రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

జీశాట్-7సీ కమ్యూనికేషన్ శాటిలైట్, వరుణాస్త్ర హెవీ వెయిట్ టార్పెడోల కొనుగోలుకు రూ.4,106 కోట్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకున్న ఎంఓడీ

నాడు పోస్టు చేయడమైనది: 15 OCT 2026 3:22PM by PIB Hyderabad

భారత వైమానిక దళం కోసం ప్రత్యేక కమ్యూనికేషన్ శాటిలైట్ సామర్థ్యమైన జీశాట్-7సీ, భారత నావికా దళానికి వరుణాస్త్ర హెవీ వెయిట్ టార్పెడోల కొనుగోలుకు రక్షణ మంత్రిత్వశాఖ సుమారు రూ.4,106 కోట్ల విలువైన ఒప్పందాలను కుదుర్చుకుంది.

బెంగళూరులోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు చెందిన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్‌తో రూ.2,563 కోట్ల విలువైన జీశాట్-7సీ ఉపగ్రహ ఒప్పందం కుదిరింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించి, అభివృద్ధి చేసిన ఈ ఉపగ్రహం భారత వైమానిక దళ ఆస్తుల కోసం సురక్షితమైన, బలమైన కమ్యూనికేషన్ సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది. తద్వారా కార్యాచరణ సామర్థ్యం మరింత బలోపేతం అవుతుంది.

హైదరాబాద్‌లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌తో రూ.1,543 కోట్ల విలువైన వరుణాస్త్ర ఒప్పందం జరిగింది. నేవల్ సైన్స్ అండ్ టెక్నాలాజికల్ లాబొరేటరీ అభివృద్ధి చేసిన స్వదేశీ నౌక ద్వారా ప్రయోగించిన జలాంతర్గామి యుద్ధ టార్పెడోనే వరుణాస్త్ర. ఇది అధునాతన సామర్థ్యాలతో ఉంది. సుదూర ప్రాంతాల్లో శత్రు జలాంతర్గాములను ఎదుర్కొనే సామర్థ్యం ఉంది. తద్వారా భారత నావికాదళ జలాంతర్గామి యుద్ధ సామర్థ్యాన్ని ఇది పెంపొందిస్తుంది.

రక్షణ మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ శ్రీ ఎ.అన్బరసు సమక్షంలో అక్టోబర్ 15, 2026న న్యూఢిల్లీలో ఈ ఒప్పందాలు జరిగాయి. ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా దృక్పథానికి అనుగుణంగా, కీలక సాంకేతికతల్లో స్వావలంబను ప్రోత్సహిస్తూ దేశీయ రక్షణ తయారీ సామర్థ్యాల అభివృద్ధి కోసం ముందడుగు వేయటంలో ఈ రెండు ఒప్పందాలు కీలక ఘట్టాన్ని సూచిస్తున్నాయి.

 

***


(రిలీజ్ ఐడి: 2323999) సందర్శకుల సూచీ సంఖ్య : : 11
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Assamese , Gujarati , Tamil