వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ముంబయి వేదికగా 14వ భారత్-యూఏఈ ఉన్నత స్థాయి జాయింట్ టాస్క్ ఫోర్స్ సమావేశం
పెట్టుబడులు, ఆవిష్కరణలతో భారత్-యూఏఈ భాగస్వామ్యంలో గణనీయమైన మార్పు: కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్
సీఈపీఏ పురోగతిపై భారత్-యూఏఈ సమీక్ష.. సంయుక్త పెట్టుబడి ప్రాజెక్టులపై ముందడుగు
నాడు పోస్టు చేయడమైనది:
28 SEP 2026 3:56PM by PIB Hyderabad
భారత్-యూఏఈ పెట్టుబడులపై ఉన్నత స్థాయి జాయింట్ టాస్క్‌ఫోర్స్ (హెచ్ఎల్‌జేటీఎఫ్ఐ) 14వ సమావేశం నేడు ముంబయిలో జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్, అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ (ఏడీఐఏ) మేనేజింగ్ డైరెక్టర్ షేక్ హమీద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సహాధ్యక్షత వహించారు.
భారత్-యూఏఈ మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సంబంధాలను ప్రోత్సహించేందుకు 2013లో హెచ్ఎల్‌జేటీఎఫ్ఐని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి భారత్, యూఏఈల్లో మరిన్ని పెట్టుబడులకు కోసం ఉన్న అవకాశాలు, భవిష్యత్తు ప్రణాళికలను చర్చించేందుకు ఇది సమర్థవంతమైన వేదికగా పనిచేస్తోంది. ఇరు దేశాల పెట్టుబడిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కూడా ఈ వేదిక ఉపయోగపడుతోంది.
2026 మేలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ యూఏఈలో పర్యటించడం, 2026 సెప్టెంబర్‌లో అబుదాబి యువరాజు షేక్ ఖలీద్ బిన్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భారత్‌లో పర్యటించడం వంటి ఉన్నతస్థాయి పరస్పర పర్యటనలు ఇరు దేశాల భాగస్వామ్యానికి వ్యూహాత్మక దిశను అందించాయి. దీంతో భారత్-యూఏఈ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం కావడానికి మరింత ఊతం లభించింది.
నేటి సమావేశంలో ద్వైపాక్షిక పెట్టుబడులను పెంచే చర్యలు, కొత్తగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో సహకార అవకాశాలను అన్వేషించడం సహా కీలక వాణిజ్య, పెట్టుబడి అంశాలపై చర్చించారు. యూఏఈ–భారత్ ఆర్థిక భాగస్వామ్యం పరిమాణం, వ్యూహాత్మక ప్రాధాన్యత పరంగా నిరంతరం విస్తరిస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం 101.25 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంది. 2025లో చమురేతర వాణిజ్యం 76.2 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇది ఇరు దేశాల వాణిజ్య సంబంధాల బలాన్ని, సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ) ప్రభావాన్ని ప్రతిబింబిస్తోంది. 2032 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 200 బిలియన్ అమెరికన్ డాలర్లకు పెంచాలనే ఉమ్మడి లక్ష్యంతో భారత్, యూఏఈలు భవిష్యత్తు ఆర్థిక వృద్ధికి కీలకమైన ఇంధనం, మౌలిక వసతులు, సాంకేతికత, కృత్రిమ మేధ వంటి రంగాల్లో పెట్టుబడుల సహకారాన్ని మరింత విస్తరిస్తున్నాయి.
ఈ సానుకూల పరిస్థితుల నేపథ్యంలో భారత్-యూఏఈ మధ్య పెరుగుతున్న వాణిజ్యాన్ని, ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో సీఈపీఏ, ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం (బీఐటీ), పన్నులు, పరస్పర న్యాయ సహాయం వంటి అంశాలపై కుదిరిన ఇతర ఒప్పందాలు పోషించిన పాత్రను సహాధ్యక్షులు అభినందిస్తూ ఈ సమావేశాన్ని ప్రారంభించారు. సీఈపీఏకు సంబంధించిన ఉపకమిటీల పనితీరును ఇరు దేశాలు సమీక్షించాయి. అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక పరిస్థితులు సంక్లిష్టంగా మారుతున్న నేపథ్యంలో వాణిజ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై చర్చించింది.
గుజరాత్‌లోని ఫుడ్ పార్కు ప్రాజెక్టు సహా పలు ఉమ్మడి పెట్టుబడి ప్రాజెక్టులు, సహకార రంగాల్లో సాధించిన పురోగతిని సంయుక్త టాస్క్‌ఫోర్స్ సమీక్షించింది. 2026 చివరి నాటికి యూఏఈలో ఇన్వెస్ట్ ఇండియా కార్యాలయం కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉందని ఇరు దేశాలు పేర్కొన్నాయి. ఇటీవల ఎమిరేట్స్ ఎన్‌బీడీ భారత్‌లోని ఆర్‌బీఎల్ బ్యాంకులో మెజారిటీ వాటాను సుమారు 3 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడం, ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ (ఐహెచ్‌సీ) భారత్‌లోని సమ్మాన్ క్యాపిటల్‌లో 1 బిలియన్ డాలర్ల పెట్టుబడి, ఒడిశాలో సమగ్ర అల్యూమినియం కాంప్లెక్స్ ఏర్పాటుకు 11.5 బిలియన్ డాలర్ల సంయుక్త పెట్టుబడి ప్రతిపాదన వంటి అంశాలను ఇరు దేశాలు స్వాగతించాయి. భారత్‌లోని గిఫ్ట్ సిటీలో మష్రెక్ బ్యాంకు, ఫస్ట్ అబుదాబి బ్యాంకు (ఎఫ్ఏబీ), అబుదాబి నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ (ఏడీఎన్ఐసీ) శాఖల కార్యాలయాలు విజయవంతంగా ప్రారంభమైన విషయాన్ని కూడా ప్రస్తావించారు. 2026 మేలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ యూఏఈ పర్యటన సందర్భంగా కుదిరిన అవగాహన ఒప్పందాల కింద ఇంధన రంగంలో కొనసాగుతున్న సహకారాన్ని ఇరు దేశాలు సమీక్షించాయి. పరస్పర పెట్టుబడుల విస్తృతి, వైవిధ్యాన్ని పరిశీలిస్తే భారత్-యూఏఈ సంబంధాలు అనేక రంగాల్లో బహుముఖ భాగస్వామ్యంగా కొనసాగుతున్నాయని గుర్తించారు.
యూఏఈ–భారత్ ఆర్థిక భాగస్వామ్యంలో ఆర్థిక రంగంలో సహకారం కీలకమైన అంశంగా కొనసాగుతోంది. యూఏఈ, భారత్ సెంట్రల్ బ్యాంకులు స్థానిక కరెన్సీల్లో లావాదేవీలు, చెల్లింపులు, మెసేజింగ్ వ్యవస్థల అనుసంధానం, సెంట్రల్ బ్యాంకు డిజిటల్ కరెన్సీలకు సంబంధించిన కార్యక్రమాల్లో సాధించిన పురోగతిని సమావేశానికి హాజరైన ఇరు దేశాల ప్రతినిధులు సమీక్షించారు. ఈ కార్యక్రమాల ద్వారా ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులను మరింత సమర్థవంతంగా, అందుబాటులో ఉండేలా, పటిష్టంగా నిర్వహించే సామర్థ్యం ఉందని పేర్కొన్నారు. వీటిని సకాలంలో అమలు చేసేందుకు కలిసికట్టుగా పనిచేయాలని ఇరు దేశాలు అంగీకరించాయి.
ఇరు దేశాల మధ్య పరస్పర పెట్టుబడులను పెంచే అవకాశం ఉన్న రంగాలపై ప్రతినిధులు చర్చించారు. ఇందులో ఇంధనం, పరిశ్రమలు, లాజిస్టిక్స్, మౌలిక సదుపాయాలు, సాంకేతికత, కృత్రిమ మేధ, అంతరిక్షం, ఆహార భద్రత, వ్యవసాయ ఆవిష్కరణలు, అంకుర సంస్థలు వంటి రంగాల్లో కలిసి పనిచేసే అవకాశాలను పరిశీలించారు.
ఈ సమావేశంలో అబుదాబి–భారత్ మధ్య పౌర విమానయాన రంగంలో సహకారంపై ఇరు దేశాల నేతలు చర్చించారు. విస్తృత ఆర్థిక సంబంధాలకు మద్దతుగా విమాన రాకపోకలను మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా చర్చలు సాగాయి. భారత్‌లోని గుజరాత్ ధోలేరాలో విమానయాన, లాజిస్టిక్స్ కేంద్రాన్ని అభివృద్ధి చేయడంలో పెట్టుబడి అవకాశాలు, సహకార మార్గాలను ఇరు దేశాలు పరిశీలించాయి.
హెచ్ఎల్‌జేటీఎఫ్ఐ ఏర్పాటైనప్పటి నుంచి భారత్, యూఏఈ మధ్య పెట్టుబడులకు సంబంధించిన సమస్యలను ప్రస్తావించి, వాటిని పరిష్కరించేందుకు బహిరంగంగా, సమర్థవంతంగా పనిచేసే వేదికగా నిరంతరం
సేవలందిస్తోంది.
భారత్‌లో యూఏఈ పెట్టుబడులు, కంపెనీలకు సంబంధించిన పెండింగ్ సమస్యలను, అలాగే యూఏఈలో భారత పెట్టుబడులు, కంపెనీలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు యూఏఈ–భారత్ ఫాస్ట్ ట్రాక్ వ్యవస్థ ద్వారా చేపట్టిన చర్యలను ఇరు దేశాలు ప్రస్తావించాయి. ఈ సమస్యలను సకాలంలో పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇరు దేశాలు అంగీకరించాయి.
సమావేశం ముగింపు సందర్భంగా హెచ్ఎల్‌జేటీఎఫ్ఐ విజయవంతంగా కొనసాగేందుకు నిరంతరం కృషి చేస్తున్న ఇరు దేశాల రాయబారులు, అధికారులు, సాంకేతిక బృందాలను సహాధ్యక్షులు అభినందించారు.
హెచ్ఎల్‌జేటీఎఫ్ఐ 14వ సమావేశంపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి, హెచ్ఎల్‌జేటీఎఫ్ఐ సంయుక్త అధ్యక్షులు శ్రీ పీయూష్ గోయల్ మాట్లాడుతూ కింది విధంగా పేర్కొన్నారు.
“ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ సమ్మిళిత, సుస్థిర, స్థిరమైన ఆర్థిక వృద్ధికి కట్టుబడి ఉంది. ఈ ప్రయాణంలో యూఏఈ భారత్‌కు విశ్వసనీయ మిత్రదేశం, భాగస్వామి. నేటి జాయింట్ టాస్క్‌ఫోర్స్ సమావేశంలో అనేక కార్యక్రమాల్లో సాధించిన సానుకూల పురోగతిని సమీక్షించడంతో పాటు, భవిష్యత్తులో సహకారాన్ని మరింత విస్తరించే అవకాశాలపై చర్చించాం. పెట్టుబడులు, ఆవిష్కరణల అభివృద్ధి, ప్రజల భద్రత వంటి అంశాల్లో పరస్పర సహకారంతో కొనసాగుతున్న ఈ భాగస్వామ్యం ఇరు దేశాల దూరదృష్టితో కూడిన నాయకత్వంలో గణనీయమైన మార్పు దిశగా ముందుకు సాగుతోంది” అని అన్నారు.
హెచ్‌ఎల్‌జేటీఎఫ్‌ఐ సహ-అధ్యక్షులు, అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ (ఏడీఐఏ) మేనేజింగ్ డైరెక్టర్ గౌరవ షేక్ హమీద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మాట్లాడుతూ.. ‘‘“యూఏఈ, భారత్ మధ్య చాలాకాలంగా కొనసాగుతున్న, క్రమంగా బలోపేతమవుతున్న భాగస్వామ్యంలో ఈ సమావేశం కీలకంగా నిలిచింది. 2013లో ఏర్పాటు చేసినప్పటి నుంచి ఈ సంయుక్త టాస్క్‌ఫోర్స్ బహిరంగ చర్చలు, ఆచరణాత్మక సమస్యల పరిష్కారం, ఇరు దేశాల ఉమ్మడి ఆర్థిక లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లేందుకు విలువైన వేదికగా పనిచేస్తోంది. సంవత్సరాలుగా పెట్టుబడిదారులకు మద్దతు ఇవ్వడం, సమస్యలను పరిష్కరించడం, సహకారానికి కొత్త అవకాశాలను గుర్తించడం ద్వారా ఇరు దేశాలను మరింత దగ్గర చేయడంలో ఇది సహాయపడింది’’ అని పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2316263)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4