అంతరిక్ష విభాగం
azadi ka amrit mahotsav

నవ శకంలోకి భారత్-ఫ్రాన్స్ అంతరిక్ష సహకారం

· మానవ అంతరిక్ష యానం.. అంకుర సంస్థలు.. అంతరిక్ష నవ్యావరణ వ్యవస్థపై ప్రధానంగా దృష్టి: కేంద్ర సహాయ మంత్రి డాక్ట‌ర్‌ జితేంద్ర సింగ్

· మంత్రితో న్యూఢిల్లీలో ఫ్రాన్స్ ఉన్నత విద్య-పరిశోధన-అంతరిక్ష శాఖ మంత్రి ఫిలిప్ బాప్టిస్ట్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సమావేశం

· సౌండింగ్ రాకెట్ల నాటి నుంచి గగన్‌యాన్.. సంయుక్త ఉపగ్రహ ప్రయోగాల దాకా 6 దశాబ్దాలుగా అవిచ్ఛిన్నంగా భారత్-ఫ్రాన్స్ అంతరిక్ష భాగస్వామ్యం

· భారత్-ఫ్రాన్స్ మధ్య విస్తృత శాస్త్ర-సాంకేతిక సహకారానికి ఆవిష్కరణల సంవత్సరం-2026 కొత్త బాటలు వేస్తుంది: డాక్టర్‌ జితేంద్ర సింగ్‌

· తృష్ణ.. గగన్‌యాన్.. భారత్‌లోని 400కు పైగా అంతరిక్ష అంకురాలు రెండు దేశాల భాగస్వామ్యానికి వినూత్న అవకాశాలు కల్పిస్తున్నాయి

· అంతరిక్ష రంగంలో ప్రభుత్వం-పరిశ్రమలు.. అంకురాల మధ్య విస్తృత సహకారం దిశగా డాక్టర్‌ జితేంద్ర సింగ్ విజ్ఞప్తి

నాడు పోస్టు చేయడమైనది: 28 SEP 2026 4:23PM by PIB Hyderabad

   భారత్‌- ఫ్రాన్స్‌ మధ్య 1960 దశకం నాటి తొలి సౌండింగ్ రాకెట్ నుంచి నేటి అత్యాధునిక ప్రయోగాల దాకా అంతరిక్ష రంగ సహకారం అవిచ్ఛిన్నంగా కొనసాగుతోంది. ఈ మేరకు కేంద్ర శాస్త్ర-సాంకేతిక-భూ విజ్ఞాన (స్వతంత్ర బాధ్యత), సిబ్బంది-ప్రజా సమస్యలు-పింఛన్లు, అణుశక్తి-అంతరిక్ష శాఖలు, ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు న్యూఢిల్లీలో వ్యాఖ్యానించారు. రెండు దేశాల మధ్య సంయుక్త ఉపగ్రహ ప్రయోగాలు, ప్రయోగ వాహన సాంకేతికతలు, మానవ అంతరిక్ష యానం, ఆధునిక అంతరిక్ష అనువర్తనాలలో ఈ విస్తృత, విస్తరిత భాగస్వామ్యం పరిణామం చెందిందని ఆయన పేర్కొన్నారు.

నేడు వేగంగా విస్తరిస్తున్న అంతరిక్ష రంగంలో మరింత విస్తృత భాగస్వామ్యం సహా  ప్రభుత్వాలు-పరిశోధన సంస్థలు, పరిశ్రమలు-అంకురాలను ఒకే వేదికపైకి తెచ్చి, భారీ నవ్యావరణ వ్యవస్థ రూపకల్పనకు రెండు దేశాల మధ్యగల ఈ సుదీర్ఘ బంధం ఒక అవకాశం కల్పిస్తోందని మంత్రి చెప్పారు.

ఫ్రాన్స్ ఉన్నత విద్య-పరిశోధన-అంతరిక్ష శాఖ మంత్రి ప్రొఫెసర్ ఫిలిప్ బాప్టిస్ట్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం న్యూఢిల్లీలో డాక్టర్ జితేంద్ర సింగ్‌తో ఇవాళ సమావేశమైంది. అంతరిక్ష రంగంపై శిఖరాగ్ర సదస్సు, భారత్-ఫ్రాన్స్ ఆవిష్కరణల సంవత్సరం-2026, అంతరిక్షం, సెఫిప్రా, నీలి ఆర్థిక వ్యవస్థ సహా శాస్త్ర-సాంకేతిక సహకారంపై ప్రాథమ్యాల మీద ఈ సందర్భంగా చర్చించారు. వివిధ రంగాలలో రెండు దేశాల మధ్య సహకార విస్తృతిని ఈ భారీ ప్రతినిధి బృందం ప్రతిబింబిస్తున్నదని డాక్టర్ జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు.

ఈ సమావేశాంలో మంత్రితోపాటు శాస్త్ర-సాంకేతిక విభాగం కార్యదర్శి ప్రొఫెసర్ ఉమేష్ వి.వాఘ్మారే, భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ టి.శ్రీనివాస కుమార్, బయోటెక్నాలజీ విభాగం కార్యదర్శి డాక్టర్ రాజేష్ ఎస్.గోఖలే, సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్‌ శ్రీమతి ఎన్.కలైసెల్వి, డీఎస్టీ అంతర్జాతీయ సహకార విభాగాధిపతి డాక్టర్ ప్రవీణ్‌కుమార్ సోమసుందరం, అంతరిక్ష విభాగం, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధులు, సెఫిప్రా డైరెక్టర్-ఫ్రాన్స్ నోడల్ అధికారి-శాస్త్రవేత్త(ఇ) ఐసీడీ, డీఎస్టీ తదితరులు పాల్గొన్నారు.

ఫ్రాన్స్‌ ప్రతినిధి బృందంలో- మంత్రి ప్రొఫెసర్ ఫిలిప్ బాప్టిస్ట్, చీఫ్ ఆఫ్ స్టాఫ్ లూ లే నబాస్క్, దౌత్య సలహాదారు అలెక్సియా లకాజ్, వ్యక్తిగత భద్రతా అధికారి జెరెమీ రోలర్, ఇండియా డెస్క్ అధికారి బెనోయిట్ టాల్యూ ఉన్నారు. అలాగే, ఎసెక్‌ డైరెక్టర్ జనరల్ విన్సెంజో విన్జీ, భారత్‌లో ఫ్రాన్స్ రాయబారి థియరీ మాథౌ, సహకార-సాంస్కృతిక కార్యాచరణ కౌన్సిలర్ గ్రెగోర్ ట్రుమెల్, డిప్యూటీ కౌన్సిలర్ నికోలస్ గాస్కోయిన్, శాస్త్రీయ సహకార అధికారి సిల్వియాన్ పీడ్, వ్యూహాత్మక వ్యవహారాల సలహాదారు రాఫెల్ సనానెస్, అంతరిక్ష వ్యవహారాల కౌన్సిలర్ తమారా టెజెల్ కూడా చర్యల్లో పాలుపంచుకున్నారు.

రెండు దేశాల అంతరిక్ష సంస్థలు పునాదులు ఎంత లోతైనవో భారత్-ఫ్రాన్స్ అంతరిక్ష సహకారం కూడా అంత విస్తృతమైనదని డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ భాగస్వామ్యం 1960లలో సౌండింగ్ రాకెట్ ప్రయోగాల నుంచి నేటి మానవ అంతరిక్ష యాత్ర సహకారం దాకా పురోగమించిందని ఆయన గుర్తుచేశారు. ఇస్రో, సిఎన్ఇఎస్ సంయుక్తంగా రూపొందించిన మేఘా-ట్రోపిక్స్, సరళ్, ప్రయోగ వాహన ఇంజిన్ తదితరాల్లో సహకారం ఈ సుదీర్ఘ భాగస్వామ్యంలో కీలక ఘట్టాలని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మూడో సంయుక్త ఉపగ్రహం ‘తృష్ణ’ దిశగా కార్యక్రమాల ప్రగతి సంతృప్తకరంగా ఉందని చెప్పారు. వినియోగ వస్తు సరఫరా, ఫ్లైట్ సర్జన్లకు శిక్షణ సహా భారత గగన్‌యాన్ కార్యక్రమానికి ‘సిఎన్ఇఎస్’ మద్దతివ్వడాన్ని ఆయన అభినందించారు. మానవ అంతరిక్ష యాత్ర సంబంధిత సూక్ష్మ గురుత్వాకర్షణ పరిశోధన, పారబోలిక్ విమానాల అంశంపైనా ద్వైపాక్షిక చర్చలు ప్రారంభించారు.

భారత అంతరిక్ష రంగ రూపాంతరీకరణ నేపథ్యంలో ప్రభుత్వ సంస్థలు-పేరొందిన సంస్థలకు అతీతంగా సహకార విస్తరణకు రెండు దేశాల మధ్య కొత్త అవకాశాలు అందివస్తున్నాయని మంత్రి అన్నారు. భారత అంతరిక్ష రంగ సంస్కరణలు, ప్రైవేట్ వ్యవస్థల వృద్ధిని ప్రస్తావిస్తూ- దేశంలో ప్రస్తుతం 400కు పైగా అంతరిక్ష అంకుర సంస్థలు  రాకెట్-ఉపగ్రహ నిర్మాణం, అంతరిక్ష అనువర్తనాలు సహా వివిధ రంగాలలో కృషి చేస్తున్నాయని ఆయన అన్నారు. రెండు దేశాల ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమలు, అంకుర సంస్థలను భారత్-ఫ్రాన్స్ సహకారంలో తదుపరి దశ ఒకే వేదికపైకి తెస్తుందని తెలిపారు. తద్వారా ఒక భారీ నవ్యావరణం రూపొందడమే కాకుండా విస్తృత వనరుల సముదాయ  సృష్టి సాధ్యం కాగలదని ఆయన చెప్పారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ‘భారత్‌-ఫ్రాన్స్ ఆవిష్కరణల సంవత్సరం-2026’కు శ్రీకారం చుట్టడాన్ని డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ గుర్తుచేశారు. దీనివల్ల ఆవిష్కరణలు, అత్యాధునిక సాంకేతికతలలో భాగస్వామ్య విస్తృతికి కీలక వేదిక ఏర్పడుతుందని చెప్పారు. ఈ ఏడాది అక్టోబరు 11న బెంగళూరులో నిర్వహించే ‘వాటర్ సైకిల్, తృష్ణ మిషన్’ కార్యక్రమాల గురించి ఆయన ప్రస్తావించారు. ఇందుకోసం ఇస్రో ప్రచార సామగ్రిని సమకూరుస్తుండగా, సీనియర్ అధికారులు తృష్ణ ఉపగ్రహం, దాని అనువర్తనాలపై ప్రసంగిస్తారని వెల్లడించారు.

బయోటెక్నాలజీ, డిజిటల్ సైన్సెస్ అండ్‌ టెక్నాలజీస్‌, సముద్ర శాస్త్రాలు సహా రెండు దేశాల శాస్త్రీయ సహకార విస్తృతి నేపథ్యంలో అంతరిక్ష భాగస్వామ్యం ప్రాధాన్యాన్ని మంత్రి గుర్తుచేశారు. సిఫిప్రా, భారత్‌-ఫ్రాన్స్ సంయుక్త కేంద్రాల వంటి సంస్థలు- యంత్రాంగాల ద్వారా కొనసాగుతున్న కృషి- బహుళ విజ్ఞానశాస్త్ర రంగాల్లో నిరంతరం విస్తరిస్తున్న భాగస్వామ్యంగా రూపుదిద్దుకుంటోందని ఆయన తెలిపారు.

నీలి ఆర్థిక వ్యవస్థను ప్రస్తావిస్తూ- సముద్ర శాస్త్ర విజ్ఞానంలో సహకారానికి గల అవకాశాలు సహా సముద్రపు లోతుల్లోని అపార శాస్త్రీయ, వనరుల సామర్థ్యాన్వేషణలో భారత ‘డీప్ ఓషన్ మిషన్’కు ఎంతో ప్రాధాన్యం ఉందని డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ చెప్పారు.  అంతరిక్ష, శాస్త్రవిజ్ఞాన, సముద్ర రంగాలలో విస్తరిస్తున్న కృషి ఫలితంగా ఈ వ్యవస్థలోని సంస్థలు-వాటాదారుల మధ్య పెరుగుతున్న సహకారం భారత్-ఫ్రాన్స్ విస్తృత భాగస్వామ్య రూపకల్పనకు ఒక అవకాశాన్నిస్తుందని ఆయన అన్నారు.

ప్రొఫెసర్ ఫిలిప్ బాప్టిస్ట్ మాట్లాడుతూ- శాస్త్ర, సాంకేతిక, అంతరిక్ష రంగాలలో భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం చేసుకోవాలన్న భారత్‌ దృక్కోణంతో ఫ్రాన్స్ ఏకీభవిస్తున్నదని చెప్పారు. తదనుగుణంగా ఆయా రంగాల్లో సహకారా విస్తరణకు తామెంతో ఆసక్తితో ఉన్నామని ఆయన పేర్కొన్నారు. రెండు దేశాల సమష్టి సామర్థ్యం ఎంతటి విజయం సాధించగలదో చెప్పడానికి ‘తృష్ణ’ను ఒక బలమైన ఉదాహరణగా ఆయన అభివర్ణించారు. మానవ అంతరిక్ష యానం, వ్యోమగాముల ఆరోగ్యం, సూక్ష్మ గురుత్వాకర్షణపై పరిశోధన, పారబోలిక్ విమానాలు వంటి అంశాల్లో మరింత సహకారంపై హర్షం వ్యక్తం చేశారు. బలమైన, భవిష్యదాధారిత భారత్-ఫ్రాన్స్ ఆవిష్కరణల వ్యవస్థ రూపకల్పనపై సమష్టి లక్ష్యాన్ని ఆయన ప్రస్తావించారు. అలాగే, రెండు దేశాల పరిశోధన సంస్థలను, అంకుర సంస్థలను అనుసంధానించడంపైనా ఆయన సానుకూలత వెలిబుచ్చారు.

ఈ ఏడాది (2026)ని భారత్-ఫ్రాన్స్ ఆవిష్కరణల సంవత్సరంగా పాటిస్తున్న కీలక తరుణంలో రెండు దేశాల మధ్య ఈ సమావేశం నిర్వహించడం గమనార్హం. అంతరిక్షం, సైన్స్ అండ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, డిజిటల్ సైన్సెస్, సముద్ర శాస్త్ర రంగాలలో ద్వైపాక్షిక సహకారం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని ఆధునిక రంగాల్లోకి మరింత విస్తరించేలా ఈ చర్చలు నవ్యోత్తేజమిచ్చాయి. అదే సమయంలో సంస్థాగత, పారిశ్రామిక, అంకుర సంస్థల మధ్య సహకారానికి మరిన్ని అనువైన అవకాశాలకు బాటలు వేశాయి.

***


(రిలీజ్ ఐడి: 2316277) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Gujarati , Malayalam