ఉప రాష్ట్రపతి సచివాలయం
డాక్టర్ ఆనందా శంకర్ జయంత్ స్ఫూర్తిదాయక జ్ఞాపకాల సంకలనం ‘డాన్సింగ్ విత్ జాయ్’ గ్రంథాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్
కేన్సర్ బాధితులను కాపాడటానికి అవగాహన, సత్వర గుర్తింపు, సకాలంలో చికిత్స కీలకమన్న ఉపరాష్ట్రపతి
కేన్సర్ సంరక్షణ కేంద్రాల విస్తరణతో రోగుల చెంతకు నైపుణ్యయుక్త సేవలు: ఉపరాష్ట్రపతి
నాడు పోస్టు చేయడమైనది:
14 OCT 2026 5:50PM by PIB Hyderabad
‘డాన్సింగ్ విత్ జాయ్’ (ఉత్సాహంగా నర్తించడం) గ్రంథాన్ని ఉపరాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి భవన్లో ఈ రోజు ఆవిష్కరించారు. ఇది ప్రముఖ శాస్త్రీయ నర్తకి, రచయిత్రి, ఇండియన్ ట్రాఫిక్ రైల్వే సర్వీస్ మాజీ అధికారిణి డాక్టర్ ఆనందా శంకర్ జయంత్ జ్ఞాపకాలను వివరించిన స్ఫూర్తిదాయక పుస్తకం.

ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ఉపరాష్ట్రపతి ప్రసంగిస్తూ, ఈ పుస్తకం నాట్యంతో, ఆనందంతో ముడిపడిన కథ కన్న మించింది అన్నారు. ఈ పుస్తకం అభిరుచి, కష్టపడి పనిచేయడం, సవాళ్లకు ఎదురొడ్డి నిలబడడంతో పాటు ఒక మనిషి లోపలి ప్రతిభను ఆరాతీసి దానికి మెరుగులు పెట్టే అసాధారణ శక్తిని వివరించిన స్ఫూర్తిదాయక వృత్తాంతమని ఆయన ప్రశంసించారు.
కేన్సర్ వ్యాధితో బాధపడిన డాక్టర్ ఆనందా శంకర్ జయంత్ తన జీవిత యాత్రను ఎలా గడిపిందీ ఈ గ్రంథం చెబుతుందని, ఇది ఒక్క కేన్సర్‌ను గురించి చెప్పడమే కాకుండా ఆ వ్యాధిని అధిగమించి ఒక కొత్త దృష్టికోణంతో జీవనాన్ని ఎలా జీవించవచ్చో తెలియజేస్తుందని ఉపరాష్ట్రపతి అన్నారు. గాఢంగా పెంచుకున్న అభినివేశం జీవితంలో అత్యంత క్లిష్ట క్షణాల్లో అండగా ఉండి, ప్రతికూల పరిస్థితులలో కూడా స్వీయ శక్తిని గుర్తించే అవకాశాన్ని అందిస్తుందని ఆయన అన్నారు.
డాన్సర్ అనే ఇంగ్లిషు మాటలోని ‘డి’ అక్షరం కేన్సర్ పదంలోని ‘సి’పై పైచేయిని సాధించడానికి తోడ్పడిందని పుస్తకం అందిస్తున్న సందేశాన్ని శ్రీ సి.పి. రాధాకృష్ణన్ ప్రస్తావించారు. ఏళ్ల తరబడి క్రమశిక్షణ, నిరంతరం నేర్చుకుంటూ ఉండటం, అంకితభావంతో డాక్టర్ ఆనందా సాన పట్టుకున్న నాట్యమే ఆమె జీవితంలో అన్నింటి కన్న పెద్ద సవాలును ఎదుర్కోవడంలో అత్యంత బలమైన శక్తిగా మారిందని ఆయన అన్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సారథ్యంలో భారత్ ‘ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు’, అసాంక్రామిక వ్యాధుల నివారణ, నియంత్రణకు ఉద్దేశించిన జాతీయ కార్యక్రమం వంటి కార్యక్రమాలను అమలు చేస్తూ నివారణ ప్రధాన ఆరోగ్య సంరక్షణను, జాగృతిని పటిష్టపరుస్తోందని ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు. రాష్ట్రాల్లో కేన్సర్ సంరక్షణ సదుపాయాలను విస్తరిస్తుండటంతో, వ్యాధిగ్రస్తులకు వారి సమీప ప్రాంతాల్లోనే ప్రత్యేక చికిత్స సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయని వివరించారు. దీనిలో భాగంగా 700 కన్న ఎక్కువ జిల్లా వైద్యశాలలను, 500 డే కేర్ కేన్సర్ సెంటర్లను ఏర్పాటు చేశారని, 19 రాష్ట్ర కేన్సర్ సంస్థలతో పాటు 20 తృతీయ సంరక్షణ కేన్సర్ కేంద్రాలను నెలకొల్పడానికి అనుమతి ఇచ్చారని ఆయన తెలిపారు. ‘ఆయుష్మాన్ భారత్’ పథకంలో భాగంగా అర్హత కలిగిన కుటుంబాలకు ఏటా రూ.5 లక్షల ఆరోగ్య సంరక్షణ లబ్ధిని అందిస్తున్నారని, ఈ ఏడాదిలో ఫిబ్రవరి నుంచి జాతీయ స్థాయిలో హెచ్‌పీవీ టీకామందును ఇప్పించే కార్యక్రమాన్ని అమలుచేస్తున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 1 కోటీ 20 లక్షల మంది అమ్మాయిలకు సర్వైకల్ కేన్సర్ నుంచి రక్షణను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే 50 లక్షల కన్న ఎక్కువ మంది అమ్మాయిలకు టీకామందును ఇప్పించారని ఉపరాష్ట్రపతి వివరించారు.
డాక్టర్ ఆనందా జీవితంలోని అనుభవాల నుంచి పాఠాలను నేర్చుకోవచ్చని ఉపరాష్ట్రపతి చెబుతూ, గెలుపు ఓటములు ఒకే నాణేనికి రెండు ముఖాలు, ప్రతి ఓటమి మనకు నేర్చుకోవడానికి, సమీక్షించుకోవడానికి, రెట్టించిన దృఢసంకల్పంతో తిరిగి ప్రయత్నించడానికి ఒక అవకాశాన్ని ఇస్తుందన్నారు. కేన్సర్‌తో, ఇతర గంభీర సవాళ్లతో సతమతం అవుతున్న వారు ఆశను ఎన్నటికీ వీడొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. సాహసం, సానుకూల మనస్తత్వం ముఖ్యమని స్పష్టం చేశారు. అవగాహన, శీఘ్ర గతిన గుర్తించడంతో పాటు సరి అయిన సమయంలో చికిత్సను తీసుకోవడాన్ని మొదలుపెట్టుకోవడం వల్ల కూడా ప్రాణాలను కాపాడుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు.
కేన్సర్ వ్యాధిగ్రస్తులకు సహాయం చేయడంలో కుటుంబాలు, స్వచ్ఛంద సేవకులు కీలక పాత్రను పోషించడం ప్రశంసనీయమని ఉపరాష్ట్రపతి అన్నారు. వ్యాధిగ్రస్తుల జీవితాల్లో అత్యంత కఠిన దశలలో అత్యవసరమైన మానసిక స్థైర్యాన్ని, ప్రోత్సాహాన్ని, సంరక్షణను అందించింది కుటుంబ సభ్యులేనని ఆయన అన్నారు. ఈ క్రమంలో వారు వ్యక్తిగతంగా, ఆర్థికంగా పెద్ద త్యాగాలు చేయడానికి కూడా ముందుకు వస్తున్నారని శ్రీ సి.పి. రాధాకృష్ణన్ అన్నారు.
ప్రతిభ ఉండటం ఒక వరం, అయితే నిరంతరం నేర్చుకుంటూ అభ్యాసం, అంకితభావాన్ని కనబరచడం ద్వారా ప్రతిభను ప్రావీణ్యం స్థాయికి మెరుగుపరుచుకోవచ్చు అని ఉపరాష్ట్రపతి అన్నారు. మక్కువను కలిగివుండటం విలాసం ఏమీ కాదని, అది శక్తి వనరు అని ఆయన అన్నారు. సాధారణ పరిస్థితుల్లో పెంచి పోషించుకున్న సామర్థ్యాలు, అభిరుచులు అసాధారణ సవాళ్లు ఎదురైన వేళల్లో అమూల్యమైన సంయమన శక్తిని అందిస్తాయని ఆయన చెప్పారు.
పుస్తకాన్ని తీసుకువచ్చిన డాక్టర్ ఆనందా శంకర్ జయంత్‌కు శ్రీ సి.పి. రాధాకృష్ణన్ అభినందనలు తెలిపారు. ‘డాన్సింగ్ విత్ జాయ్’ యువతకు తమ ప్రతిభావ్యుత్పత్తులను గుర్తించి మెరుగులు దిద్దుకోవడానికి తగ్గ స్ఫూర్తిని అందిస్తుందని, ఎంతో మంది జీవితాలను ప్రభావితం చేయగలుగుతుందని ఆయన అన్నారు. జీవితం ఏ స్థితిని మనకు ఇవ్వజూపినప్పటికీ సాహసం, ఆత్మగౌరవం, ప్రసన్నతలతో ఆ స్థితిని ఎదుర్కోవచ్చని ఈ పుస్తకం పాఠకులకు గుర్తు చేస్తుందని ఉపరాష్ట్రపతి అన్నారు.
ఈ కార్యక్రమంలో సంగీత నాటక అకాడమీ చైర్మన్ డాక్టర్ సంధ్య పురేచా, ఉషాలక్ష్మి బ్రెస్ట్ కేన్సర్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ పి. రఘు రామ్, ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ (ఐజీఎన్సీఏ) మెంబర్ సెక్రటరీ డాక్టర్ సచ్చిదానంద్ జోషితో పాటు అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు. కార్యక్రమంలో వైద్యులు, కేన్సర్ స్పెషలిస్టులు, కేన్సర్ బారిన పడి కోలుకున్న వారు కూడా పాలుపంచుకున్నారు.




***
(రిలీజ్ ఐడి: 2323858)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10