వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
దేశంలో అందుబాటు ధరల్లో తగినంత ఉల్లి లభ్యత
మార్కెట్లలోకి ముమ్మరంగా కొత్త ఖరీఫ్ ఉల్లి రాక
దేశవ్యాప్తంగా మండీ, రిటైల్ విపణుల్లో క్రమంగా తగ్గుతున్న ఉల్లిపాయల ధరలు
ప్రజలకు తక్కువ ధరకే ఉల్లిని అందించేందుకు 123 నగరాలకు బఫర్ స్టాక్ విక్రయాల విస్తరణ - 8 ప్రత్యేక కాందా ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు 467 ట్రక్కుల ద్వారా దేశవ్యాప్తంగా మార్కెట్లకు ఉల్లి నిల్వల తరలింపు
ధరలను నియంత్రించేందుకు బఫర్ నిల్వల్లోని ఉల్లిపాయలను పరిస్థితులకు అనుగుణంగా, వ్యూహాత్మకంగా దశలవారీగా మార్కెట్లోకి విడుదల చేసే చర్యలను మరింత విస్తరించిన ప్రభుత్వం
నాడు పోస్టు చేయడమైనది:
07 OCT 2026 5:57PM by PIB Hyderabad
ఉల్లి లభ్యత - ఖరీఫ్ ఉల్లి పరిస్థితి
ఈ ఏడాది ఖరీఫ్ సాగు విస్తీర్ణం పెరగడం, పంట వృద్ధికి అనుకూల వాతావరణం నెలకొనడం, మార్కెట్లకు సరుకు రాక ముమ్మరం కావడంతో పాటు నూతన ఖరీఫ్ దిగుబడులు ప్రారంభం కావడంతో ఉల్లి లభ్యత అంచనాలు గణనీయంగా బలపడ్డాయి. ఈ పరిణామాలతో సరఫరా వ్యవస్థ బలోపేతమై, ప్రధాన విపణులు, రిటైల్ మార్కెట్లలో ఉల్లిపాయల ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.
కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ సహా ప్రధాన ఉత్పత్తి రాష్ట్రాల్లో కొత్త ఖరీఫ్ ఉల్లిపాయల రాక ప్రారంభమైంది. అదే సమయంలో నిల్వల్లో ఉన్న ఉల్లిపాయల సరఫరా కూడా మార్కెట్ అవసరాలను తీర్చుతోంది. రానున్న వారాల్లో ఈ ఉత్పత్తి ప్రాంతాల నుంచి ఉల్లిపాయల రాక మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో రాబోయే పండుగల సీజన్‌లో వినియోగ మార్కెట్లలో ఉల్లిపాయల లభ్యత మరింత మెరుగుపడనుంది.
ఖరీఫ్ ఉల్లిపాయల ఉత్పత్తిపై అంచనాలు ఆశాజనకంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఖరీఫ్ ఉల్లిపాయల సాగు విస్తీర్ణం గత ఏడాది ఇప్పటికే నమోదైన మెరుగైన స్థాయితో పోలిస్తే సుమారు 5 శాతం అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రధాన ఉత్పత్తి ప్రాంతాల్లో పంట పరిస్థితులు కూడా అనుకూలంగా ఉన్నాయి. కోతల సమయంలో వాతావరణ పరిస్థితులపై భారత వాతావరణ విభాగం అంచనాలు కూడా పంటకు అనుకూలంగా ఉన్నాయి. రానున్న వారాల్లో ఖరీఫ్ ఉల్లిపాయలు పండించే ప్రధాన ప్రాంతాల్లో అధిక వర్షాలు కురిసే అవకాశం లేదని ఐఎండీ bఅంచనా వేస్తోంది. దీంతో ఉల్లిపాయల కోత, ఎండబెట్టడం, రవాణా సజావుగా సాగేందుకు అవకాశం ఉంటుంది. అలాగే తేమ కారణంగా పంట దెబ్బతినే ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చు.
మహారాష్ట్రలో ఉల్లిపాయల మండీ ధరల పరిస్థితి
ఉల్లిపాయల సరఫరా పరిస్థితి మెరుగుపడటం మండీ ధరల్లోనూ ప్రతిబింబిస్తోంది. కీలక ఉల్లిపాయ మార్కెట్లకు సరఫరా గణనీయంగా కొనసాగుతోంది. మహారాష్ట్రలో ఉల్లిపాయల వెయిటెడ్ యావరేజ్ మండీ ధర సెప్టెంబర్ 16న క్వింటాల్‌కు సుమారు రూ.4,030 ఉండగా, అక్టోబర్ 3 నాటికి దాదాపు రూ.3,475కు తగ్గింది. అంటే సుమారు 13 శాతం క్షీణత నమోదైంది. మండీ ధరలు వరుసగా తగ్గుముఖం పట్టడం ద్వారా మార్కెట్లకు ఉల్లిపాయల రాక పెరగడం సరఫరా పరిస్థితులు మెరుగుపడటానికి దోహదపడుతోందని స్పష్టమవుతోంది.
ఉల్లి రిటైల్ ధరల పరిస్థితి
రిటైల్ మార్కెట్లలోనూ ఉల్లిపాయల ధరలు తగ్గుముఖం పట్టిన ధోరణి కనిపిస్తోంది. గత రెండు వారాల్లో 126 నగరాల్లో రిటైల్ ఉల్లిపాయ ధరలు కిలోకు రూ.1 నుంచి రూ.21 వరకు తగ్గాయి. తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్ వంటి ప్రధాన వినియోగ రాష్ట్రాల్లోనూ ధరలు తగ్గుముఖం పట్టాయి. భౌగోళికంగా విస్తరించిన వివిధ మార్కెట్లలో ధరల తగ్గుదల కనిపించడం ద్వారా ఈ మెరుగుదల ఏదైనా ఒక మండీ లేదా ప్రాంతానికే పరిమితం కాలేదని స్పష్టమవుతోంది. దేశవ్యాప్తంగా ఉల్లిపాయల లభ్యత బలోపేతం కావడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది.
ప్రభుత్వ బఫర్ నిల్వల నుంచి వ్యూహాత్మకంగా ఉల్లిపాయల విడుదల
బఫర్ నిల్వల్లోని ఉల్లిపాయలను విడుదల చేయడం ద్వారా వినియోగ కేంద్రాలకు ప్రభుత్వం సరఫరాలను మరింత పెంచుతోంది. ఇప్పటి వరకు ప్రభుత్వం 123 నగరాలకు 8 కందా ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 467 ట్రక్కుల ద్వారా 2.0 లక్షల క్వింటాళ్లకు పైగా ఉల్లిపాయలను సరఫరా చేసింది. అధిక వినియోగం ఉన్న మార్కెట్లకు మరింత పెద్ద మొత్తంలో ఉల్లిపాయలు చేరేలా అదనపు రైలు ర్యాక్‌లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. రాబోయే పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలను మరింత బలోపేతం చేస్తున్నారు. సరఫరా, పంపిణీ వేగం, సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు అదనపు రైలు రవాణాను కూడా చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
తాజా ఖరీఫ్ ఉల్లిపాయల రాక, నిల్వల్లో ఉన్న ఉల్లిపాయల లభ్యత, అలాగే బఫర్ నిల్వల్లోని ఉల్లిపాయలను వినియోగ కేంద్రాలకు నిరంతరం తరలించడం వంటి చర్యల ద్వారా మార్కెట్‌కు పలు మార్గాల్లో ఉల్లిపాయల సరఫరా అందుతోంది. ప్రభుత్వం ఉల్లిపాయల రాక, నిల్వలు, ధరల కదలికలను నిరంతరం నిశితంగా పర్యవేక్షిస్తోంది. అవసరమైన ప్రాంతాల్లో సక్రమంగా పంపిణీ జరిగేలా, తగినంత ఉల్లిపాయల లభ్యత ఉండేలా తగిన చర్యలు చేపడుతోంది.
మొత్తంగా, ఖరీఫ్ ఉల్లిపాయల సాగు విస్తీర్ణం పెరగడం, పంట పరిస్థితులు అనుకూలంగా ఉండటం, కోతలకు అనుకూలమైన వాతావరణం, మార్కెట్లకు ఉల్లిపాయల రాక గణనీయంగా కొనసాగడం, అలాగే మండీ, రిటైల్ ధరలు విస్తృతంగా తగ్గుముఖం పట్టడం వంటి పరిణామాలు రానున్న వారాల్లో ఉల్లిపాయల లభ్యత సంతృప్తికరంగా ఉండే అవకాశాలను సూచిస్తున్నాయి. తాజా ఖరీఫ్ ఉల్లిపాయల సరఫరా మరింత ఊపందుకుంటుందని, పండుగల సీజన్‌కు ముందు ప్రభుత్వం చేపడుతున్న పంపిణీ చర్యలు మరింత బలోపేతం కానున్న నేపథ్యంలో, రానున్న రోజుల్లో ఉల్లిపాయల సరఫరా పరిస్థితి అనుకూలంగానే కొనసాగుతుందని, ధరలు మరింత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
****
(రిలీజ్ ఐడి: 2320395)
సందర్శకుల సూచీ సంఖ్య : : 2