ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

తూర్పు ప్రాంతంలో బంగ్లాదేశ్ నుంచి బంగారం అక్రమ రవాణాను అడ్డుకున్న డీఆర్ఐ


7.8 కిలోలకు పైగా విదేశీ బంగారం స్వాధీనం - ఆరుగురి అరెస్ట్

నిఘా సమాచారంతో చేపట్టిన దాడుల్లో బన్‌పూర్ సరిహద్దు ప్రాంతం, త్రిపుర నుంచి కోల్‌కతాకు అనుసంధానించే మార్గాల ద్వారా సాగుతున్న బంగారం అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు

నాడు పోస్టు చేయడమైనది: 11 OCT 2026 10:26AM by PIB Hyderabad

బంగ్లాదేశ్ నుంచి సరిహద్దుల మీదుగా సాగుతున్న బంగారం అక్రమ రవాణాపై రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ (డీఆర్ఐ) తన దాడులను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా 2026 అక్టోబర్ 8, 9 తేదీల్లో తూర్పు ప్రాంతంలో కచ్చితమైన నిఘా సమాచారం ఆధారంగా నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో  సుమారు 7.8 కిలోల విదేశీ మూలాలున్న బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. దీని విలువ రూ.11.50 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. సరిహద్దు ప్రాంతాల నుంచి కోల్‌కతాకు అక్రమంగా రవాణా చేసిన బంగారాన్ని తరలించేందుకు రోడ్డు, రైల్వే మార్గాలను వినియోగిస్తున్నట్లు ఈ ఆపరేషన్ల ద్వారా వెల్లడైంది. ఈ కేసులో ఆరుగురిని అరెస్టు చేశారు.

డీఆర్ఐ కోల్‌కతా నిర్వహించిన దాడుల్లో  స్వాధీనం చేసుకున్న బంగారం

డీఆర్ఐ అధికారులు డాంకుని టోల్ ప్లాజా వద్ద ఓ వాహనాన్ని అడ్డగించారు. బంగ్లాదేశ్ సరిహద్దుకు సమీపంలోని బన్‌పూర్ నుంచి కోల్‌కతా వైపు వెళ్తున్న ఈ వాహనంలో నలుగురు వ్యక్తులు ఉన్నారు. వాహనాన్ని, అందులోని వ్యక్తులను తనిఖీ చేయగా సుమారు 6.8 కిలోల బరువున్న 50 బంగారు కడ్డీలు లభించాయి. వీటి విలువ దాదాపు రూ.10 కోట్లు ఉంటుందని అంచనా. వీటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో కొన్ని బంగారు బిస్కెట్లపై విదేశీ గుర్తులు ఉన్నాయి. బంగారాన్ని చట్టబద్ధంగా తమ వద్ద ఉంచుకున్నట్లు నిరూపించే ఎలాంటి చెల్లుబాటు అయ్యే పత్రాలను నిందితులు సమర్పించలేకపోయారు. బంగ్లాదేశ్ మీదుగా విదేశీ మూలాలున్న బంగారాన్ని భారతదేశంలోకి అక్రమంగా తరలించడంలో తమ ప్రమేయం ఉందని వారు తమ వాంగ్మూలాల్లో అంగీకరించారు. ముఖ్యంగా, బన్‌పూర్ సరిహద్దు ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ అక్రమ రవాణా ముఠాకు ప్రధాన సూత్రధారి కూడా అరెస్టయిన నలుగురిలో ఉండటం గమనార్హం.

అదే రోజు పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా టౌన్ రైల్వే స్టేషన్, న్యూ జల్పాయిగురి రైల్వే స్టేషన్‌లలో డీఆర్ఐ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. రైళ్లలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులను అడ్డగించి, వారి వద్ద నుంచి సుమారు  కిలో విదేశీ మూలాలున్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నాయి. దీని విలువ దాదాపు రూ.1.5 కోట్లు ఉంటుందని అంచనా. బంగారాన్ని చట్టబద్ధంగా కొనుగోలు చేసినట్లు నిరూపించే పత్రాలను సమర్పించడంలో విఫలమైన ఇద్దరు ప్రయాణికులను అధికారులు అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న బంగారం గాజులు, బంగారు కడ్డీల రూపంలో ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. త్రిపురలో భారత్‌ - బంగ్లాదేశ్‌ సరిహద్దు మీదుగా అక్రమంగా తరలించిన బంగారంతో వీటిని తయారు చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడయింది. నిర్ధారణ అయింది.

బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాలతో పాటు, ఈశాన్య రాష్ట్రాలను కోల్‌కతా వంటి ప్రధాన మార్కెట్లతో అనుసంధానించే రహదారి, రైల్వే మార్గాలను కూడా అక్రమంగా రవాణా చేస్తున్న బంగారాన్ని తరలించేందుకు ఉపయోగిస్తున్నట్లు ఈ దాడుల ద్వారా స్పష్టం అవుతోంది.  నిఘా సమాచారంతో కూడిన అమలు చర్యలు, సమన్వయంతో చేపట్టే దాడుల ద్వారా వ్యవస్థీకృత అక్రమ రవాణా ముఠాలను పూర్తిగా నిర్మూలించేందుకు డీఆర్ఐ  కట్టుబడి ఉంది.

 

***


(రిలీజ్ ఐడి: 2321948) సందర్శకుల సూచీ సంఖ్య : : 16
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Bengali-TR , Assamese , Gujarati , Tamil