ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

యూపీఎస్సీ శతాబ్ది ఉత్సవాలకు హాజరైన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ

· యూపీఎస్సీ వందేళ్లు పూర్తిచేసుకోవడం గర్వించదగ్గ మైలురాయి... పాలనలో, ప్రజా సేవలో శతాబ్ద కాలంగా యూపీఎస్సీది కీలక పాత్ర

· యూపీఎస్సీ వందేళ్ల వేడుక మాత్రమే కాదు- గొప్ప వారసత్వ పరంపరా ఉత్సవమిది... ఏటా లక్షలాది మంది యువత తమలో నిలుపుకొనే ఆకాంక్షల వేడుక ఇది

· ప్రతి భారతీయుడికీ ఈ సంస్థపై ఉన్న విశ్వాసానికి నిదర్శనం ఈ ఉత్సవం

· రెండు కీలక సూత్రాలను మనమెల్లప్పుడూ గుర్తుంచుకోవాలి... ఒకటి - దేశం ప్రథమం, మరొకటి - పౌరుడే ప్రథమం

· ప్రభుత్వ పదవి పట్ల కాకుండా, ప్రజా సేవ పట్ల అంకితభావం కలిగిన యువతను ప్రభుత్వ ఉద్యోగాల్లోకి తీసుకురావాలి

· అభ్యర్థికి ఏమేం తెలుసో పరీక్షించడానికే పరిమితం కావద్దు... యువత సివిల్ సర్వీసుల్లో ఎందుకు చేరాలనుకుంటున్నారో కూడా నియామక పరీక్షలో పరిశీలించాలి

· ‘నాగరిక దేవోభవ’… ఇదే మనకు మంత్రప్రదం: ప్రజలే మనకు దైవం

· ప్రజా సేవే మనకు అత్యున్నతం

· నేటి 21వ శతాబ్దపు భారత్ నూతన పని సంస్కృతితో ముందుకు సాగుతోంది... ప్రజా అనుకూల, క్రియాశీల, సుపరిపాలనే దీనికి మూల సూత్రం

· ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ

నాడు పోస్టు చేయడమైనది: 01 OCT 2026 1:46PM by PIB Hyderabad

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈ రోజు నిర్వహించిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. శతాబ్ది ఉత్సవాల వెనుక ఉన్న ఘనమైన వారసత్వాన్ని ప్రధానమంత్రి తన ప్రసంగంలో గుర్తుచేశారు. నిజానికి లక్షలాది యువత ఆశయాలకు, ప్రతి భారతీయుడికీ ఆ సంస్థపై ఉన్న అచంచలమైన విశ్వాసానికి ఈ వందేళ్ల వేడుక నిదర్శనమని ప్రధానమంత్రి కొనియాడారు. తరాలు, ప్రభుత్వాలు, సాంకేతికతలు, సిలబస్‌లు మారుతున్నా... యూపీఎస్సీ విశ్వసనీయతను నిలబెట్టుకున్న తీరును ఆయన ప్రశంసించారు. ఈ సందర్భంగా ప్రత్యేక స్మారక పోస్టల్ స్టాంపును, స్మారక నాణేన్ని, 100 కీలక తీర్పుల సంకలనాన్ని ఆవిష్కరించడంపై శ్రీ మోదీ హర్షం వ్యక్తం చేశారు.

స్వాతంత్ర్యానంతరం పెద్దపెద్ద సవాళ్లు దేశం ఎదుట నిలిచిన తీరును గుర్తుచేశారు. స్వాతంత్య్రాన్ని కాపాడుకోవడానికే కాకుండా, నూతనంగా రూపుదిద్దుకున్న దేశంలో సమర్థ పాలనను అందించడం లక్ష్యంగా అత్యంత కీలకమైన ఈ ఉక్కు చట్రాన్ని ఏర్పాటు చేసిన సర్దార్ వల్లభభాయ్ పటేల్‌ను ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రత్యేకంగా స్మరించుకున్నారు. స్వతంత్ర భారతదేశానికి కీలకమైన మూలాధారంగా ఈ సంస్థను తీర్చిదిద్ది... సశక్తంగా మలిచిన సర్దార్ పటేల్ కృషిని ఆయన ప్రశంసించారు. ‘‘దేశ పునర్నిర్మాణానికి అత్యావశ్యకమైన ఉక్కు చట్రాన్ని సర్దార్ పటేల్ అందించారు’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

1926లో బ్రిటిష్ పాలన కాలంలో ఈ సంస్థ ఏర్పడిన విధానానికి, స్వాతంత్య్రానంతరం యూపీఎస్సీ పరిణామ క్రమానికి నడుమ స్పష్టమైన వ్యత్యాసముందని ప్రధానమంత్రి అన్నారు. స్వేచ్ఛాయుతమైన స్వతంత్ర భారత స్వప్నాలను సాకారం చేసే దిశగా తన ప్రాధాన్యాలను ఈ వ్యవస్థ విజయవంతంగా మలచుకుందన్నారు. చరిత్రాత్మకంగా యూపీఎస్సీ అత్యుత్తమంగా బాధ్యతలు నిర్వర్తించిందని, ఇక దేశం ముంగిట నిలిచిన రాబోయే 25 ఏళ్ల కీలక భవిష్యత్తుపై ఇప్పుడు ప్రధానంగా దృష్టి సారించాలని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘అందుకే, ఈ రోజు నా ప్రసంగంలో ఈ అంశంపైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నాను’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

వికసిత భారత్ సాధనలో ఎంపిక కమిషన్ల పాత్ర అత్యంత కీలకమైనదని వివరిస్తూ... ఈ రోజు నియమితులయ్యే యువత ఏకకాలంలో దేశ భవితను మలిచే శిల్పులుగాను, ప్రథమ లబ్ధిదారులుగాను ఉంటారని ప్రధానమంత్రి అన్నారు. దేశానికి, ప్రజలకు ప్రథమ ప్రాధాన్యమిచ్చే రెండంచెల ప్రాతిపదికన ప్రతి ఎంపిక ప్రక్రియలోనూ నిశితమైన పరీక్షలు ఉండాలని ఆయన నిర్దేశించారు. ‘‘ఈ భావన నిండిన అభ్యర్థులు ఎంపికైతే.. జాతీయ లక్ష్యాలను సాధించడం మరింత సహజంగా, సులభంగా మారుతుంది’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

2047 నాటికి రూపుదిద్దుకోబోతున్న అత్యంత విభిన్నమైన సామాజిక - ఆర్థిక ముఖచిత్రాన్ని వివరిస్తూ... గ్రామీణ - పట్టణ వ్యత్యాసాలు తగ్గిపోతూ శరవేగంగా పట్టణీకరణ చెందుతున్న మన దేశంలో యువత ఆకాంక్షలు భారీగా పెరుగుతాయని ప్రధానమంత్రి వివరించారు. కృత్రిమ మేధ ఆధారంగా సత్వర, కచ్చితమైన పరిష్కారాలను ప్రజలు డిమాండ్ చేస్తున్న నేటి డిజిటల్ ప్రపంచంలో... ఆ వేగానికి అనుగుణంగా సేవలందించే పాత పద్ధతులు కూడా పరివర్తన చెందాలని ఆయన హెచ్చరించారు. ‘‘మారుతున్న ఈ ధోరణికి అనుగుణంగా మన సివిల్ సర్వీసుల్లో కూడా నూతన మార్పులు అనివార్యం’’ అని శ్రీ మోదీ అభిప్రాయపడ్డారు.

ఉద్యోగ నియామకాల దృక్పథంలో ప్రాథమిక మార్పులు రావాలని చెబుతూ... కేవలం అభ్యర్థుల విద్యా విషయక పరిజ్ఞానాన్ని మాత్రమే కాకుండా, వారిలోని అంతర్గత ప్రేరణను కూడా ఎంపిక ప్రామాణికాలతో అంచనా వేయాలని ప్రధానమంత్రి సూచించారు. దీనివల్ల అభ్యర్థులు కేవలం అధికారం పట్ల కాకుండా, ప్రజాసేవ పట్ల అంకితభావంతో ముందుకొస్తారని ఆయన వివరించారు. సరైన అంతర్గత ప్రేరణ ఉన్న వ్యక్తులను ఎంపిక చేయడం వల్ల.. అధికార యంత్రాంగాన్ని, శరవేగంగా మారుతున్న ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మలచడం సులభతరమవుతుందన్నారు. ‘‘అందుకే భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మన ఎంపిక ప్రమాణాలను, నియామక ప్రక్రియను మనం మార్చుకోవాలి’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.  

కొత్తగా సివిల్ సర్వీసెస్‌లోకి వచ్చిన అధికారులతో వ్యక్తిగత అనుభవాలను పంచుకుంటూ... భవిష్యత్తులో సవాళ్లు, బాధ్యతలు పెరిగినప్పుడు తమను తాము సరిచూసుకునేలా ట్రైనీ అధికారులు ప్రాథమిక ఉద్దేశాలను రాసి పెట్టుకోవాలని ప్రధానమంత్రి సూచించారు. అభ్యర్థుల కోసం ఇలాంటి ఆత్మపరిశీలనా పద్ధతులను నెలకొల్పాలని యూపీఎస్సీ, రాష్ట్ర సర్వీస్ కమిషన్లను ప్రోత్సహించారు. "యూపీఎస్సీ, రాష్ట్ర కమిషన్లు కూడా ఇటువంటి వ్యవస్థ అభివృద్ధి గురించి యోచించాలి" అని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

గతంలోని 'మాయ్-బాప్' పాలనా విధానాన్ని విడనాడుతూ... 'నాగరిక్ దేవో భవ' సూత్రం ఆధారంగా ఆధునిక పాలనా యుగానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు. ప్రజాసేవే అన్నింటికంటే సర్వోన్నతమైనదని, అదే 21వ శతాబ్దపు పరిపాలనకు కీలక ఆధారమని అన్నారు. "దేశ పౌరుడు దేవుడి కంటే ఏమాత్రం తక్కువ కాదు" అని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

ఆధునిక పరిపాలనలో నూతన పని సంస్కృతి గురించి చెబుతూ... 21వ శతాబ్దపు భారతదేశం పూర్తిగా సరికొత్త కార్యాచరణ స్ఫూర్తితో ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి తెలిపారు. ఈ నూతన శకం ప్రాథమిక సూత్రాలు పూర్తిగా మూడు ప్రధాన అంశాలపై ఆధారపడి ఉన్నాయని చెప్పారు. "ప్రజా అనుకూల, ముందస్తుగా స్పందించగల, మెరుగైన పరిపాలన అనే మూడు ప్రాథమిక సూత్రాలు" అని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.

ఈ ప్రాథమిక పాలనా సూత్రాలను మరింత వివరిస్తూ... జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో ఎంపిక ప్రక్రియలు ఎలాంటి అనవసరమైన ఒత్తిళ్లు, ప్రభావాలకు లోనుకాకుండా, సమస్యలను ముందుగానే ఊహించి పనిచేసే నిపుణులను ఎంపిక చేసేలా అత్యంత పకడ్బందీగా రూపొందించుకోవాలని ప్రధానమంత్రి కోరారు. సమస్యలకు వినూత్న పరిష్కారాలను చూపుతూ, ప్రజల జీవనశైలిని సులభతరం చేస్తూ, చట్టాలు ప్రజలపై చూపే ప్రభావాన్ని నిశితంగా అంచనా వేసే సానుభూతిపరులైన సివిల్ సర్వెంట్ల అవసరాన్ని తెలిపారు. "కఠినమైన సమస్యల నుంచి వినూత్న మార్గాల ద్వారా బయటపడే నిపుణులను మనం దేశానికి అందించాలి" అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

సమాజం ఎదుర్కొంటున్న సాంకేతిక సవాళ్లను ప్రస్తావిస్తూ... ఇన్ఫర్మేషన్ వార్‌ఫేర్, డీప్‌ఫేక్‌లు, అల్గారిథమిక్ వివక్ష, పర్యావరణ సమతుల్యత వంటి సరికొత్త రణరంగాలను భవిష్యత్ సివిల్ సర్వెంట్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రధానమంత్రి హెచ్చరించారు. అభ్యర్థుల దూరదృష్టికి, క్లిష్టమైన సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలకు ప్రాధాన్యతనిస్తూ, ఈ ప్రపంచ మార్పులకు తగినట్లుగా మారాలని నియామక సంస్థలను ఆదేశించారు. "ఇటువంటి పరిస్థితుల్లో ఎంపిక ప్రక్రియలో మనం క్లిష్టమైన సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని, దూరదృష్టిని పరీక్షించటానికే అధిక ప్రాధాన్యతనివ్వాల్సి ఉంటుంది" అని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

పాలనాపరమైన సంస్కరణల ఆవశ్యకతను తెలియజేస్తూ... పరీక్షల నిర్వహణ సంస్థలు దేశ విస్తృత సంస్కరణల ధోరణకి అనుగుణంగా వేగంగా మారాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ప్రమాణాలను తగ్గించకుండా పరీక్షా ప్రక్రియను వేగవంతం చేయాలని, దీని కోసం 'నిర్దిష్ట కాలపరిమితి' సూత్రం పాటించాలన్నారు. సుదీర్ఘంగా సాగే పరీక్షల సమయం వల్ల కుటుంబాలపై కోచింగ్ ఫీజులు, అద్దెలు, రవాణా వంటి తీవ్రమైన ఆర్థిక భారం పడుతుందన్నారు. పరీక్షా ప్రక్రియల కాలాన్ని కుదించటం కేవలం పరిపాలనాపరమైన అంశం మాత్రమే కాక ప్రాథమికమైన సమన్యాయ సంస్కరణగా మారుతుందన్నారు. “ఇది ఒక సామాజిక సమన్యాయ సంస్కరణ అవుతుంది” అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

వ్యవస్థాపక సంస్థాగత సామర్థ్యాన్ని క్రమపద్ధతిలో పెంపొందించటాన్ని ప్రోత్సహిస్తూ, రాష్ట్ర కమిషన్లు ఉత్తమ పద్ధతులను పంచుకునే జాతీయ సదస్సులను ప్రధానమంత్రి ప్రశంసించారు. అంతర్జాతీయ ప్రమాదాలను అధ్యయనం చేయటం ద్వారా, సాంకేతిక సామర్థ్యంపై దృష్టి పెట్టడం ద్వారా ఈ వేదికలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా పాల్గొంటున్న యువతకు ఎంతో ఉపశమనాన్ని, స్పష్టతను అందించేందుకు పరస్పర అభ్యాసం, విధానాలను ప్రామాణీకరించటం ముఖ్యమని సూచించారు. "ఈ పరస్పర అభ్యాస ప్రక్రియ యూపీఎస్సీకి, ప్రతి రాష్ట్రంలోని సెలక్షన్ కమిషన్లకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది" అని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.

నిరంతర సంస్థాగత వృద్ధి అవసరమని స్పష్టం చేస్తూ... యూపీఎస్సీ, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లు సామర్థ్యాలను పెంపొందించుకోవటంపై దృష్టి సారించాలని ప్రధానమంత్రి సూచించారు. సివిల్ సర్వీసుల జాతీయ మిషన్ ద్వారా ఇప్పటికే ఏర్పాటైన డిజిటల్ మౌలిక సదుపాయాలను విస్తృతంగా వినియోగించుకోవాలని సిఫార్సు చేశారు. “మిషన్ కర్మయోగి ద్వారా రూపొందించిన ఐ-గాట్ వేదికను ఇందుకోసం ఉపయోగించుకోవచ్చు” అని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

అధికారులకు కర్తవ్యాన్ని గుర్తుచేస్తూ... యువశక్తిని బలమైన జాతీయ శక్తిగా మార్చటమే వారి ప్రధాన ధ్యేయమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. అవకాశాలు ఇప్పుడు పట్టణ ప్రాంతాలకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల ప్రతిభావంతులకు విజయవంతంగా విస్తరించాయని తెలిపారు. 1952లో కేవలం 3 శాతంగా ఉన్న సివిల్ సర్వీసెస్ మహిళా అభ్యర్థుల సంఖ్య నేడు 30 శాతానికి పైగా పెరిగిందని, 2014 తర్వాత నలుగురు యూపీఎస్సీ ఛైర్‌పర్సన్లలో చరిత్రాత్మకంగా ముగ్గురు మహిళలే నియమితులయ్యారని ఆయన గర్వంగా చెప్పారు. “ఈ మార్పులు కేవలం గణాంకాలు మాత్రమే కాదు. దేశంలో అవకాశాల పరిధి విస్తరణను తెలియజేస్తున్నాయి” అని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.

1976లో ఈ సంస్థ 50వ వార్షికోత్సవం జరుపుకున్నప్పటి నుంచి అభ్యర్థుల భాగస్వామ్యంలో భారీ పెరుగుదల ఉందని, పరీక్ష రాసేవారి సంఖ్య 45 రెట్లు పెరిగిందని ప్రధానమంత్రి తెలిపారు. ఇది ఒక విశాలమైన జాతీయ ప్రతిభా వనరును సూచిస్తుందని, ఎంపిక చేసే సంస్థలపై అపారమైన బాధ్యతను మోపుతోందని అన్నారు. వారు కేవలం అభ్యర్థులను ఎంపిక చేయటం మాత్రమే కాదని, క్షేత్రస్థాయిలో ప్రభుత్వానికి ముఖచిత్రంగా, ప్రతినిధులుగా మారే వ్యక్తులను ఎన్నుకుంటున్నారని కమిషన్లకు గుర్తుచేశారు.

"సరైన వ్యక్తిని ఎంపిక చేయాల్సిన అపారమైన బాధ్యత మీ అందరికీ ఉంది" అని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.

సంస్థ రెండో శతాబ్దం దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో, భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు కార్యకలాపాలను వేగంగా ఆధునీకరించాలని, అదే సమయంలో దాని ప్రాథమిక విశ్వసనీయతను కాపాడుకోవాలని కమిషన్‌ను ప్రధానమంత్రి కోరారు. యూపీఎస్సీ ప్రధాన గుర్తింపైన స్వయంప్రతిపత్తి, నిష్పక్షపాత వైఖరి, ప్రతిభ, గోప్యత, పారదర్శకమైన ప్రక్రియలు ఎప్పటికీ రాజీపడకూడదని స్పష్టం చేశారు. "ఈ విలువలు ఎప్పటికీ అలాగే నిలిచిపోవాలి" అని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కీలక ఆదేశమిస్తూ ప్రధానమంత్రి ప్రసంగాన్ని ముగించారు. ఈ సంస్థ నూతన శతాబ్దంలోనూ విజయవంతంగా అభివృద్ధి చెందుతుందని, కాలానికి తగినట్లుగా మారుతుందని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

***

 


(రిలీజ్ ఐడి: 2317689) సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Bengali , Bengali-TR , Gujarati , Tamil , Kannada , Malayalam