భారత ఎన్నికల సంఘం
azadi ka amrit mahotsav

రాజకీయ పార్టీల ప్రతినిధి బృందాలతో సమావేశాల నియమావళిపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టత - నేడు (మంగళవారం) సాయంత్రం 4 గంటల వరకు ఏ పార్టీ అపాయింట్‌మెంట్ కోరలేదని స్పష్టీకరణ

నాడు పోస్టు చేయడమైనది: 06 OCT 2026 9:44PM by PIB Hyderabad

నేడు కొన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘం కార్యాలయానికి చేపట్టిన ర్యాలీ సందర్భంగా కొందరు ఎంపీలు తమ బృందంతో వచ్చి ఈసీని కలవాలనుకుంటున్నారనే విషయాన్ని మీడియా కథనాల ద్వారానే తెలుసుకున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. నేటి పరిణామాలపై ఈసీ స్పందిస్తూ, ఈ రోజు సాయంత్రం 4 గంటల వరకు తమను కలిసేందుకు ఏ రాజకీయ పార్టీ నుంచి కానీ, వారి ప్రతినిధుల నుంచి కానీ ఎలాంటి విజ్ఞప్తి రాలేదని స్పష్టం చేసింది.

 

ఆ తరువాత సుమారు సాయంత్రం 4 గంటల సమయంలో, ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ నేతృత్వంలోని ఎంపీల ప్రతినిధి బృందం ఎన్నికల సంఘాన్ని కలిసి ఒక వినతిపత్రం సమర్పించాలనుకుంటున్నట్లు ఢిల్లీ పోలీసుల ద్వారా సమాచారం అందింది.

 

2025లో భారత ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలతో సమావేశాల నిర్వహణకు ఒక విధానాన్ని నిర్దేశించింది. ఈ విధానం గురించి అన్ని రాజకీయ పార్టీలకు తెలియజేశారు. ప్రస్తుతం ఆయా పార్టీలు ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయి. రాజకీయ పార్టీకి చెందిన ప్రతినిధి బృందం లేదా పలు రాజకీయ పార్టీలతో కూడిన సంయుక్త ప్రతినిధి బృందం ఎన్నికల సంఘాన్ని కలవాలనుకున్నప్పుడు, ఆ పార్టీ లేదా పార్టీల నుంచి అధికారికంగా నియమితులైన ప్రతినిధి ద్వారా అపాయింట్‌మెంట్ కోరుతుంది. అనంతరం ఇరు పక్షాలు పరస్పరం అంగీకరించిన సమయానికి సమావేశం నిర్వహిస్తారు.

 

నేడు సాయంత్రం 4 గంటల తర్వాత ఎంపీల ప్రతినిధి బృందంతో భేటీ ప్రతిపాదనపై ఈసీ పరిశీలన జరుపుతుండగా, ఢిల్లీ పోలీసు డీసీపీ నుంచి కీలక సమాచారం అందింది. ఈ సమావేశం సుమారు 240 మంది ఎంపీల బృందంతో జరగాల్సి ఉందని, దీని కోసం పార్లమెంట్ హౌస్ యానెక్స్‌ను వేదికగా ప్రతిపాదించినట్లు డీసీపీ ఎన్నికల సంఘానికి తెలియజేశారు. అయితే ఈసీ నిబంధనల ప్రకారం రాజకీయ పార్టీలు లేదా ప్రతినిధుల సమావేశాలను కేవలం కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయ ప్రాంగణంలోనే నిర్వహించాల్సి ఉంటుంది. అందువల్ల, వెలుపల వేదికను ప్రతిపాదించడాన్ని అసాధారణ అభ్యర్థనగా పరిగణించిన ఆ విజ్ఞప్తిని తోసిపుచ్చినట్లు ఈసీ స్పష్టం చేసింది.

 

పార్లమెంట్ సభ్యుల నుంచి వినతిపత్రాన్ని స్వీకరించేందుకు విధుల్లో ఉన్న తమ అత్యున్నత అధికారిని సమావేశ ప్రాంగణానికి పంపడానికి కూడా ప్రతిపాదించామని, నిజానికి ఇది కూడా ఒక అసాధారణ చర్యేనని, అయినప్పటికీ ఈ ప్రతిపాదనను సైతం ఎంపీలు తిరస్కరించారని ఎన్నికల సంఘం తెలిపింది.

 

భారత ప్రజాస్వామ్య, పార్లమెంటరీ విధానాల పట్ల ఎన్నికల సంఘానికి అత్యున్నత గౌరవం ఉందని, అదే సమయంలో తమ సంస్థాగత నిబంధనలు, సాంప్రదాయాలు కూడా అంతే ప్రాముఖ్యమైనవని ఈసీ స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలు ఎప్పుడైనా భేటీ కోసం అపాయింట్‌మెంట్ కోరవచ్చని, సమయ వెసులుబాటును బట్టి తేదీని ఖరారు చేయడం క్రమం తప్పకుండా జరిగే పద్ధతని స్పష్టం చేసింది.


(రిలీజ్ ఐడి: 2319879) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , हिन्दी , Marathi , Malayalam