ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారతదేశపు మొదటి వాష్-కేంద్రీకృత సామాజిక బాండును నమోదు చేసిన నాబ్‌కిసాన్: రూ.180 కోట్ల సమీకరణ

నాడు పోస్టు చేయడమైనది: 03 OCT 2026 12:01PM by PIB Hyderabad

జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్ (నాబార్డ్) అనుబంధ సంస్థ అయిన నాబ్‌కిసాన్ ఫైనాన్స్ లిమిటెడ్... నీరు, పారిశుధ్యం, పరిశుభ్రత (వాష్) రంగానికి ప్రత్యేకించిన దేశంలోనే తొలి సామాజిక బాండ్లను 2026 అక్టోబర్ 1న ముంబైలోని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో నమోదు చేసింది.

 

ఈ బాండ్ల ఇష్యూకి మదుపర్ల నుంచి భారీ స్పందన లభించింది. మొత్తంగా 1.8 రెట్లు స్పందన దక్కింది. ఫలితంగా నాబ్‌కిసాన్ రూ.180 కోట్లను సమీకరించింది. అయిదేళ్ల కాలవ్యవధికి గాను బాండ్లకు 8.10 శాతం కూపన్ రేటు లభిస్తుంది. ఇది 2031 సెప్టెంబర్ నాటికి మెచ్యూర్ అవుతుంది. దీనికి క్రిసిల్, కేర్‌ సంస్థలు అత్యధిక దేశీయ క్రెడిట్ రేటింగ్ అయిన ఏఏఏ (స్థిరం)ను కేటాయించాయి. వీటి ద్వారా సమీకరించిన నిధులను గ్రామీణ, వెనకబడిన ప్రాంతాల్లో సురక్షితమైన తాగునీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రతా సౌకర్యాలను మరింత అందుబాటులోకి తీసుకొచ్చేలా విస్తరించేందుకు ఉపయోగిస్తారు. తద్వారా ఆరోగ్యం, జీవనోపాధి, జీవన నాణ్యత మెరుగవుతాయి.

 

నాబార్డ్, నాబ్‌కిసాన్, వాటర్.ఓఆర్‌జీ, ట్రస్ట్ గ్రూప్, ఎన్ఎస్ఈ ప్రతినిధులు ఈ నమోదు కార్యక్రమంలో ప్రసంగించారు. అనంతరం గంట మోగించి లిస్టింగును అధికారికంగా ప్రారంభించారు.

కీలకమైన అభివృద్ధి ప్రాధాన్యాలను పరిష్కరించడంలో వినూత్న ఆర్థిక విధానాల సామర్థ్యాన్ని విజయవంతమైన వాష్ బాండ్ల జారీ తెలియజేస్తోందని నాబార్డ్ ఛైర్మన్ డాక్టర్ షాజీ కృష్ణన్ వి అన్నారు. నీరు, పారిశుద్ధ్యం మరింత అందుబాటులోకి తీసుకురావడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యాన్ని, జీవనోపాధిని, జీవన నాణ్యతను మెరుగుపరచవచ్చని తెలియజేశారు. అదే సమయంలో ఇలాంటి ప్రాజెక్టులను లాభదాయకంగా మార్చడంలోనూ, వాణిజ్య, మూలధన మార్కెట్ల నుంచి విస్తృత భాగస్వామ్యాన్ని ఆకర్షించడంలోనూ అభివృద్ధి సంస్థలు ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాయని తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో నాబ్‌కిసాన్ ఎండీ, సీఈవో శ్రీ ఇమ్మానువేల్ గణేశన్ ప్రసంగించారు. అభివృద్ధి రంగాలకు మూలధన మార్కెట్లు నిధులను సమీకరించే విధానాన్ని, వాటి ద్వారా సాధించే సామాజిక ప్రభావాన్ని వాష్ బాండ్లు తెలియజేస్తున్నాయన్నారు. సమ్మిళితమైన, సుస్థిరమైన గ్రామీణాభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడంలో సుస్థిర ఆర్థిక వ్యవస్థపై పెరుగుతున్న విశ్వాసాన్ని మదుపర్ల నుంచి వచ్చిన భారీ స్పందన ప్రతిబింబిస్తోంది.

 

సాంకేతిక సలహాదారుగా, విజ్ఞాన భాగస్వామిగా వ్యవహరిస్తున్న వాటర్.ఓఆర్‌జీ, మార్కెట్ సంస్థలు, అడ్వైజర్లు, ట్రస్టీలు, అరేంజర్లతో సహా విస్తృత స్థాయిలో భాగస్వాములు ఈ బాండ్ల లిస్టింగుకు సహకారం అందించారు.

 

వాష్ రంగానికి చెందిన సామాజిక బాండ్‌ను భారత్‌లోనే తొలిసారిగా లిస్ట్ చేయడం ద్వారా... సుస్థిరమైన, సమ్మిళితమైన గ్రామీణాభివృద్ధికి దోహదపడే వినూత్న ఆర్థిక పరిష్కారాలను ప్రోత్సహించడంతో పాటు, దేశీయ సుస్థిర ఆర్థిక విపణిని మరింత పటిష్టం చేసేందుకు తమ నిబద్ధతను నాబార్డ్, నాబ్‌కిసాన్ పునరుద్ఘాటించాయి.

****


(రిలీజ్ ఐడి: 2318643) సందర్శకుల సూచీ సంఖ్య : : 3
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , Urdu , Marathi