వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
అమెరికాలోని మిల్వాకీకి చేరుకున్న శ్రీ పీయూష్ గోయల్.. జీ 20 వాణిజ్య మంత్రుల సమావేశంలో పాల్గొననున్న కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి
ఎన్ఏఎం రౌండ్‌టేబుల్ సమావేశంలో అమెరికా తయారీ, సాంకేతిక రంగాల ప్రముఖులతో శ్రీ పీయూష్ గోయల్ సమావేశం
నాడు పోస్టు చేయడమైనది:
30 SEP 2026 5:11PM by PIB Hyderabad
జీ 20 వాణిజ్య మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్ అమెరికాలోని మిల్వాకీ నగరానికి చేరుకున్నారు. చికాగోలోని భారత కాన్సులేట్ జనరల్ కాన్సుల్ జనరల్ డాక్టర్ ఎం. ఆనంద్ ప్రకాశ్ ఆయనకు స్వాగతం పలికారు.
నేషనల్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఎన్ఏఎం) ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్ సమావేశంలో.. అమెరికాలోని ప్రముఖ తయారీ, సాంకేతిక రంగాల సంస్థల సీఈవోలు, సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లతో శ్రీ పియూష్ గోయల్ సమావేశమయ్యారు. అమెరికాలోని దాదాపు 3 ట్రిలియన్ డాలర్ల తయారీ రంగ జీడీపీలో అత్యధిక వాటా ఉన్న అగ్రశ్రేణి తయారీ రంగ కంపెనీలకు ఎన్ఏఎంలో విశేష ప్రాతినిధ్యం ఉంది.
ఈ సమావేశంలో శ్రీ పియూష్ గోయల్ మాట్లాడుతూ.. భారత్ - అమెరికా మధ్య ఆర్థిక సంబంధాలు కేవలం సంప్రదాయ వాణిజ్య సంబంధాలకే పరిమితం కాదనీ, పెట్టుబడులు, తయారీ, సాంకేతికత, ఆవిష్కరణలు, దృఢమైన సరఫరా వ్యవస్థలు, ఇరు దేశాల్లో అధిక విలువ కలిగిన సామర్థ్యాలను పెంపొందించే దిశగా సంబంధాలు విస్తరిస్తున్నాయనీ వ్యాఖ్యానించారు.
భారత్‌లో ఆవిర్భవిస్తున్న నూతన అవకాశాలపై, దేశంలో భాగస్వామ్యాలను విస్తరించడం పట్ల ఆయా సంస్థల ఆలోచనలపై సీఈవోలు, సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు తమ అభిప్రాయాలను వివరించారు. భారత్‌లో తమ వ్యాపార నిర్వహణ, విస్తరణ, పెట్టుబడుల విషయంలో కంపెనీలకు తగిన సహకారాన్ని అందించడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా శ్రీ పియూష్ గోయల్ స్పష్టం చేశారు.
రాక్‌వెల్ ఆటోమేషన్ అంతర్జాతీయ ప్రధాన కార్యాలయంలో.. బిజినెస్ రౌండ్‌టేబుల్ (బీఆర్టీ), ఎన్ఏఎమ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన స్వాగత సన్మాన కార్యక్రమంలో కూడా శ్రీ పియూష్ గోయల్ పాల్గొన్నారు. ఇతర జీ 20 దేశాల వాణిజ్య మంత్రులు, అమెరికన్ కంపెనీల ఉన్నత స్థాయి వ్యాపార దిగ్గజాలతో ఈ సందర్భంగా ఆయన చర్చించారు.
***
(రిలీజ్ ఐడి: 2317341)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8