పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్యారిస్ ఒప్పందంలో లోపాల తొలగింపు, ఒప్పంద వాగ్దానాల ఆచరణ, ఒప్పంద సత్వర అమలుపై సీఓపీ31 శ్రద్ధ వహించాలని భారత్ స్పష్టీకరణ

సత్వర అమలు, అవసరమైన వారిని చేరుకోవడం, పరిష్కారాలను మరింత విస్తృతం చేయడం ద్వారా అంతాల్యా ఫలితాల సమీక్ష: శ్రీ భూపేందర్ యాదవ్

నాడు పోస్టు చేయడమైనది: 07 OCT 2026 8:17AM by PIB Hyderabad

ప్యారిస్ ఒప్పందంలో ఇప్పుడున్న లోపాలను తొలగించడం, ఒప్పందంలో చేసిన వాగ్దానాలను నెరవేర్చడంతో పాటు ఒప్పందాన్ని త్వరితగతిన అమలు చేయడంపై కూడా సీఓపీ31 దృష్టిని కేంద్రీకరించాలని కేంద్ర పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పు శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ కోరారు. యునైటెడ్ నేషన్స్ ఫ్రేంవర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ (యూఎన్ఎఫ్‌సీసీసీ) ప్రీ-సీఓపీ31 సమావేశాన్ని ఫిజీలో ఈ రోజు నిర్వహించారు. శ్రీ భూపేందర్ యాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గొని, సీఓపీ31 ప్రాధాన్యాలు అంశంపై సర్వసభ్య చర్చా కార్యక్రమంలో ప్రసంగించారు. ఆస్ట్రేలియా, ఫిజీ, తువలు దేశాలు కలిసికట్టుగా యూఎన్ఎఫ్‌సీసీసీ సంబంధిత ప్రీ-సీఓపీ31 సమావేశాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ సమావేశంలో పాలుపంచుకుంటున్న భారతీయ ప్రతినిధి వర్గానికి మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ నాయకత్వం వహిస్తున్నారు.

శ్రీ యాదవ్ తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ... వాతావరణ మార్పుల పరంగా ఎదురవుతున్న సవాళ్లకు ధైర్యంగా ఎదుర్కొంటూ విజయవంతమైన నమూనాను అందించిన తువలు ప్రజల ఉత్సాహానికి నమస్కరిస్తున్నానన్నారు. వారి ప్రయత్నాలు ఆశనూ, ఆత్మవిశ్వాసాన్నీ, వాతావరణ మార్పుతో తలపడడానికి అంతా ఏకతాటి మీదకు రావాలన్న సంకల్పాన్నీ బలపరుస్తున్నాయని ఆయన అన్నారు.

యూఎన్ఎఫ్‌సీసీసీ ఆధ్వర్యంలో కుదిరిన ప్యారిస్ ఒప్పందంలో సాధించవలసిన దీర్ఘకాలిక లక్ష్యాలు ఇప్పటికే ఖరారయ్యాయనీ, వాటిలో అంతర్జాతీయ స్థాయిలో ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్ స్థాయికి పరిమితం చేయాలన్న లక్ష్యం ఉందని మంత్రి గుర్తుచేశారు. ఈ ఆకాంక్షను సాకారం చేయడానికి కార్యాచరణతో ముడిపడిన సాధనాలను సమీకరించుకోవలసి ఉంటుందనీ, ఈ లక్ష్యాలను సాధించే దిశగా ప్రపంచం తన ప్రస్థానాన్ని ఎలా వేగవంతం చేయగలదన్న అంశంపై ప్రస్తుతం శ్రద్ధ వహించాల్సి ఉందనీ శ్రీ యాదవ్ అన్నారు.

ఏకాభిప్రాయ సాధన, నిర్ణయాలను తీసుకోవడం, వాటిని అమలు చేయడం ముఖ్యమని సీఓపీ31 అధ్యక్ష దేశాలు స్పష్టం చేసిన సంగతిని శ్రీ యాదవ్ ప్రస్తావిస్తూ, వాతావరణ సంబంధిత బహుపక్షవాదం పయనించవలసిన గమ్యం, దీర్ఘకాలిక లక్ష్యాల విషయంలో మొత్తంమీద అభిప్రాయ సామ్యం నెలకొందన్నారు. ఏమైనప్పటికీ సైన్సు, సాంప్రదాయిక జ్ఞానం, సామాజిక పద్ధతుల మధ్య, ఆచారాలకు, నైతికతకు మధ్య, అందుబాటులో ఉన్న వనరులకు, అవసరాలకు మధ్య ఇప్పుడున్న అవగాహనపరమైన లోపాలను గుర్తించడం, వాటిపై అనుకూల అభిప్రాయాలను ఏర్పరచడానికి నడుంకట్టాల్సి ఉందని ఆయన అన్నారు. పూర్తి అవగాహనను అందించేందుకు సీఓపీ31 ప్రయత్నించాలని మంత్రి సూచించారు.

నిర్ణయాలను తీసుకోవలసిన విషయంపై శ్రీ యాదవ్ మాట్లాడుతూ, యూఎన్ఎఫ్‌సీసీసీతో పాటు ప్యారిస్ ఒప్పందంలో చేసిన వాగ్దానాలను ‘‘సరి అయిన అర్థంలో’’ నెరవేర్చాలన్నదే అన్ని పక్షాల నుంచి ఆశిస్తున్న ప్రధాన నిర్ణయమనీ, ఈ వాగ్దానాలను అమలుపరచగలిగేందుకు తగిన అవకాశాలను ప్రతి ఒక్క పక్షానికీ కల్పించాలన్నారు. అమలు ప్రక్రియను గురించి మంత్రి ప్రస్తావిస్తూ, లోపాలు ఎక్కడున్నదీ గుర్తించాలనీ, వాటి ప్రభావం అత్యధిక సంఖ్యాకుల విషయంలో సుస్పష్టంగా కనిపిస్తున్న సందర్భాల్లో లోటును భర్తీ చేయాలనీ కోరారు. సామర్థ్యాలను పెంచడంపై శ్రద్ధ వహించాలనీ, ఏటా బలమైన ఉదాహరణలను, విజయ గాథలను తెలియజేయాలనీ మంత్రి అన్ని పక్షాలకూ విజ్ఞ‌ప్తి చేశారు. ఆ నిదర్శనాలు అధిక ప్రభావాన్ని ఉపశమింపచేసేవిగానూ, విస్తృత స్థాయిలో అనుసరించడానికి తగినవిగానూ, కార్యాచరణ సాధనాలు ఇట్టే అందుబాటులోకి వచ్చేవిగానూ ఉండాలని ఆయన అన్నారు.

అలాంటి ఉదాహరణలను ప్రతి ఏటా నిరంతరాయంగా పంచుకోవడంతో పాటు, వాటిని విరివిగా అనుకరించడం వల్ల ప్యారిస్ ఒప్పంద లక్ష్యాలను సాధించడంలో క్షేత్ర స్థాయిలో మెరుగైన ఫలితాలను సాధించవచ్చని శ్రీ యాదవ్ అన్నారు.

అంతాల్యాలో లభించే విజయాన్ని కేవలం కొత్త లక్ష్యాలకే, లేదా కొత్త ప్రకటనలకే పరిమితం చేయకూడదనీ, కార్యాచరణకు వేగాన్ని జతపరచగలిగామా, సహాయాన్ని ఆపన్న వర్గాల చెంతకు చేర్చగలిగామా, ఇప్పుడున్న పరిష్కారాలను పెద్ద ఎత్తున అమలు చేయగలుగుతామా అనే కొలబద్దలతో కొలవాలనీ మంత్రి అన్నారు.

ఏటా వాతావరణ మార్పుల సంబంధిత ఐక్యరాజ్యసమితి సదస్సును నిర్వహించడానికి కొన్ని వారాల ముందుగా ప్రీ-సీఓపీని నిర్వహిస్తుంటారు. ఇది ఒక సన్నాహక సమావేశం. సదస్సును ఈ ఏడాది నవంబర్‌లో తుర్కియేలోని అంతాల్యాలో నిర్వహిస్తారు.

 

***

 

(రిలీజ్ ఐడి: 2320080) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Bengali , Gujarati , Urdu , हिन्दी , Tamil , Malayalam