గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఆంధ్రప్రదేశ్‌కు పీఎంఏవై-జి 2.0 పథకం కింద ₹3,600 కోట్ల విలువైన 3 లక్షల శాశ్వత గృహాలు మంజూరు
దేశంలో తొలి త్రీడీ కాంక్రీట్-ప్రింటెడ్ గృహనిర్మాణ ప్రాజెక్టుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ శంకుస్థాపన
గృహనిర్మాణం సహా వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర మంత్రితో కలసి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు సారథ్యం
మోదీ-నాయుడు భాగస్వామ్యంతో ప్రగతి వేగం రెట్టింపు.. రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికీ శాశ్వత గృహవసతి కల్పిస్తాం: శ్రీ చౌహాన్ హామీ
మధ్యప్రదేశ్ ప్రజలతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకూ తాను ‘మామ’నేనని తెలుగులో చెబుతూ ప్రజల మనసు చూరగొన్న కేంద్ర మంత్రి
మోదీ దార్శనికత.. నాయుడు నేతృత్వాన ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్ర రాష్ట్రంగా అవతరిస్తుందని వ్యాఖ్య
‘అన్నదాత సుఖీభవ’ నుంచి ‘లఖ్‌పతి దీదీ’ వరకూ రైతులకూ, మహిళలకూ సాధికారితను అందిస్తున్న మోదీ-నాయుడు ప్రభుత్వాలు
నాడు పోస్టు చేయడమైనది:
04 OCT 2026 5:11PM by PIB Hyderabad
గుంటూరు (ఆంధ్రప్రదేశ్)/న్యూఢిల్లీ, అక్టోబరు 4, 2026: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ₹3,600 కోట్ల విలువైన 3 లక్షల ఇళ్లలో తొలి విడత గృహాలను కేంద్ర వ్యవసాయ-రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం అప్పగించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ 2.0' (పీఎంఏవై-జి) కింద కేంద్రం ఈ ఇళ్లను మంజూరు చేసింది. ఈ మేరకు గుంటూరు జిల్లా బుర్రిపాలెం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్.చంద్రబాబు నాయుడు కూడా పాల్గొన్నారు. అనంతరం దేశంలోనే తొలిసారి త్రీడీ కాంక్రీట్ ప్రింటింగ్ సాంకేతికత ద్వారా ప్రయోగాత్మకంగా ₹14 కోట్ల వ్యయంతో నిర్మించే 177 ఇళ్లకు శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలనుద్దేశించిన కేంద్ర మంత్రి ప్రసంగించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు రాష్ట్రంలో ప్రగతిని పరుగులు పెట్టిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. అన్ని రంగాలలో పురోగమన వేగం పెంచి, ఆంధ్రపదేశ్‌ను దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి, సమాచార శాఖల సహాయ మంత్రి డాక్టర్ శ్రీ చంద్రశేఖర్ పెమ్మసాని, ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్, గృహనిర్మాణ-సమాచార శాఖ మంత్రి శ్రీ కొలుసు పార్థసారథి, పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్, బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు శ్రీ పి.వి.ఎన్.మాధవ్, రాజ్యసభ సభ్యుడు శ్రీ భాష్యం రామకృష్ణ, ఎంపీ శ్రీ లింగమనేని రమేష్, ఎమ్మెల్సీ శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బత్తుల తాతయ్య బాబు సహా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు, వేలాది రైతులు, గ్రామీణులు, మహిళలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు గృహాల కేటాయింపు 76,000 నుంచి 3 లక్షలకు పెంపు
ఆంధ్రప్రదేశ్ గృహనిర్మాణ అవసరాలను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని శ్రీ చౌహాన్ అన్నారు. కాబట్టే, తమ శాఖ అధికారులు 76,000 ఇళ్లకు ప్రతిపాదనలు పంపినా, ముఖ్యమంత్రి అభ్యర్తన మేరకు ఈ సంఖ్యను 3 లక్షలకు పెంచామని ఆయన వెల్లడించారు. ఈ అంశాన్ని విశదీకరిస్తూ- “ఆంధ్రప్రదేశ్‌కు 76,000 ఇళ్లను కేటాయించేందుకు మాత్రమే వీలుందని మా శాఖ అధికారులు నాకు చెప్పారు. అయితే, రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇల్లు ఉండాలని ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు పట్టుబట్టారు. దీంతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆశీస్సులతో మేం 3 లక్షల ఇళ్లను మంజూరు చేశాం” అని తెలిపారు. ఇవికాకుండా మరో 6 లక్షల ఇళ్లను కూడా కేటాయించాలనిన ముఖ్యమంత్రి కోరినట్లు చౌహాన్ వెల్లడించారు. కేంద్రం తరఫున నిరంతర మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ మేరకు “కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అండగా ఉన్నదని, నేను కూడా మద్దతిస్తున్నానని శ్రీ చంద్రబాబుకు చెప్పాను. ఇప్పుడు కేటాయించిన 3 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తిచేశాక మరో 3 లక్షలు, అటుపైన మరో 3 లక్షలు కూడా మంజూరు చేస్తాం. తద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి పేద కుటుంబానికీ పక్కా ఇల్లు లభిస్తుంది” అని భరోసా ఇచ్చామని చెప్పారు.
ఆరు నెలల్లో త్రీడీ కాంక్రీట్ ప్రింటింగ్ సాంకేతికతతో దృఢమైన ఇళ్లు సిద్ధం
బుర్రిపాలెం, ఒబులనాయుడుపాలెం గ్రామాల్లో ప్రయోగాత్మకంగా చేపడుతున్న త్రీడీ కాంక్రీట్ ప్రింటింగ్ గృహనిర్మాణ ప్రాజెక్టును గ్రామీణ గృహనిర్మాణ రంగం ఆధునికీకరణలో కీలక ఘట్టంగా ఆయన అభివర్ణించారు. మొత్తం ₹14 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టుతో నిర్మాణ సమయం, ఖర్చులు, శ్రామిక అవసరాలు గణనీయంగా తగ్గుతాయని శ్రీ చౌహాన్ చెప్పారు. అత్యాధునిక యంత్రాలు, త్రీడీ కాంక్రీట్ ప్రింటింగ్ సాంకేతికతతో 177 ఇళ్ల నిర్మాణం 6 నెలల్లో పూర్తవుతుందని అంచనా. సంప్రదాయ నిర్మాణ పద్ధతులతో పోలిస్తే, వీటి దృఢత్వం ఎక్కువని, దీర్ఘకాలిక మన్నికతో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
అమరావతి.. పోలవరం.. మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం మద్దతు
రాష్ట్ర రాజకీయ-పురోగమన చరిత్రను ప్రస్తావిస్తూ- 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని రహిత రాష్ట్రంగా మిగిలిందని శ్రీ చౌహాన్ గుర్తుచేశారు. అమరావతిని రాష్ట్ర ఏకైక శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ మోదీ ప్రభుత్వం పార్లమెంటులో చట్టం చేసిందని ఆయన గుర్తుచేశారు అంతేకాకుండా దాని అభివృద్ధి కోసం ₹15,000 కోట్ల ప్రత్యేక ఆర్థిక సహాయం కూడా అందించిందని తెలిపారు. రాష్ట్రానికి జీవనాడి వంటి పోలవరం సాగునీటి ప్రాజెక్టును కూడా ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. గత ప్రభుత్వ హయాంలో తీవ్ర జాప్యానికి గురైన ఈ ప్రాజెక్టు నేడు కేంద్రం నుంచి 100 శాతం గ్రాంటుతో వేగంగా సాగుతోందని చెప్పారు. మరోవైపు ప్రతిపాదిత అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం రవాణా అనుసంధానాన్ని మరింత బలోపేతం చేయడమే కాకుండా రాష్ట్ర ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తుందన్నారు.
‘అన్నదాత సుఖీభవ’తో రైతుకు ఆదాయ వృద్ధి… 60 లక్షల మందిని ‘లఖ్‌పతి దీదీ’లుగా మార్చడమే లక్ష్యం
అన్నదాత ఆదాయం పెంపు దిశగా రాష్ట్ర ప్రభుత్వ కృషిని వివరిస్తూ- ‘పీఎం-కిసాన్’ పథకం కింద కేంద్రం ఇస్తున్న ₹6,000కు ఆంధ్రప్రదేశ్ ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద మరో ₹14,000 జోడించడంతో రైతులకు ఏటా ₹20,000 మేర ఆర్థిక భరోసా లభిస్తున్నదని శ్రీ చౌహాన్ పేర్కొన్నారు. పండ్లు, పూలు, కూరగాయలు, ఔషధ మొక్కల సాగుపై దృష్టి సారించడం ద్వారా దేశంలోనే అగ్రగామి ఉద్యాన (హార్టికల్చర్) కూడలిగా ఎదిగే సామర్థ్యం తనకున్నదని ఆంధ్రప్రదేశ్ చాటుతున్నట్లు ఆయన చెప్పారు. మహిళల ఆర్థిక సాధికారతను ప్రస్తావిస్తూ- ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే 23 లక్షల మంది మహిళలు స్వయం సహాయ సంఘాల ద్వారా ‘లఖ్‌పతి దీదీ’లుగా ఎదిగారని కేంద్ర మంత్రి తెలిపారు. జీవనోపాధి అవకాశాల విస్తరణ, మహిళల ఆర్థిక స్వేచ్ఛ బలోపేతం ద్వారా వీరి సంఖ్యను 60 లక్షలకు పెంచాలని ‘ఎన్‌డీఏ’ ప్రభుత్వం లక్ష్యనిర్దేశం చేసుకున్నదని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో అక్టోబరు 15న జాతీయ ‘సరస్ మేళా’ నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. దేశ రాజధాని ఢిల్లీ వెలుపల ఈ కార్యక్రమ నిర్వహణ ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ప్రారంభిస్తారు. మహిళల సారథ్యంలోని స్వయం సహాయ సంఘాలు తమ ఉత్పత్తులను ప్రదర్శించడంతోపాటు మార్కెట్ అవకాశాలను విస్తరించుకునేందుకు ఇదొక వేదికగా నిలుస్తుంది.
“నేను మధ్యప్రదేశ్‌కే కాదు... ఆంధ్రప్రదేశ్ ప్రజలకూ ‘మామ’నే: తెలుగులో ప్రజలను పలకరించిన శ్రీ చౌహాన్
‘భారత్ మాతా కీ జై’, ‘శ్రీ వేంకటేశ్వర భగవాన్ కీ జై’ నినాదాలతో శ్రీ చౌహాన్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ముందుగా సభికులను తెలుగులో పలకరిస్తూ ఆంధ్రప్రదేశ్ సుసంపన్న వారసత్వం, జ్ఞానం, శాస్త్రవిజ్ఞాన విజయాలు, ప్రతిభను ఆయన కొనియాడారు. తెనాలి రామకృష్ణుడు వంటి కవి పుంగవుడు నడియాడిన ఈ నేలకు నివాళి అర్పిస్తూ- తేనెకన్నా మధురమైన తెలుగు భాషకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభిస్తున్నదని చెప్పారు. ఈ సందర్భంగా తెలుగులో మాట్లాడుతూ- “నేను మధ్యప్రదేశ్‌కే కాదు… ఆంధ్రప్రదేశ్ ప్రజలకూ ‘మామ’నేనని చమత్కరించారు. “ప్రజా సేవ నాకు దైవారాధనతో సమానం. ఇక్కడి ప్రజల ఉత్సాహం, నిజాయితీ, అంకితభావం చూశాక మిమ్మల్ని మళ్లీమళ్లీ కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అన్నారు. దీంతో ప్రజలంతా ఆనందోత్సాహాలతో పెద్దపెట్టున స్పందిస్తూ కరతాళ ధ్వనులు చేశారు.
చంద్రబాబు నాయకత్వం.. ప్రజలతో శ్రీ పెమ్మసాని క్షేత్రస్థాయి అనుబంధంపై చౌహాన్ ప్రశంసలు
కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ శ్రీ చంద్రశేఖర్ పెమ్మసాని తన పూర్వికుల గ్రామం బుర్రిపాలెంను సందర్శించడం తనకు అపరిమిత ఆనందం కలిగించిందని శ్రీ చౌహాన్ అన్నారు. ప్రజా సేవపై శ్రీ పెమ్మసాని నిబద్ధతను, క్షేత్రస్థాయిలో ప్రజలతో ఆయనకుగల అనుబంధాన్ని ప్రశంసించారు. అమెరికా నుంచి తిరిగి వచ్చిన వ్యక్తికి గ్రామీణ జీవితం, అభివృద్ధి ఏ మాత్రం అర్థమవుతాయన్న సందేహం తనలో ఉండేదన్నారు. “అయితే, ప్రజలతో ఆయనకున్న సన్నిహిత బంధం, సేవా స్ఫూర్తి, లక్ష్య సాధనలో స్పష్టత వంటి సుగుణాలు నన్నెంతో ప్రభావితం చేశాయి. ప్రతిభను గుర్తించడమే కాకుండా వారిని ప్రజా జీవనంలోకి తేవడంలో శ్రీ చంద్రబాబు సామర్థ్యం అపారం.. అద్భుతం” అని ఆయన వ్యాఖ్యానించారే. ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబును చురుకైన, అంకితభావం గల, నిర్ణయాత్మక నేతగా అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్‌ను ఒక ప్రధాన ఐటీ కూడలిగా తీర్చిదిద్దిన ఘనత ఆయనదేనని శ్రీ చౌహాన్ కొనియాడారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం టెక్నాలజీ, డేటా సెంటర్లు, అత్యాధునిక తయారీ రంగాలకు అమరావతిని కూడలిగా రూపుదిద్దడంలో శ్రీ నాయుడు దార్శనికతే సారథ్యశక్తిగా ఉందన్నారు.
గృహనిర్మాణానికి కేంద్రం మద్దతుపై శ్రీ చంద్రబాబు కృతజ్ఞతలు
రాష్ట్రంలో పేదలకు గృహనిర్మాణంపై కేంద్రం మద్దతుకు ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను మధ్యప్రదేశ్ ప్రజలకే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలకూ ఆత్మీయుడైన ‘మామ’గా అభివర్ణించారు. “శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్‌లో సుపరిపాలన, ప్రజాసేవ ద్వారా అద్భుత రికార్డు సృష్టించిన ప్రజా నాయకుడు. ఆంధ్రప్రదేశ్‌లోని పేదలకు పక్కా ఇళ్ల అంశాన్ని మేం ప్రస్తావించగానే- కేటాయింపును 75,000 నుంచి ఏకంగా 3 లక్షలకు పెంచి ప్రజల హృదయాలను గెలుచుకున్నారు” అని ప్రశంసించారు. ప్రతి పేద కుటుంబానికీ పక్కా గృహవసతి కల్పన దిశగా ఎన్‌డీఏ ప్రభుత్వం నిబద్ధతతో ఉందన్నారు. ఇందుకోసం రాష్ట్రానికి 9 లక్షల గృహాలు అవసరమని ఆయన గుర్తుచేశారు. దీనిపై శ్రీ చౌహాన్ హామీ ఇవ్వడాన్ని ప్రస్తావిస్తూ- తొలి దశ పూర్తికాగానే మిగిలిన 6 లక్షల గృహాలకూ కేంద్రం ఆమోద ముద్ర వేస్తుందని విశ్వసిస్తున్నట్లు శ్రీ నాయుడు చెప్పారు. రాష్ట్ర ప్రగతి వేగంపై విశ్వాసం వ్యక్తం చేస్తూ- ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్గనిర్దేశంలో, శ్రీ చౌహాన్ నిరంతర మద్దతుతో మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, అత్యాధునిక సాంకేతికతలు, గ్రామీణాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా నిలవగలదని ఆయన ఆశాభావం వెలిబుచ్చారు.
*****
(రిలీజ్ ఐడి: 2318925)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11