రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

అత్యంత ఎత్తునుంచి దూకగల పారాషూట్‌తో డీఆర్‌డీవో తొలి ప్రత్యక్ష ప్రయోగం

నాడు పోస్టు చేయడమైనది: 06 OCT 2026 4:11PM by PIB Hyderabad

   దేశంలోని అత్యంత ఎత్తయిన సైనిక పహరా ప్రదేశాలలో ఒకటైన ‘న్యోమా’ (ముధ్ డ్రాప్‌జోన్‌) సమీపాన అత్యంత ఎత్తునుంచి దూకగల పారాషూట్‌ (ఏహెచ్‌ఏపీ)తో రక్షణ రంగ పరిశోధన-అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) తొలి ప్రత్యక్ష ప్రయోగం నిర్వహించింది.

ఈ మేరకు సముద్ర మట్టానికి 16,000 అడుగుల ఎత్తునగల ప్రదేశం నుంచి సైనికుడు దూకిన తర్వాత పారాషూట్‌ను 15,500 అడుగుల ఎత్తులో విప్పగా- అది 13,700 అడుగుల ఎత్తునగల ‘న్యోమా’ వద్ద దిగింది. ఈ ప్రయోగం ద్వారా అత్యంత ఎత్తయిన ప్రదేశాల నుంచి భారత పారాట్రూపర్ల ద్వారా ‘ఏహెచ్‌ఏపీ’ వ్యూహాత్మక వినియోగ సామర్థ్యం రుజువైంది.

పారాట్రూపర్లను సామూహికంగా కిందకు దించే ఈ వ్యూహాత్మక పారాషూట్‌ వ్యవస్థకు  ఆగ్రాలోని ‘ఏరియల్ డెలివరీ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్’ (ఏడీఆర్‌డీఈ) రూపకల్పన-అభివృద్ధి బాధ్యతలను చేపట్టింది. అనంతరం కాన్పూర్‌లోని ‘ఆర్డినెన్స్ పారాషూట్‌ ఫ్యాక్టరీ (ఓపీఎఫ్‌) దీన్ని ఉత్పత్తి చేయగా, ‘డీజీఏక్యూఏ’ దీనిపై మూల్యాంకనం పూర్తి చేసింది. అటుపైన కాన్పూర్‌లోని ‘సీఈఎంఐఎల్‌ఏసీ, ఆర్‌సీఎంఏ’లు నాణ్యతను ధ్రువీకరించాయి.

‘ఏహెచ్‌ఏపీ’ ద్వారా వివిధ రకాల సైనిక మోహరింపు విధానాలను అనుసరించే వీలుంటుంది. ఈ కార్యాచరణ ఎత్తు పరిధి అత్యంత విస్తృతం (18000 అడుగులు) మాత్రమేగాక ఎంతో సురక్షిత అవరోహణ వేగం సాధ్యమవుతుంది. ముఖ్యంగా అధిక ఎత్తునగల భూభాగాలలో భారత రక్షణ దళాల వ్యూహాత్మక అవసరాలకు ఇది చాలా అనుకూలం. ఇలాంటి ఎత్తయిన ప్రదేశాల్లో వ్యూహాత్మక సమర్థ పారాషూట్‌ వినియోగం అమిత సంక్లిష్టమేగాక అది తెరుచుకోవడంలో అత్యధిక కుదుపు, అవరోహణ వేగం సహజంగా ప్రమాదానికి దారితీసేవిగా ఉంటాయి.

ఈ నేపథ్యంలో స్వదేశీ ‘ఏహెచ్‌ఏపీ’ పారాషూట్ వ్యవస్థను తొలిసారి ప్రయోగాత్మకంగా  విజయవంతం చేయడంపై ‘డీఆర్‌డిఓ’తో పాటు రక్షణ దళాలను, డీపీఎస్‌యూ’లను, సహకరించిన ఇతర పరిశ్రమలను రక్షణశాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. స్వయంసమృద్ధ భారత్‌ దిశగా ఇది కీలక మలుపని ఆయన అభివర్ణించారు. అలాగే, రక్షణశాఖ కార్యదర్శి, రక్షణ పరిశోధన-అభివృద్ధి విభాగం కార్యదర్శి-డీఆర్‌డీఓ ఛైర్మన్ శ్రీ రాజేష్ కుమార్ సింగ్ కూడా ఈ వ్యవస్థ రూపకల్పన-అభివృద్ధిలో పాలుపంచుకున్న బృందాన్ని అభినందించారు.

***


(రిలీజ్ ఐడి: 2319687) సందర్శకుల సూచీ సంఖ్య : : 11
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Gujarati