ప్రధాన మంత్రి కార్యాలయం
బ్లూమ్‌బర్గ్ న్యూ ఎకానమీ ఫోరంను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
సాధికారతను కల్పించే శక్తి అనే ఆలోచనను మీ ముందుకు తీసుకువచ్చాను: పీఎం
నియంత్రణకు అతీతంగా సామర్థ్యాన్నిచ్చే శక్తి, పోటీపడే శక్తికి అతీతంగా సహకారాన్ని అందించే
శక్తి, విజయం సాధించే శక్తికి అతీతంగా ఇతరుల గెలుపునకు
తోడ్పడే శక్తి ఉంటుంది: పీఎం
ఇతర దేశాలకు కూడా నూతన అవకాశాలను అందించేలా భారత్ సామర్థ్యాలను
వినియోగించాలన్నదే మా స్థిర లక్ష్యం: పీఎం
సమష్టి వృద్ధి, ఉమ్మడి అవకాశాల్లోనే భారత్ పురోగతి మూలాలున్నాయి: పీఎం
ఇతరులకు నష్టం కలిగించేలా మా వృద్ధి ఉండదు, మేం ప్రపంచం కోసం, ప్రపంచంతో కలసి ఎదుగుతాం: పీఎం
అనిశ్చితితో నిండిన ఈ ప్రపంచంలో విశ్వసనీయతను, స్థిరత్వాన్ని భారత్ అందిస్తోంది: పీఎం
మాకు సంస్కరణలు నిర్బంధం కాదు. అవి మా దృఢవిశ్వాసానికి సంబంధించినవి: పీఎం
నాడు పోస్టు చేయడమైనది:
13 OCT 2026 12:42PM by PIB Hyderabad
న్యూఢిల్లీలో బ్లూమ్‌బర్గ్ న్యూ ఎకానమీ ఫోరంను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రసంగించారు. అంతకు ముందే శ్రీ మైఖేల్ బ్లూమ్‌బర్గ్ చేసిన వ్యాఖ్యలను అంగీకరించారు. అపూర్వమైన రీతిలో భారతదేశంలోకి ఈ ఫోరం అడుగుపెట్టడాన్ని ప్రధానమంత్రి అభినందించారు. ఆర్థికం, సాంకేతికం, ఇంధనం, అంతర్జాతీయ వ్యవహరాలతో సహా కీలకమైన అంశాలపై చర్చించేందుకు ప్రపంచంలోని మేధావులందరినీ ఏకం చేయగల ఈ వేదిక సామర్థ్యాన్ని ప్రశంసించారు. ‘‘సరైన సమయంలో సరైన వేదికను ఎంచుకున్న శ్రీ బ్లూమ్‌బర్గ్‌కు, ఆయన బృందానికి అభినందనలు’’ అని శ్రీ మోదీ అన్నారు.
నూతన ప్రపంచ శక్తులుగా ఆవిర్భవిస్తున్న దేశాలపై ఈ సదస్సు ప్రధాన దృష్టి సారించడం గురించి ప్రధాని ప్రస్తావించారు. 21వ శతాబ్దపు మూడో దశాబ్దంలో సాంకేతిక పరిజ్ఞానం, డేటా, జ్ఞానం, ఆవిష్కరణలే శక్తికి అంతిమ కొలమానాలుగా పరిగణిస్తున్న మార్పు గురించి వివరించారు. ఈ అధికారానికి ఉన్న ప్రాథమిక ఉద్దేశాన్ని పునఃపరిశీలించాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారిని కోరారు. ఇది కొంతమందిని మాత్రమే ఉన్నత స్థానాలకు చేర్చడానికా? లేదా లక్షలాది మందికి అవకాశాలను కల్పించడానికా? అని ప్రశ్నించారు. నియంత్రణ నుంచి సాధికారత కల్పించే దిశగా, పోటీపడటం నుంచి సహకరించుకొనే దిశగా మారాల్సిన అవసరాన్ని స్పష్టం చేశారు. ‘‘విజయం సాధించే శక్తిని దాటి ఇతరుల విజయానికి దోహదపడే దిశగా పయనిస్తూ, సాధికారతను కల్పించే శక్తి అనే ఆలోచనతో ఈ రోజు నేను ఇక్కడికి వచ్చాను’’ అని శ్రీ మోదీ తెలియజేశారు.
ఈ తాత్విక భావనకు ప్రాచీన సాంస్కృతిక జ్ఞానాన్ని పునాదిగా వేస్తూ... జ్ఞానం, సంపద, అధికారాల నిజమైన విలువ వాటిని ఎంత నైతికంగా ఉపయోగిస్తున్నాదనిపైనే ఆధారపడి ఉంటుందనే సంస్కృత శ్లోకాన్ని ఉటంకించారు. అత్యంత సంక్లిష్టంగా ఉన్న ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో ఈ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడం అత్యంత అవసరమని ఆయన తెలియజేశారు. ‘‘అధికార ఉద్దేశంలోనే దాని అసలు ప్రయోజనం దాగుంది’’ అని శ్రీమోదీ స్పష్టం చేశారు.
ఈ ప్రాచీన ఆదర్శాలను ఆధునిక పరిపాలనకు అనువదిస్తూ.. ‘‘సాధికారతను కల్పించే శక్తి’’ అనే భావన కేవలం ప్రపంచానికి బోధించే అంశం మాత్రమే కాదని, అది దేశ పరిపాలనలో, పని సంస్కృతిలో భాగం చేయదగిన సాంస్కృతిక సంప్రదాయమని మోదీ తెలియజేశారు. దేశ ప్రగతికి సంబంధించిన స్పష్టమైన ఉదాహరణలను ఉపయోగించి ఈ పరివర్తనాత్మక తత్వాన్ని వివరిస్తానని ఆయన చెప్పారు. ‘‘భారతదేశానికి చెందిన ఉదాహరణలు తెలియజేస్తూ నా ప్రసంగాన్ని కొనసాగిస్తాను’’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
‘ప్రజాస్వామ్యానికి తల్లి’ అయిన భారతదేశంలోని చైతన్యం గురించి ప్రధానమంత్రి వివరించారు. దేశంలోని అపారమైన భాషా వైవిధ్యం, 80,000 పబ్లికేషన్లు, వెయ్యికి పైగా టీవీ ఛానళ్లు ఉన్నాయని వెల్లడించారు. ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో దేశంలో అర బిలియన్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వినియోగదారులు ఉన్నారన్నారు. వీరు విస్తృతమైన, బహిరంగ చర్చలలో పాల్గొంటున్నారని, ప్రజాస్వామ్య విధానంలో జరిగే చర్చలను డిజిటల్ శక్తి ప్రోత్సహిస్తుందనేదానికి ఇదే నిదర్శనమని తెలియజేశారు. ‘‘ప్రస్తుత సమయంలో కీలక పాత్ర పోషించేది డిజిటల్ శక్తే’’ అని శ్రీ మోదీ తెలిపారు.
డిజిటల్ బహిష్కరణకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని ప్రధాని గుర్తు చేశారు. దశాబ్దం క్రితం మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ కేవలం కొంతమంది ఉన్నత వర్గాల వారికే పరిమితమైన ప్రత్యేక హక్కుగా పరిగణించేవారన్నారు. 2014 నుంచి తమ ప్రభుత్వం డేటా ధరలను గణనీయంగా తగ్గించిందని తెలియజేశారు. తద్వారా చిన్న స్థాయి పట్టణాలకు చెందిన విద్యార్థుల నుంచి గ్రామాల్లోని దుకాణదారుల వరకు ప్రతి ఒక్కరికీ సమాచారాన్ని, మార్కెట్ అవకాశాలను తక్షణమే అందించడమే తమ ఉద్దేశమని పేర్కొన్నారు. ‘‘భారత్‌లో అనుసంధానం ప్రజలను మాత్రమే అనుసంధానించడంతోనే సరిపెట్టుకోలేదు. అవకాశాలను కూడా అందించింది’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
అసాధారణ స్థాయిలో చేపట్టిన ఆర్థిక సమ్మిళిత్వం గురించి కూడా ప్రధానమంత్రి వివరించారు. సాధారణ వీధి వ్యాపారి నుంచి పెద్ద కార్ షోరూమ్ వరకు ఒకే సాంకేతిక వేదికను ఉపయోగించే ఎలాంటి అవరోధాలు లేని డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను పరిశీలించాలని అంతర్జాతీయ అతిథులను కోరారు. సమ్మిళిత సాంకేతిక పరిజ్ఞాన పనితీరుకు అంతిమ చిహ్నంగా విప్లవాత్మకమైన ఆర్థిక ప్రజాస్వామ్యీకరణను ఉదహరించారు. ‘‘ఇదే సమ్మిళిత సాంకేతిక సామర్థ్యం’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
అంతర్జాతీయ సాంకేతిక ఏకత్వం పట్ల దేశానికున్న నిబద్ధత గురించి ప్రధానమంత్రి వివరించారు. ఇతర దేశాలు తమ డిజిటల్ మౌలిక వసతులను నిర్మించుకొనేలా తన స్వదేశీ సామర్థ్యాలను గ్లోబల్ సౌత్, ఇతర భాగస్వామ్య దేశాలతో భారత్ పంచుకుంటోందని ప్రధానమంత్రి ప్రకటించారు. అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలను స్వదేశీ ఆవిష్కరణలు ఏవిధంగా అందిస్తున్నాయో తెలియజేసేందుకు మహమ్మారి సమయంలో అందుబాటులోకి తెచ్చిన కొవిన్ ఓపెన్ సోర్స్ వేదికే ఉదాహరణ అని పేర్కొన్నారు. ‘‘మన సామర్థ్యం మానవాళికి సాధికారతను అందించాలి’’ అని శ్రీ మోదీ అన్నారు.
ఆవిష్కరణలను విస్తృత స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడాన్ని సమర్థిస్తూ... దేశంలో అన్యూహంగా వృద్ధి చెందుతున్న అంకుర సంస్థలను ప్రధానమంత్రి అభినందించారు. 2014లో వందల సంఖ్యలో ఉన్న అంకుర సంస్థలు ఇప్పుడు 2.5 లక్షలకు పైగా చేరుకున్నాయన్నారు. వీటిలో దాదాపు సగం అంకుర సంస్థలు చిన్న నగరాలకు చెందినవే అని, 45 శాతానికి పైగా అంకురసంస్థల్లో మహిళా నాయకత్వం ఉందని గర్వంగా తెలిపారు. ఇది సమస్యలను పరిష్కరించే శక్తి సమాజంలోని అన్ని వర్గాలకూ చేరుతోందని నిరూపిస్తోందన్నారు. ‘‘ఆవిష్కరణల్లో అవకాశాలు మరింత మందికి చేరుతున్నాయి," అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
ప్రజా పరిపాలన మూల తత్వం గురించి ప్రధాని ప్రస్తావించారు. ప్రజలు వ్యవస్థలపై పూర్తిగా ఆధారపడి ఉండేలా చూడాలన్నది ప్రభుత్వ అధికారం లక్ష్యం కాకూడదని, దానికి బదులుగా పౌరులను పూర్తిగా సమర్థులుగా, సాధికారంగా తీర్చిదిద్దడంపై దృష్టి సారించాలని సూచించారు. గడచిన దశాబ్ద కాలంలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకురావడానికి ఈ సాధికారత ఆధారిత పాలనా విధానమే కారణమన్నారు. ‘‘ఈ మార్గంలోనే భారత్ ముందుకు నడుస్తోంది" అని శ్రీ మోదీ తెలియజేశారు.
అవినీతిని వ్యవస్థాగతంగా నిర్మూలించడం గురించి ప్రధానమంత్రి వివరించారు. ప్రభుత్వ అందించే సాయాన్ని నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాలకే పంపిణీ చేసేందుకు ఉద్దేశించిన జేఏఎం త్రయం, ప్రత్యక్ష నగదు బదిలీ వ్యవస్థల అమలు గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. ‘‘ఇది అవినీతిని తగ్గించింది. దేశ పౌరులకు సౌలభ్యాన్ని మెరుగుపరిచింది. ప్రభుత్వం, ప్రజల మధ్య ప్రత్యక్ష సంబంధాలను ఏర్పాటు చేసింది’’ అని శ్రీ మోదీ చెప్పారు.
ప్రపంచ వేదికపై ఈ సాధికారత తత్వాన్ని వివరిస్తూ.. కొవిడ్–19 మహమ్మారి సమయంలో వ్యాక్సిన్లకు ఎదురైన తీవ్ర కొరతను ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. ప్రాణాలను కాపాడే ఉత్పాదక శక్తిని కొన్ని దేశాలు తమ వద్దే ఉంచుకోవాలా? అని ప్రశ్నించారు. 100కు పైగా దేశాలకు వ్యాక్సిన్లను సరఫరా చేయాలనే మానవతా మార్గాన్ని భారత్ ఎంచుకుందని ఆయన గర్వం వ్యక్తం చేశారు. ‘‘మన ఉత్పాదక సామర్థ్యం ఇతర దేశాలకు కూడా సహాయకారిగా మారింది’’ అని శ్రీ మోదీ తెలియజేశారు.
సమ్మిళిత్వంతో కూడిన దూరదృష్టికి ఓ ప్రత్యేక ఉదాహరణను శ్రీ మోదీ అందించారు. ఇటీవలే దేశంలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సదస్సులో మానవ ప్రయోజనాలకు అతీతంగా కృత్రిమ మేధ జంతు సంక్షేమానికి ఎలాంటి మేలు చేకూరుస్తుందనే దానిపై విస్తృత చర్చలు జరిగాయని తెలియజేశారు. ఇది రోజురోజుకీ సామర్థ్యం పెంచుకుంటున్న దేశం ప్రపంచం మొత్తానికీ విస్తృత ప్రయోజనాలను అందిస్తుందని నిరూపించడానికి ఈ చర్చలే ఉదాహరణ అని తెలియజేశారు. ‘‘భారత్ ఎంత సమర్థంగా తయారైతే, మానవాళికి, ప్రపంచానికి అంతగా ప్రయోజనం చేకూరుస్తుంది’’ అని శ్రీ మోదీ తెలిపారు.
ప్రపంచ క్రమంలో సమతుల్యతకు ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. పోటీ, ఆవిష్కరణ, జాతీయ సామర్థ్యం అనేవి ముఖ్యమైనవే అయినప్పటికీ వాతావరణ మార్పు, నీటి పరిపాలన, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలను బాధ్యతాయుతంగా వినియోగించడం లాంటి అంతర్జాతీయ సవాళ్లను పరిష్కరించేందుకు కరుణ, నిబద్ధత కూడా తప్పనిసరిగా ఉండాలని ప్రధానమంత్రి తెలియజేశారు. నూతన, ఉమ్మడి అవకాశాలను సృష్టించడంలో చురుగ్గా ఉండే శక్తులు ప్రపంచానికి అత్యవసరమని ఆయన స్పష్టం చేశారు. ‘‘శక్తి అంటే కేవలం ముందుకు సాగే సామర్థ్యం మాత్రమే కాదు. ఇతరులు కూడా ముందుకు నడిచేలా వారిని శక్తిమంతం చేసే సామర్థ్యం’’ అని శ్రీ మోదీ తెలియజేశారు.
వాతావరణ పరిరక్షణ చర్యల పట్ల భారత్‌కు ఉన్న దృఢ నిబద్ధతను ప్రధానమంత్రి వివరించారు. 2030 నాటికి శిలాజేతర ఇంధన వనరుల నుంచి 40 శాతం విద్యుత్ సామర్థ్యాన్ని సాధిస్తామని 2015లో పారిస్ ఒప్పందం సందర్భంగా చేసిన ప్రతిష్ఠాత్మక ప్రతిజ్ఞను ప్రధానమంత్రి గుర్తుచేశారు. ఈ లక్ష్యాన్ని నిర్ణీత గడువుకు తొమ్మిదేళ్ల ముందుగానే, 2021 నవంబర్‌లో భారత్ అధిగమించిందని గర్వంగా ప్రకటించారు. ఈ ఘనత సాధించిన తొలి జీ-20 దేశంగా భారత్ నిలిచిందని తెలిపారు. “ఇది కేవలం ఇచ్చిన హామీని నెరవేర్చడం మాత్రమే కాదు.. భారత్ ఇంధన రంగంలో మారుతున్న ప్రయాణానికి కూడా ఇది సంకేతం” అని ప్రధాని శ్రీ మోదీ పేర్కొన్నారు.
హరిత ఇంధన రంగంలో భారత్ సాధించిన భారీ పురోగతిని వివరిస్తూ.. దేశంలో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 2014లో కేవలం 75 గిగావాట్లుగా ఉండగా, ప్రస్తుతం సుమారు 300 గిగావాట్లకు చేరిందని ప్రధానమంత్రి తెలిపారు. ఈ సామర్థ్యం నాలుగు రెట్లు పెరగడం దేశ సుస్థిర అభివృద్ధిలో ఒక గొప్ప విజయమని ఆయన అభివర్ణించారు.
ఇంధన పరివర్తన వల్ల క్షేత్రస్థాయిలో ప్రజలకు కలుగుతున్న ఆర్థిక ప్రయోజనాలను శ్రీ మోదీ ప్రస్తావించారు. పీఎం సూర్య ఘర్, పీఎం-కుసుమ్ పథకాలు గృహ వినియోగదారులు, రైతులు తమకు అవసరమైన సౌర విద్యుత్‌ను తామే ఉత్పత్తి చేసుకునేలా, వ్యవసాయ పెట్టుబడి ఖర్చులను తగ్గించుకునేలా సహాయపడుతున్నాయని తెలిపారు. ఈ పథకాల ద్వారా 30 గిగావాట్లకు పైగా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం అదనంగా అందుబాటులోకి వచ్చిందన్నారు. తద్వారా ఏటా 3 కోట్ల టన్నులకు పైగా కర్బన ఉద్గారాలు తగ్గుతున్నాయని, ప్రకృతి పరిరక్షణతో పాటు ప్రజలకు కూడా ప్రయోజనం చేకూరుతోందని పేర్కొన్నారు. “ఇది ప్రజలకు సాధికారతను కూడా కల్పిస్తోంది” అని ప్రధాని శ్రీ మోదీ అన్నారు.
ప్రపంచ దేశాల మధ్య ఆధిపత్య పోరాటాలు కొనసాగుతున్నప్పటికీ, భారత్ సహకార స్ఫూర్తితో ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అంతర్జాతీయంగా ఆధిపత్యం కోసం పోటీ నెలకొన్న తరుణంలో.. భారత్ ప్రత్యేకమైన, స్థిరత్వాన్ని పెంపొందించే మార్గాన్ని ఎంచుకుందని తెలిపారు. ప్రస్తుత దశాబ్దం భారత్ అనుసరిస్తున్న ఈ ప్రత్యేక వైఖరికి స్పష్టమైన నిదర్శనమని పేర్కొన్నారు. “ప్రపంచంలో శక్తి ఆధిపత్యం కోసం పోటీ సాగుతున్న ఈ సమయంలో.. భారత్ భిన్నమైన దృక్పథంతో ముందుకు సాగుతోంది” అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.
21వ శతాబ్దంలోని మూడో దశాబ్దాన్ని ప్రభావితం చేస్తున్న వరుస సంక్షోభాల గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపించిన మహమ్మారులు, ప్రాంతీయ యుద్ధాలు, కీలక ఖనిజాలు, ఇంధనం, వాణిజ్యానికి సంబంధించిన సరఫరా వ్యవస్థల్లో తీవ్రమైన అంతరాయాలను గుర్తుచేశారు. ఒక సంక్షోభం నుంచి ప్రపంచం తేరుకునేలోపే మరో సంక్షోభం ఎదురవుతోందని పేర్కొన్నారు. “ప్రపంచం ఒక సంక్షోభం నుంచి బయటపడే మార్గాన్ని అన్వేషించేలోపే, మరో కొత్త సంక్షోభం ఎదురవుతోంది” అని ప్రధాని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
ప్రపంచ దేశాల పరస్పర అనుసంధానాన్ని ఒత్తిడి, ఆధిపత్య సాధనంగా మార్చడంపై ప్రధానమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. సరఫరా వ్యవస్థలు, ఇంధనం, ఖనిజాలు, సాంకేతికత, చెల్లింపుల వ్యవస్థలు వంటి కీలక అంశాలను ఇతర దేశాలపై ఒత్తిడి తెచ్చేందుకు, ఆధిపత్యం చెలాయించేందుకు ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు. దశాబ్దాల ప్రపంచీకరణ ద్వారా ఏర్పడిన పరస్పర అనుసంధాన వ్యవస్థలు ప్రస్తుతం ప్రమాదకరమైన భౌగోళిక రాజకీయ అడ్డంకులుగా మారుతున్నాయని హెచ్చరించారు. “గత దశాబ్దాల్లో ప్రపంచీకరణ ద్వారా ఏర్పడిన అనుసంధానాలు ఎప్పుడు, ఎక్కడ అడ్డంకులుగా మారాయో మనమంతా చూస్తున్నాం” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
వేగంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం, జనాభాపరమైన సవాళ్ల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న విశ్వాస సంక్షోభాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ.. సంక్షోభ సమయాల్లోనూ సరఫరా వ్యవస్థలను కొనసాగిస్తూ, ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే విశ్వసనీయ భాగస్వాముల కోసం ప్రపంచం తీవ్రంగా ఎదురుచూస్తోందని పేర్కొన్నారు. అంతర్జాతీయ సంబంధాల్లో భిన్నమైన, సహకారపూర్వకమైన విధానాన్ని అనుసరిస్తూ, నమ్మదగిన భాగస్వామిగా భారత్ నిలుస్తోందని తెలిపారు. “భిన్నమైన వైఖరి, భిన్నమైన ఆలోచనతో భారత్ మీ ముందుంది” అని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
ప్రపంచ వేదికపై భారత్ అనుసరిస్తున్న విధానాన్ని వివరిస్తూ.. 21వ శతాబ్దంలో దేశ పురోగతి పరస్పర సహకారం, సమ్మిళిత అభివృద్ధిపై ఆధారపడి ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రపంచంలో వినియోగించే జనరిక్ మందుల్లో అయిదో వంతును భారత్ అందిస్తోందని, డిజిటల్ గుర్తింపు నమూనాల రూపకల్పనలో మార్గదర్శకంగా నిలిచిందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తున్న 2,000కు పైగా గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లకు (ప్రపంచ సామర్థ్య కేంద్రాలు-జీసీసీలు) ఆతిథ్యం ఇస్తున్న విశ్వసనీయ ప్రతిభా కేంద్రంగా కేంద్రంగా మారిందని తెలిపారు. “అందరితో కలిసి పనిచేస్తూ, ప్రతి ఒక్కరినీ కలుపుకొని ముందుకు సాగడమే భారత్ ప్రగతి గాథ” అని ప్రధానమంత్రి శ్రీ మోదీ అన్నారు.
ప్రపంచంలో స్థిరత్వాన్ని పెంపొందించే శక్తిగా భారత్ పోషిస్తున్న పాత్రను వివరిస్తూ.. ప్రపంచానికి స్థిరమైన మద్దతు అవసరమైన ప్రతిసారీ అంతర్జాతీయ సమాజానికి సహకరించేందుకు భారత్ బాధ్యతాయుతంగా ముందుకు వస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రపంచ వేదికపై అందరికీ సమానంగా ప్రయోజనం చేకూరేలా అభివృద్ధి సాధించాలన్న ప్రాథమిక సూత్రాన్ని ఆయన వివరించారు. “ఎవరికీ నష్టం కలిగించి మేం అభివృద్ధి చెందం. ప్రపంచంతో కలిసి, ప్రపంచం కోసం అభివృద్ధి చెందుతాం” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
భారత్ సుదీర్ఘ చారిత్రక వారసత్వాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు. మానవాళికి ‘సున్నా’ భావనను అందించినప్పుడు భారత్ ఎలాంటి రాయల్టీలను ఆశించలేదని శ్రీ మోదీ గుర్తుచేశారు. నేటికీ అదే నిస్వార్థ స్ఫూర్తితో దేశం పనిచేస్తోందని పేర్కొన్నారు. గతంలో ప్రపంచంలోని కొన్ని సంస్థలు తమ స్వప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చాయని చెబుతూ.. భారత్ మాత్రం అందరి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుతోందని తెలిపారు. “నేటికీ భారత్ ఇదే స్ఫూర్తితో పనిచేస్తోంది” అని ప్రధాని శ్రీ మోదీ పేర్కొన్నారు.
సమ్మిళిత ప్రపంచ వేదికలను నిర్మించడంలో భారత్ సాధించిన ప్రగతిని వివరిస్తూ.. అంతర్జాతీయ సౌర కూటమి, సీడీఆర్ఐ, బిగ్ క్యాట్ అలయన్స్, గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్, ఐఎంఈసీ, మిషన్ లైఫ్ వంటి పరివర్తనాత్మక కార్యక్రమాలను ప్రధానమంత్రి ప్రస్తావించారు. పరిమిత భౌగోళిక రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, అన్ని రకాల జీవరాశులకు ప్రయోజనం చేకూర్చేలా ఈ వేదికలను ఉద్దేశపూర్వకంగా రూపొందించినట్లు తెలిపారు. “అందరికీ, ప్రతి జీవికి ప్రయోజనం కలిగించే కార్యక్రమాలను భారత్ చేపట్టింది” అని ప్రధాని స్పష్టం చేశారు.
భారత విదేశాంగ విధానానికి మార్గనిర్దేశం చేస్తున్న విస్తృత తాత్విక దృక్పథాన్ని ప్రధానమంత్రి వివరించారు. ‘ఒకే సూర్యుడు, ఒకే ప్రపంచం, ఒకే విద్యుత్ గ్రిడ్’, ‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’, ‘ఒకే భూమి, ఒకే ఆరోగ్యం’ అనే నినాదాలను ప్రస్తావించారు. ఇతర దేశాలను అనుసంధానించడం, ఐక్యంగా ముందుకు నడిపించడం, వాటి అభివృద్ధికి తోడ్పడటం కోసమే భారత్ తన శక్తిని వినియోగిస్తుందని పేర్కొన్నారు. “శక్తిని వినియోగించడంలోనూ ఇతరులకు సాధికారత కల్పించడమే భారత్ లక్ష్యం” అని శ్రీ మోదీ అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ స్థితిస్థాపకతను ప్రస్తావిస్తూ.. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 7.8 శాతం వృద్ధి రేటు నమోదైందని ప్రధానమంత్రి తెలిపారు. ప్రస్తుత ఖాతా లోటు 0.61 శాతానికి తగ్గిందని, విదేశీ మారక నిల్వలు 700 బిలియన్ డాలర్లను మించాయని పేర్కొన్నారు. దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థ గత కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత పటిష్ఠ స్థితిలో ప్రస్తుతం ఉందని తెలిపారు. “అనిశ్చితితో నిండిన ప్రపంచంలో భారత్ విశ్వసనీయతను, స్థిరత్వాన్ని అందిస్తోంది” అని ప్రధానమంత్రి అన్నారు.
దేశ ఆర్థిక వ్యవస్థలోని పటిష్ఠమైన నిర్మాణాత్మక బలాల కారణంగానే ఇటీవల సార్వభౌమ రేటింగ్‌లు మెరుగుపడ్డాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఒకే మార్కెట్‌ను ఏర్పాటు చేసేందుకు జీఎస్టీ అమలు, దివాలా చట్టాల రూపకల్పన, 29 కార్మిక చట్టాలను నాలుగు కార్మిక కోడ్లుగా ఏకీకృతం చేయడం, వ్యాపారాలకు సంబంధించి వందలాది చిన్న అంశాలను నేరాల పరిధి నుంచి తొలగించడం వంటి వ్యవస్థాగత సంస్కరణలను నిరంతరంగా అమలు చేస్తున్నామని వివరించారు. దేశాన్ని ముందుకు నడిపిస్తున్న ఈ వేగం యాదృచ్ఛికంగా వచ్చింది కాదని, ముందుచూపుతో తీసుకున్న నిర్ణయమని ప్రపంచ పెట్టుబడిదారులకు భరోసా ఇచ్చారు. “మాకు సంస్కరణలు తప్పనిసరి పరిస్థితి కాదు. అవి మా దృఢ విశ్వాసం” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
ప్రాచీన వేద మంత్రాన్ని ప్రస్తావిస్తూ.. సమష్టి శక్తిని పెంపొందించుకోవడానికి, ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లను పరిష్కరించడానికి అంతర్జాతీయ సమాజం కలిసికట్టుగా నడవాలని, మాట్లాడుకోవాలని, పరస్పరం ఒకరినొకరు అర్థం చేసుకోవాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. పరస్పర భాగస్వామ్యంతో ప్రపంచవ్యాప్తంగా అవకాశాలను సృష్టించే ఈ స్ఫూర్తిని విస్తృతంగా వ్యాప్తి చేయడానికి బ్లూమ్‌బెర్గ్ నూతన ఆర్థిక వేదిక ఒక గొప్ప వేదికగా నిలుస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ తన ప్రసంగాన్ని ముగించారు.
***
(రిలీజ్ ఐడి: 2323137)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam