శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
యేటీ భారీ బరువుల రవాణా సామర్థ్యం కలిగిన స్వయంచాలక వైమానిక వాహనం అభివృద్ధికి ఐడియాఫోర్జ్తో రూ.151 కోట్ల ఆర్డీఐ సహాయ ఒప్పందం కుదుర్చుకున్న టీడీబీ
టీఆర్ఎల్-9 స్థాయికి చేరుకోవడమే లక్ష్యంగా 200 కిలోల వరకు బరువును మోసుకెళ్లే, 200 కిలోమీటర్ల లక్ష్య పరిధి కలిగిన స్వదేశీ వీటీఓఎల్ వేదిక అభివృద్ధి
నాడు పోస్టు చేయడమైనది:
14 OCT 2026 12:50PM by PIB Hyderabad
స్వయంచాలక వైమానిక వ్యవస్థలు, తదుపరి తరం లాజిస్టిక్స్ రంగాల్లో భారత సామర్థ్యాలను బలోపేతం చేసే లక్ష్యంతో కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ పరిధిలోని సాంకేతిక అభివృద్ధి మండలి మహారాష్ట్రలోని ముంబయికి చెందిన ఐడియాఫోర్డ్ టెక్నాలజీ లిమిటెడ్లో ఒప్పందం కుదుర్చుకుంది. పరిశోధన అభివృద్ధి ఆవిష్కరణలు నిధి కింద ఈ సంస్థకు రూ. 151 కోట్ల ఆర్థిక సాయం అందించనుంది.
స్వయంచాలక వైమానిక వ్యవస్థలు, తదుపరి తరం లాజిస్టిక్స్ రంగాల్లో భారత సామర్థ్యాలను బలోపేతం చేసే లక్ష్యంతో కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ (డీఎస్టీ) పరిధిలోని సాంకేతిక అభివృద్ధి మండలి (టీడీబీ) మహారాష్ట్రలోని ముంబయికి చెందిన ఐడియాఫోర్జ్ టెక్నాలజీ లిమిటెడ్తో ఒప్పందం కుదుర్చుకుంది. పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణల (ఆర్డీఐ) నిధి కింద ఈ సంస్థకు రూ.151 కోట్ల ఆర్థిక సహాయం అందించనుంది.
మొత్తం రూ.302 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులో భాగంగా, భారీ బరువులను సుదూర ప్రాంతాలకు రవాణా చేయగల స్వయంచాలక వైమానిక లాజిస్టిక్స్ వాహనం ‘యేటీ (వైఈటీఐ)ని అభివృద్ధి చేయనున్నారు. ఈ సాంకేతికతను సాంకేతిక సంసిద్ధత స్థాయి (టీఆర్ఎల్)-4 నుంచి టీఆర్ఎల్-9 స్థాయికి తీసుకెళ్లడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ ఆర్థిక సహాయాన్ని రుణ రూపంలో అందించనున్నారు. కఠినమైన పరిస్థితుల్లోనూ పనిచేసేలా యేటీని రూపొందిస్తున్నారు. ఇది నిలువుగా పైకి లేచి, నిలువుగా దిగగలిగే సామర్థ్యంతో పాటు స్థిర రెక్కలను కలిగిన హైబ్రిడ్ మానవరహిత వైమానిక వాహనం (వీటీఓఎల్-ఎఫ్డబ్ల్యూ యూఏవీ). భారీ సరుకును సుదూర ప్రాంతాలకు రవాణా చేయడం దీని ప్రధాన ఉద్దేశం. సాధారణ రవాణా సౌకర్యాలు అందుబాటులో లేని ప్రాంతాల్లో, రవాణాకు ఎక్కువ సమయం పట్టే చోట్ల లేదా రవాణాపై నిర్వహణపరమైన పరిమితులు ఉన్న ప్రాంతాల్లో లాజిస్టిక్స్ అవసరాలను తీర్చేందుకు ఈ వాహనం ఉపయోగపడనుంది. ఈ వైమానిక వాహనం 200 కిలోల వరకు సరుకును మోసుకెళ్లేలా, గరిష్ఠంగా 200 కిలోమీటర్ల దూరం ప్రయాణించేలా రూపొందిస్తున్నారు. సముద్ర మట్టానికి సగటున 6,500 మీటర్ల ఎత్తు వరకు పనిచేయగల సామర్థ్యం కూడా దీనికి ఉండేలా లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా దీని నిర్మాణాన్ని రూపొందిస్తున్నారు. తద్వారా ఎత్తైన పర్వత ప్రాంతాలు, ఎడారులు, సముద్ర ప్రాంతాలు వంటి సవాలుతో కూడిన వాతావరణ పరిస్థితుల్లోనూ ఇది పనిచేయగలదు.
సుదూర ప్రయాణాలకు అనువుగా స్థిర రెక్కల నిర్మాణాన్ని కలిగి ఉండటంతో పాటు నిలువుగా పైకి లేచి, నిలువుగా దిగగలడమే యేటీ వాహనం ప్రత్యేకత.. సుమారు 15 మీటర్ల × 15 మీటర్ల విస్తీర్ణం కలిగిన చిన్న, ప్రత్యేకంగా సిద్ధం చేయని ప్రదేశాల నుంచే ఈ వాహనం టేకాఫ్ తీసుకుని ల్యాండ్ అయ్యేలా రూపొందిస్తున్నారు. దీనివల్ల భూమిపై మౌలిక సదుపాయాలు పరిమితంగా ఉన్న ప్రాంతాల్లోనూ దీన్ని వినియోగించవచ్చు. సాంకేతిక లోపాలను తట్టుకునే సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు ఈ వాహనంలో పంపిణీ ఆధారిత, ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో కూడిన ప్రొపల్షన్ (చోదక వ్యవస్థ), విద్యుత్ సరఫరా వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నారు. గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (జీఎన్ఎస్ఎస్) సంకేతాలు అందుబాటులో లేని పరిస్థితుల్లోనూ దిశను గుర్తిస్తూ ప్రయాణించడం, 200 కిలోమీటర్ల వరకు కమ్యూనికేషన్ లింక్, సమూహంగా పనిచేసే సామర్థ్యం, కంటైనర్లలో తరలించే సౌకర్యం వంటివి కూడా ఇందులో ప్రతిపాదించారు. దీనివల్ల వాహనాన్ని వేగంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించి, తక్కువ సమయంలో సిద్ధం చేయవచ్చు. భౌగోళికంగా క్లిష్టమైన ప్రాంతాల్లో లాజిస్టిక్స్ కార్యకలాపాలకు ఇది తోడ్పడుతుంది.
కఠినమైన భూభాగాల మీదుగా అత్యవసర సరుకులను తరలించాల్సిన అవసరం ఉన్న రంగాల్లో భారీ బరువులను మోసుకెళ్లగల స్వయంచాలక వైమానిక వాహనాల ప్రాధాన్యం పెరుగుతోంది. నిలువుగా పైకి లేచి, దిగగల సామర్థ్యంతో పాటు సుదూర ప్రయాణ సామర్థ్యం, అధిక సరుకు మోసే సామర్థ్యాన్ని కలిపి యేటీని అభివృద్ధి చేస్తున్నారు. మానవరహిత విమానయానం, వైమానిక లాజిస్టిక్స్ మార్కెట్లో ప్రత్యేక అవసరాలను తీర్చడం ఈ వాహనం లక్ష్యం.
ఆర్డీఐ నిధుల సహకారంతో చేపట్టే ఈ కార్యక్రమం ద్వారా యేటీని టీఆర్ఎల్-9 స్థాయికి తీసుకెళ్లేందుకు అవసరమైన సాంకేతిక అభివృద్ధి, ఇంజినీరింగ్, వివిధ వ్యవస్థల అనుసంధానం, పరీక్షలు, పనితీరు ధ్రువీకరణ చేపడతారు. ఇవన్నీ వర్తించే సాంకేతిక, భద్రతా, నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహిస్తారు. ఈ ప్రాజెక్టు ‘డీప్ టెక్నాలజీ’ రంగానికి చెందినది. ఇందులో ఉపరంగంగా ‘ఇంటెలిజెంట్ సిస్టమ్స్, రోబోటిక్స్’ను గుర్తించారు. అంతరిక్ష, విమానయాన ఇంజినీరింగ్, చోదక వ్యవస్థలు, నావిగేషన్, సమాచార వ్యవస్థలు, తెలివైన నియంత్రణ సాంకేతికతలను సమన్వయం చేసే స్వదేశీ స్వయంచాలక వ్యవస్థల ప్రాధాన్యం పెరుగుతోందని ఈ ప్రాజెక్టు ప్రతిబింబిస్తోంది.
టీడీబీ కార్యదర్శి శ్రీ రాజేశ్ కుమార్ పాఠక్ మాట్లాడుతూ.. “అధునాతన స్వయంచాలక వ్యవస్థల అభివృద్ధి సంక్లిష్టమైన కార్యకలాపాలు, లాజిస్టిక్స్ సవాళ్లను పరిష్కరించేందుకు కొత్త అవకాశాలను తెరుస్తోంది. స్వదేశంలో తయారయ్యే భారీ బరువులను మోసుకెళ్లగల వైమానిక వాహనాలు మారుమూల ప్రాంతాలకు, చేరుకోవడం కష్టమైన ప్రదేశాలకు రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించగలవు. ఆర్డీఐ నిధి ద్వారా అధునాతన అభివృద్ధి దశ నుంచి వాస్తవ వినియోగం దిశగా ముందుకు సాగేందుకు నిరంతర పెట్టుబడులు అవసరమయ్యే సాంకేతికత ఆధారిత ప్రాజెక్టులకు టీడీబీ సహకరిస్తోంది. ఐడియాఫోర్జ్తో కుదుర్చుకున్న ఈ ఒప్పందం ద్వారా స్వయంచాలక వ్యవస్థలు, రోబోటిక్స్, తదుపరి తరం అంతరిక్ష, వైమానిక సాంకేతికతల్లో భారత సామర్థ్యాలను బలోపేతం చేయాలన్న మా నిబద్ధతను చాటుతున్నాం” అని తెలిపారు.
ఈ అభివృద్ధిపై ఐడియాఫోర్జ్ టెక్నాలజీ లిమిటెడ్ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు మాట్లాడుతూ.. “భారత్ స్వయంచాలకంగా రూపొందించగల, తయారు చేయగల, నిర్వహించగల సాంకేతిక సామర్థ్యాల్లో యేటీ ఒక తరానికి సరిపడేంత ముందడుగును సూచిస్తోంది. రహదారులు ముగిసే చోట్లకు, వాతావరణ అనుకూలించని పరిస్థితుల్లోనూ చేరుకోవాల్సిన వాస్తవ సవాళ్లను మన సాయుధ దళాలు, లాజిస్టిక్స్ వ్యవస్థలు ప్రతిరోజూ ఎదుర్కొంటున్నాయి. ఆ సవాలుకు యేటీ మా సమాధానం. అత్యంత క్లిష్టమైన కార్యకలాపాల పరిస్థితుల్లో కేవలం ఎగరడమే కాకుండా, విశ్వసనీయంగా, పదేపదే సరుకులను చేరవేసేలా దీన్ని రూపొందిస్తున్నాం. ఆర్డీఐ విధానం ద్వారా ఐడియాఫోర్జ్పై ప్రభుత్వం ఉంచిన విశ్వాసం, దేశ సామర్థ్యాలను నిర్మించడంలో కీలక బాధ్యతను చేపట్టేందుకు భారత డీప్టెక్ సంస్థలు సిద్ధంగా ఉన్నాయనడానికి నిదర్శనం” అని పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2323258)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11