ఆర్థిక మంత్రిత్వ శాఖ
పాకిస్తాన్ నుంచి దిగుమతి అయిన 73,00,000 కిలోలకు పైగా రాతి ఉప్పును స్వాధీనం చేసుకున్న డీఆర్ఐ.. నలుగురి అరెస్టు
పాకిస్తానీ వస్తువుల దిగుమతిని భారత్ నిషేధించగా అడ్డదారిని అనుసరించిన అంతర్జాతీయ దొంగరవాణా ముఠా కార్యప్రణాళిక గుట్టును రట్టు చేసిన ఆపరేషన్ డీప్ మేనిఫెస్ట్
నాడు పోస్టు చేయడమైనది:
14 OCT 2026 4:09PM by PIB Hyderabad
భారత్ నిషేధించిన వస్తువులను, పాకిస్తాన్లో తయారు చేసిన, లేదా పాకిస్తాన్ నుంచి దిగుమతి చేసుకున్న వస్తు సామగ్రిని వంచనాత్మక పద్ధతులలో పెద్ద ఎత్తున చేరవేస్తున్న ఓ ముఠా గుట్టును రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ (డీఆర్ఐ) మరో సారి రట్టు చేసింది. ‘‘ఆపరేషన్ డీప్ మేనిఫెస్ట్’’ పేరిట ఈ కార్యకలాపాలను నిర్వహించారు.

పాకిస్తాన్ నుంచి తెచ్చిన 295 కంటేనర్ల పారిశ్రామిక/హిమాలయన్ రాక్ సాల్టును డీఆర్ఐ పట్టుకుంది. 7,311 టన్నులున్న ఈ రాతి ఉప్పు మార్కెట్టు విలువ సుమారు రూ.30 కోట్లు ఉంటుంది. సరుకును శ్రీలంకలోని కొలంబో ఓడరేవు నుంచి తీసుకువచ్చారు. యూఏఈకి చెందిన సంస్థలు జారీ చేసిన చలానాలు, కల్పిత ధ్రువపత్రాలతో కళ్లు కప్పాలని చూసిన యత్నాన్ని భగ్నం చేశారు.
నిర్దిష్ట రహస్య సమాచారం అందడంతో, డీఆర్ఐ గత నెల 26 మొదలు ఈ నెల 11 మధ్య పక్షం రోజుల పాటు గాంధీధామ్, ఆదిపూర్, వెరావల్, పానిపట్, పుణే, పటియాలా, ఢిల్లీ, ముంబయిలలో సంబంధిత ప్రాంతాల్లో సోదాలను నిర్వహించింది.

ముంద్రా, కాండ్లా ఓడరేవుల గుండా 295 కంటేనర్లను తొమ్మిది దిగుమతి సంస్థలు నిషేధాజ్ఞలను ఉల్లంఘించి దేశంలోకి తీసుకువచ్చినట్లు దర్యాప్తులో బయటపడింది. ఈ 295 కంటేనర్లలోని 5 కంటేనర్లలో 140 మెట్రిక్ టన్నుల పారిశ్రామిక/హిమాలయన్ రాక్ సాల్టును గుర్తించారు. దీని విలువ రూ.24.41 లక్షలు అని లెక్కగట్టారు. ఈ సరుకును కాండ్లా ఓడరేవులో స్వాధీనం చేసుకున్నారు. దీనికి అదనంగా, దిగుమతిదారు సంస్థల బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.20.96 లక్షలను కూడా జప్తు చేశారు. ఈ సొమ్ము విక్రయాల ద్వారా అందిన సొమ్ము.
పాకిస్తానీ, యూఏఈ, శ్రీలంక, భారతీయ పౌరుల యాజమాన్యంలోని సంస్థలతో సంబంధం పెట్టుకుని ఓ అంతర్జాతీయ నెట్వర్క్ పనిచేస్తోందని ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. ఈ నెట్వర్క్ సరుకుకు సంబంధించిన పాకిస్తానీ మూలాలను దాచిపెట్టడానికి షిప్మెంటు, సహాయక పత్రాలను సమన్వయపరిచే పనిలో పడిందని తెలుసుకున్నారు. లావాదేవీలను సమర్థించుకోవడానికి దుబాయ్ లోని సంస్థలు జారీ చేశాయంటున్న నకిలీ చలానాలను ఉపయోగించారు. షిప్మెంటుకు పాకిస్తాన్-శ్రీలంక లతో ఉన్న మూలాలకు సంబంధించి శ్రీలంక కస్టమ్స్ వద్ద దాఖలు చేసిన బిల్స్ ఆఫ్ లేడింగ్, కస్టమ్స్ డిక్లరేషన్లలో సామగ్రి మూల దేశం పాకిస్తాన్ అనీ, సరుకును భారతదేశానికి చేరవేస్తున్నారన్న వివరాలు స్పష్టంగా పొందుపరిచి ఉన్నాయి. దిగుమతిదారులు సమర్పించిన సిసలు ధ్రువపత్రాలు నకిలీవి అన్న సంగతి రుజువైంది.
కస్టమ్స్ చట్టం-1962 నిబంధనల ప్రకారం నలుగురిని అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు దిగుమతిదారు సంస్థల యజమానులు/ భాగస్వాములు. ఒకరి వద్ద కస్టమ్స్ బ్రోకరు వద్ద ఉండే జి-కార్డు ఉంది. మరొకరు దుబాయి కేంద్రంగా పనిచేస్తున్న సరఫరాదారు సంస్థకు యజమాని. ఆ వ్యక్తి దిగుమతి సంస్థను తండ్రి పేరిట ఏర్పాటు చేసి, కార్యకలాపాలను కొనసాగిస్తున్నాడు.
కిందటి నెలలో ఇదే విధమైన మరో చర్యలో, డీఆర్ఐ నాసిక్లోని సీఎఫ్ఎస్ అమ్బడ్ లో 3,62,000 కిలోల పాకిస్తానీ ఎండు ఖర్జూరాలను పట్టుకుంది. వాటిని ముంబయి కేంద్రంగా పనిచేస్తున్న ఒక సంస్థ 13 కంటేనర్లలో దిగుమతి చేసుకుందని వెల్లడైంది.
అంతర్జాతీయ నెట్వర్కులు మూడో పక్షం దేశాల గుండా దిగుమతి చేసుకొని, మూల స్థానాన్ని గురించిన తప్పుడు ధ్రువీకరణలు పొందుపరిచి, అక్రమ వ్యాపార దస్తావేజులను పుట్టించడం, పారదర్శకం కాని ఆర్థిక వ్యవస్థల ద్వారా పాకిస్తానీ మూలాలు కలిగిన సామనును భారత్ దిగుమతిపరమైన నిషేధాన్ని విధించిన సామగ్రిని కళ్లుగప్పి కొత్త కొత్త పద్ధతుల్లో రవాణా చేస్తుంటే పైన ప్రస్తావించిన కేసులు ఆ కూపీని లాగాయి. ఇలాంటి నెట్వర్కులను డీఆర్ఐ పసిగట్టి, వాటిపైన ఉన్న ముసుగును తొలగిస్తోంది. భారత ఆర్థిక, సామాజిక ప్రయోజనాలను కాపాడటానికి డీఆర్ఐ నిబద్ధతతో వ్యవహరిస్తున్నది.
2025 ఏప్రిల్లో పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగిన తరువాత నుంచి పాకిస్తాన్లో తయారు చేసిన, లేదా పాకిస్తాన్ నుంచి రప్పించుకొనే, అక్కడి నుంచి ఎగుమతి అయ్యే అన్ని వస్తువులపై జాతీయ భద్రత, ప్రజా విధాన హితాలను కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని 2025 మే నెల 2నాటి డీజీఎఫ్టీ నోటిఫికేషన్ నంబర్ 06/2025-26 ద్వారా ప్రత్యక్ష నిషేధాన్ని, పరోక్ష నిషేధాన్ని విధించింది.
***
(రిలీజ్ ఐడి: 2323433)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10