ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఎన్‌ఎల్ఎంసీ తొలి పూర్తిస్థాయి ఈ-వేలం: తొలిరోజే ఆర్ఐఎన్ఎల్ భూములకు ₹366.33 కోట్ల బిడ్లు; 150 ప్లాట్ల విక్రయం
చదరపు గజానికి ₹1.80 లక్షలు దాటిన గరిష్ఠ వేలం ధర; బలమైన మార్కెట్ డిమాండ్‌కు నిదర్శనం
నాడు పోస్టు చేయడమైనది:
13 OCT 2026 1:28PM by PIB Hyderabad
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను నిర్వహిస్తున్న రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్)కు చెందిన విలువైన భూభాగాల ఈ-వేలంలో తొలిరోజు ప్రక్రియను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ (డీపీఈ) కింద పనిచేస్తున్న నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ (ఎన్‌ఎల్ఎంసీ) విజయవంతంగా నిర్వహించింది. ఎన్‌ఎల్ఎంసీ చేపట్టిన తొలి ఎండ్-టు-ఎండ్ ఈ-వేలం కావడంతో మొదటి దశ సంస్థకు కీలక మైలురాయిగా నిలిచింది. మిగులు ప్రభుత్వ ఆస్తుల మానిటైజేషన్‌కు క్రమబద్ధమైన, పారదర్శక, సాంకేతిక ఆధారిత విధానాన్ని ఇది చాటింది.

మొదటి దశలో వేలానికి ఉంచిన భూభాగాల్లో 150 ప్లాట్లు విజయవంతంగా అమ్ముడయ్యాయి. వీటి మొత్తం రిజర్వు ధర ₹312.48 కోట్లు కాగా, విజయవంతమైన బిడ్ల విలువ ₹366.33 కోట్లకు చేరింది. రిజర్వు ధర కంటే సగటున 17.23 శాతం అధికంగా బిడ్లు నమోదయ్యాయి. వేలంలో ఉంచిన ఆస్తులపై మార్కెట్ నుంచి మంచి స్పందన, ఆసక్తి కనిపించినట్లు ఈ ఫలితాలు సూచిస్తున్నాయి.
ఈ వేలంలో ధరలు కూడా గణనీయ స్థాయికి చేరాయి. చదరపు గజానికి గరిష్ఠ వేలం ధర ₹1.80 లక్షలు దాటింది. విశాఖపట్నంలోని అనుకూల ప్రాంతాల్లో ఉన్న భూభాగాలకు బలమైన మార్కెట్ డిమాండ్ ఉందని ఈ ధర నిర్ధారణ తెలియజేస్తోంది. ప్రభుత్వ ఆస్తుల ఆర్థిక సామర్థ్యాన్ని వెలికితీయడంలో పారదర్శక, పోటీతత్వ ఈ-వేలం ప్రక్రియ పాత్రను ఇది స్పష్టం చేస్తోంది.
ఆర్ఐఎన్ఎల్ సమన్వయంతో ఎన్‌ఎల్ఎంసీ ఈ వేలానికి సదుపాయాలు కల్పిస్తోంది. క్వికర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (క్యూఐపీఎల్) ట్రాన్సాక్షన్ కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తోంది. రైల్‌టెల్ ఈ-నివిదా ప్లాట్‌ఫామ్ ద్వారా ఆన్‌లైన్ బిడ్డింగ్ ప్రక్రియను నిర్వహిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (సీపీఎస్ఈలు), ఇతర ప్రభుత్వ సంస్థల వద్ద ఉన్న మిగులు భూ ఆస్తులను ఉత్పాదకంగా వినియోగించే విస్తృత ప్రయత్నాల్లో ఈ ఈ-వేలం భాగంగా ఉంది. క్రమబద్ధమైన, మార్కెట్ ఆధారిత ప్రక్రియ ద్వారా గుర్తించిన ఆస్తులను మార్కెట్‌కు తీసుకురావడానికి ఎన్‌ఎల్ఎంసీ వాటి యాజమాన్య సంస్థలతో కలిసి పనిచేస్తోంది. సంభావ్య కొనుగోలుదారుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ పారదర్శక ధర నిర్ధారణకు సహకరిస్తోంది.
వేలానికి ముందు 2026 సెప్టెంబర్‌లో విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్‌లో ఎన్‌ఎల్ఎంసీ, ఆర్ఐఎన్ఎల్ పెట్టుబడిదారుల అవగాహన కార్యక్రమాలను నిర్వహించాయి. వేలంలో ఉంచిన ఆస్తుల వివరాలను తెలుసుకోవడానికి, సందేహాలను నివృత్తి చేసుకోవడానికి, వేలంలో పాల్గొనే ప్రక్రియపై అవగాహన పొందడానికి ఈ సమావేశాలు సంభావ్య బిడ్డర్లకు అవకాశం కల్పించాయి.

రిజిస్ట్రేషన్, పత్రాలు, ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (ఈఎండీ) నిబంధనలు, ఆన్‌లైన్ బిడ్డింగ్‌కు సంబంధించిన సందేహాలను కూడా ఈ అవగాహన కార్యక్రమం ద్వారా నివృత్తి చేశారు. ఈ-వేలంలో పాల్గొనే ముందు ఆసక్తి గల కొనుగోలుదారులకు అవసరమైన సమాచారం అందించడం, అవగాహనను విస్తరించడం, బిడ్డర్ల భాగస్వామ్యాన్ని సులభతరం చేయడం ఈ కార్యక్రమాల లక్ష్యం.
ఆర్ఐఎన్ఎల్ భూముల ఈ-వేలం తొలిరోజు విజయవంతం కావడం ప్రభుత్వ ఆస్తుల పారదర్శక, పోటీతత్వ మానిటైజేషన్‌కు ఎన్‌ఎల్ఎంసీ చేస్తున్న ప్రయత్నాల్లో కీలక ముందడుగుగా నిలిచింది. క్రమబద్ధంగా రూపొందించిన మార్కెట్ ప్రక్రియలు పెట్టుబడిదారుల ఆసక్తిని ఆకర్షించడంతో పాటు మిగులు ప్రభుత్వ ఆస్తులకు తగిన విలువను సాధించగలవని వేలానికి వచ్చిన స్పందన తెలియజేస్తోంది.
అక్టోబర్ 30న విశాఖపట్నంలో భూమిని సొంతం చేసుకునేందుకు చివరి అవకాశం: ఆర్ఐఎన్ఎల్ ఈ-వేలం రెండో దశ
తొలి దశకు లభించిన ప్రోత్సాహకర స్పందన నేపథ్యంలో విశాఖపట్నంలోని కీలక ప్రాంతాల్లో భూములను సొంతం చేసుకునేందుకు సంభావ్య కొనుగోలుదారులకు ఈ-వేలం రెండో, చివరి దశ మరో అవకాశం కల్పిస్తోంది. మిగిలిన 216 భూభాగాలను రెండో దశలో వేలం వేయనున్నారు. ఈ ప్రక్రియను 2026 అక్టోబర్ 30న ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించేలా తేదీని మార్చారు. ప్రస్తుత వేలంలో ఇదే చివరి దశ కావడంతో ఆసక్తి గల కొనుగోలుదారులు అందుబాటులో ఉన్న ప్లాట్ల వివరాలను పరిశీలించి, నిర్ణీత గడువులోగా రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని సూచించారు. తొలి దశ ఫలితాలు మార్కెట్ భాగస్వామ్యం, ధర నిర్ధారణపై సంభావ్య బిడ్డర్లకు స్పష్టత ఇస్తున్నాయి. విశాఖపట్నంలో భూమిని సొంతం చేసుకోవాలని భావించేవారికి ఇది ముఖ్యమైన అవకాశంగా నిలుస్తోంది.
ఆసక్తి గల బిడ్డర్లు 2026 అక్టోబర్ 27లోగా రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. అందుబాటులో ఉన్న భూభాగాలు, రిజర్వు ధరలు, అర్హత నిబంధనలు, పాల్గొనేందుకు అవసరమైన వివరాలను అధికారిక ఈ-వేలం పోర్టల్(https://eauction.enivida.com/)లో పొందవచ్చు.
తుది దశ వేలంలో పాల్గొనాలనుకునే కొనుగోలుదారులు అందుబాటులో ఉన్న సమాచారాన్ని పరిశీలించి, సమగ్ర విచారణ చేపట్టి, గడువులోగా అవసరమైన ప్రక్రియలను పూర్తి చేయాలని సూచించారు.

ఎన్‌ఎల్ఎంసీ గురించి..
నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ (ఎన్‌ఎల్ఎంసీ) కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ కింద పనిచేసే భారత ప్రభుత్వ సంస్థ. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర ప్రభుత్వ ఏజెన్సీల వద్ద ఉన్న మిగులు భూములు, భవన ఆస్తుల మానిటైజేషన్‌కు ఇది సహకరిస్తుంది. ఆస్తుల యాజమాన్య సంస్థలతో సమన్వయం చేసుకుంటూ అలాంటి ఆస్తులను క్రమబద్ధంగా గుర్తించడం, సిద్ధం చేయడం, పారదర్శక, మార్కెట్ ఆధారిత ప్రక్రియల ద్వారా మానిటైజ్ చేయడంలో ఎన్‌ఎల్ఎంసీ సహాయం అందిస్తోంది.
***
(రిలీజ్ ఐడి: 2322724)
సందర్శకుల సూచీ సంఖ్య : : 66