ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ప్రపంచ బ్యాంక్ గ్రూప్ ‘వరల్డ్ డెవలప్‌మెంట్ రిపోర్ట్ 2026: ది ప్రామిస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ను న్యూఢిల్లీలో ఆవిష్కరించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్
కృత్రిమ మేధ స్వీకరణ, అనుసరణ, అభివృద్ధి ద్వారా పురోగతి సాధించేందుకు అభివృద్ధి చెందుతున్న దేశాలకు మార్గదర్శకంగా ప్రపంచ బ్యాంకు గ్రూప్ నివేదిక
భారత్ లో ప్రపంచ బ్యాంక్ గ్రూప్ నివేదిక ఆవిష్కరణకు సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన ఎలక్ట్రానిక్స్ , ఐటీ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియాఏఐ మిషన్, ప్రపంచ బ్యాంక్ గ్రూప్
సమ్మిళిత అభివృద్ధి కోసం ఏఐ వినియోగాన్ని విస్తరించడంపై విధానకర్తలు, అభివృద్ధి రంగ నిపుణులు, సాంకేతిక రంగ ప్రముఖుల చర్చలు
ఉన్నత స్థాయి ప్యానెల్ చర్చ, రాష్ట్రాల ఏఐ ప్రదర్శనలో వివిధ రంగాల్లో ప్రయోగాత్మక ఏఐ ప్రాజెక్టుల నుంచి ఆధారాలతో కూడిన విస్తృత స్థాయి అమలువైపు భారత్ ఎలా ముందుకు సాగాలనే అంశంపై పరిశీలన
నాడు పోస్టు చేయడమైనది:
08 OCT 2026 6:04PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రపంచ బ్యాంక్ గ్రూప్ రూపొందించిన ‘వరల్డ్ డెవలప్‌మెంట్ రిపోర్ట్ 2026: ది ప్రామిస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రైల్వేలు, సమాచార, ప్రసార శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ నేడు ఆవిష్కరించారు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు కృత్రిమ మేధ (ఏఐ) అందించే అవకాశాలు, ఎదురయ్యే సవాళ్లను ఈ నివేదిక విశ్లేషించింది. అభివృద్ధి కోసం ఏఐని వినియోగించుకునే దిశగా దేశాలు ముందుకు సాగేందుకు ఏఐ స్వీకరణ, స్థానిక అవసరాలకు అనుగుణంగా అనుసరణ, మరింత అభివృద్ధి అనే మూడు కీలక అంశాలతో కూడిన కార్యాచరణ ప్రణాళికను నివేదిక ప్రతిపాదించింది.
కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎంఈఐటీవై) ఆధ్వర్యంలోని ఇండియాఏఐ మిషన్, ప్రపంచ బ్యాంక్ గ్రూప్ సహకారంతో ఈ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏఐ ద్వారా అభివృద్ధి ప్రయోజనాలను గరిష్ఠ స్థాయిలో అందిపుచ్చుకోవడంతోపాటు, వాటిని సురక్షితంగా, నిరంతరాయంగా కొనసాగించేందుకు భారత్ అనుసరించాల్సిన మార్గాలపై సీనియర్ విధాన నిర్ణేతలు, అంతర్జాతీయ అభివృద్ధి రంగ నిపుణులు, సాంకేతిక రంగ ప్రముఖులు, సంబంధిత రంగాల ప్రతినిధులు విస్తృతంగా చర్చించారు. కార్యక్రమంలో భాగంగా ‘స్టేట్ ఏఐ షోకేస్‘ ను కూడా ఏర్పాటు చేశారు. ఇందులో దేశంలోని వివిధ రాష్ట్రాలు, ఏఐ రంగంలోని ఆవిష్కర్తలు అభివృద్ధి చేసిన ఏఐ ఆధారిత పరిష్కారాలను ప్రదర్శించారు.
అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో నిపుణుల సేవలను మరింత విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడం, ఉత్పాదకతను పెంచడం, సేవల అందజేతను మెరుగుపరచడం వంటి అంశాల్లో కృత్రిమ మేధ కీలకంగా ఉపయోగపడగలదని నివేదిక పేర్కొంది. వైద్య పరీక్షలు, వ్యవసాయ నిర్ణయాలు, విద్యా రంగాల్లో ఇప్పటికే ఏఐ ఆధారిత సాధనాలను వినియోగిస్తున్నారని తెలిపింది. పరిమిత సంఖ్యలో ఉన్న నిపుణుల పరిజ్ఞానాన్ని పెద్ద సంఖ్యలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో ఇవి దోహదపడుతున్నాయని వివరించింది. అయితే ఈ ప్రయోజనాలను పూర్తిస్థాయిలో సాధించేందుకు నమ్మకమైన విద్యుత్ సరఫరా, మెరుగైన డిజిటల్ కనెక్టివిటీ, కంప్యూటింగ్ మౌలిక వసతులు, నాణ్యమైన డేటా, నైపుణ్యాలు, సమర్థవంతమైన విద్యా వ్యవస్థలు, సామర్థ్యం కలిగిన సంస్థలు వంటి బలమైన పునాదులు అవసరమని నివేదిక స్పష్టం చేసింది.
కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ ప్రధానోపన్యాసం చేశారు. అనంతరం ప్రపంచ అభివృద్ధి నివేదికను అధికారికంగా ఆవిష్కరించారు. సాంకేతికతను అందరికీ సమానంగా అందించడమే భారత్ అనుసరిస్తున్న విధానమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. కృత్రిమ మేధ ద్వారా లభించే ప్రయోజనాలు దేశవ్యాప్తంగా ప్రజలు, వ్యాపార సంస్థలు, వివిధ సంస్థలకు చేరేలా చూడటమే ఈ విధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
“ఏఐ సామాన్య ప్రజల జీవితాలను మారుస్తోంది. కంప్యూటర్‌ను ఎప్పుడూ ఉపయోగించని రైతులు కూడా ఫోన్‌లో కేవలం వాయిస్ ద్వారా ఏఐ సేవలను వినియోగించుకుని బారామతిలో చెరకు దిగుబడిని 40 శాతం పెంచుకున్నారు. అదే సమయంలో నీరు, ఎరువుల వినియోగం 30 శాతం తగ్గింది. ఆరోగ్య రంగంలో టీబీ గుర్తింపు 35 శాతం పెరిగింది. ఇలాంటి ఉదాహరణలు గ్లోబల్ సౌత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురాగలవు” అని కేంద్ర మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ తెలిపారు.
బారామతి లో చేపట్టిన కార్యక్రమంలో ఉపగ్రహాలు, ఐఓటీ, వాతావరణ సమాచారాన్ని వినియోగించడంతోపాటు కూలీల వ్యయాన్ని కూడా తగ్గించినట్లు తెలిపారు. గుజరాత్‌లో అగ్రిస్టాక్‌ను 5 లక్షల మంది రైతులు వినియోగిస్తున్నారని, సర్లాబెన్ ద్వారా పశువుల ఆరోగ్య పరిరక్షణకు ఏఐ సాంకేతికతను ఉపయోగించడం వల్ల 3 కోట్ల పశువులు, వాటిపై ఆధారపడిన రైతులకు ప్రయోజనం చేకూరుతోందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
కృత్రిమ మేధ అభివృద్ధి, వినియోగంలో భారత్ కీలకమైన శక్తిగా ఎదిగింది. వైద్యం, వ్యవసాయం, విద్య, పాలన, ఆర్థిక సేవలు తదితర ప్రజా, ఆర్థిక ప్రాధాన్య రంగాల్లో ఏఐ ఆధారిత సాంకేతికతలను విస్తృతంగా వినియోగిస్తున్నారు. ఇండియాఏఐ మిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇండియాఏఐ కంప్యూట్ కెపాసిటీ, దేశీయ ఫౌండేషన్ మోడళ్ల అభివృద్ధి కోసం ఇండియాఏఐ ఇన్నోవేషన్ సెంటర్, ఇండియాఏఐ డేటాసెట్స్ ప్లాట్‌ఫామ్ (ఏఐకోష్), ఇండియాఏఐ అప్లికేషన్ డెవలప్‌మెంట్ ఇనిషియేటివ్, ఇండియాఏఐ ఫ్యూచర్‌స్కిల్స్, ఇండియాఏఐ స్టార్టప్ ఫైనాన్సింగ్, సేఫ్ అండ్ ట్రస్టెడ్ ఏఐ అనే ఏడు కీలక స్తంభాలపై సమగ్ర ఏఐ వ్యవస్థను నిర్మిస్తోంది.
ఇండియాఏఐ మిషన్ ద్వారా ఏఐ విలువ శ్రేణిలోని అన్ని దశల్లో భారత్ సామర్థ్యాలను బలోపేతం చేయడంతోపాటు, దేశ విస్తృతి, వైవిధ్యం, బహుభాషా పరిస్థితులకు అనుగుణంగా ఏఐ అభివృద్ధి సమ్మిళితంగా, బాధ్యతాయుతంగా ఉండేలా చర్యలు చేపడుతున్నారు. కంప్యూటింగ్ వనరులు, డేటా, ఏఐ మోడళ్లను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడం, భారత్ ఎదుర్కొంటున్న ప్రత్యేక సవాళ్లకు పరిష్కారాలు అభివృద్ధి చేయడం, ఉపాధి, ఆర్థిక అవకాశాలను సృష్టించడం ప్రభుత్వ విధానంలో కీలక అంశాలుగా ఉన్నాయి. సురక్షిత, విశ్వసనీయ (సేఫ్ అండ్ ట్రస్టెడ్) ఏఐ విభాగంలో బాధ్యతాయుత ఏఐ అభివృద్ధికి దేశీయ సాధనాలు, యంత్రాంగాల రూపకల్పనకు ప్రభుత్వం సహకరిస్తోంది. ఇందులో ఏఐలో నిష్పాక్షికత, అల్గారిథమ్‌ల ఆడిటింగ్, వివరణాత్మక ఏఐ, గోప్యతను కాపాడే ఏఐ, డీప్‌ఫేక్‌ల గుర్తింపు వంటి అంశాలు ఉన్నాయి. ఏఐ పాలన, భద్రత కోసం అవసరమైన సంస్థాగత వ్యవస్థలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
భారత్‌లో నివేదిక ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా, విజయవంతమైన ఏఐ ప్రయోగాత్మక ప్రాజెక్టులను ఎలా గుర్తించాలి, వాటి ప్రభావాన్ని ఎలా అంచనా వేయాలి, కొలవగల అభివృద్ధి ఫలితాలను సాధించేలా వాటిని విస్తృత స్థాయికి ఎలా తీసుకెళ్లాలనే అంశాలపై విధాన నిర్ణేతలు, సంబంధిత రంగాల నిపుణులు చర్చించారు. ఏఐ వల్ల తలెత్తే అవకాశం ఉన్న ప్రమాదాలను ఎలా నివారించాలి, వాటి నుంచి ఎలా రక్షణ కల్పించాలనే అంశాన్ని కూడా వారు పరిశీలించారు.
కార్యక్రమం ప్రారంభంలో ఇండియాఏఐ మిషన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ సుదీప్ శ్రీవాస్తవ, ప్రపంచ బ్యాంక్ గ్రూప్ డెవలప్‌మెంట్ ఎకనామిక్స్ విభాగం వ్యూహాల డైరెక్టర్ డాక్టర్ సోమిక్ లాల్ స్వాగత ప్రసంగాలు చేశారు.
“కృత్రిమ మేధను సృష్టించడం కంటే దాన్ని సమర్థవంతంగా వినియోగించడమే ప్రపంచ అభివృద్ధి నివేదికలోని కీలక సందేశాల్లో ఒకటి. సంస్థలు, మార్కెట్లు, ఏఐ సాంకేతికతను సమన్వయం చేసి లక్షలాది మంది జీవితాల్లో మార్పు తీసుకురావడానికి భారత్‌కు ప్రత్యేక అవకాశం ఉంది” అని డాక్టర్ సోమిక్ లాల్ అన్నారు.
ఏఐ పైలట్ల నుంచి విస్తృత స్థాయి అమలు దిశగా: భారత్‌లో ఏఐ సామర్థ్యం’ అనే అంశంపై కీలకోపన్యాసం చేసిన ప్రపంచ బ్యాంక్ గ్రూప్ ముఖ్య ఆర్థికవేత్త, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ మైఖేల్ క్రెమర్, “ఏఐ రంగంలో భారత్ సాధిస్తున్న పురోగతి ప్రపంచంలోని ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలకు కూడా పాఠాలను అందిస్తోంది. ఏఐ రంగంలో భారత్ సాధిస్తున్న గణనీయమైన పురోగతి కేవలం దేశంలోని సమస్యలను పరిష్కరించడానికే పరిమితం కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న విస్తృత అభివృద్ధి సవాళ్లను పరిష్కరించడంలోనూ దోహదపడుతోంది” అని అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు వాతావరణ సలహాలు అందించడంలో ఎడ్‌టెక్ పరిష్కారాల వినియోగంలో ఏఐ అందిస్తున్న ప్రయోజనాలను ఉదాహరణలుగా ప్రస్తావించిన ఆయన, “ఏఐ ఆధారిత పరిష్కారాలను విస్తృత స్థాయికి తీసుకెళ్లాలంటే ఫుల్‌స్టాక్ విధానం అవసరం. కేవలం సాఫ్ట్‌వేర్ అంశాలకే పరిమితం కాకుండా, దానితో పాటు మానవ వనరులు, సంస్థాగత వ్యవస్థలను కూడా సమన్వయం చేయాలి” అని అన్నారు.
ప్రపంచానికి ఉదాహరణగా భారత్ చేపట్టిన ఏఐ ఆధారిత రుతుపవనాల అంచనా విధానాన్ని డాక్టర్ క్రెమర్ ప్రస్తావించారు. భారత ప్రభుత్వం వాతావరణ విభాగాలు, వ్యవసాయ మంత్రిత్వ శాఖల ద్వారా ఓపెన్ యాక్సెస్ మోడళ్లతో సహా పలు ఏఐ మోడళ్లను పరీక్షించి, వాటిని సమన్వయం చేసి వాతావరణ అంచనాలను రూపొందించింది. అనంతరం ఈ అంచనాలను టెక్స్ట్ సందేశాలు, వాయిస్ సేవలు, ఏఐ ఆధారిత సలహాల ద్వారా లక్షలాది మంది రైతులకు చేరవేసింది. ఈ మోడల్ 2025లో చోటుచేసుకున్న అసాధారణ రుతుపవనాలను కూడా ముందుగానే అంచనా వేసిందని ఆయన తెలిపారు. భారత్ అనుసరించిన విధానాన్ని ఇప్పుడు ఇథియోపియా కూడా అనుసరిస్తోందని చెప్పారు. వాణిజ్యపరమైన ప్రోత్సాహకాలు పరిమితంగా ఉన్నప్పటికీ సామాజిక ప్రయోజనాలు అధికంగా ఉన్న సందర్భాల్లో ప్రభుత్వం కీలక పాత్ర పోషించాల్సిన అవసరాన్ని ఈ ఉదాహరణ స్పష్టం చేస్తోందని డాక్టర్ క్రెమర్ పేర్కొన్నారు.
అనంతరం ప్రపంచ అభివృద్ధి నివేదిక 2026 డైరెక్టర్ డాక్టర్ గౌరవ్ నయ్యర్ నివేదికలోని ముఖ్యాంశాలను, ప్రధాన నిర్ధారణలను వివరించారు.
“స్థానిక అవసరాలకు అనుగుణంగా ఏఐ సాధనాలను అనుసరిస్తూ, కొత్త సాంకేతికతకు ప్రభుత్వం సదుపాయాలు కల్పించే సంస్థగా, వినియోగదారుగా, నియంత్రణ సంస్థగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో భారత్ ఇప్పటికే అభివృద్ధి కోసం ఏఐ వినియోగించే దిశగా ముందుకు సాగుతోంది. శతాబ్ద కాలంలో సాధించలేని అభివృద్ధి ఫలితాలను భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు ఏఐ సహాయంతో కొన్ని దశాబ్దాల్లోనే సాధించగలవు” అని డాక్టర్ నయ్యర్ అన్నారు.
అభివృద్ధి చెందుతున్న దేశాల కోసం నివేదిక సూచించిన మూడు ప్రధాన సందేశాలను ఈ ప్రదర్శనలో వివరించారు. అవి - ఆశావహంగా ఉండటం, వ్యూహాత్మకంగా వ్యవహరించడం, ఆచరణాత్మక దృక్పథాన్ని అవలంబించడం. దేశాలు ఏఐని స్వీకరించి, తమ స్థానిక అవసరాలకు అనుగుణంగా మార్చుకుని, అనంతరం మరింత అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని నివేదిక సూచించింది. కోట్లాది డాలర్లు ఖర్చు చేసి మొదటి నుంచి అధునాతన ఏఐ వ్యవస్థలను నిర్మించడంకంటే, ఇప్పటికే అందుబాటులో ఉన్న ఏఐ సాధనాలను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవడంపై దృష్టి పెట్టాలని పేర్కొంది. అలాగే, ఏఐకి సదుపాయాలు కల్పించే సంస్థలుగా, వినియోగదారులుగా, నియంత్రణ సంస్థలుగా వ్యవహరించే క్రమంలో ఖర్చును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది. ఏఐ కారణంగా ఉద్యోగాల్లో మార్పులు, అంతరాయాలు ఏర్పడే ప్రమాదం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో తక్షణం అంత తీవ్రంగా ఉండకపోవచ్చని నివేదిక పేర్కొంది. అదే సమయంలో, ఏఐ ద్వారా అత్యధిక ప్రయోజనం పొందే అవకాశం ఉన్న దేశాలే దాని వినియోగానికి అత్యంత తక్కువ సిద్ధంగా ఉండే పరిస్థితి ఉందని తెలిపింది. ప్రపంచంలోని 25 అల్పాదాయ దేశాల్లో కేవలం ఒక్క దేశం మాత్రమే జాతీయ ఏఐ వ్యూహాన్ని ప్రకటించిందని వెల్లడించింది.
ప్రపంచ బ్యాంక్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ నీలకంఠ్ మిశ్రా, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ ఎస్. కృష్ణన్ ప్రత్యేక ప్రసంగాలు చేశారు.
“ప్రపంచ అభివృద్ధి నివేదికలో పేర్కొన్న అంశాలు భారత్ అనుసరిస్తున్న ఏఐ రోడ్‌మ్యాప్ కంప్యూటింగ్ సామర్థ్యం, డేటా, ఏఐ మోడళ్లతో సన్నిహితంగా అనుసంధానమై ఉన్నాయి. నియంత్రణ విషయంలోనూ నివేదిక ఆచరణాత్మక విధానాన్ని సూచిస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలను, స్వచ్ఛంద నిబంధనల పాటింపును ఆధారంగా చేసుకుని, సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ నియంత్రణ విధానాన్ని అవసరానికి అనుగుణంగా పునఃసమీక్షించాలి” అని శ్రీ ఎస్. కృష్ణన్ తెలిపారు.
మానవ వనరుల సామర్థ్యాలే అత్యంత కీలకమని శ్రీ కృష్ణన్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా ఏఐ టాలెంట్ మిషన్‌పై ఇప్పటికే కసరత్తు జరుగుతోందని తెలిపారు. ప్రపంచంలోనే అత్యధిక ఏఐ నైపుణ్యాలున్న దేశాల్లో భారత్ ఒకటిగా ఉన్నందున, గ్లోబల్ సౌత్ దేశాలకు భారత్ సహకారం అందించగలదని అన్నారు. అదే సమయంలో దేశీయంగా వ్యాపార సంస్థల్లో ఏఐ వినియోగం మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని, మారుతున్న సాంకేతిక పరిణామాలకు అనుగుణంగా ప్రభుత్వం కూడా చురుగ్గా, సౌలభ్యంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని శ్రీ కృష్ణన్ పేర్కొన్నారు.
‘భారత్‌లో అభివృద్ధి కోసం ఏఐని సమర్థంగా వినియోగించడం’ అనే అంశంపై ఉన్నతస్థాయి ప్యానెల్ చర్చ జరిగింది. ఈ చర్చలో మూడు ప్రధాన అంశాలు- భారత్‌లో ఏఐ స్వీకరణకు ఎదురవుతున్న సవాళ్లు, ఏఐని సమర్థంగా వినియోగించడంతోపాటు స్థానిక పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా దాన్ని ఎలా మలచుకోవాలి - పై దృష్టి సారించారు. అలాగే ఏఐ వల్ల తలెత్తే ప్రమాదాలను నియంత్రించేందుకు అవసరమైన విధానాలు గురించి చర్చించారు. ఏఐ ద్వారా లభించే ప్రయోజనాలు విస్తృతంగా ప్రజలకు అందేలా, దాని వల్ల కలిగే ప్రమాదాలను కట్టుదిట్టంగా నియంత్రించేలా విధానాలను రూపొందించడం ద్వారానే ఏఐ పూర్తి ప్రయోజనాలను సాకారం చేసుకోవచ్చని చర్చలో స్పష్టం చేశారు
ఈ ప్యానెల్‌లో ప్రపంచ బ్యాంక్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ నీలకంఠ్ మిశ్రా, ప్రపంచ బ్యాంక్ గ్రూప్ డెవలప్‌మెంట్ ఎకనామిక్స్ విభాగం స్ట్రాటజీ డైరెక్టర్ డాక్టర్ సోమిక్ లాల్, సర్వమ్ ఏఐ సహ వ్యవస్థాపకుడు డాక్టర్ వివేక్ రాఘవన్, వాధ్వానీ ఏఐ చీఫ్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ నీరజ్ అగర్వాల్, భారత్‌జెన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ మనీష్ సింగ్, ఎక్‌స్టెప్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీ శంకర్ మారువాడ పాల్గొన్నారు. సీఎన్‌బీసీ - టీవీ18 మేనేజింగ్ ఎడిటర్ శ్రీమతి షెరీన్ భాన్ చర్చను సమన్వయం చేశారు. ఏఐ రంగంలో విడివిడిగా చేపట్టే ప్రయోగాత్మక ప్రాజెక్టులను దాటి, ఆధారాలతో నిరూపితమైన విస్తృత స్థాయి అమలువైపు వెళ్లాల్సిన అవసరం ఉందని ప్యానెల్ సభ్యులు స్పష్టం చేశారు. స్థానిక సామర్థ్యాలను బలోపేతం చేయడం, డేటా, కంప్యూటింగ్ వనరులకు మెరుగైన లభ్యత కల్పించడం, తగిన సంస్థాగత వ్యవస్థలను ఏర్పాటు చేయడం, భారత్‌లోని విభిన్న సామాజిక, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఏఐ పరిష్కారాలు ఉండేలా చూడడం అవసరమని వారు పేర్కొన్నారు.
ప్యానెల్ చర్చ అనంతరం ‘స్టేట్ ఏఐ షోకేస్ - దేశవ్యాప్తంగా ఏఐ ఆవిష్కరణలు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలు స్థానిక, అభివృద్ధి సవాళ్లను పరిష్కరించేందుకు వివిధ రంగాల్లో విస్తృత స్థాయిలో అమలు చేయగల ఏఐ ఆధారిత పరిష్కారాలను ఎలా వినియోగిస్తున్నాయన్న దానిపై ఈ కార్యక్రమం దేశవ్యాప్త దృక్పథాన్ని అందించింది. ప్రతి ప్రదర్శకుడు ఒక కీలక ఏఐ ఆధారిత పరిష్కారం, దాని అమలు ప్రయాణం, అలాగే దాని ద్వారా సాధించిన ప్రభావాన్ని వివరించారు. ఈ ప్రదర్శనలు ఇలా ఉన్నాయి:
నవచేతన: 0 నుంచి 6 ఏళ్ల వయస్సు పిల్లల్లో అభివృద్ధి సంబంధిత లోపాలను ముందుగానే గుర్తించేందుకు ఏఐ సాయంతో చేపట్టిన ప్రాథమిక స్క్రీనింగ్ కార్యక్రమం. దీనిని ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ శ్రీ ఎం. వేణుగోపాల్ రెడ్డి ప్రదర్శించారు.
మహావిస్టార్ ఏఐ : రైతులకు వ్యక్తిగత సలహాలు, డిజిటల్ సేవలు, రైతుల భాగస్వామ్యాన్ని అందించే సమగ్ర వేదిక. దీనిని మహారాష్ట్రలోని పోక్రా ప్రాజెక్టుకు చెందిన శ్రీ ఫహీమ్ షేక్ ప్రదర్శించారు.
ఎడ్స్‌క్‌గ్రిడ్: విద్యా రంగంలో పాలనను మెరుగుపరిచేందుకు జియోఏఐ ఆధారిత ఇంటెలిజెన్స్ పరిష్కారం. దీనిని మేఘాలయ సమగ్ర శిక్షా అభియాన్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్, స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ డైరెక్టర్ శ్రీమతి రిచా కులకర్ణి ప్రదర్శించారు.
వ్యుహా -సర్వై: వైద్య సేవలందించే ప్రదేశంలోనే గర్భాశయ క్యాన్సర్‌ను గుర్తించేందుకు రూపొందించిన స్క్రీనింగ్ పరిష్కారం. ఎన్‌సీజీ క్యాచ్ గ్రాంట్ విజేత వ్యుహా మెడ్ డేటా సహ వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీ ధృతిమాన్ మల్లిక్ దీనిని ప్రదర్శించారు.
ఈ కార్యక్రమంలో విభిన్న విధానాలు, అభివృద్ధి చెందుతున్న నమూనాలు, భౌగోళికంగా వివిధ ప్రాంతాలకు అనుగుణంగా అమలు చేసుకునే అవకాశం ఉన్న ఏఐ ఆధారిత పరిష్కారాలను ప్రదర్శించారు.
చర్చల్లో ఏఐపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించడం, ఈ సాంకేతికత సురక్షితంగా, బాధ్యతాయుతంగా, సమ్మిళితంగా అభివృద్ధి చెందేలా చూడాల్సిన అవసరాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ‘వరల్డ్ డెవలప్‌మెంట్ రిపోర్ట్ 2026: ది ప్రామిస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ను భారత్‌లో ఆవిష్కరించడం ద్వారా అభివృద్ధికి ఏఐని సమర్థవంతమైన సాధనంగా వినియోగించడంపై జరుగుతున్న ప్రపంచవ్యాప్త చర్చకు మరో కీలక స్వరం జతైంది. ఏఐ రంగంలో సాధిస్తున్న పురోగతిని విస్తృత ప్రజా ప్రయోజనాలకు, సుస్థిర అభివృద్ధి ఫలితాలకు అనువదించేందుకు అవసరమైన మౌలిక సామర్థ్యాలు, సంస్థాగత వ్యవస్థలు, విధాన ప్రణాళికలను దేశాలు రూపొందించుకోవలసిన ఆవశ్యకతను ఈ కార్యక్రమం స్పష్టం చేసింది.
ఇండియాఏఐ మిషన్ డైరెక్టర్ శ్రీ ఎం.డి. వై. సఫీరుల్లా కె., ఐఏఎస్ ముగింపు ప్రసంగం చేశారు.
****
(రిలీజ్ ఐడి: 2321182)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6