విద్యుత్తు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయల్ ఎఫీషియన్సీ (కేఫ్) నూతన నిబంధనల ప్రకటన అయిదేళ్లలో ఇంధన సామర్థ్యాన్ని 16 శాతానికి పైగా పెంచుకోవాలని లక్ష్యం ప్రత్యామ్నాయ ఇంధనాలు, ఈవీలు, హైబ్రిడ్ కార్ల అభివృద్ధికి మద్దతు


కార్లలో ఇంధన సామర్థ్యాన్ని పెంచేందుకు నూతన సాంకేతికతల్లో ఆవిష్కరణల ప్రోత్సాహం

నాడు పోస్టు చేయడమైనది: 30 SEP 2026 9:57AM by PIB Hyderabad

ప్రయాణికుల వాహనాల కోసం విద్యుత్ మంత్రిత్వ శాఖ కొత్త కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ (కేఫ్) నిబంధనలను ప్రకటించింది. ఈ నిబంధనలు ఏప్రిల్ 1, 2027 నుంచి మార్చి 31, 2032 వరకు అమల్లో ఉంటాయి. ఈ నూతన నిబంధనలు భారతదేశంలో తయారయ్యే, దేశానికి దిగుమతయ్యే కొత్త ప్రయాణ వాహనాలన్నింటికీ వర్తిస్తాయి.

ఐదేళ్ల పాటు ప్రతి సంవత్సరం లక్ష్యాలను కఠినతరం చేస్తూ, ఇంధన సామర్థ్యంలో క్రమమైన మెరుగుదలను ఈ నూతన కేఫ్ వ్యవస్థ ప్రోత్సహిస్తుంది. ఇంధన వినియోగ ప్రమాణం 2027-28 నాటికి ప్రతి 100 కిలోమీటర్లకు 3.996 లీటర్ల నుంచి 2031-32 నాటికి 100 కిలోమీటర్లకు 3.3273 లీటర్లకు కుదించారు. ఇది దాదాపు 16.7 శాతం మెరుగుదలను సూచిస్తుంది.

తేలికపాటి వాహనాలకు సున్నితమైన లక్ష్యాలను, బరువైన వాహనాలకు ఎక్కువ ఇంధన సామర్థ్య అవసరాలను అందించేందుకు... సవరించిన లక్ష్యాన్ని మరింత సమతుల్యమైన, బరువు ఆధారిత విధానాన్ని అందించేలా మార్పులు చేశారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం 1,082 కిలోలుగా ఉన్న రిఫరెన్స్ బరువును, కొత్త కేఫ్ నిబంధనల ప్రకారం 1,229 కిలోలకు పెంచారు. ఇది దాదాపు 13.6 శాతం పెరుగుదలను సూచిస్తూ, ప్రయాణికుల వాహన రంగంలో మార్పును ప్రతిబింబిస్తోంది.

కొత్త నిబంధనలు తయారీదారులకు మరింత వెసులుబాటును కల్పించటమే కాక పర్యావరణహిత సాంకేతికతలు, ప్రత్యామ్నాయ ఇంధనాలు, ఇతర వినూత్న పరిష్కారాలను స్వీకరించే అవకాశాన్నిస్తున్నాయి. సోలార్ రిఫ్లెక్టివ్ పెయింట్స్, అధునాతన గ్లేజింగ్, ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు హై-ఎఫిషియన్సీ ఎయిర్ కండిషనింగ్ వంటి నూతన సాంకేతికతల్లో ఆవిష్కరణలను ఈ నూతన కేఫ్ ప్రోత్సహిస్తుంది. తద్వారా భారతదేశ ఇంధన భద్రత, సుస్థిర లక్ష్యాల సాధనకు ఇది తోడ్పడుతుంది.

భారతదేశ రవాణా రంగానికి అవసరమైన ఇంధన డిమాండ్‌లో ప్రయాణికుల వాహనాల విభాగానిదే అధిక వాటా. శిలాజ ఇంధన వినియోగానికి ప్రధాన కారణంలా ఇది మారుతోంది. కొత్త కేఫ్ విధానం... వేగవంతమైన సాంకేతిక పురోగతులు, ప్రత్యామ్నాయ, పునరుత్పాదక ఇంధనాల లభ్యత పెరుగుదల, విద్యుద్దీకరణ విస్తరణ, మారుతున్న ప్రపంచ ఆటోమోటివ్ సాంకేతికతలకు అనుగుణంగా ఉంటూ, వాటికి పూర్తి మద్దతిస్తుంది.

వివరణాత్మక గమనిక

కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ (కేఫ్) నిబంధనలు 2027-28 నుంచి 2031-32 వరకు: భారతదేశ ఆటోమోటివ్ రంగానికి భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే, సౌకర్యవంతమైన వ్యవస్థ

ఇవాళ ప్రకటించిన నూతన కేఫ్ నిబంధనలు 2027 ఏప్రిల్ 1 నుంచి 2032 మార్చి 31 వరకు ప్రయాణికుల వాహనాలకు వర్తిస్తాయి. ఇప్పటికే ఉన్న కేఫ్ నిబంధనలను భర్తీ చేస్తూ 2027 ఏప్రిల్ 1 నుంచి ఇవి అమల్లోకి వస్తాయి. భారతదేశంలో తయారైన, దిగుమతి అయ్యే కొత్త ప్రయాణికుల వాహనాలన్నింటికీ ఇవి వర్తిస్తాయి. ఈ నూతన వ్యవస్థ ఆటోమొబైల్ పరిశ్రమలో నియంత్రణ స్పష్టతను మెరుగుపరుస్తుంది. స్థిరమైన విధానాన్ని అందిస్తుంది. ఇది సాంకేతిక ఆవిష్కరణలను సులభతరం చేస్తూ, భారత ప్రయాణికుల వాహన రంగ ఇంధన సామర్థ్యం పెరిగేందుకు, ఇంధన వినియోగాన్ని తగ్గించే దిశగా నిరంతరం అభివృద్ధి చెందటానికి దోహదపడుతుంది.

భారతదేశంలో స్వచ్ఛమైన, అధిక శక్తి గల సమర్థవంతమైన, స్థిరమైన రవాణా దిశగా సాగుతున్న ప్రయాణంలో కేఫ్ వ్యవస్థ కీలక ఘట్టాన్ని సూచిస్తుంది. ఆటోమొబైల్ తయారీదారులు, పరిశ్రమల సంఘాలు, విద్యాసంస్థలు, ఇతర భాగస్వాములతో విస్తృతమైన సంప్రదింపుల తర్వాత నూతన కేఫ్ నిబంధనలను ఖరారు చేశారు. ప్రయాణికుల వాహన రంగం కోసం భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే, సాంకేతికతకు అతీతంగా, సరళమైన నిబంధనా వ్యవస్థను అందించటమే దీని ఉద్దేశం.

ఈ కేఫ్ వ్యవస్థ... ఆటోమోటివ్ పరిశ్రమకు మరింత సాంకేతిక ఎంపికను, సౌలభ్యాన్ని, నియంత్రణ భరోసాని అందిస్తూనే ప్రస్తుత విధానం ద్వారా సాధించిన విజయాలను మరింత ముందుకు తీసుకువెళుతుంది.

ఇంధన సామర్థ్యంలో నిరంతర మెరుగుదలను సాధించటంతోపాటు, స్వచ్ఛ సాంకేతికతలు, ప్రత్యామ్నాయ ఇంధనాలు, వినూత్న పరిష్కారాల స్వీకరణను ఈ వ్యవస్థ మరింతగా ప్రోత్సహిస్తుంది. తద్వారా ఇది భారతదేశ ఇంధన భద్రత, సుస్థిరతా లక్ష్యాలకు మద్దతిస్తుంది. భారతదేశ అభివృద్ధికి, ఇంధన భద్రతకు స్వచ్ఛమైన, సమర్థవంతమైన, సుస్థిర మొబిలిటీ కీలక ఆధారమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చెప్పిన విస్తృత దృక్పథానికి ఈ వ్యవస్థ అనుగుణంగా ఉంది.

కొత్త సీఏఎఫ్ఈ నిబంధనల ముఖ్య లక్షణాలు

  1. ప్రస్తుత లక్ష్యాలతో పోల్చితే మొత్తం వాహనాల సగటు లక్ష్యాన్ని దశలవారీగా మరింత కఠినతరం చేశారు. అదే సమయంలో తయారీదారులు స్వచ్ఛమైన ఇంధనాలు, మెరుగైన సాంకేతికతలు, అత్యంత సమర్థవంతమైన వాహనాలను అందుబాటులోకి తెచ్చేలా ప్రోత్సహించేందుకు వారికి వివిధ రకాల ప్రోత్సాహకాలు, వెసులుబాటును కల్పిస్తున్నారు. అందువల్ల ఈ విధానం… సరైన సాంకేతిక మార్గాలను ఎంచుకునేందుకు పరిశ్రమలకు మరింత స్వేచ్ఛనిస్తూనే ఉన్నత లక్ష్యాలను సాధించేలా రూపొందించారు.

  2. కార్బన్ న్యూట్రాలిటీ ఫ్యాక్టర్ (సీఎన్ఎఫ్) ప్రవేశం ద్వారా ఇథనాల్ కలిపిన పెట్రోల్, బయోఫ్యూయల్స్, సీబీజీ వంటి పునరుత్పాదక, తక్కువ-కర్బన ఇంధనాల పాత్రను ఈ వ్యవస్థ గుర్తిస్తుంది. వాహన సామర్థ్య పెంపుదల, ఎలక్ట్రిఫికేషన్‌తో పాటు తయారీదారులు ఫ్లీట్-స్థాయి కేఫ్ పనితీరును మెరుగుపరచుకునేందుకు అదనపు మార్గాన్ని అందిస్తుంది. భారతదేశం స్వచ్ఛ ఇంధన దిశగా సాగించే విస్తృత పరివర్తనకు మద్దతిస్తూనే, వివిధ సాంకేతిక మార్గాల్లో నూతన ఆవిష్కరణలను ఈ నిబంధన ప్రోత్సహిస్తుంది.

  3. గుర్తింపు పొందిన ఇంధన-పొదుపు సాంకేతికతల జాబితాను నాలుగు నుంచి పన్నెండు సాంకేతికతలకు గణనీయంగా విస్తరించారు. ఇది ఆమోదం పొందిన ఇంధన-పొదుపు సాంకేతికతలను స్వీకరించేందుకు, వాటికి గుర్తింపు పొందటానికి తయారీదారులకు మరింత సౌలభ్యాన్ని అందిస్తుంది. ఈ వ్యవస్థ ద్వారా అర్హత గల ప్రతి సాంకేతికతకు కిలోమీటరుకు ఒక గ్రాము కార్బన్‌డైయాక్సైడ్ రాయితీ లభిస్తుంది. దీని గరిష్ఠ పరిమితి కిలోమీటరుకు 9.0 గ్రాముల కార్బన్‌డైయాక్సైడ్‌గా ఉంటుంది.

  4. బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలు (బీఈవీలు), రేంజ్-ఎక్స్‌టెండెడ్ ఎలక్ట్రిక్ వాహనాలు (ఆర్ఈఈవీలు), ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలు (పీహెచ్ఈవీలు), స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలు (ఎస్‌హెచ్ఈవీలు), ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలు ఫ్లీట్-సగటు లెక్కల్లో వాల్యూమ్ డిరోగషన్ ఫ్యాక్టర్లను... అంటే 'సూపర్ క్రెడిట్స్'ను పొందుతాయి. ఇది మరింత స్వచ్ఛమైన, అధునాతన వాహన సాంకేతికతల ఉత్పత్తిని, మార్కెట్లో వాటి వ్యాప్తిని వేగవంతం చేసేందుకు తయారీదారులకు అదనపు ప్రోత్సాహకాన్ని అందిస్తుంది.

  5. నిబంధనలు పాటించటాన్ని మరింత సులభతరం చేసేందుకు, తయారీదారులకు మెరుగైన నిర్వహణ సౌలభ్యాన్ని అందించేందుకు ఈ వ్యవస్థ ద్వారా తయారీదారులు నిర్దిష్ట రెండు, మూడేళ్లు నిబంధనలను పాటించే కాల వ్యవధుల్లో బాధ్యతలను నేరవేర్చే వెసులుబాటును ఎంచుకోవచ్చు. ఇది ఈ కాలపరిమితిలో తమ సాంకేతిక మార్పులను, ఉత్పత్తి శ్రేణులను మరింత సమర్థవంతంగా నిర్వహించుకునేందుకు తయారీదారులకు సహాయపడుతుంది.

  6. ఈ విధానం కేఫ్ నిబంధనలను పాటించటంలో తయారీదారులకు మరింత వెసులుబాటును కల్పిస్తుంది. నిర్దేశిత లక్ష్యాల కంటే మెరుగైన పనితీరు కనబరిచే తయారీదారులు క్రెడిట్లను పొందుతారు. వీటిని నిర్ణీత గడువులోపు భవిష్యత్తు కోసం నిల్వ ఉంచుకోవచ్చు. ఒకవేళ లక్ష్యాలను చేరుకోలేకపోయిన తయారీదారులు, నిబంధనల ప్రకారం తమకున్న వెసులుబాటును ఉపయోగించుకోవచ్చు. ఇతర తయారీదారులతో క్రెడిట్లను మార్చుకోవచ్చు. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ నిర్వహించే కొనుగోలు విధానం ద్వారా క్రెడిట్లను కొనుగోలు చేయవచ్చు. తయారీదారులపై భారాన్ని తగ్గించటం, మారుతున్న కాలానికి తగినట్లు సర్దుబాటు చేసుకునే అవకాశం కల్పించటం, వాహనాల ఉత్పత్తిలో, సాంకేతికతను మార్చుకోవటంలో వచ్చే మార్పులను సులభంగా నిర్వహించుకునేందుకు తోడ్పడటం ఈ నిబంధనల ఉద్దేశం.

  7. మోడిఫైడ్ ఇండియన్ డ్రైవింగ్ సైకిల్ (ఎంఐడీసీ), వరల్డ్ వైడ్ హార్మోనైజ్డ్ లైట్ వెహికల్స్ టెస్ట్ ప్రొసీజర్ (డబ్ల్యూఎల్‌టీపీ) రెండింటి ద్వారా వాహనాల పరీక్షలను నిర్వహిస్తారు. భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఆమోదం పొందిన వాహన పరీక్షా పద్ధతులకు క్రమంగా మారటానికి ఈ రెండు విధానాలు దోహదపడతాయి.

  8. సంవత్సరానికి 1,000 యూనిట్ల కంటే తక్కువ అమ్మకాలు జరిపే తయారీదారులకు ఫ్లీట్-సగటు నిబంధనల నుంచి మినహాయింపు ఉంటుంది. తద్వారా తక్కువ ఉత్పత్తి చేసే తయారీదారులు నియంత్రణ భారాల నుంచి తప్పించుకుంటారు.                          ***


(రిలీజ్ ఐడి: 2317048) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Gujarati , Tamil , Malayalam