ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అక్టోబర్ 12న కేలాంగ్‌లో తొలి హై ఆల్టిట్యూడ్ వైద్య, ప్రజారోగ్య పరిశోధనా కేంద్రానికి శంకుస్థాపన చేయనున్న కేంద్ర ఆరోగ్య మంత్రి శ్రీ జగత్ ప్రకాశ్ నడ్డా


అధిక ఎత్తయిన ప్రాంతాల్లో వాతావరణ ప్రభావాలు, ప్రజల ఆరోగ్య సమస్యలు, వాటి నివారణకు సంబంధించి కేలాంగ్ లో ఐసీఎంఆర్ తొలి పరిశోధనా కేంద్రం

భారతదేశ హిమాలయ ప్రాంతంలో వాతావరణ మార్పులను తట్టుకునే ఆరోగ్య సేవలను, వైద్య పరిశోధనలను, ప్రజారోగ్య సంసిద్ధతను బలోపేతం చేయనున్న కొత్త కేంద్రం

నాడు పోస్టు చేయడమైనది: 11 OCT 2026 2:43PM by PIB Hyderabad

ఎత్తయిన పర్వత ప్రాంతాల్లో వైద్యం, ప్రజారోగ్య సేవలకు సంబంధించి హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్ - స్పితి జిల్లాలోని కేలాంగ్ వద్ద ఐసీఎంఆర్  ఏర్పాటు చేస్తున్న పరిశోధనా కేంద్రం (ఐసీఎంఆర్ - సీహెచ్ఏఎంపీ) నిర్మాణానికి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ జగత్ ప్రకాశ్ నడ్డా 2026 అక్టోబర్ 12న శంకుస్థాపన చేస్తారు. భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆరోగ్య పరిశోధన విభాగం ఆధ్వర్యంలో భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. భారతదేశంలోని ఎత్తైన పర్వత ప్రాంతాలు, వాతావరణ మార్పుల ప్రభావానికి గురయ్యే ప్రాంతాలపై దృష్టి సారించి, వివిధ రంగాల సమన్వయంతో పరిశోధనలు, నూతన ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధిని బలోపేతం చేయడం ఈ కేంద్రం ప్రధాన లక్ష్యం.

హిమాలయ పర్యావరణ వ్యవస్థలో అధిక ఎత్తు, తీవ్రమైన వాతావరణ పరిస్థితులు, కఠినమైన భౌగోళిక స్వరూపం, ఇతర ప్రాంతాలతో పరిమిత సంబంధాలు, వాతావరణంలో పెరుగుతున్న అనిశ్చితి వంటి కారణాల వల్ల ప్రజారోగ్యానికి ప్రత్యేకమైన సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితులు వ్యాధుల వ్యాప్తి తీరు, వైద్య సేవల లభ్యత, వృత్తిపరమైన ఆరోగ్యం, అత్యవసర పరిస్థితుల్లో స్పందించే సామర్థ్యంపై ప్రభావం చూపుతున్నాయి. ఈ సవాళ్లతో కూడిన ప్రాంతాల్లో నివసించే, పనిచేసే ప్రజల అవసరాలకు అనుగుణంగా శాస్త్రీయ ఆధారాలను సేకరించడం, స్థానిక పరిస్థితులకు తగిన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలను అభివృద్ధి చేయడం, వాటిని విస్తృత స్థాయిలో అమలు చేయడం వంటి కార్యక్రమాలను ఈ కేంద్రం బలోపేతం చేయనుంది.

ఈ కేంద్రం పరిశోధనల్లో భాగంగా ఎత్తైన పర్వత ప్రాంతాల్లో మానవ శరీర ధర్మాలు, ఆ ప్రాంతాలకు శరీరం అలవాటు పడే ప్రక్రియ, పర్వత ప్రాంత వైద్యం, వాతావరణ మార్పులతో ప్రభావితమయ్యే వ్యాధులు, కొత్తగా వస్తున్న వ్యాధులు, అంటువ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులు, తల్లీబిడ్డల ఆరోగ్యం, పోషకాహారం, మానసిక ఆరోగ్యం, పర్యావరణ, వృత్తిపరమైన ఆరోగ్యం, విపత్తుల సమయంలో అందించే వైద్య సేవలు వంటి అంశాలపై పరిశోధనలు చేపట్టనున్నారు. మారుమూల ప్రాంతాలు, సులభంగా చేరుకోలేని ప్రాంతాల్లో వైద్య సేవలను మెరుగుపరిచేందుకు డిజిటల్ ఆరోగ్య వేదికలు, దూర ప్రాంతాల నుంచే వైద్య సలహాలు, సేవలు పొందే టెలిమెడిసిన్ విధానం, డ్రోన్ల ద్వారా వైద్య సామగ్రి సరఫరా, ప్రజారోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే వ్యవస్థలను సమన్వయంతో వినియోగించే అవకాశాలను కూడా ఈ కేంద్రం పరిశీలించనుంది.

హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్ - స్పితి ప్రాంతంలో ఏర్పాటు కానున్న ఈ కేంద్రం -  వ్యూహాత్మకంగా కీలకమైన సరిహద్దు ప్రాంతంలో నివసించే ఎత్తయిన పర్వత ప్రాంతాల ప్రజలు, గిరిజన సమూహాలపై నిరంతర క్షేత్రస్థాయి పరిశోధనలు చేపట్టేందుకు ఒక ముఖ్యమైన సంస్థాగత వేదికగా నిలవనుంది. దీని భౌగోళిక స్థానం వల్ల పర్యావరణ పరిస్థితులు, వాతావరణ మార్పులు, ప్రజల ఆరోగ్యంపై వాటి ప్రభావాల మధ్య సంబంధాన్ని అధ్యయనం చేసేందుకు దీర్ఘకాలిక పరిశోధనలు నిర్వహించడం సాధ్యమవుతుంది. గిరిజనుల ఆరోగ్యం, విపత్తులను ఎదుర్కొనే సంసిద్ధత, డిజిటల్ ఆరోగ్య రంగంలో నూతన ఆవిష్కరణలు, వాతావరణ మార్పులను తట్టుకోగల ఆరోగ్య వ్యవస్థల అభివృద్ధి వంటి జాతీయ ప్రాధాన్యతలకు ఈ కేంద్రం దోహదపడనుంది. ఎత్తైన పర్వత ప్రాంతాల్లో వైద్య పరిశోధనలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అధ్యయనాల్లో భారత్ పాత్రను కూడా ఇది మరింత బలోపేతం చేయనుంది.

ఈ కార్యక్రమం ద్వారా సాయుధ దళాల వైద్య సేవల విభాగం (ఏఎఫ్ఎంఎస్), భారత్ లోని జాతీయ ప్రాధాన్యత కలిగిన పరిశోధనా సంస్థలు, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం మధ్య సంస్థాగత సహకారాన్ని ప్రోత్సహించనున్నారు. ఈ భాగస్వామ్యాలు అనువర్తిత పరిశోధన, శాస్త్రీయ విజ్ఞాన మార్పిడి, సామర్థ్య పెంపుదల, సాక్ష్యాధారిత విధానాల రూపకల్పనకు తోడ్పడతాయి. ఆరోగ్య పరిశోధనలో ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని సాధించడంతో పాటు, సమాజంలోని అన్ని వర్గాలకూ అందుబాటులో ఉండే, వాతావరణ మార్పులను తట్టుకోగల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల అభివృద్ధి దిశగా భారత ప్రభుత్వ దార్శనికతను ఇవి ముందుకు తీసుకెళ్లనున్నాయి.

శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా సాంప్రదాయ భూమి పూజ, ఫలకం ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం 'గ్రీన్ ఐసీఎంఆర్ క్యాంపస్' కార్యక్రమం కింద హిమాలయ ప్రాంతానికి చెందిన మొక్కలను నాటతారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవం, ఈ కేంద్రం అధికారిక వీడియో, వెబ్‌సైట్ ఆవిష్కరణ, భవన నమూనా ప్రదర్శనతో పాటు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఒక ప్రత్యేక స్మారక పోస్టల్ కవర్‌ను కూడా విడుదల చేస్తారు. 

ఈ శంకుస్థాపన కార్యక్రమానికి భారత ప్రభుత్వ రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ సేథ్, హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, రాష్ట్ర శాసనసభ సభ్యుడు శ్రీ జై రామ్ ఠాకూర్, హిమాచల్ ప్రదేశ్‌లోని మండి పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి కంగనా రనౌత్, లాహౌల్ - స్పితి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ సభ్యురాలు శ్రీమతి అనురాధ రాణా, మాజీ శాసనసభ సభ్యుడు శ్రీ రవి ఠాకూర్ తదితరులు హాజరుకానున్నారు.

ఈ కార్యక్రమానికి హాజరయ్యే ఇతర ప్రముఖుల్లో సాయుధ దళాల వైద్య సేవల విభాగం డైరెక్టర్ జనరల్ ఎయిర్ మార్షల్ సందీప్ థరేజా, ఆరోగ్య పరిశోధన విభాగం కార్యదర్శి, ఐసిఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహల్, ఆరోగ్య పరిశోధన విభాగం సంయుక్త కార్యదర్శి శ్రీమతి మనీషా సక్సేనా, ఐసిఎంఆర్ సీనియర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (పరిపాలన) శ్రీ వివేక్ కుమార్ దక్ష్, అదనపు డైరెక్టర్ జనరల్ (వెలుపలి పరిశోధనలు) డాక్టర్ అల్కా శర్మ, సీనియర్ ఆర్థిక సలహాదారు డాక్టర్ రిచా పాండే తదితరులు ఉన్నారు. కేంద్ర, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాలకు చెందిన సీనియర్ అధికారులు, సాయుధ దళాల ప్రతినిధులు, శాస్త్రవేత్తలు, ప్రజారోగ్య నిపుణులు, పరిశోధనా సంస్థల ప్రతినిధులు, ఇతర కీలక భాగస్వాములు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

 

***


(రిలీజ్ ఐడి: 2321970) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी