సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
భారత దేశ కొబ్బరి పీచు రంగం: జీవనోపాధి అవకాశాలు సృష్టిస్తూ, పరిశ్రమలకు ప్రోత్సాహమివ్వడంతో పాటు సుస్థిర వృద్ధికి ఊతం
ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్‌లో నమోదైన కాయర్ యూనిట్లు 21,000కు పైనే..
2.3 లక్షల మందికి ఉద్యోగ కల్పన
కొబ్బరి పీచు ఉత్పాదనల ఎగుమతుల్లో గత పదేళ్లలో 305 శాతం వృద్ధి
నాడు పోస్టు చేయడమైనది:
14 OCT 2026 10:09AM by PIB Hyderabad
ప్రపంచంలో కొబ్బరి పీచును మరే దేశం కన్న ఎక్కువగా ఉత్పత్తి చేయడంతో పాటు ఎగుమతి చేస్తున్న దేశం భారత్. సంప్రదాయాలకు విలువనిచ్చే భారత్‌లో నూతన ఆవిష్కరణలు కూడా పురోగమిస్తున్నాయి. కొబ్బరి పీచు రంగం ఆర్థిక, సామాజిక పురోగతికి పర్యావరణానుకూలమైన, నిలకడ కలిగిన రంగంగా ఎదుగుతున్నది. ఈ రంగం కొబ్బరి పొట్టును లాభసాటిగా వినియోగించడాన్ని ప్రోత్సహించడం ఒక్కటే కాకుండా, పల్లె ప్రాంతాల్లో సాంప్రదాయిక చేతి వృత్తి బృందాలకు బతుకుదెరువును చూపుతూ, వారి ఎదుగుదలకు తోడ్పడుతున్నది. స్థిర ప్రాతిపదిక, విలువ జోడింపు, అభివృద్ధి ఫలాలు అందరికీ అందేటట్లు చూడటంపై ఈ రంగం ప్రత్యేకంగా దృష్టి పెడుతూ, 2047కల్లా అభివృద్ధి చెందిన దేశంగా నిలిచే దిశగా భారత్ సాగిస్తున్న ప్రయాణంలో ఓ కీలక పాత్రను పోషిస్తోంది.
కొబ్బరి పీచును వాడి తయారుచేస్తున్న చాపలు, పరుపులు, తాళ్లు, బ్రష్షులు, ఇతర ఉపయోగకర వస్తువులు పర్యావరణానికి ఎలాంటి హానీ చేయకుండా, మన్నిక కలిగిన ఉత్పాదనలుగా ఉంటూ మన అందరి నిత్య జీవితంలో ఓ భాగంగా మారుతున్నాయి. అయితే ఇంతకూ ఈ కొబ్బరి పీచు అంటే ఏమిటసలు?
కొబ్బరి పీచు ఒక ప్రకృతిసిద్ధ సామగ్రి. కొబ్బరికాయలపై గట్టిగా అంటిపెట్టుకుని ఉండే దీనిని వలుస్తారు. ఇది పీచు రూపంలో ఉంటుంది. ఈ ప్రాకృతిక నారను శుద్ధిపరిచి, అనేక రకాలైన వాణిజ్య ఉత్పాదనలుగా రూపొందిస్తారు. కొబ్బరి పీచు రంగం భారతదేశలో అత్యంత ప్రాచీన, సంప్రదాయ పరిశ్రమల్లో ఒకటి. ఇది పర్యావరణ మిత్రపూర్వక తయారీ రంగాల్లో ఒకటి. దీనిలో కొబ్బరి డిప్పలు, పీచును కొబ్బరికాయల నుంచి వేరు చేసి, శుద్ధి పరిచి, విలువను జత చేసి ఉత్పాదనల రూపంలో తీర్చి దిద్దుతారు.
భారతదేశంలో కొబ్బరి పీచు రంగం:-
ప్రపంచంలో అతి పెద్ద కొబ్బరి పీచు, పీచు ఉత్పాదనల ఉత్పత్తిదారు, ఎగుమతిదారు దేశంగా పేరు తెచ్చుకుంది భారత్. ప్రపంచం మొత్తంమీద మూడింట రెండు వంతుల కొబ్బరిని భారత్ అందిస్తోంది. భారతదేశ కొబ్బరి పీచు పరిశ్రమ టర్నోవరు దాదాపుగా రూ.16,000 కోట్లు. భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో సుమారు 1 శాతాన్ని ఈ పరిశ్రమ సమకూరుస్తోంది.
భారత్ 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఎగుమతి చేసిన కొబ్బరి నార, పీచు ఉత్పత్తుల విలువ రూ.6,614.40 కోట్లుగా లెక్కకు వచ్చింది. భారత్ కొబ్బరి పీచు ఉత్పాదనలను ప్రధానంగా అమెరికా, చైనా, నెదర్లాండ్స్, స్పెయిన్, బ్రిటన్లకు ఎగుమతి చేశారు. కొబ్బరి బెండు, పీచు, దారం, యంత్రాల సాయంతో రూపొందించిన కాలి పట్టాలను, చాపలను వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.
భారతదేశ కొబ్బరి పీచు రంగంలో పనిచేస్తున్న యూనిట్లు 21,000కు మించి ఉన్నాయి. ఇవి 7 లక్షల కన్నా ఎక్కువ మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధిని కల్పిస్తున్నాయి. ఈ రంగంలో పనిచేస్తున్న వారిలో 80 శాతం మంది గ్రామీణ కుటుంబాలకు చెందిన మహిళలు.
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ (ఎమ్ఎస్ఎమ్ఈ) ‘‘కాయర్ వికాస్ యోజన (సీవైవై)’’ పేరుతో ఓ కేంద్ర రంగ పథకాన్ని నిర్వహిస్తోంది. కొబ్బరి నార రంగాన్ని సుస్థిర ప్రాతిపదికన అభివృద్ధిపరచడం ఈ పథకం లక్ష్యం. దేశంలో కొబ్బరి పీచుతో వివిధ వస్తువులను తయారు చేసే చేతివృత్తిదారులకు, కొబ్బరి పీచు పరిశ్రమకు ఈ పథకం ద్వారా సాయాన్ని అందిస్తున్నారు.కాయర్ వికాస్ యోజన (సీవైవై)లో ప్రధానంగా ఈ కింది అంశాలపై శ్రద్ధ తీసుకుంటున్నారు:
• కొబ్బరి పీచు పరిశ్రమను దృష్టిలో పెట్టుకొని కొత్త కొత్త సాంకేతికతలను, యంత్ర పరికరాలను, ఉత్పాదనలను అభివృద్ధిపరచడం.
• వివిధ నైపుణ్యాల్లో శిక్షణను అందిచడం, అభివృద్ధి ప్రధాన కార్యక్రమాలను నిర్వహించడం.
• కొబ్బరి పీచు, కొబ్బరి పీచుతో తయారు చేసిన వస్తువుల అమ్మకాలను దేశీయ మార్కెట్లతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ప్రోత్సహించడం.
• ప్రచార కార్యక్రమాలను నిర్వహించడం, వాణిజ్య మేళాలు, ఎక్స్‌పోలు, తదితర కార్యక్రమాలలో పాలుపంచుకొనేందుకు అవకాశాన్ని కల్పించి తత్సంబంధిత అవగాహనను పెంపొందించడం.
• అమ్మకాలను ప్రోత్సహించడానికి ఆర్థిక సహాయాన్ని అందించడం.
• కొబ్బరి నార ఎగుమతిదారు సంస్థలు అంతర్జాతీయ ప్రదర్శనలలో పాల్గొనేందుకు మార్గాన్ని సుగమం చేయడం.
• కొబ్బరి నార రంగానికి సంబంధించిన గణాంకాలను సంకలనపరిచి, ప్రచురించడం.
గత 12 సంవత్సరాల్లో (2014-15 మొదలు) కీలక విజయాలు:
• ‘ఉద్యమ్’ రిజిస్ట్రేషన్ పోర్టల్‌లో 21,000 కు పైగా కాయర్ యూనిట్లు నమోదు అయ్యాయి. వీటిలో 2.3 లక్షల మంది పనిచేస్తున్నారు. ఈ విధంగా వారు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ విధాన విస్తారిత అనుబంధ వ్యవస్థలో భాగమయ్యారు.
• కొబ్బరి పీచు, కొబ్బరి నార ఉత్పాదనల ఎగుమతులు నాలుగింతలకు పైబడ్డాయి. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఈ ఎగుమతుల విలువ రూ.1,630.33 కోట్లుగా ఉండగా, 2025-26 ఆర్థిక సంవత్సరం కల్లా 305.70 శాతం వృద్ధితో రూ.6,614.40 కోట్లకు చేరుకున్నాయి.
• వివిధ శిక్షణ కార్యక్రమాలను నిర్వహించి 68,000 కన్న ఎక్కువ మందికి ప్రావీణ్యాలను నేర్పించారు. శిక్షణ పొందిన వారిలో 80 శాతం కన్న ఎక్కువ మంది మహిళలు ఉన్నారు.
• 150కి పైగా సరికొత్త యంత్రాలు, సాంకేతికతలు, విలువను జోడించిన ఉత్పాదనలను ఆవిష్కరించారు.
• విదేశాల్లో నిర్వహించిన అంతర్జాతీయ ప్రదర్శనల్లో పాల్గొనడానికి 1,000 కన్న ఎక్కువ ఎగుమతిదారు సంస్థలకు అవకాశం లభించింది. దీనికి తోడు, ఎగుమతి మార్కెట్లకు ప్రోత్సాహాన్ని ఇవ్వడంలో భాగంగా 850కి పైగా ఔత్సాహిక వాణిజ్య సంస్థలకు రూ.20 కోట్ల కన్న ఎక్కువ ఆర్థిక సహాయాన్ని అందించారు.
• భారత్ నలుమూలలా 1,400కు పైగా ప్రచార కార్యక్రమాలతో పాటు, 950కి పైగా ప్రదర్శనలను కూడా నిర్వహించారు.
కొబ్బరి నారతో కలలను సాకారం చేసుకోవడం: వాణిజ్య సంస్థల స్ఫూర్తిదాయక విజయ గాథలు

1. మహారాష్ట్రలో సింధుదుర్గ్ జిల్లాకు చెందిన శ్రీమతి రంజన రామ్‌చంద్ర కదమ్ తాను ఔత్సాహిక వాణిజ్య వేత్త కావాలన్న కలను ‘ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పీఎమ్ఈజీపీ)’అండతో నెరవేర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆమెకు కాయర్ బోర్డు మార్గదర్శకత్వాన్ని అందించింది. ఆమె కాయర్ యూనిట్టును ఏర్పాటు చేయడానికి బోర్డు సాయపడింది. ఆమె ఓ షెడ్డును నిర్మింపచేసుకొని, వ్యాపారాన్ని ఆరంభించడానికి అవసరమైన యంత్ర పరికరాల్ని కొనుగోలు చేశారు. ఆమె ఏర్పాటు చేసిన కర్మాగారంలో ప్రస్తుతం కొబ్బరి పీచుతో తాళ్లు, దిళ్లు, డోర్మ్యాట్లను తయారు చేస్తున్నారు. ఈ సంస్థతో ఆమె ఆరుగురికి పూర్తి స్థాయి ఉపాధిని కల్పించారు.
2. కేరళలోని కోజికోడ్‌లో శ్రీ సురేంద్రన్ పి. మార్గదర్శకత్వంలో సంపూర్ణ ప్లస్ అగ్రో ఫర్టిలైజర్ ఎంటర్ప్రైజెస్ నడుస్తున్నది. ఈ సంస్థకు కణ్ణూర్‌లో గల కాయర్ బోర్డు ఉప- ప్రాంతీయ కార్యాలయంతో పాటు కలావుర్లోని కేంద్ర కొబ్బరి పీచు పరిశోధన సంస్థ (సీసీఆర్‌ఐ)లు శిక్షణను, సాంకేతిక మార్గదర్శకత్వాన్ని సమకూర్చాయి. కొబ్బరి బెండు నుంచి బయో-ఫర్టిలైజరును తయారు చేయడం, ఆ ఎరువును ప్రభావవంతంగా ఉపయోగించడాన్ని గురించిన ప్రత్యక్ష శిక్షణ కార్య్రమాల్లో, డెమాన్స్ట్రేషన్లు, అవగాహన కార్యక్రమాల్లో శ్రీ సురేంద్రన్ పి. చురుకుగా పాల్గొన్నారు. ఆయన స్థాపించిన వాణిజ్య సంస్థ 500 కన్న ఎక్కువ మంది వినియోగదారులను కేవలం ఒక సంవత్సర కాలంలో సంపాదించుకుంది. ఈ యూనిట్టు 20 టన్నుల కన్న ఎక్కువ కాయర్ పిథ్ బయో-ఫర్టిలైజర్ విక్రయాలను కూడా నమోదు చేసింది. ప్రస్తుతానికి ఈ యూనిట్టులో ఇద్దరు మహిళలు సహా అయిదుగురు కార్మికులు పనిచేస్తున్నారు.

3. ఆంధ్రప్రదేశ్‌లో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన శ్రీమతి అల్లం గౌతమి అయిదు సంవత్సరాల కిందట కాయర్ బోర్డ్ ట్రయినింగ్ సెంటర్లో శిక్షణ పొందారు. సాంకేతిక మార్గదర్శకత్వం అందించిన స్ఫూర్తితో ఆమె తన సొంత వాణిజ్య సంస్థ అదిగో కాయర్ ప్రోడక్ట్స్‌ను స్థాపించారు. పీఎమ్ఈజీపీ లో భాగంగా ఆమెకు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఇవాళ, ఈ యూనిట్టు దాదాపు రూ.35 లక్షల వార్షిక టర్నోవరును సాధించింది. ఈ సంస్థ వార్షిక లాభం సుమారు రూ.10 లక్షలుగా ఉంది. ఈ సంస్థ ఆరుగురు మహిళలకు జీవనోపాధిని కల్పించింది. రాజమండ్రి కాయర్ బోర్డు ప్రాంతీయ కార్యాలయం, మండల పరిషత్ అధికారుల అండదండలతో ఆమె శిక్షణ కార్యక్రమాలను కూడా చురుకుగా నిర్వహిస్తున్నారు. కొబ్బరి నారతో చాప అల్లడంలో, తాళ్ల తయారీలో, హస్తకళల ఉత్పాదనల్లో ఇంతవరకు సుమారు 120 మంది మహిళలకు శిక్షణను అందించారు.

4. కేరళలో ఆలప్పుళ నివాసి శ్రీ జి. సామూ పీఎమ్ఈజీపీలో భాగంగా కలావుర్ లోని కాయర్ బోర్డు ప్రాంతీయ కార్యాలయం నుంచి సాయాన్ని అందుకుని, కొబ్బరి పీచును వడికే యూనిట్టును 2024లో నెలకొల్పారు. రెండు సంవత్సరాల్లో ఈ యూనిట్టు కాయర్ యార్ను, తాళ్లను ఉత్పత్తి చేయడంలో ప్రావీణ్యాన్ని సాధించగలిగింది. ఈ యూనిట్టు ఉత్పాదనలను స్థానిక కాయర్ సొసైటీలతో పాటు ఆలప్పుళలో తయారీ సంస్థలకు కూడా సరఫరా చేస్తున్నారు. ఈ పరిశ్రమలో స్థానికంగా 8 -10 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వారిలో ఎక్కువ మంది చుట్టుపక్కల పల్లెలకు చెందిన మహిళలే ఉన్నారు. నెలవారీ టర్నోవరు చెప్పుకోదగిన స్థాయిలో వృద్ధి చెందింది. దీంతో శ్రీ సాబూకు నిలకడైన ఆదాయం అందుతోంది. కార్మికులకు క్రమం తప్పక వేతనాలు కూడా లభిస్తున్నాయి.
***
(రిలీజ్ ఐడి: 2323175)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7