రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

విజయవాడలో జాతీయ సరస్ మేళాలో పాల్గొన్న రాష్ట్రపతి

అభివృద్ధి ఫలాలను ప్రతి పల్లెకు, ప్రతి ఒక్క కుటుంబానికి చేరవేయడంలో
స్వయంసహాయ బృందాలు, సరస్ మేళాలు ప్రముఖ పాత్ర పోషించగలవన్న రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము

నాడు పోస్టు చేయడమైనది: 15 OCT 2026 3:15PM by PIB Hyderabad

జాతీయ సరస్ మేళాలో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. జాతీయ సరస్ మేళాను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి విజయవాడలో ఈ రోజు ఏర్పాటు చేశాయి. సరస్ స్టాళ్లను రాష్ట్రపతి సందర్శించి, లఖ్‌పతి దీదీలతో సంభాషించారు.

 


రాష్ట్రపతి ప్రసంగిస్తూ, వ్యవసాయంలో గ్రామీణ మహిళలదే కీలక పాత్ర అన్నారు. వారు స్వయంసహాయక బృందాల (ఎస్‌హెచ్‌జీస్) ద్వారా ఆర్థిక, సాంకేతిక, సామాజిక సాధికారత సాధనకు కొత్త మార్గాన్ని కనుగొన్నారని శ్రీమతి ద్రౌపది ముర్ము అన్నారు. మహిళలకు సాధికారతను కల్పించడంలో ఉత్సాహకర వృద్ధి నమోదవడమే కాక, ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో వారి భాగస్వామ్యం పెరిగిందని కూడా తెలిసి సంతోషిస్తున్నట్లు రాష్ట్రపతి తెలిపారు. ఇది భారత్ సమాన అవకాశాలను అందించే, అన్ని వర్గాలకు భాగస్వామ్యాన్ని పంచే తరహా అభివృద్ధిని సాధించడానికి ఎంతో అవసరమన్నారు.

 


గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మహిళా స్వయంసహాయ బృందాలు ప్రభావవంతమైన తోడ్పాటును అందించినట్లు రాష్ట్రపతి తెలిపారు. గత 12 సంవత్సరాల్లో ఈ బృందాలతో అనుబంధాన్ని ఏర్పరుచుకున్న మహిళల సంఖ్య 10 కోట్లకు మించిందని వెల్లడించారు. ఈ మహిళలు 90 లక్షలకు పైబడిన స్వయంసహాయ బృందాలతో ముడిపడి, కుటుంబాల ఆర్థిక అభ్యున్నతికి సార్థక తోడ్పాటును అందిస్తున్నారని రాష్ట్రపతి అన్నారు. ఆ భాగస్వామ్య ప్రక్రియ మహిళలు కేంద్ర స్థానంలో నిలబడుతున్న, సమ్మిళితమైన గ్రామీణ అభివృద్ధికి దోహదం చేస్తోందని శ్రీమతి ద్రౌపది ముర్ము అన్నారు. సామూహిక వాణిజ్య వ్యవస్థకు సంబంధించిన అవకాశాలు పెద్ద ఎత్తున విస్తరించడానికి ఈ పరిణామం తోడ్పడిందన్నారు.

 


సామాజిక కార్యకలాపాల్లో మహిళా స్వయంసహాయక బృందాలు ప్రధాన పాత్ర పోషిస్తుండడం సంతోషదాయకమని రాష్ట్రపతి అన్నారు. గ్రామీణ జీవితం సమగ్రంగా పరివర్తన చెందడానికి, మన దేశ అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాల వారి చెంతకు చేరడానికి ఎస్‌హెచ్‌జీలు గొప్ప తోడ్పాటును అందిస్తున్నాయని శ్రీమతి ద్రౌపది ముర్ము అన్నారు.


‘లఖ్‌పతి దీదీ’ కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకువచ్చి గ్రామీణ మహిళలకు సాధికారతను కల్పించడానికి ప్రత్యేక వేగాన్ని, దిశను సమకూర్చిందని రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము అన్నారు. డిజిటల్ సేవలు, పునరుత్పాదక ఇంధనం వంటి వివిధ ఆధునిక రంగాల్లో భాగస్వామ్యం రోజురోజుకు పెరుగుతుండటంతో, గ్రామీణ ప్రాంతాల మహిళలకు నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన కొత్త దారులు తెరుచుకుంటున్నాయని రాష్ట్రపతి అన్నారు.

 


గ్రామీణ ప్రాంతాల మహిళలు పథకాలకు ప్రస్తుతం లబ్ధిదారులుగా మాత్రమే లేరని, సంపదను సృష్టించేవారుగాను, అభివృద్ధికి సారథులుగాను మారారని రాష్ట్రపతి ప్రశంసించారు. ఇంత జరుగుతున్నా, మనం సాధికారత కల్పన యాత్రలో పయనించవలసిన దూరం ఇంకా ఎంతో మిగిలే ఉందని శ్రీమతి ద్రౌపది ముర్ము అన్నారు. గ్రామీణ ప్రాంతాల మహిళలు సొంత ఆదాయంపై, ఆస్తులపై ఎంతవరకు నియంత్రణను సాధించగలిగారనేది కూడా సాధికారత కల్పనకు సంబంధించిన ఒక కీలక ప్రమాణంగా మారాలి అని రాష్ట్రపతి అన్నారు. దీంతోపాటు, గృహ సంరక్షణ బాధ్యతలలో సహకారపూర్వక సాముదాయిక వ్యవస్థలను ప్రోత్సహించవలసిన అవసరం ఉందన్నారు.  వాతావరణ మార్పులను తట్టుకొని నిలవగలిగిన వాణిజ్య సంస్థలలో గ్రామీణ మహిళల భాగస్వామ్యం తప్పక వృద్ధి చెందాలని కూడా శ్రీమతి ద్రౌపది ముర్ము అన్నారు.


గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరిచే వేదికలుగా సరస్ మేళాలు మారుతున్నాయని రాష్ట్రపతి అన్నారు. ఈ మేళాలు అంతకంతకు వృద్ధి చెందుతున్న గ్రామీణ మార్కెట్లుగా నిలదొక్కుకున్నాయన్నారు. వాటితో గ్రామీణ మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, దేశవ్యాప్త వినియోగదారులకు మధ్య ప్రత్యక్ష బంధం బలోపేతమైందన్నారు. 2047 కల్లా అభివృద్ధి చెందిన భారత్‌ లక్ష్యాన్ని సాధించాలంటే, అభివృద్ధి ఫలాలను ప్రతి పల్లెకు, ప్రతి కుటుంబానికి చేర్చడం అత్యంత అవసరం అని శ్రీమతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. ఈ ప్రయత్నంలో ఎస్‌హెచ్‌జీలు, సరస్ మేళాలు ముఖ్య పాత్రను పోషించగలుగుతాయని రాష్ట్రపతి తెలిపారు.
34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సుమారు 1500 మహిళా స్వయంసహాయక బృందాలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో పాటు లఖ్‌పతి దీదీలు వారి వారి ఉత్పాదనలను జాతీయ సరస్ మేళాలోని తాజా సంచికలో ప్రదర్శిస్తున్నారు. 650 కన్న ఎక్కువ స్టాల్స్‌ను ఈ మేళాలో ఏర్పాటు చేశారు. మేళాను ఈ నెల 31 వరకు తెరిచి ఉంచుతారు.
రాష్ట్రపతి ప్రసంగాన్ని చదవడానికి ఈ కింది లింకుపై క్లిక్ చేయగలరు:
Please click here to see the President's Speech-

***


(రిలీజ్ ఐడి: 2323893) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati , Tamil , Malayalam