సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
కథనాలు, సినిమా, అంతర్జాతీయ స్వరాల ఉత్సవం: మీడియా ప్రతినిధులను గోవాకు ఆహ్వానిస్తోన్న ఇఫి 2026.. అక్రిడిటేషన్ల నమోదు ప్రారంభం
గోవాలోని పనాజీలో మరోసారి సినీ సందడి మొదలుకానుంది. 2026 నవంబర్ 20 నుంచి 28 వరకు 57వ అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవం (ఇఫి) నిర్వహించనున్నారు. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దర్శకులు, సినీ రంగ నిపుణులు, జర్నలిస్టులు, సినీ అభిమానులను ఈ ఉత్సవం ఒకే వేదికపైకి తీసుకురానుంది. విభిన్న కథలు, సినిమాల ద్వారా చెప్పే భిన్నమైన భావాలు, వివిధ సంస్కృతుల ప్రేక్షకులను అనుసంధానించే సృజనాత్మకతను ఇఫి వేడుకగా జరుపుకోనుంది.
సినీ ప్రదర్శనలు, చర్చలు, దర్శకులు, చిత్ర ప్రముఖులతో ముఖాముఖి కార్యక్రమాలు, పరస్పర పరిచయాలు, నెట్‌వర్కింగ్ అవకాశాలు వంటి కార్యక్రమాల ద్వారా విభిన్న కథలు, దృక్కోణాలను ఇఫి ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. తద్వారా ఆలోచనలు, సంభాషణలు, భాగస్వామ్యాలకు ఒక క్రియాశీల వేదికను అందిస్తుంది. ఈ సినీ వేడుకలకు గోవా సిద్ధమవుతున్న వేళ.. ప్రపంచ చలనచిత్ర రంగానికి చెందిన వ్యక్తుల మధ్య సృజనాత్మక ఆలోచనలు, అర్థవంతమైన చర్చలు, పరస్పర సహకారానికి ఇఫి ప్రత్యేక వేదికగా నిలవనుంది.
ప్రతి ఏడాది ఇఫికి విస్తృత ప్రచారం, ఆదరణ తీసుకురావడంలో మీడియా ప్రతినిధులు కీలకంగా వ్యవహరిస్తుంటారు. వార్తా కథనాలు, ఇంటర్వ్యూలు, సమీక్షలు, ప్రత్యేక కథనాలు, డిజిటల్ కవరేజీ ద్వారా ఉత్సవంలోని సినిమాలు, కార్యక్రమాలు, చర్చలను భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు మీడియా చేరువ చేస్తుంది. విభిన్న కళాకారులు, వారి కళా ప్రతిభను ప్రజలకు పరిచయం చేయడంలోనూ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇఫిలో మీడియా ప్రతినిధుల నిరంతర భాగస్వామ్యాన్ని నిర్వాహకులు ఎంతో విలువైనదిగా భావిస్తున్నారు. మీడియా ద్వారా ఇఫిపై మరింత విస్తృత అవగాహన ఏర్పడటంతో పాటు, ఈ చలనచిత్రోత్సవం, సృజనాత్మక కళారూపాలపై ప్రజల భాగస్వామ్యం కూడా పెరుగుతుంది.
అక్టోబర్ 1న మీడియా అక్రిడిటేషన్ నమోదు ప్రారంభం
2026లో జరగనున్న 57వ అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవాన్ని కవర్ చేయాలనుకునే మీడియా ప్రతినిధులు అధికారిక పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ) అక్రిడిటేషన్ వేదిక ద్వారా https://accreditation.pib.gov.in/eventregistration/login.aspx మీడియా ప్రతినిధిగా నమోదు చేసుకోవచ్చు.
మీడియా అక్రిడిటేషన్ కోసం నమోదు ప్రక్రియ 2026 అక్టోబర్ 1న ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 15, 2026 చివరి తేదీ.
అక్రిడిటేషన్ పొందిన మీడియా ప్రతినిధులకు ఉత్సవంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. వీటిలో
· సినిమా ప్రదర్శనలు,
· ప్యానెల్ చర్చలు,
· దర్శకులు, సినీ రంగ నిపుణులతో ముఖాముఖి కార్యక్రమాలు,
· నెట్‌వర్కింగ్ అవకాశాలు
· చిత్రోత్సవానికి సంబంధించిన ఇతర కార్యక్రమాలు ఉంటాయి.
మీడియా ప్రతినిధులు దరఖాస్తు చేసుకునే ముందు అక్రిడిటేషన్ మార్గదర్శకాలను పూర్తిగా చదవాలని సూచించారు. దరఖాస్తుదారులు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రం, వృత్తిపరమైన వివరాలు, ప్రస్తుత ఫోన్ నంబర్, ఈమెయిల్ చిరునామాతో పాటు వేదికలో కోరిన ఇతర అవసరమైన పత్రాలను సమర్పించాలి.
వివరణాత్మక అర్హత ప్రమాణాలు, మీడియా అక్రిడిటేషన్ విధానానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చూడవచ్చు..
అవసరమైన పత్రాలు
· ఫొటో
· ప్రభుత్వ గుర్తింపు పత్రం
· పీఐబీ లేదా రాష్ట్ర ప్రభుత్వ అక్రిడిటేషన్ కార్డు లేదా సంస్థ గుర్తింపు కార్డుతోపాటు ఎడిటర్ లేఖ
· సంబంధిత రంగంలో పనిచేస్తున్నట్లు రుజువు
ముఖ్యమైన సమాచారం
· చలనచిత్రోత్సవం: 57వ అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవం (ఇఫి)
· వేదిక: పనాజీ, గోవా
· మీడియా అక్రిడిటేషన్ ప్రారంభం: 2026 అక్టోబర్ 1
· మీడియా అక్రిడిటేషన్ ముగింపు: 2026 అక్టోబర్ 15
· అక్రిడిటేషన్ వేదిక: https://accreditation.pib.gov.in/eventregistration/login.aspx
· సహాయ ఈమెయిల్: iffi.mediadesk@pib.gov.in
ఇఫి 56వ విడత కోసం గతంలో వేదికలో నమోదు చేసుకున్న మీడియా ప్రతినిధులు, అదే లాగిన్ వివరాలతో లాగిన్ అయి, అవసరమైన పత్రాలను అప్‌డేట్ చేసుకోవచ్చు.
మీడియా ప్రతినిధులు వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసియాలో ప్రముఖ చలనచిత్రోత్సవాల్లో ఒకటైన ఇఫిలో పాల్గొని, ప్రపంచ సినిమా రంగాన్ని తీర్చిదిద్దుతున్న ప్రముఖులతో పరిచయం ఏర్పరుచుకోవడంతో పాటు, తెర వెనక జరిగే విభిన్నకథలను తెలుసుకునే అవకాశం లభిస్తుంది. అలాగే సినిమా నిర్మాణం, సృజనాత్మకత, సంస్కృతికి సంబంధించిన ఉత్సాహభరితమైన ఇఫి వేడుకలో భాగస్వాములు కావచ్చు. మొదట నమోదు చేసుకున్న 50 మందికి 2026 నవంబర్ 19న పనాజీలో నిర్వహించే ఫిల్మ్ అప్రిషియేషన్ వర్క్‌షాప్‌లో ఉచితంగా పాల్గొనే అవకాశం లభిస్తుంది.
మీడియా ప్రతినిధులు కాకపోయినా సినిమాలను ఇష్టపడే వారు కూడా ఇఫికి ప్రతినిధులుగా నమోదు చేసుకోవచ్చు. ఇందుకోసం https://www.iffigoa.org/delegate-registration ద్వారా నమోదు చేసుకుని, 57వ ఇఫి 2026లో ప్రదర్శించే విభిన్న సినిమాలు, ఇతర కార్యక్రమాలను ఆస్వాదించవచ్చు.
ఇఫి గురించి
1952లో ప్రారంభమైన అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవం (ఇఫి) దక్షిణాసియాలోనే అత్యంత పురాతనమైన, అతిపెద్ద చలనచిత్ర వేడుకల్లో ఒకటి. భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎణ్ఎఫ్‌డీసీ), గోవా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీ ఆఫ్ గోవా (ఈఎస్‌జీ) సంయుక్తంగా ఇఫిని నిర్వహిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ దర్శకులు, సినీ దిగ్గజాలు, కొత్తగా ఎదుగుతున్న ప్రతిభావంతులను ఈ వేడుక ఒకే వేదికపైకి తీసుకువస్తుంది. అంతర్జాతీయ పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, మాస్టర్‌క్లాసులు, ప్రముఖులకు నివాళులతోపాటు విభిన్న కథలు, భాషలు, సినిమా సంప్రదాయాలను గోవా ప్రాంగణంలో ఈ చలనచిత్రోత్సవం ఘనంగా నిర్వహించుకోనుంది. 56వ ఇఫి 2026కి సంబంధించిన మరింత సమాచారం, తాజా వివరాల కోసం https://www.iffigoa.org/ వెబ్‌సైట్‌ను సందర్శించండి.
***
(రిలీజ్ ఐడి: 2318309)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam