత నిర్వహణలో సమాఖ్యలు మరింత నిబద్ధత చూపాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. భారత క్రీడా నైపుణ్యం కొనసాగేలా మరింత సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఎంతయినా ఉందని మంత్రి పునరుద్ఘాటించారు.

పతక విజేతలు కాగల కొద్దిమంది క్రీడాకారులపై ఆధారపడటం కాకుండా దేశం కోసం విజేతల తరాన్ని సృష్టించడం అవశ్యమని డాక్టర్ మాండవీయ స్పష్టం చేశారు. “మీరాబాయి చాను ఒంటిచేత్తో మనకు ఇంకెంత కాలం పతకాలు సాధించిపెట్టగలరు? మనం మరో 10 మంది మీరాబాయిలను తయారు చేయాలి. ప్రతి సమాఖ్య ఈ విషయంలో మరింత శ్రద్ధ, చిత్తశుద్ధి చూపాలి. ప్రతిభను గుర్తించి, సరైన శిక్షణ ద్వారా క్రీడాకారులు అత్యున్నత స్థాయికి ఎదిగే వాతావరణాన్ని ఏర్పరచాలి” అని ఆయన ఉద్బోధించారు. వివిధ క్రీడా దశలలో భారత పతక సాధన సంకల్పాన్ని సాకారం చేయగల క్రీడాకారులను గుర్తించి, అంతర్జాతీయ స్థాయికి వారిని తీర్చిదిద్దడం నేటి తక్షణావసరమని నిర్దేశించారు.

ఆసియా క్రీడలలో భారత్‌ ప్రతిభపై సమీక్షతోపాటు లాస్ ఏంజిలిస్‌ ఒలింపిక్స్-2028, కామన్వెల్త్ గేమ్స్-2030, దోహాలో ఆసియా క్రీడలు-2030 సన్నాహాలపై అంచనాల దిశగా నేటి జాతీయ క్రీడా సమాఖ్యల సదస్సు ఒక వేదికగా ఉపయోగపడింది. ఈ సమీక్ష సమావేశంలో షూటింగ్, అథ్లెటిక్స్, బాక్సింగ్, ఆర్చరీ, స్క్వాష్, వుషు తదితర ప్రధాన జాతీయ క్రీడా సమాఖ్యల ప్రతినిధులు పాల్గొన్నారు.

ప్రధాన అంతర్జాతీయ వేదికలపై పోటీపడే వేళ క్రీడాకారులలో ఏకాగ్రత లోపాన్ని సరిదిద్దడానికి మరింత మంది క్రీడా మనస్తత్వవేత్తలు, విజ్ఞాన నిపుణులు, అత్యుత్తమ మానసిక శిక్షకుల అవసరం చాలా ఉందని డాక్టర్ మాండవీయ ప్రముఖంగా ప్రస్తావించారు. అలాగే, ప్రతి జాతీయ క్రీడా సమాఖ్య మరిన్ని పోటీలను నిర్వహించాలని, తద్వారా క్రీడాకారుల సన్నద్ధతను బలోపేతం చేయాలని కోరారు. అంకితభావంతో కృషి చేస్తూ ప్రతిభ, నైపుణ్య ప్రదర్శన సహా పరిపాలన పరమైన లోపాలను నిజాయితీగా అంచనా వేయాలని ఆయన సూచించారు.

ఖేలో ఇండియా పథకాన్ని జాతీయ క్రీడా సమాఖ్యలతో సంధానించడంపై ఖేలో ఇండియా సంయుక్త కార్యదర్శి శ్రీ వినీల్ కృష్ణ ప్రసంగించారు. ఐచీ-నగోయా ఆసియా క్రీడలు, లాస్ ఏంజిలిస్‌ ఒలింపిక్స్-2028 సన్నాహాలపై ‘టాప్స్’ సీఈఓ కల్నల్ ఎన్.ఎస్.జోహల్ సమీక్షించారు. ఈ సదస్సులో భాగంగా జాతీయ క్రీడా సమాఖ్యలకు సహాయంపై  సవరిరించి మార్గదర్శకాల కరదీపికనను ఆవిష్కరించారు.

సమాఖ్యలన్నీ తమ కార్యకలాపాలను ఖేలో ఇండియా మిషన్ దార్శనికతకు అనుగుణంగా మార్చుకోవాలని క్రీడా-యువజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీమతి రక్షా ఖడ్సే పిలుపునిచ్చారు. “ప్రతి జాతీయ క్రీడా సమాఖ్య, రాష్ట్ర-జిల్లా స్థాయి సమాఖ్యలు కూడా ఏర్పాటై, సమర్థంగా పనిచేసేలా చూడాలి. ప్రతిభకు గుర్తింపు సహా ఈ కార్యకలాపాలపై పూర్తి చిత్తశుద్ధిని ప్రదర్శించాలి. ప్రతిభను గుర్తించడమన్నది ఈ ప్రక్రియలో ఒక భాగమే.. క్రీడాకారులు తమ పూర్తి సామర్థ్యాన్ని అందిపుచ్చుకునేలా సరైన శిక్షణ-మద్దతు కూడా వారికి లభించాలి” అని శ్రీమతి ఖడ్సే విశదీకరించారు.

ప్రతిభను గుర్తించే బాధ్యతతో పాటు రాష్ట్ర, జిల్లా స్థాయి ఫెడరేషన్లు సమర్థంగా పనిచేసేలా జాతీయ క్రీడా సమాఖ్యలు బాధ్యత వహించడం తప్పనిసరని ఆమె స్పష్టం చేశారు. “సమష్టి కృషితో మాత్రమే మనం క్రీడాకారుల సన్నద్ధతను బలోపేతం చేయడమే కాకుండా ప్రతిభ ఎదుగుదలకు మెరుగైన మార్గం సృష్టించి, తద్వారా భారత్‌ పతకాల సంఖ్యను మరింత పెంచగలం” అని ఆమె పేర్కొన్నారు.

క్రీడా మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ హరి రంజన్ రావు మాట్లాడుతూ- దోహాలో ఆసియా క్రీడలు-2030 ముగిసేసరికి పతక విజేతల జాబితాలోని తొలి మూడుస్థానాల్లో భారత్‌ నిలిచేలా లక్ష్యనిర్దేశం చేసుకోవాలని సూచించారు. అలాగే, భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న 2030 కామన్వెల్త్ క్రీడలను ఒక ప్రధాన జాతీయ సవాలుగా పరిగణించాలని పేర్కొన్నారు. ఈ మేరకు “దోహా ఆసియా క్రీడల్లో మనం మూడో స్థానంలో నిలిచేలా కృషి చేయాలి. అలాగే, 2030 కామన్వెల్త్ క్రీడల్లో 2010 నాటి ఆ పోటీల మన రికార్డులను మనమే బద్దలు కొట్టి, తొలి మూడు స్థానాల్లో ఒకటిగా నిలవాలి. నాలుగేళ్ల తర్వాత ఆ క్రీడలకు ఆతిథ్యం ఇస్తున్నందున ప్రతి సమాఖ్య ఈ పోటీని ప్రతిష్టాత్మకంగా పరిగణించాలి. తదనుగుణంగా సన్నద్ధమై ఒక పెను సవాలును ఎదుర్కొఏ తరహాలో ఇప్పటి నుంచే కృషి చేయాలి” అని ఆయన ఆకాంక్షించారు.

అంతకుముందు- క్రీడా వ్యవస్థ నాలుగు చక్రాల వాహనం వంటిదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు క్రీడాకారులు, కోచ్‌లు, జాతీయ క్రీడా సమాఖ్యలు, యువజన వ్యవహారాలు-క్రీడల మంత్రిత్వ శాఖ పరిధిలోని భారత క్రీడా ప్రాధికార సంస్థ సమష్టిగా, సమన్వయంతో శ్రమిస్తేనే ఆ వాహనం శరవేగంగా దూసుకెళ్లగలదని స్పష్టం చేశారు.

***


(రిలీజ్ ఐడి: 2324179) సందర్శకుల సూచీ సంఖ్య : : 11
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Punjabi , Gujarati , Tamil