యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2027 కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన జాతీయ స్థాయి క్విజ్‌కు విశేష స్పందన - దేశవ్యాప్తంగా క్విజ్‌లో పాల్గొన్న 1,45,26,013 మందిలో అర్హత సాధించిన యువత తదుపరి దశ అయిన వ్యాసరచన రౌండ్‌కు ఎంపిక
మై భారత్ పోర్టల్ లో 500 పదాలతో వ్యాసాలు సమర్పించేందుకు 2026 అక్టోబర్ 15 వరకు గడువు
నాడు పోస్టు చేయడమైనది:
06 OCT 2026 5:22PM by PIB Hyderabad
వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ (వీబీవైఎల్డీ) 2027 కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మేరా యువ భారత్ (మై భారత్) ద్వారా నిర్వహిస్తున్న ప్రతిష్ఠాత్మక యువజన భాగస్వామ్య కార్యక్రమం. ఇందులో భాగంగా నిర్వహించిన వికసిత్ భారత్ క్విజ్ విజయవంతంగా పూర్తయింది. దేశవ్యాప్తంగా యువ భారతీయుల నుంచి క్విజ్‌కు అపూర్వ స్పందన లభించింది. ఎంపిక ప్రక్రియలో మొత్తం 1,45,26,013మంది పాల్గొన్నారు.
2047 నాటికి వికసిత భారత్ సాధన దిశగా యువ పౌరులు తమ ఆలోచనలు, అభిప్రాయాలు, వినూత్న పరిష్కారాలను పంచుకునేందుకు క్రమబద్ధమైన, ప్రతిభా ఆధారిత వేదికను అందించడం వీబీవైఎల్డీ 2027 లక్ష్యం. ప్రతిభావంతులైన యువత ప్రజాజీవితంలో భాగస్వాములు కావడానికి, దేశ నిర్మాణంలో తమ వంతు సహకారం అందించేందుకు అవకాశాలు కల్పించాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా ఈ కార్యక్రమం రూపు దిద్దుకుంది.
ప్రతిభా ఆధారిత జాతీయ యువ నాయకత్వ ప్రయాణం
వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2027 గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు యువ నాయకత్వాన్ని గుర్తించి, తీర్చిదిద్దడానికి క్రమబద్ధమైన, బహుళ అంచెల ఎంపిక ప్రక్రియను అనుసరిస్తోంది. 'వికసిత్ భారత్ ఛాలెంజ్' ఎంపిక విధానం ఈ క్రింది విధంగా సాగుతుంది:
వికసిత్ భారత్ క్విజ్ ➔ వికసిత్ భారత్ వ్యాస రచన పోటీ ➔ జిల్లా స్థాయి పీపీటీ ఛాంపియన్‌షిప్ ➔ రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంతాల వీబీవైఎల్డీ ➔ జాతీయ స్థాయి వీబీవైఎల్డీ
వీబీవైఎల్డీ 2027 ఎంపిక ప్రక్రియలో మొదటి దశ అయిన 'వికసిత్ భారత్ క్విజ్'ను 2026 ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 30 వరకు మై భారత్ పోర్టల్‌తో పాటు మైగవ్ వేదిక ద్వారా నిర్వహించారు. ఈ క్విజ్‌లో 10 నిమిషాల వ్యవధిలో పూర్తి చేసేలా, గరిష్టంగా 20 మార్కులకు గానూ 20 ప్రశ్నలను కేటాయించారు.
క్విజ్ అర్హత సాధించిన దాదాపు 5.7 లక్షల మంది యువత తదుపరి 'వికసిత్ భారత్ వ్యాసరచన పోటీ' కి ఎంపికయ్యారు. వీరు తమ పరిధిలోని ప్రాంతానికి సంబంధించిన ప్రత్యేక అంశంపై 500 పదాల వ్యాసాన్ని 'మై భారత్' పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ప్రధాన అంశాలను, రాష్ట్రాల వారీ వివరాలను 'మై భారత్' పోర్టల్‌లో సమగ్రంగా పొందుపరిచారు.
భవిష్యత్ పాలన, పట్టణమార్పు - పౌర సేవలు
వాతావరణ భద్రత, సరిహద్దులు - సుస్థిర పర్వత ప్రాంత అభివృద్ధి
జనాభా ప్రయోజనం - మానవ వనరుల అభివృద్ధి
సుస్థిర పారిశ్రామికీకరణ - వనరుల ఆధారిత ఆర్థిక వృద్ధి
యాక్ట్ ఈస్ట్ విధానం, అనుసంధానత - సాంస్కృతిక నాయకత్వం
తయారీ రంగం, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, హరిత వృద్ధి
గిరిజన నాయకత్వం, సహజ వనరులు, సమ్మిళిత అభివృద్ధి
ఆవిష్కరణ ఆధారిత ఆర్థిక వ్యవస్థ, పర్యాటకం, సృజనాత్మక పరిశ్రమలు
సాంకేతికత, ఆవిష్కరణలు, భవిష్యత్ సన్నద్ధత
నీలి ఆర్థిక వ్యవస్థ, మానవ వనరులు, ప్రపంచ స్థాయి పోటీతత్వం
అభ్యర్థులు అక్టోబర్ 15, 2026 వరకు మై భారత్ వేదికపై 23 అధికారిక భాషల్లో దేనిలోనైనా తమ వ్యాసాలను దాఖలు చేయవచ్చు. అత్యుత్తమ వ్యాసాలు రాసిన అభ్యర్థులను జిల్లాల వారీగా ఎంపిక చేసి, మొదటిసారిగా ప్రతీ జిల్లాలో నిర్వహించే ముఖాముఖీ ప్రెజెంటేషన్ రౌండ్‌కు ఎంపిక చేస్తారు. ఆపై విజేతలు రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంతాల వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ పోటీల్లో పాల్గొంటారు. మొత్తం 10 ప్రధాన ఇతివృత్తాల ఆధారంగా దేశవ్యాప్తంగా ఎంపికైన యువ నాయకులు జాతీయ స్థాయి వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్‌లో పాల్గొనే జాతీయ బృందంగా ఏర్పడతారు.
***
(రిలీజ్ ఐడి: 2319883)
సందర్శకుల సూచీ సంఖ్య : : 18