మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఫ్రాన్స్ ఉన్నత విద్యా శాఖ మంత్రితో న్యూఢిల్లీలో ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించిన కేంద్ర విద్యా శాఖ మంత్రి


విద్య, పరిశోధన, నూతన ఆవిష్కరణ రంగాల్లో సహకారాన్ని విస్తరించుకోవడానికి ఒక మంచి అవకాశాన్ని ‘భారత్-ఫ్రాన్స్ నూతన ఆవిష్కరణల సంవత్సరం-2026’ అందిస్తోందన్న శ్రీ ప్రల్హాద్ జోషీ

విద్యారంగంలో ద్వైపాక్షిక సంబంధాలను ప్రోత్సహించడం, సంస్థాగత సంబంధాలు, పరిశోధన పరమైన సమన్వయంతో పాటు సహకరించుకోదగిన నూతన రంగాలపై చర్చించిన మంత్రులు

ఈ నెల 28 నుంచి 30 మధ్య మూడు రోజుల పాటు భారత్ పర్యటనకు విచ్చేసిన ఫ్రాన్స్ మంత్రి శ్రీ ఫిలిప్ బాప్టిస్ట్

నాడు పోస్టు చేయడమైనది: 28 SEP 2026 7:54PM by PIB Hyderabad

ఫ్రాన్స్ ఉన్నత విద్య, పరిశోధన, అంతరిక్ష శాఖ మంత్రి శ్రీ ఫిలిప్ బాప్టిస్ట్‌తో కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ప్రల్హాద్ జోషి న్యూఢిల్లీలో ఈ రోజు ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. విద్యను, పరిశోధనలను ముందుకు తీసుకు పోవడానికి విద్యార్థులను, ఉపాధ్యాయులను, పరిశోధకులను నిర్ణీత కాలం పాటు ఇరు దేశాలూ పరస్పరం ఆదరించుకోవడం, నూతన ఆవిష్కరణలు, సంస్థాగత భాగస్వామ్యం వంటి విషయాల్లో భారత్-ఫ్రాన్స్ సహకారాన్ని పటిష్టపరుచుకోవడానికి చేపట్టవలసిన కార్యాచరణపై మంత్రులు ఇద్దరూ చర్చించారు.


ఫ్రాన్స్ మంత్రికి, ఆయన ప్రతినిధివర్గానికి శ్రీ ప్రల్హాద్ జోషి స్వాగతం పలికారు. భారత్-ఫ్రాన్స్ చిరకాల భాగస్వామ్యాన్ని ఆయన ప్రస్తావించారు. విద్యారంగంలో సహకారం ఇరు దేశాల సంబంధాల్లో కీలక పాత్రను పోషిస్తోందని మంత్రి స్పష్టం చేశారు. విద్య, పరిశోధన, నూతన ఆవిష్కరణలలో సమన్వయాన్ని మరింత పెంపొందించుకోవడానికి ఒక చక్కని అవకాశాన్ని ‘భారత్-ఫ్రాన్స్ నూతన ఆవిష్కరణల సంవత్సరం-2026’ అందిస్తోందన్నారు.


ఉన్నత విద్య రంగంలో సహకారానికి గల అవకాశాలపై ఇరు పక్షాలు చర్చించాయి. ఈ అవకాశాల్లో.. సంస్థాగత సంబంధాలను పటిష్టపరచడం, విద్యార్థులు, ఉపాధ్యాయులు, పరిశోధకులను నిర్ణీత కాలం పాటు ఇటు వారిని అటు, అటు వారిని ఇటు పంపించడంతో పాటు, సహకార ప్రధాన విద్యా కార్యక్రమాలు, బృందాల పర్యటనలకు మరిన్ని అవకాశాలను కల్పించడం భాగంగా ఉన్నాయి. లైఫ్ సైన్సెస్, సోషల్ సైన్సెస్, మానవ విజ్ఞానశాస్త్రాల్లో కూడా ఇదివరకటితో పోలిస్తే ఎక్కువ సహకారానికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయో పరిశీలించారు. సంస్థాగత ఆదాన ప్రదానం, పరస్పర సహకారంతో విద్యా సంబంధ కార్యకలాపాలను నిర్వహించుకోవడంతో పాటు పరిశోధనపై ఈ సందర్భంగా దృష్టి కేంద్రీకరించారు.


ఉభయ దేశాల మధ్య జ్ఞాన భాగస్వామ్యాలను మరింతగా ప్రోత్సహించే అంశంపై అభిప్రాయాలను మంత్రులు వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న సంస్థాగత సహకారాన్ని బలోపేతం చేయడంతో పాటు, సంయుక్త విద్యా, పరిశోధన కార్యక్రమాలను కొత్త కోణాలలో కూడా విస్తరించగలగడానికి ఉన్న అవకాశాలపై చర్చించారు.  గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీ సహా భారతదేశంలో ఫ్రాన్స్ కంపెనీలు కార్యకలాపాలను నిర్వహిస్తున్న ప్రాంతాల్లో ఆయా కంపెనీలకు సాంకేతిక నిపుణుల సేవలు అవసరమవుతున్నందువల్ల ఆయా ప్రాంతాల్లో ఫ్రెంచి ఉన్నత విద్యాసంస్థలు తమ శాఖలను ప్రారంభించేందుకు అవకాశాలు ఉన్నాయా అన్నది బేరీజు వేయాలని ద్వైపాక్షిక సమావేశంలో సూచించారు.


రెండు దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాలకు ప్రాధాన్యాన్ని ఇవ్వవలసిన అవసరం ఉందని ఇరు పక్షాలు అంగీకరిస్తూ భాషలను నేర్చుకోవడానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న అవకాశాలను పెంపొందింప చేయడం, అలాగే విద్యాబోధన పట్ల ఆసక్తి కలిగిన వారికి శిక్షణ ఇవ్వడం, విద్యారంగంలో ప్రవీణుల సేవలను పరస్పరం వినియోగించుకోవడం, సాంకేతికత ఆధారిత విద్యాబోధనను ప్రోత్సహించడంపై చర్చించారు. భారత్, ఫ్రాన్స్‌‌ల మధ్య పరస్పర అర్హతల  గుర్తింపు ఒప్పందం పునస్సమీక్ష, డిజిటల్ మాధ్యమంలో విద్యాబోధనకు సంబంధించి అత్యుత్తమ పద్ధతులను ఇచ్చి పుచ్చుకోవడం, నాణ్యమైన విద్యాబోధన పరిధిని విస్తరించడానికి సాంకేతిక విజ్ఞానాన్ని  వినియోగించుకోవడం వంటి అంశాలు కూడా చర్చల్లో చోటు చేసుకున్నాయి.
ఉన్నత విద్య, నూతన ఆవిష్కరణలు, భాషాపరమైన విద్య, డిజిటల్ మాధ్యమం సేవలను వినియోగించుకొంటూ విద్యాబోధన వంటి రంగాల్లో భారత్-ఫ్రాన్స్ సహకారాన్ని మరింత విస్తరించే విషయంలో ఇరు పక్షాలు తమ నిబద్ధతను పునరుద్ఘాటించి, సమావేశం ముగిసినట్లు ప్రకటించాయి.

 

***


(రిలీజ్ ఐడి: 2316387) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Kannada , Malayalam