సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
సిక్కిం సాంస్కృతిక వారసత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేస్తున్న ప్రధానమంత్రి జ్ఞాపికలు
నాడు పోస్టు చేయడమైనది:
06 OCT 2026 5:44PM by PIB Hyderabad
ప్రధానమంత్రికి వివిధ సందర్భాల్లో వచ్చిన జ్ఞాపికల 8వ విడత ఈ - వేలం నమామి గంగే కార్యక్రమానికి మద్దతు అందించాలనే ఉన్నత లక్ష్యంతో పాటు, భారతదేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రజలు నేరుగా అనుభూతి చెందుతూ, ఆ వారసత్వ జ్ఞాపకాలను సొంతం చేసుకునే అవకాశాన్ని అందిస్తోంది.
ఈసారి ఈ - వేలంలో ప్రదర్శించిన ప్రధాని బహుమతుల్లో సిక్కిం రాష్ట్రానికి చెందిన రెండు ప్రత్యేక కళాఖండాలు కొలువుదీరాయి. ఇవి అక్కడి విశిష్ట సంస్కృతి, కళా వైభవానికి అద్దం పడుతున్నాయి. వీటిని ఈ వేదికపై ఉంచడం ద్వారా సిక్కిం వారసత్వాన్ని దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెచ్చినట్లయింది. ఒకప్పుడు దౌత్యపరమైన లేదా అధికారికంగా అందించిన ఈ అరుదైన కళారూపాలను సొంతం చేసుకుని, దేశ వారసత్వంతో అనుసంధానమయ్యే అవకాశాన్ని పౌరులకు, కళాభిమానులకు ఇది కలిగిస్తోంది.
ఈ జ్ఞాపికల్లో ఒకటి అత్యంత నైపుణ్యంతో రూపొందించిన ఇత్తడి బుద్ధుని శిల్పం. దీనిని సిక్కిం గవర్నర్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి బహూకరించారు. రెండో కళాఖండం టిబెటన్ బౌద్ధ సంప్రదాయానికి చెందిన టేబుల్‌టాప్ ప్రార్థనా చక్రం (మణి ఖోర్లో). దీనిపై పవిత్రమైన “ఓం మణి పద్మే హుం” మంత్రాన్ని చిత్రించారు. హిమాలయ రాష్ట్రం సిక్కింలోని కళా, ఆధ్యాత్మిక సంప్రదాయాలను ఈ ప్రార్థనా చక్రం ప్రతిబింబిస్తోంది.
ఈ ఏడాది వేలంలో ప్రదర్శించిన ఈ రెండు అరుదైన జ్ఞాపికలు భారతీయ సంస్కృతిలోని విశిష్ట వైవిధ్యాన్ని చాటిచెబుతున్నాయి. దేశంలోని విభిన్న కళా రూపాలను సమ్మేళనం చేస్తూ, పౌరులందరినీ ఒకే తాటిపైకి తెచ్చే ఐక్యతా వంతెనగా 'పిఎం మెమోంటోస్' వంటి వినూత్న కార్యక్రమాలు పోషించగల ముఖ్యమైన పాత్రను కూడా ఇది చాటిచెబుతోంది.
ప్రధానికి వచ్చిన జ్ఞాపికల 8వ విడత ఈ - వేలాన్ని అక్టోబర్ 31, 2026 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ - వేలంలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్నవారు https://pmmementos.gov.in పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో బిడ్లు నమోదు చేసుకోవచ్చు. కాగా, ఈ వేలం ద్వారా సమకూరే నిధులను నమామి గంగే ప్రాజెక్టు కోసం వెచ్చిస్తారు.
***
(రిలీజ్ ఐడి: 2319888)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8