ఆర్థిక మంత్రిత్వ శాఖ
దేశవ్యాప్త బంగారం అక్రమ రవాణా వ్యవస్థను ఛేదించిన డీఆర్‌ఐ
రూ. 10 కోట్లకు పైగా విలువైన 6.6 కిలోల విదేశీ బంగారం స్వాధీనం, సూత్రధారితో సహా 11 మంది అరెస్టు
ఈ వ్యవస్థ ద్వారా గత తొమ్మిది నెలల్లో కొరియర్ మార్గాల ద్వారా రూ. 475 కోట్ల విలువైన 318 కిలోల అక్రమంగా బంగారం రవాణా
నాడు పోస్టు చేయడమైనది:
28 SEP 2026 2:57PM by PIB Hyderabad
వ్యవస్థీకృత బంగారం అక్రమ రవాణాపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా దేశవ్యాప్తంగా బంగారం స్మగ్లింగ్ చేసే ముఠా గుట్టు రట్టు చేసింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా దాదాపు రూ. 10.36 కోట్ల విలువైన 6.61 కేజీల విదేశీ అక్రమ బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ముఠా కొరియర్ వ్యవస్థ ద్వారా కార్యకలాపాలు సాగిస్తూ... గడిచిన తొమ్మిది నెలల్లో దాదాపు రూ. 475 కోట్ల విలువైన 318 కిలోల స్మగ్లింగ్ బంగారాన్ని దేశవ్యాప్తంగా రవాణా చేసింది. ఈ వ్యవహారంలో కీలక సూత్రధారితో సహా మొత్తం 11 మందిని అధికారులు అరెస్టు చేశారు.
పశ్చిమ బెంగాల్, అస్సాంలోని ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దుల ద్వారా విదేశీ బంగారం నిరంతరం అక్రమ రవాణా అవుతోందని, ఆ తర్వాత కొరియర్ పార్సిళ్ల ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారని లభించిన ఖచ్చితమైన సమాచారంతో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) సెప్టెంబర్ 23, 24 తేదీల్లో అనేక నగరాల్లో ఒకేసారి దాడులు నిర్వహించింది. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, అహ్మదాబాద్, గువాహటి ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలను అడ్డుకొని సోదాలు నిర్వహించారు.
ఈ ఆపరేషన్ సమయంలో గువాహటి, కోల్‌కతా నుంచి ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్‌లకు డెలివరీ కోసం బుక్ చేసిన స్మగ్లింగ్ బంగారంతో కూడిన లైవ్ కొరియర్ సరుకులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పార్సిళ్లను తీసుకోవడానికి వచ్చిన ఏడుగురిని అదుపులోకి తీసుకోగా, కోల్‌కతాలోని కొరియర్ పంపినవారి ప్రాంగణాల్లో జరిపిన తనిఖీల్లో మరో ముగ్గురిని అరెస్టు చేశారు. తదుపరి చేపట్టిన చర్యల్లో ఈ బంగారాన్ని పంపించి, డెలివరీ చేయడంలో సమన్వయం చేసిన వ్యక్తులో కీలక సూత్రధారిని ముంబైలో అరెస్టు చేశారు.
ఈ స్మగ్లింగ్ ముఠా విదేశాల నుంచి అక్రమంగా తీసుకొచ్చిన బంగారాన్ని చిన్న చిన్న కొరియర్ పార్సిళ్లుగా విభజిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. గువాహటి, కోల్‌కతాల నుంచి ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్‌లలోని వివిధ వ్యక్తులకు ఈ పార్సిళ్లను పంపి, స్థానిక మార్కెట్‌లో విక్రయించేవారు. బంగారం పంపినవారు, అందుకున్నవారు ఇద్దరూ ఎటువంటి చట్టబద్ధమైన బంగారు లావాదేవీలు లేకుండా కేవలం కాగితాలకే పరిమితమైన వ్యక్తులుగా గుర్తించారు. బంగారాన్ని రహస్యంగా రవాణా చేయడానికి, పంపిణీ చేయడానికి వారు కావాలనే ఈ కొరియర్ వ్యవస్థను ఉద్దేశపూర్వకంగా ఉపయోగించారని తేలింది.
అడ్డుకున్న పార్సిళ్ల నుంచి సుమారు రూ. 10.36 కోట్ల విలువైన కడ్డీల రూపంలో ఉన్న మొత్తం 6.61 కిలోల విదేశీ బంగారాన్ని స్వాధీనం చేసుకుని, కస్టమ్స్ చట్టం 1962 నిబంధనల ప్రకారం జప్తు చేశారు. ఈ సిండికేట్‌తో సంబంధం ఉన్న 11 మందిని అరెస్టు చేశారు.
సేకరించిన పత్రాల ప్రాథమిక విచారణలో ఈ ముఠా అక్రమ కార్యకలాపాలు భారీ స్థాయిలో చేపట్టినట్లు బయటపడింది. కేవలం గడిచిన 9 నెలల్లోనే సుమారు రూ. 475 కోట్ల విలువైన 318 కిలోల స్మగ్లింగ్ బంగారాన్ని ఇదే కొరియర్ వ్యవస్థ ద్వారా దేశవ్యాప్తంగా చేరవేసినట్లు తేలింది. ఈ వ్యవహారంపై మరింత లోతైన విచారణ కొనసాగుతోంది.
దేశవ్యాప్తంగా స్మగ్లింగ్ బంగారాన్ని రవాణా చేయడానికి అసాధారణమైన కొరియర్, లాజిస్టిక్స్ మార్గాలను ఉపయోగించడంతోపాటు, సరఫరా వ్యవస్థలోని ప్రతి దశలోనూ వ్యవస్థీకృత బంగారం అక్రమ రవాణా వ్యవస్థలను ఛేదించడంపై డీఆర్ఐ నిరంతరం చూపుతున్న ప్రత్యేక దృష్టికి ఈ ఆపరేషన్ ఒక నిదర్శనంగా నిలిచింది.
***
(రిలీజ్ ఐడి: 2316083)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5