రక్షణ మంత్రిత్వ శాఖ
సైనికులకు ‘భారత్ రైస్’పథకాన్ని ప్రారంభించిన భారతీయ సైన్యం
పాల్గొన్న రక్షణ మంత్రి, వినియోగదారు వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి
లద్దాఖ్, ఈశాన్య ప్రాంతం సహా సైన్య సరఫరా డిపోలకు
ఉన్నత నాణ్యత కలిగిన బియ్యం నేరుగా అందుబాటులోకి
నిర్వహణ పరంగా అత్యవసర స్థితుల్లో ఎఫ్సీఐ గిడ్డంగులు, సిబ్బంది, వస్తుసామగ్రిని ఉపయోగించుకోవడానికి కుదిరిన ఎంఓయూ
రైతుల శ్రమను సైనికులకు శక్తిగా మార్చే ఉమ్మడి సంకల్పాన్ని చాటుతోంది ఈ కార్యక్రమం: శ్రీ రాజ్నాథ్ సింగ్
‘‘ప్రబల సరఫరా వ్యవస్థలు, సైనికుల సంక్షేమం జాతీయ భద్రతకు ఎంతో అవసరం’’
‘‘సైన్య కార్యకలాపాల కొనసాగింపునకు దృఢమైన సరఫరా వ్యవస్థ అవసరమని చాటిన ఆపరేషన్ సిందూర్’’
నాడు పోస్టు చేయడమైనది:
12 OCT 2026 1:01PM by PIB Hyderabad
సాయుధ బలగాల కోసం ‘భారత్ రైస్’ (భారత్ బియ్యం) కార్యక్రమాన్ని భారతీయ సైన్యం నేడు.. అంటే 2026 అక్టోబర్ 12న.. న్యూఢిల్లీలో ప్రారంభించింది. కేంద్ర రక్షణ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్తో పాటు వినియోగదారు వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి శ్రీ ప్రల్హాద్ జోషి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిర్వహణ కార్యకలాపాల పరంగా అత్యవసర స్థితులు ఎదురైనప్పుడు భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ)కు చెందిన మౌలిక సదుపాయాలను ఉపయోగించుకోవడానికి ఉద్దేశించిన అవగాహన ఒప్పంద పత్రం (ఎమ్ఓయూ)పై భారతీయ సైన్యం, ఎఫ్సీఐ సంతకాలు చేశాయి. ఉన్నత నాణ్యత కలిగిన భారత్ బియ్యాన్ని లద్దాఖ్, ఈశాన్య ప్రాంతాల వంటి దూర ప్రాంతాలు సహా సైన్యానికి చెందిన సరఫరా డిపోలకు నేరుగా అందజేస్తారు. దీంతో సైన్య సరఫరా కేంద్రాలు స్థానిక ఎఫ్సీఐ కేంద్రాల నుంచి బియ్యాన్ని కొనుగోలు చేసే పని ఇక మీదట ఉండదు.
_20261012130229_566997.jpeg)
_20261012130245_ea6043.jpeg)
రక్షణ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ ప్రసంగిస్తూ, ‘భారత్ రైస్’ విశ్వాస బంధానికి ప్రతీక అన్నారు. ఈ బంధం రైతు పొలంలో మొదలై, జవాను కంచం వరకు విస్తరిస్తుందని వర్ణించారు. ‘జయ్ జవాన్, జయ్ కిసాన్’ భావనను ఈ కార్యక్రమం సాకారం చేస్తుందని ఆయన తెలిపారు. ఇది రైతు కష్టాన్ని సైనికుని శక్తిగా మార్చే ఓ సామూహిక సంకల్పాన్ని చాటిచెబుతుందని ఆయన అన్నారు. ‘‘అధిక నాణ్యతతో కూడిన బియ్యాన్ని నిర్ధారిత ప్రమాణాల ప్రకారం అందించడం జరుగుతుంది. దీనికి తోడు, మేం దీని ప్యాకేజింగును సరళతరంగా, సౌకర్యవంతంగా మార్చేటట్లు చర్యలు తీసుకుంటాం. ఈ కార్యక్రమం చూడటానికి చిన్నదిగానే కనిపించవచ్చు, కానీ దీంతో దూర ప్రాంతాలకు, చేరుకోవడం కష్టసాధ్యమయ్యే ప్రాంతాలకు ఆహారాన్ని చేరవేస్తున్న సైనికులకు ఎంతో ఊరట కలుగుతుంది’’ అని మంత్రి వివరించారు.
_20261012130258_d60188.jpeg)
‘సైనికులు విధినిర్వహణలో కేవలం ఆయుధాలపై ఆధారపడితే సరిపోదు, వారు శారీరకంగా స్వస్థులుగా, మానసికంగా సమతౌల్యంతో, మనోబలం సహనశక్తితో ఉండాలి, ప్రత్యేకించి అత్యంత కఠినతర పరిస్థితుల్లో సేవ చేస్తున్న పక్షంలో ఇది మరింత ముఖ్యంగా మారుతుంది’ అని శ్రీ రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ‘జవాన్ల సంక్షేమం ఏదో అప్రధానకరమైన అంశం కాదు, అది జాతీయ భద్రతతో ముడిపడిన అంశం’ అని ఆయన అన్నారు. ‘‘పుష్టిని కలిగించే భోజనం, బలమైన సామగ్రి, సంపూర్ణ శిక్షణ.. ఇవి బలగాల మనఃస్థయిర్యాన్ని ఇనుమడింప చేస్తాయి. దీంతో వారు ఏ సవాలుకైనా ఎదురొడ్డి నిలిచి, దేశాన్ని రక్షించడానికి తయారుగా ఉంటారు’’ అని మంత్రి వివరించారు.
ఆధునిక యుద్ధంలో ఆయుధాలు, యుద్ధ సామగ్రి, సాంకేతికత మాత్రమే కీలక అంశాలు కావు, ఆధునిక రవాణా వ్యవస్థ దానంతట అదే ఒక యుద్ధ శక్తి అని రక్షణ మంత్రి ఉద్ఘాటించారు. ఇవాళ యుద్ధ విజయం ఒక్క రణ రంగాల్లోనే సమకూరదు, అది సరఫరా వ్యవస్థల దృఢత్వం, నిల్వ సామర్థ్యం, రవాణా నెట్వర్కులు, గిడ్డంగి వసతులు, అవసరమైనప్పుడు సరుకును సకాలంలో అందజేసే సామర్థ్యాలు కూడా అంతే ప్రధానమని ఆయన అన్నారు.
_20261012130340_8c31b4.jpeg)
‘‘రాబోయే కాలంలో చోటు చేసుకొనే సంఘర్షణల్లో హెచ్చరిక చేసే సమయం ఎంతో తగ్గిపోనుందని ఆపరేషన్ సిందూర్ తాలూకు వ్యూహాత్మక విశ్లేషణలో బయటపడింది. మన అదుపులో ఉండని పరిస్థితులు, యుద్ధంలో సాంకేతికతను ఉపయోగించడం వంటి అంశాలు మన సన్నాహాలకు కఠిన పరీక్షను కొనితేవచ్చు. ఇలాంటి సంఘర్షణలు మన సరఫరా వ్యవస్థలను, సరఫరా నెట్వర్కుల స్థిరత్వాన్ని కూడా పరీక్షించవచ్చు. ఇందువల్ల, మన సైన్య కార్యకలాపాలను కొనసాగించడానికి బలమైన, ప్రతికూలతలకు తట్టుకొని నిలువగలిగిన లాజిస్టిక్స్ ప్రణాళికను రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ఎఫ్సీఐతో ఒప్పందాన్ని కుదుర్చుకోవడం ఈ దిశగా వేసిన ఒక ముఖ్యమైన అడుగు’’ అని శ్రీ రాజ్నాథ్ సింగ్ అన్నారు.
ఎఫ్సీఐ దగ్గర దేశవ్యాప్తంగా కార్యకలాపాలను నిర్వహించడానికి కీలక ప్రాంతాలు సహా, గిడ్డంగులు, నిల్వకు సంబంధించిన మౌలిక సదుపాయాలు, ఆధునిక సైలోలు, సామగ్రిని చేరవేసే, దించే ఉపకరణాలు, వీటితో పాటు సుశిక్షిత సిబ్బంది ఉన్నారని రక్షణ మంత్రి అన్నారు. అవసరపడినప్పుడు దేశంలో ప్రస్తుత జాతీయ సామర్థ్యాన్ని దేశ భద్రత అవసరాలకు అనుగుణంగా వినియోగించుకోవచ్చనడానికి ఈ కార్యక్రమం ఒక నిదర్శనంగా నిలుస్తోందని ఆయన అన్నారు. ఇది రెండు విధాలుగా ఉపయోగించుకొనే భావనను ప్రతిబింబిస్తోందని, దేశ మౌలిక సదుపాయాలను, సామర్థ్యాలను ఒక ఉద్దేశానికే కాకుండా పౌర, సైన్య అవసరాలు రెండిటినీ కూడా నెరవేర్చడానికి ఉపయోగించుకో గలగడం దీనిలో భాగమని ఆయన అన్నారు.
_20261012130354_808d40.jpeg)
పోరాట విమానాలను ప్రస్తుతం ఎక్స్ప్రెస్వే పై దించుతున్న విధంగానే, సరిహద్దు రహదారుల సంస్థ (బీఆర్ఓ) నిర్మించిన రోడ్లు, వంతెనలను స్థానికులు ఉపయోగించుకుంటున్నట్లుగానే, ఎఫ్సీఐ గోదాములు ఒక్క బియ్యం నిల్వకు మాత్రమే పరిమితం కాబోవని, ఆ గోదాములు భారతీయ సైన్య సరఫరా వ్యవస్థలో విడదీయలేని భాగంగా మారుతాయని శ్రీ రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ‘‘ఈ దృష్టికోణం ఒక్క వనరుల మెరుగైన ఉపయోగానికి పూచీపడడమే కాదు, జాతీయ దృఢత్వాన్నీ బలోపేతం చేస్తుంది. ప్రస్తుత మౌలిక సదుపాయాలను నిర్వహణ ప్రణాళికతో జోడించి కాలాన్ని ఆదా చేయగలుగుతాం, వనరులను మరింత ఎక్కువ ప్రభావవంతంగా ఉపయోగించుకోగలుగుతాం. ఈ ఒప్పందం పరిపాలనపరమైన సర్దుబాటు కన్న చాలా విస్తృతమైంది. ఇది సైన్య నిర్వహణ సావధానతను పటిష్టపరచడంలో కీలక భూమికను పోషిస్తుంది. అంతే కాదు, ప్రభుత్వంలోని అన్ని విభాగాలను, పూర్తి ప్రభుత్వాన్ని, పూర్తి దేశాన్ని ఏకతాటి మీదకు తీసుకు రావాలన్న మా దృక్పథాన్ని కూడా చాటుతోంది’’ అని ఆయన అన్నారు.
మన సైనికుల సంక్షేమానికి సంబంధించిన ప్రతి ఒక్క అంశంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని రక్షణ మంత్రి అన్నారు. ఆయుధాలు, సాంకేతికత మొదలు వస్త్రాలు, పరికరాలు, శిక్షణ వరకు అన్ని రంగాల్లో స్వయంసమృద్ధికి, ఆధునికీకరణకు ప్రాధాన్యాన్ని ఇస్తున్నామని ఆయన అన్నారు. ‘‘ప్రస్తుతం భారత్ తన రక్షణ అవసరాలలో చాలా పెద్ద భాగం స్వదేశీ స్థాయిలో సమకూర్చుకుంటోంది’’ అని ఆయన తెలిపారు. ‘నూతన ఆవిష్కరణలు, సమన్వయం ప్రాతిపదికలుగా సైనికులకు నిరంతరం అత్యుత్తమ నాణ్యతతో కూడిన సామగ్రిని అందుబాటులోకి తీసుకు వస్తున్నారు. సరఫరా వ్యవస్థలను బలోపేతం చేసి ప్రతికూల పరిస్థితులను కూడా తట్టుకొని నిలిచేవిగా రూపొందిస్తున్నారు. ముందు వరుసలకు సకాలంలో సామగ్రిని అందేటట్లు చూస్తున్నారు. దేశ భద్రతకు పౌరసేవా ప్రధాన మౌలిక సదుపాయాలను మేలైన విధంగా ఉపయోగించుకుంటున్నారు’ అని ఆయన వివరించారు. ‘సైనికులు సరిహద్దులను కాపాడుతుంటారు కాబట్టి, తమ వెన్నంటి యావత్తు దేశం నిలబడుతుందన్న భరోసా వారికి ఏర్పడాలి’ అని ఆయన అన్నారు. సైనికుల మనోబలాన్ని పెంపొందించడం ప్రభుత్వ ప్రాధాన్యమని ఆయన స్పష్టం చేశారు. ‘‘ఈ నిబద్ధత ఒక్క ప్రభుత్వానిది మాత్రమే కాదు, రైతులు, సహకార రంగం, పౌర పాలనయంత్రాంగంతో పాటు పూర్తి దేశానిది కూడా’’ అని ఆయన చెప్పారు.
ఈ సందర్భంగా వినియోగదారు వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి శ్రీ ప్రల్హాద్ జోషి ప్రసంగిస్తూ, ‘భారత్ రైస్’ కార్యక్రమాన్ని ప్రశంసించారు. సాటి లేని సాహసాలు, అంకిత భావంతో దేశాన్ని రక్షిస్తున్న వారికి అత్యుత్తమ నాణ్యతను కలిగిన బియ్యాన్ని అందజేస్తుండడం తమ విభాగానికి గౌరవపూర్వకమైన విషయమని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘దేశ రక్షకులకు మంచి భోజనం పెట్టడం, వారి అవసరాల పట్ల శ్రద్ధ తీసుకోవడం మా కర్తవ్యం’’ అని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో సైన్య ప్రధానాధికారి జనరల్ ధీరజ్ సేఠ్, ఆహార ప్రజా పంపిణీ కార్యదర్శి శ్రీ సంజీవ్ చోప్రా, రక్షణ శాఖ, వినియోగదారు వ్యవహారాల శాఖ, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ, ఎఫ్సీఐ, భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య (‘నాఫెడ్’), సహకార రంగానికి చెందిన ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
‘భారత్ రైస్’ గురించి..
సరఫరాలు, రవాణా డైరెక్టర్ జనరల్ నాయకత్వంలో ఆరంభించిన ‘భారత్ రైస్’ కార్యక్రమం సైనికోద్యోగుల వద్ద నుంచి చాలా కాలం నుంచి అందుతున్న అభిప్రాయాల నుంచి స్ఫూర్తిని పొందింది. ఆహార పదార్థాల నాణ్యతను మెరుగుపరచడం ఈ పథకం లక్ష్యం. 2026-27 ఆర్థిక సంవత్సరంలో, బియ్యాన్ని రక్షణ రంగం నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా మరాడిస్తారు. దీని సరఫరా బాధ్యతను నాఫెడ్ తీసుకుంటుంది. ఈ బియ్యాన్ని అవసరమైన నాణ్యత తనిఖీలను పూర్తి చేసి దీన్లో ఇతరాలేవీ కలవకుండా, నూక గాని, రంగు మారిన ధాన్యం గింజలు గాని కనీస స్థాయికి మాత్రమే పరిమితం అయ్యేటట్లు చూస్తారు.
పది కిలోలు, ముప్ఫై కిలోల సంచులలో కొనుగోలు చేసే కారణంగా, ఈ బియ్యాన్ని అనుకున్న చోట్లకు చేరవేయడం, దించుకోవడం మరింత సులభంగా మారుతుంది. సైన్యం, ఎఫ్సీఐ, నాఫెడ్, ఆహారం, ప్రజా పంపిణీ విభాగాల మధ్య సుమారు 18 నెలల సమన్వయం అనంతరం ఈ కార్యక్రమం కార్యరూపాన్ని దాల్చింది.
ఆపరేషన్ సిందూర్ సహా నిర్వహణ కార్యకలాపాలతో ముడిపడిన అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాల ఆధారంగా ఎఫ్సీఐతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఆపరేషన్ సిందూర్ వేళ అకస్మాత్తుగా ఎదురై దీర్ఘ కాలం పాటు కొనసాగిన అత్యవసర స్థితులు ఆధునిక రవాణా సంబంధిత ఏర్పాట్లు (లాజిస్టిక్స్ అరేంజ్మెంట్స్) సవాళ్లకు ఎదురొడ్డి నిలిచేటట్లు ఉండి తీరాలని బోధించాయి. భారతీయ సైన్య నిర్వహణ కార్యకలాపాలకు సంబంధించి అత్యవసర స్థితులు ఎదురైన వేళ.. సరకు రవాణా, నిర్వహణలకు ఎఫ్సీఐ గిడ్డంగులను, ఉద్యోగులను, ఉపకరణాలను ఉపయోగించుకోవడానికి ఓ లాంఛనప్రాయ వ్యవస్థను ఈ ఒప్పందం అందుబాటులోకి తీసుకువస్తుంది.
సైన్యంలోని సరఫరా, రవాణా విభాగాలతో పాటు ఎఫ్సీఐకి చెందిన ప్రాంతీయ, విభాగీయ కార్యాలయాల మధ్య ప్రాథమిక స్థాయి సమన్వయాన్ని ఏర్పరిచారు. దీనిని నిర్వహణ సంబంధిత లాజిస్టిక్స్ ప్రణాళికలతో ఏకీకరించారు. ఈ ఒప్పందం 5 సంవత్సరాల పాటు అమల్లో ఉంటుంది. దీనిని పరస్పర అంగీకారం కుదిరిన మేరకు పొడిగించుకొనేందుకు కూడా వీలు ఉంది.
ఈ ఏర్పాటు.. అదనపు నిల్వ సదుపాయాల లభ్యతకు, వనరులను త్వరిత గతిన తరలించడానికి, రేషన్, సరఫరా, ఉపకరణాలను వేర్వేరు ప్రాంతాలకు పంపిణీ చేయడానికి, వాటిని నిర్వహణ క్షేత్రాల సమీపంలో అందజేయడానికి దోహదం చేస్తుంది. ఈ విధంగా, ఇప్పటి జాతీయ మౌలిక సదుపాయాలను మరింత మెరుగ్గా ఉపయోగించి సైన్య లాజిస్టిక్స్ వ్యవస్థ ప్రతిస్పందన సామర్థ్యాన్ని వేగిర పరచడమే కాకుండా దాని బలాన్ని పెంపొందింప చేయడం సాధ్యపడుతుంది. ఇది ప్రభుత్వంలో అన్ని విభాగాలను ఏకతాటి మీదకు తీసుకు రావాలన్న ‘ప్రధానమంత్రి గతి శక్తి’ దృష్టికోణానికి అనుగుణంగా ఉంది.
భారతీయ సైన్యం ఇటీవల కొన్ని సంవత్సరాల్లో రేషన్ నాణ్యతను, పరిమాణాన్ని మెరుగుపరిచే దిశగా అనేక చర్యలను చేపట్టింది. వీటిలో అగ్నివీర్ పథకంలో భర్తీ అయ్యే వారికి అదనపు రేషన్, త్రివిధ దళాల రేషన్ వ్యవస్థలో మరింత ఏకరూపతను తీసుకురావడం వంటివి భాగంగా ఉన్నాయి. సేంద్రియ ఆహార పదార్థాలను పరిచయం చేయాలన్న ప్రతిపాదన కూడా ఉంది.
***
(రిలీజ్ ఐడి: 2322607)
సందర్శకుల సూచీ సంఖ్య : : 22