రాష్ట్రపతి సచివాలయం
స్విట్జర్లాండ్ అధ్యక్షునికి రాష్ట్రపతి విందు భారత్, స్విట్జర్లాండ్ మధ్య మరింత సహకారంతో రెండు దేశాల ప్రజలకు ప్రయోజనం: రాష్ట్రపతి శ్రీ ద్రౌపది ముర్ము
నాడు పోస్టు చేయడమైనది:
05 OCT 2026 10:40PM by PIB Hyderabad
రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము.. స్విట్జర్లాండ్ అధ్యక్షుడు శ్రీ గయ్ పార్మెలిన్‌కు ఈ రోజు రాష్ట్రపతి భవన్లో స్వాగతం పలికారు. స్విట్జర్లాండ్ అధ్యక్షుని గౌరవార్థం విందు కార్యక్రమాన్ని రాష్ట్రపతి ఏర్పాటు చేశారు.
భారత్, స్విట్జర్లాండ్ ల మధ్య ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, చట్టబద్ధ పాలన ప్రాతిపదికలుగా మైత్రీ పూర్వక, సుహృద్భావ సంబంధాలను రాష్ట్రపతి ప్రస్తావించారు. వాణిజ్యం, పెట్టుబడులు, విజ్ఞానశాస్త్రం,సాంకేతిక విజ్ఞానం, నూతన ఆవిష్కరణలు, సంస్కృతి, రెండు దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాలు సహా అనేక రంగాలలో ఉభయ దేశాల మధ్య విస్తృత సహకారం ఏర్పడిందని శ్రీమతి ద్రౌపది ముర్ము అన్నారు. ఇరు దేశాల మధ్య తరచు ఉన్నత స్థాయి చర్చలు ఈ ద్వైపాక్షిక సంబంధాలు మరింత పుంజుకోవడానికి దోహదం చేస్తున్నాయన్నారు.
భారత్‌తో వాణిజ్యం చేస్తున్న, భారత్‌లో పెట్టుబడి పెడుతున్న భాగస్వామ్యదేశాల్లో స్విట్జర్లాండ్ ఒకటి అని రాష్ట్రపతి అన్నారు. భారత్-యూరోపియన్ స్వేచ్ఛా వాణిజ్య సంఘ వాణిజ్య, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నందువల్ల ద్వైపాక్షిక వాణిజ్యాన్నీ, పెట్టుబడులనీ మరిన్ని రంగాలకు విస్తరించడానికి అనేక అవకాశాలు ఉన్నాయని శ్రీమతి ద్రౌపది ముర్ము అన్నారు.
భారత మౌలిక సదుపాయాల కల్పన రంగంలో స్విస్ వాణిజ్య సంస్థలు గణనీయంగా పాలుపంచుకుంటున్న నేపథ్యంలో, కీలక రంగాలలో.. మరీ ముఖ్యంగా రోడ్ల నిర్మాణం, రైల్వే వంతెనలు, సొరంగాల నిర్మాణంలో పెట్టుబడులు పెట్టడానికి స్విస్ వాణిజ్య సంస్థలు ముందుకు వచ్చాయని రాష్ట్రపతి తెలిపారు. స్వచ్ఛ, హరిత సాంకేతికత, కృత్రిమ మేధ వంటి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న రంగాల్లోనూ అవకాశాలను స్విస్ కంపెనీలు అందిపుచ్చుకోగలగాలని రాష్ట్రపతి అన్నారు.
వలస, సంధానం, పరిశోధన, సాంకేతిక మార్పిడి రంగాల్లో సహకారాన్ని పెంపొందింప చేసుకోవడానికి ఈ పర్యటన కాలంలో ముఖ్య ఒప్పందాలు కుదిరాయని తెలిసి రాష్ట్రపతి సంతోషాన్ని వ్యక్తం చేశారు.
భారత్, స్విట్జర్లాండ్ మధ్య సన్నిహిత సహకారంతో రెండు దేశాల ప్రజలకు అనేక ప్రయోజనాలు సమకూరడం తధ్యమని నేతలిద్దరూ అంగీకరించారు. ఇరు దేశాల సంబంధాలు మరింత బలోపేతం కావడానికి స్విట్జర్లాండ్ అధ్యక్షుని పర్యటన తోడ్పడుతుందన్న నమ్మకాన్ని నేతలు వ్యక్తం చేశారు.
***
(రిలీజ్ ఐడి: 2319500)
సందర్శకుల సూచీ సంఖ్య : : 17