సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ఐఐసీటీ, యూట్యూబ్ సహకారంతో నిర్వహిస్తోన్న 'క్రియేట్ విత్ ఏఐ' కార్యక్రమం కింద నాలుగు కృత్రిమ మేధస్సు ఆధారిత చిత్రాల ఆవిష్కరణ
సాంకేతికత, మార్గదర్శకత్వం, సృజనాత్మక నూతన ఆవిష్కరణల ద్వారా భారతదేశ ఏఐ చలనచిత్ర నిర్మాణ వ్యవస్థను ముందుకు తీసుకువెళ్తున్న ఐఐసీటీ
నాడు పోస్టు చేయడమైనది:
07 OCT 2026 7:03PM by PIB Hyderabad
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ (ఐఐసీటీ), యూట్యూబ్ సంయుక్తంగా నిర్వహిస్తోన్న 'క్రియేట్ విత్ ఏఐ' కార్యక్రమం ఒక కీలక ఘట్టానికి చేరుకుంది. ఏఐ ఆధారిత సృజనాత్మక ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వడానికి, వర్ధమాన సాంకేతికతలో భారత్ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి 2025 నవంబర్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రకటించారు. ఏఐ ఉపయోగించి తీసిన మొదటి నాలుగు లఘు చిత్రాలు ఇందులో భాగంగా తొలిసారిగా విడుదలయ్యాయి. ఏఐ నేతృత్వంలోని చలనచిత్ర నిర్మాణంలో భారత్‌ను ప్రపంచ నాయకుడిగా నిలబెట్టగల ఒక వ్యవస్థను తయారుచేయటంలో ఇదొక కీలక ఘట్టం.
నేడు ముంబయిలోని ఐఐసీటీ థియేటర్‌లో ఈ నాలుగు చిత్రాలను ఆవిష్కరించారు. అదే సమయంలో చిత్రనిర్మాతలు తమ యూట్యూబ్ ఛానళ్లలో కూడా వీటిని విడుదల చేశారు. చరిత్ర, పౌరాణికం, మానవ భావోద్వేగాలు, అంతరిక్ష అన్వేషణ వంటి విభిన్న అంశాలను, కథా చెప్పే విధానాలను ఈ చిత్రాలు తెలియజేస్తున్నాయి. ఏఐ ఆధారిత చలనచిత్ర నిర్మాణంలోని సృజనాత్మక సాధ్యాసాధ్యాలను ఇవి నిరూపిస్తున్నాయి.
1741 నాటి చారిత్రాత్మక కొలచెల్ యుద్ధం నేపథ్యంలో సాగే ఒక కల్పిత చలనచిత్ర కథే ఏవియం స్టూడియోస్ వారి 'చెకావర్'. ఆ కాలపు భూమి, ప్రజలు, ధైర్యసాహసాలు, యుద్ధ కళా సంప్రదాయాల నుంచి ఈ చిత్రం స్ఫూర్తి పొందింది.
తత్వవేత్త, వ్యూహకర్త, మౌర్య సామ్రాజ్య నిర్మాత అయిన చాణక్యుని గురించి తెలియని ప్రయాణాన్ని ఆవిష్కరించే చారిత్రక ఇతిహాసమే ఎలవెన్త్ డోర్ స్టూడియో వారి 'చాణక్య - ది మైండ్ ఆఫ్ యాన్ ఎంపైర్' చిత్రం.
శక్తికి సంబంధించిన దైవిక అభివ్యక్తిని, విశ్వ సమతుల్యతను పునరుద్ధరించడానికి ఆమె చేసిన పురాణ పోరాటానికి సంబంధించినది కల్పనిక్ ఫిల్మ్స్ వారి 'దేవి: ది నైన్ ఆస్ట్రాస్' చిత్రం.
కార్తీక్ కుల్ క్రియేషన్స్ వారి 'లైకా' చిత్రం.. అంతరిక్ష యానం చేసిన ఒక కుక్క భావోద్వేగ ప్రయాణాన్ని చూపుతుంది. అంతరిక్ష అన్వేషణ నేపథ్యంలో ధైర్యం, త్యాగం, మానవులు-జంతువుల మధ్య ఉన్న బంధం వంటి అంశాలను ఇది అన్వేషిస్తుంది.
చిత్రరూపకర్త అనే వారు కథాంశానికి కేంద్ర బిందువుగానే ఉంటూ సృజనాత్మక సాధ్యతలను పెంచినప్పుడే ఏఐ అత్యంత శక్తిమంతంగా పనిచేస్తుందని ఈ చిత్రాలు నిరూపిస్తున్నాయి. గూగుల్, యూట్యూబ్ ఏఐ సాంకేతికతలు..ఐఐసీటీ మౌలిక సదుపాయాలు, అక్కడి అధ్యాపకుల మార్గదర్శకత్వం, చిత్రనిర్మాతల ఊహాశక్తిని ఒకచోట చేర్చడానికి 'క్రియేట్ విత్ ఏఐ' కార్యక్రమాన్ని ఒక ఆచరణాత్మక ప్రయోగంగా రూపకల్పన చేశారు.
ఈ సందర్భంగా ఐఐసీటీ సీఈఓ డాక్టర్ విశ్వాస్ డియోస్కర్ మాట్లాడుతూ.. కృత్రిమ మేధస్సు(ఏఐ) ఆధారిత చలనచిత్ర నిర్మాణంలో తదుపరి అధ్యాయానికి నాయకత్వం వహించే అవకాశం భారత్‌కు ఉందని అన్నారు. 'క్రియేట్ విత్ ఏఐ' కార్యక్రమం సంస్థాగత మార్గదర్శకత్వాన్ని, అధునాతన ఏఐ సాధనాలను ఒకచోట చేర్చుతోందని.. ఇది భారతీయ సృజనాత్మక స్టూడియోలకు ప్రయోగాలు చేయడానికి, సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి, కొత్త చలనచిత్ర నిర్మాణ విధానాలను అభివృద్ధి చేయడానికి అవకాశం కల్పిస్తోందని తెలిపారు. ఏఐ-ఆధారిత కథాకథనంలో దేశాన్ని ముందంజలో ఉంచగల ఒక వ్యవస్థను సృష్టించడంలో ఇదొక కీలకమైన అడుగు అని ఆయన అన్నారు.
క్రియేటర్లు జనరేటివ్ ఏఐని ఉపయోగించే అవకాశాలను ప్రధానంగా ప్రస్తావించిన యూట్యూబ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ గుంజన్ సోని మాట్లాడుతూ.. భారత్ ఎప్పుడూ ఒక అసాధారణమైన కథాకథన దేశంగా ఉంటూ వచ్చిందని అన్నారు. అయితే ఇప్పుడు స్వతంత్ర క్రియేటర్లు తమ సొంత నిబంధనల ప్రకారం ప్రొడక్షన్ పవర్‌హౌస్‌లను నిర్మించుకోవడం మనం చూస్తున్నామని ఆమె అన్నారు. "నిర్భయమైన భారతీయ కథాకథనం, సరికొత్త సాంకేతికత ఒకచోట చేరి స్వతంత్ర స్థాయిలో ప్రపంచ స్థాయి సినిమాను తీసినప్పుడు ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో మా ఐఐసీటీ భాగస్వామ్యం నిరూపిస్తుంది" అని ఆమె పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వీరిలో డైరెక్టర్ జనరల్ (పశ్చిమ ప్రాంతం) స్మితా వత్స్ శర్మ, ఐ-బీ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ సెంథిల్ రాజన్, ఎన్‌ఎఫ్‌డీసీ ఎండీ శ్రీ ప్రకాష్ మగ్దుమ్, సీబీఎఫ్‌సీ సీఈఓ శ్రీ రాజేంద్ర సింగ్ తదితరులు ఉన్నారు.
ఈ కార్యక్రమంలోని ఏఐ చిత్రాల గురించి మరిన్ని వివరాల కోసం కింది లింక్‌ను స్కాన్ చేయండి.
జనరేటివ్ ఏఐ ప్రొడక్షన్ పరమైన అవరోధాలను పూర్తిగా తొలగిస్తుంది. తద్వారా క్రియేటర్లు రచన, కథకథనం, తమ నైపుణ్యంపై దృష్టి పెట్టడానికి విలువైన సమయాన్ని ఇస్తుంది. పబ్లిక్ ఫస్ట్, గూగుల్ రూపొందించిన కొత్త 'జెన్ మీడియా ఇండియా' నివేదిక ప్రకారం జనరేటివ్ మీడియా సాధనాలు భారత్‌లోని సృజనాత్మక నిపుణులకు 20 శాతం ఉత్పాదకత పెరుగుదలను అందిస్తున్నాయి. దీని అర్థం ప్రతి సంవత్సరం సుమారు 390 గంటలు ఆదా అవుతాయి. ఇది సృష్టికర్తలు రచన, కథకథనం, తమ కళను మెరుగుపరుచుకోవడంపై పూర్తిగా దృష్టి పెట్టడానికి దాదాపు పది పూర్తి వారాల సమయాన్ని ఆదా చేస్తుంది.
ఐఐసీటీ:
భారతదేశపు యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, ఎక్స్‌టెండెడ్ రియాలిటీ (ఏవీజీసీ-ఎక్స్ఆర్) జాతీయ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఈ ‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ (ఐఐసీటీ)’. దీనిని కేంద్ర ప్రభుత్వ సమాచార- ప్రసార మంత్రిత్వ శాఖ, మహారాష్ట్ర ప్రభుత్వం, ఎఫ్ఐసీసీఐ, సీఐఐ సంయుక్తంగా ఏర్పాటుచేశాయి. ఎన్‌ఎఫ్‌డీసీ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన దీని మొదటి క్యాంపస్ 2025 జూలైలో కార్యకలాపాలు ప్రారంభించింది. అయితే గోరెగావ్‌లోని ఫిల్మ్ సిటీలో 10 ఎకరాల విస్తీర్ణంలో శాశ్వత క్యాంపస్ రూపుదిద్దుకుంటోంది. ఐఐసీటీ ప్రస్తుతం 18 కోర్సులను అందిస్తోంది. ప్రముఖ ప్రపంచ సాంకేతిక, మీడియా కంపెనీలతో భాగస్వామ్యాలను కలిగి ఉంది.
***
(రిలీజ్ ఐడి: 2320449)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5