వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి ధన్‌-ధాన్య కృషి యోజనకు ఏడాది పూర్తి

అత్యుత్తమ పనితీరు కనబరిచిన జిల్లాలుగా బిహార్‌లోని గయా, రాజస్థాన్‌లోని నాగౌర్‌, మధ్యప్రదేశ్‌లోని ఉమరియా గుర్తింపు

రైతుల జీవితాల్లో అర్థవంతమైన మార్పు తీసుకురావడమే పీఎండీడీకేవై విజయానికి అసలైన కొలమానం: కేంద్ర వ్యవసాయ మంత్రి శ్రీ శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌

పీఎండీడీకేవై రెండో ఏడాదిలో ఫలితాలే లక్ష్యంగా అమలు చేయాలని కేంద్ర మంత్రి పిలుపు

నాడు పోస్టు చేయడమైనది: 12 OCT 2026 4:11PM by PIB Hyderabad

ప్రధానమంత్రి ధన్‌-ధాన్య కృషి యోజన (పీఎండీడీకేవై) అమలులోకి వచ్చి 2026 అక్టోబర్‌ 11తో ఏడాది పూర్తయిన సందర్భంగా కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ సోమవారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. న్యూఢిల్లీ పూసా ప్రాంతంలోని జాతీయ వ్యవసాయ విజ్ఞాన సముదాయం (ఎన్‌ఏఎస్‌సీ)లోని భారతరత్న సీ సుబ్రహ్మణ్యం ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, కేంద్ర మంత్రిత్వశాఖలు, విభాగాల కార్యదర్శులు, పీఎండీడీకేవై కింద నియమితులైన కేంద్ర నోడల్‌ అధికారులు, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు.  ఈ పథకం అమలవుతున్న జిల్లాలకు చెందిన కలెక్టర్లు, జిల్లా స్థాయి అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, ప్రగతిశీల రైతులు సహా వివిధ రాష్ట్రాల నుంచి 370 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శ్రీ శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ మాట్లాడుతూ.. పథకం మొదటి ఏడాదిలో పటిష్ఠమైన పునాదులు ఏర్పాటు చేయడంపై దృష్టి సారించామని తెలిపారు. రాబోయే ఏడాది క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపించే, నిర్ధిష్ట ఫలితాలను సాధించడమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, పంటల సాగు తీవ్రతను మెరుగుపరచడం, సాగునీరు, నీటి నిర్వహణను బలోపేతం చేయడం, రైతులకు వ్యవసాయ రుణాలు అందుబాటులోకి తీసుకురావడం, అధిక విలువ కలిగిన వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, పంట కోత అనంతర మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, రైతుల ఆదాయాన్ని పెంచడం వంటి అంశాల ప్రాధాన్యాన్ని ఆయన వివరించారు.

 

పీఎండీడీకేవై విజయాన్ని అంచనా వేయడానికి అసలైన కొలమానం రైతుల జీవితాల్లో ఈ పథకం తీసుకొచ్చే అర్థవంతమైన మార్పులేనని శ్రీ శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ స్పష్టం చేశారు. అన్ని భాగస్వామ్య పక్షాలు పరస్పర సమన్వయాన్ని బలోపేతం చేయాలని, పథకం అమలును వేగవంతం చేయాలని, వ్యవసాయ రంగంలో స్పష్టమైన పురోగతి సాధించడంతోపాటు రైతులకు స్థిరమైన ఆదాయాన్ని అందించడంపై దృష్టి పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. వ్యవసాయ అభివృద్ధికి సమన్వయంతో కూడిన సమగ్ర ప్రభుత్వ విధానం ఎంత ముఖ్యమో ఈ కార్యక్రమంలో అనుబంధ మంత్రిత్వ శాఖలు, విభాగాల ప్రతినిధుల భాగస్వామ్యం తెలియజేసింది.

జిల్లా స్థాయి కార్యాచరణ ప్రణాళికలను ఆచరణలో స్పష్టమైన ఫలితాలుగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగాలు, శాస్త్రీయ సంస్థలు, రైతులతో కలిసి పనిచేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ స్పష్టం చేశారు. రానున్న ఏడాదిలో విజయవంతమైన కార్యక్రమాలను మరింత విస్తరించడంతో పాటు, గుర్తించిన అన్ని జిల్లాల్లో వ్యవసాయ ఫలితాలను మెరుగుపరచడంపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు. మొత్తం 100 పీఎండీడీకేవై జిల్లాలను ధాన్యసంపదతో పాటు సుభిక్షతలోనూ సమృద్ధిగా తీర్చిదిద్దడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

 

2026 అక్టోబర్‌ 22 నుంచి నవంబర్‌ 30 వరకు అన్ని రాష్ట్రాల్లో నిర్వహించనున్న ‘ఖేత్‌ బచావో అభియాన్‌’ గురించి శ్రీ శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రస్తావించారు. ఎరువులను సమతుల్యంగా, విచక్షణతో వినియోగించడం ద్వారా నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ఈ కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, సంబంధిత అధికారులు ఈ ప్రచార కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని విజయవంతంగా అమలయ్యేలా చూడాలని మంత్రి సూచించారు. నేల సారాన్ని కాపాడటం, పర్యావరణాన్ని పరిరక్షించడం, భవిష్యత్తు తరాల కోసం సహజ వనరులను సంరక్షించడం వంటి లక్ష్యాల సాధనకు సుస్థిర వ్యవసాయ పద్ధతులను అవలంబించడం ముఖ్యమని ఆయన వివరించారు.

 

వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ కార్యదర్శి మాట్లాడుతూ.. ఈ పథకం జిల్లా కేంద్రీకృత విధానంతో అమలవుతోందని తెలిపారు. ఆయా జిల్లాల్లోని నేల స్వభావం, వర్షపాతం, పంటల సాగు విధానాలు, నీటి లభ్యత, మౌలిక సదుపాయాలు, రైతు సమాజ అవసరాలకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు వివరించారు. పథకం అమలులో రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా కలెక్టర్లు, జిల్లా నోడల్‌ అధికారులు, కేంద్ర నోడల్‌ అధికారులు, కృషి విజ్ఞాన కేంద్రాల (కేవీకే) శాస్త్రవేత్తలు, క్షేత్రస్థాయి సిబ్బంది అందిస్తున్న సహకారాన్ని ఆయన ప్రశంసించారు. ప్రణాళికల రూపకల్పన, అమలులో సమన్వయం కోసం జిల్లా ధన్‌-ధాన్య సమితిల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ఈ పథకం కింద ప్రత్యేక డ్యాష్‌బోర్డు ద్వారా 121 సూచికల ఆధారంగా జిల్లాల పనితీరును పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రతి నెలా ప్రకటించే స్థానాల పారదర్శకతను పెంపొందించడంతో పాటు జిల్లాల మధ్య ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహిస్తున్నాయని వివరించారు.

 

ఈ కార్యక్రమంలో భాగంగా పీఎండీడీకేవై అమలవుతున్న మూడు జిల్లాల ప్రతినిధులు తమ అనుభవాలను, వినూత్న కార్యక్రమాలను వివరించారు. గడ్చిరోలి జిల్లా నీటి సంరక్షణ, కరువును తట్టుకునే సామర్థ్యాన్ని పెంపొందించేందుకు చేపట్టిన చర్యలను వివరించగా.. అల్లూరి సీతారామరాజు జిల్లా అధిక విలువ కలిగిన ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించేందుకు చేపట్టిన కార్యక్రమాలను తెలియజేసింది. బంకా జిల్లా ‘లీలావరన్‌ ప్రకృతి వ్యవసాయ భూముల పునరుద్ధరణ నమూనా’ను ప్రదర్శించింది. స్థానిక అవసరాలకు అనుగుణంగా రూపొందించిన చర్యలకు వివిధ పథకాల సమన్వయం, రైతుల భాగస్వామ్యం తోడైతే వ్యవసాయ సమస్యలను పరిష్కరించడంతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ అమలు చేయగల పరిష్కారాలను అభివృద్ధి చేయవచ్చని ఈ ప్రదర్శనలు చాటిచెప్పాయి.

పీఎండీడీకేవై కింద విశేష పనితీరు కనబరిచిన జిల్లాలను కూడా ఈ కార్యక్రమంలో గుర్తించి సత్కరించారు. మొత్తం మీద అత్యుత్తమ పనితీరు కనబరిచిన జిల్లాల్లో బిహార్‌లోని గయా మొదటి స్థానం, రాజస్థాన్‌లోని నాగౌర్‌ రెండో స్థానం, మధ్యప్రదేశ్‌లోని ఉమరియా మూడో స్థానం సాధించాయి. ఈ పథకంలోని ఆరు ప్రధాన లక్ష్యాల కింద విశేష కృషి చేసిన మరో 18 జిల్లాలను కూడా గుర్తించారు. వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించే లక్ష్యం కింద మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌, ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్‌, సిక్కింలోని గ్యాల్‌షింగ్ జిల్లాలను గుర్తించారు. పంటల వైవిధ్యాన్ని ప్రోత్సహించడం, సుస్థిర వ్యవసాయ పద్ధతులను అవలంబించేలా చేయడం అనే లక్ష్యం కింద ఉత్తరప్రదేశ్‌లోని మహోబా, మధ్యప్రదేశ్‌లోని దిండోరి, ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలను ఎంపిక చేశారు. పంట కోత అనంతర నిల్వ సామర్థ్యాన్ని పెంచే లక్ష్యం కింద మధ్యప్రదేశ్‌లోని టీకమ్‌గఢ్‌, సిద్ధి, ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లాలను గుర్తించారు. సాగునీటి మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే లక్ష్యం కింద జమ్మూ కశ్మీర్‌లోని కిష్త్వార్‌, గుజరాత్‌లోని దాహోద్‌, ఛోటా ఉదయ్‌పూర్‌ జిల్లాలను ఎంపిక చేశారు. స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యవసాయ రుణాలను మరింత అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యం కింద తెలంగాణలోని నారాయణపేట, ఉత్తరప్రదేశ్‌లోని జాలౌన్‌, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లాలను గుర్తించారు. మెరుగైన పాలన, సేవల పంపిణీ లక్ష్యం కింద తెలంగాణలోని నాగర్‌ కర్నూల్‌, గుజరాత్‌లోని కచ్‌, కర్ణాటకలోని హావేరి జిల్లాలను ఎంపిక చేశారు. ఈ సత్కారాల ద్వారా వ్యవసాయ అభివృద్ధి కోసం జిల్లా స్థాయిలో చేపట్టిన కృషిని గుర్తించడంతో పాటు, ఇతర జిల్లాలు కూడా వినూత్న పద్ధతులను అనుసరించి తమ పనితీరును మెరుగుపరచుకునేలా ప్రోత్సహించారు.

 

సమగ్ర, సుస్థిర వ్యవసాయ అభివృద్ధి కోసం జిల్లా స్థాయి ప్రణాళికలను బలోపేతం చేయడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల మధ్య సమన్వయాన్ని సమర్థంగా అమలు చేయడంపై నిబద్దతను ప్రకటిస్తూ ఈ కార్యక్రమం ముగిసింది. మొదటి ఏడాదిలో సాధించిన పురోగతిని రైతులకు ప్రత్యక్ష ప్రయోజనాలుగా మార్చడంపై ప్రధానంగా దృష్టి సారించారు. ఇందులో భాగంగా వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, ప్రతికూల పరిస్థితులను తట్టుకునే వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, సంస్థాగత రుణాలను సులభంగా అందుబాటులోకి తీసుకురావడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. పీఎండీడీకేవై లక్ష్యాల సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగాలు, శాస్త్రీయ సంస్థలు, రైతు సమాజాలతో సన్నిహిత సమన్వయంతో పనిచేస్తామని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. గుర్తించిన 100 జిల్లాలను వ్యవసాయ ప్రగతి, శ్రేయస్సు, రైతు సంక్షేమానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుంది.

 

ప్రధానమంత్రి ధన్‌-ధాన్య కృషి యోజన (పీఎండీడీకేవై)ను 2025-26 కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించారు. తక్కువ వ్యవసాయ ఉత్పాదకత, తక్కువ పంటల సాగు, తక్కువ వ్యవసాయ రుణాల పంపిణీ ఉన్న 100 జిల్లాలను లక్ష్యంగా చేసుకుని 2025 అక్టోబర్‌ 11న ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు. వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, పంటల వైవిధ్యాన్ని ప్రోత్సహించడం, సుస్థిర వ్యవసాయ పద్ధతులను విస్తరించడం, పంచాయతీ,  బ్లాక్ (మండల) స్థాయిల్లో పంట కోత అనంతర నిల్వ సదుపాయాలను పెంచడం, సాగునీటి సౌకర్యాలను మెరుగుపరచడం, స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యవసాయ రుణాల లభ్యతను సులభతరం చేయడం ఈ పథకం ప్రధాన లక్ష్యాలు.

జిల్లాలవారీగా ఉన్న వ్యవసాయ ప్రాధాన్యాలకు అనుగుణంగా పరిష్కారాలు చూపేందుకు 11 కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలకు చెందిన 36 కేంద్ర ప్రభుత్వ పథకాలతో పాటు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ఈ కార్యక్రమం సమన్వయ విధానంలో అనుసంధానిస్తుంది.

యూట్యూబ్‌ లింక్‌- https://www.youtube.com/live/erq0JIG6otw?si=z4el13dVAX9lXwS2


(రిలీజ్ ఐడి: 2322600) సందర్శకుల సూచీ సంఖ్య : : 20
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Kannada