నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వరల్డ్ స్కిల్స్ షాంఘై-2026లో 10వ స్థానాన్ని దక్కించుకున్న భారత్… 6 రజత పతకాలు, 20 ఎక్సలెన్స్ పతకాలు

వరల్డ్ స్కిల్స్ లియోన్-2024లో 13వ స్థానంలో నిలిచిన భారత్… షాంఘై-2026లో 10వ స్థానానికి చేరిక

48వ వరల్డ్ స్కిల్స్ పోటీల్లో 63 నైపుణ్యాల్లో ప్రతిభను ప్రదర్శించేందుకు భారత్ నుంచి రికార్డు స్థాయిలో 70 మంది పోటీదారులు

అధునాతన సాంకేతికతలు, తయారీ, ఇంజినీరింగ్, ప్రత్యేక సేవల్లో యువ భారత పోటీదారుల అంతర్జాతీయ స్థాయి నైపుణ్య ప్రదర్శన

నాడు పోస్టు చేయడమైనది: 27 SEP 2026 8:24PM by PIB Hyderabad

చైనాలోని షాంఘైలో జరిగిన 48వ వరల్డ్ స్కిల్స్ పోటీలు-2026 ముగిశాయి. భారత బృందం ఈ ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ నైపుణ్య వేదికపై 6 రజత పతకాలు, 20 ఎక్సలెన్స్ పతకాలను గెలుచుకుని పదో స్థానాన్ని దక్కించుకుంది. ఫ్రాన్స్‌లోని లియోన్‌లో జరిగిన వరల్డ్ స్కిల్స్ పోటీలు-2024 పోటీల్లో నాలుగు కాంస్య పతకాలు, 12 ఎక్సలెన్స్ పతకాలతో భారత్ 13వ స్థానంలో నిలిచింది. గతంతో పోలిస్తే ఈసారి మెరుగైన ప్రదర్శన కనబరచటం ద్వారా ప్రపంచ వేదికపై నైపుణ్యం గల దేశ యువత సాధించిన కీలక ఘట్టంగా నిలిచింది.

షాంఘైలో జరిగిన వరల్డ్ స్కిల్స్ పోటీల్లో బేకరీ విభాగంలో స్మృతి నంబియార్, డెంటల్ ప్రొస్థెటిక్స్ విభాగంలో మహమ్మద్ సలాం, డిజిటల్ ఇంటరాక్టివ్ మీడియా డిజైన్ విభాగంలో కోవిద్ అజయ్ గంగ్రాడే, ఇండస్ట్రియల్ డిజైన్ టెక్నాలజీ విభాగంలో పార్థ్ వోహ్రా, రవాణా, సరకు సరఫరా వ్యవస్థల నిర్వహణలో మెహరున్నీసా బేగం, రిటైల్ సేల్స్ విభాగంలో సానియా జోషి ఆరు రజత పతకాలను గెలుచుకున్నారు. వీరు సాధించిన ఈ విజయాలు సృజనాత్మకత, సాంకేతికత, సేవా రంగాలకు చెందిన నైపుణ్యాలను ప్రతిబింబిస్తూ, ప్రపంచ వేదికపై భారతదేశ ప్రతిభా విస్తరణను చాటిచెబుతున్నాయి.

సాంకేతికత, పారిశ్రామిక, డిజిటల్, సృజనాత్మకత, సేవా రంగాలకు సంబంధించిన నైపుణ్యాల్లో భారత్ 20 మెడల్స్ ఫర్ ఎక్సెలెన్స్ అవార్డులను సాధించింది. బేకరీ విభాగంలో రజత పతకం సాధించిన స్మృతి నంబియార్... భారత్ తరఫున 'బెస్ట్ ఆఫ్ నేషన్' అవార్డును అందుకున్నారు.

సెప్టెంబర్ 22 నుంచి 27 వరకు ఆరు రోజుల పాటు జరిగిన ఈ అంతర్జాతీయ వేడుకలో సుమారు 70 దేశాలు, ప్రాంతాల నుంచి 1,400 మందికి పైగా యువ పోటీదారులు పాల్గొన్నారు. అత్యాధునిక సాంకేతికతలు, అధునాతన తయారీ, ఇంజనీరింగ్, సృజనాత్మక పరిశ్రమలు, ప్రత్యేక సేవలతో కూడిన 63 నైపుణ్య విభాగాల్లో పాల్గొనేందుకు రికార్డు స్థాయిలో 70 మందితో కూడిన బృందం భారత్ తరపున ప్రాతినిధ్యం వహించింది.

సెప్టెంబర్ 23 నుంచి 26 వరకు నాలుగు రోజుల పాటు జరిగిన పోటీల అనంతరం సెప్టెంబర్ 27న షాంఘైలో ముగింపు వేడుకలను అట్టహాసంగా నిర్వహించి, విజేతలను సత్కరించారు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన పోటీదారులు, అంతర్జాతీయ ప్రతినిధులు, నిపుణులు, పరిశ్రమల ప్రతినిధులు ఈ వేడుకలో పాల్గొన్నారు. అసాధారణ సాంకేతిక నైపుణ్యం, ఆవిష్కరణ, కచ్చితత్వం, హస్తకళా నైపుణ్యాన్ని ఈ కార్యక్రమం ఘనంగా చాటిచెప్పింది.

భారత బృందం ప్రదర్శనను నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత శాఖ సహాయమంత్రి (స్వతంత్ర బాధ్యత), విద్యాశాఖ సహాయమంత్రి శ్రీ జయంత్ చౌదరి అభినందించారు. అనంతరం మాట్లాడుతూ.. "వరల్డ్ స్కిల్స్ షాంఘై-2026 పోటీల్లో భారత్ అద్భుతమైన ప్రతిభను కనబరిచింది. 6 రజత పతకాలు, 20 ఎక్సలెన్స్ పతకాలతో గ్లోబల్ స్కిల్స్ ప్రయాణంలో కీలక ముందడుగుగా నిలిచింది. గత విజయాలను అధిగమిస్తూ... మన దేశ యువ పోటీదారులు భారత నైపుణ్య సత్తాను, పోటీతత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు. ఈ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్క పోటీదారుడికి, నిపుణుడికి, ట్రైనర్‌కు, పరిశ్రమ భాగస్వామికి నా అభినందనలు. పతకాల కన్నా ముఖ్యంగా, భారత్‌ను ప్రతిబింబించేలా ప్రపంచ వేదికపై మన యువత ఆత్మవిశ్వాసంతో, సంకల్పంతో, నైపుణ్య ప్రదర్శన చేయటం గర్వకారణం. భవిష్యత్తుకు తగని నైపుణ్యాలను యువతకు అందించాలనే మన సంకల్పాన్ని వారి విజయం మరింత బలపరుస్తుంది. ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రతిభావంతులతో పోటీపడేలా ప్రతి యువ భారతీయుడికి అవకాశాన్ని కల్పించాలనే మన నిబద్ధతను తెలియజేస్తుంది" అని అన్నారు.

భారత్ సాధించిన విజయం… యువ పోటీదారుల అంకితభావాన్ని, నెలల తరబడి సాగిన కఠినమైన సన్నద్ధత, ప్రత్యేక శిక్షణ, మార్గదర్శకత్వం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాల పరిశీలన ఫలితాలను ప్రతిబింబిస్తుంది. అంతర్జాతీయ వరల్డ్ స్కిల్స్ ప్రమాణాలకు అనుగుణంగా అత్యుత్తమ వృత్తిపరమైన నైపుణ్యాన్ని ప్రదర్శించిన పోటీదారులకు మెడల్ ఫర్ ఎక్సెలెన్స్ పురస్కారాలను అందజేస్తారు.

వరల్డ్ స్కిల్స్ ఇండియా అధికారిక ప్రతినిధి, భారత ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వశాఖ సీనియర్ ఆర్థిక సలహాదారు శ్రీమతి మనీషా సేన్ శర్మ మాట్లాడుతూ ఈ పోటీ ద్వారా లభించిన అంతర్జాతీయ అనుభవంపై అభిప్రాయాలను పంచుకున్నారు. "వరల్డ్ స్కిల్స్ అంటే కేవలం పోటీపడటం కాదు... కొత్త విషయాలను నేర్చుకోవటం కూడా. మారుతున్న ప్రపంచ వృత్తిపరమైన ప్రమాణాలు, నూతన సాంకేతికతలు, అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులపై షాంఘై వేదికగా మా పోటీదారులకు, నిపుణులకు అమూల్యమైన అనుభవం లభించింది. ఈ పోటీల అనుభవం కేవలం ఈ వేదికకే పరిమితం కాకుండా, భారతదేశ విస్తృత నైపుణ్య వ్యవస్థకు ప్రయోజనం చేకూర్చేలా... బలమైన శిక్షణా విధానాలుగా, మెరుగైన మూల్యాంకన ప్రమాణాలుగా, మరింత లోతైన పరిశ్రమ భాగస్వామ్యాలుగా మార్చటమే ప్రధాన లక్ష్యం" అని పేర్కొన్నారు.

ఈ ఏడాది పలు విభాగాల్లో భారత్ పాల్గొనటం విశేషం. డెంటల్ ప్రొస్థెటిక్స్, డిజిటల్ ఇంటరాక్టివ్ మీడియా డిజైన్, ఇంటెలిజెంట్ సెక్యూరిటీ టెక్నాలజీ, ల్యాండ్‌స్కేప్ గార్డెనింగ్, ఆప్టోఎలక్ట్రానిక్ టెక్నాలజీ, రిటైల్ సేల్స్, డ్రోన్లు, ఇండస్ట్రియల్ మెకానిక్స్, సాఫ్ట్‌వేర్ టెస్టింగ్, భారీ వాహనాల సాంకేతికత, ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ వంటి 11 కొత్త, అభివృద్ధి చెందుతున్న నైపుణ్య విభాగాల్లో మొదటిసారిగా భారత్ పోటీపడింది.

ఈ ప్రత్యేక విభాగాల్లో భారత్ పాల్గొనటం వల్ల దేశ నైపుణ్యాభివృద్ధి రంగంలో విప్లవాత్మక మార్పులను ప్రతిబింబిస్తోంది. భవిష్యత్తు ఆధారిత వృత్తులు, నూతన సాంకేతికతలు, పరిశ్రమ-ఆధారిత నైపుణ్యాలకు ఇది మరింత ప్రాధాన్యతనిస్తోందని సూచిస్తుంది.

వివిధ సాంకేతిక, సృజనాత్మక, సేవా ఆధారిత విభాగాల్లో యువతులు పాల్గొనటం మరో విశేషం. కెమికల్ లాబొరేటరీ టెక్నాలజీ, రవాణా, సరకు సరఫరా వ్యవస్థల నిర్వహణ నుంచి ఫ్యాషన్ టెక్నాలజీ, విజువల్ మెర్చండైజింగ్, ఆరోగ్యం, సామాజిక భద్రత, ఆతిథ్యం, ఇతర ప్రత్యేక వృత్తుల వరకు వివిధ నైపుణ్యాల్లో మహిళా పోటీదారులు భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. వృత్తివిద్య, నైపుణ్యాభివృద్ధిలో మహిళలకు పెరుగుతున్న విస్తృత అవకాశాలను ఇది ప్రతిబింబిస్తోంది.

వరల్డ్ స్కిల్స్ షాంఘై-2026లో భారత్ భాగస్వామ్యాన్ని నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సమన్వయం చేసింది. దీనికి సెక్టార్ స్కిల్ కౌన్సిల్స్, పారిశ్రామిక భాగస్వాములు, శిక్షణ సంస్థలు, సాంకేతిక నిపుణులు, ఇతర భాగస్వాముల మద్దతు లభించింది.

ఈ పోటీలు భారతదేశ పోటీదారులు, నిపుణులకు అమూల్యమైన అంతర్జాతీయ అనుభవాన్ని అందించాయి. దీని ద్వారా ప్రపంచ స్థాయి వృత్తిపరమైన ప్రమాణాలు, నూతన సాంకేతికతలు, అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులపై అవగాహన లభించింది. ఇవి భారతదేశంలోని శిక్షణా, మూల్యాంకన వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు దోహదపడతాయి.

షాంఘైలో జరుగుతున్న వరల్డ్ స్కిల్స్-2026 ముగింపు సందర్భంగా భారత బృందం సాధించిన విజయాలు కేవలం పతకాలకు మాత్రమే పరిమితం కాలేదు. ప్రపంచ వేదికపై దేశానికి ప్రాతినిధ్యం వహించిన 70 మంది యువ భారతీయుల అంకితభావం, పట్టుదల, ఆశయాలకు ఇది ప్రతీకగా నిలిచింది. నైపుణ్యం గల, ఆత్మవిశ్వాసంతో కూడిన, భవిష్యత్‌కు సిద్ధంగా ఉండే శ్రామిక శక్తిని తీర్చిదిద్దటంలో నాణ్యమైన నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమల భాగస్వామ్యం, ప్రపంచ ప్రమాణాల పరిశీలన వంటి వాటిలో నిరంతర పెట్టుబడులు అవసరమని ఈ విజయాలు మరోసారి గుర్తుచేశాయి.

వరల్డ్ స్కిల్స్ గురించి: ప్రపంచంలోనే అత్యున్నత అంతర్జాతీయ నైపుణ్య పోటీ... వరల్డ్ స్కిల్స్. ఇది వివిధ దేశాలు, ప్రాంతాల నుంచి యువ నిపుణులను ఒకచోట చేర్చి ఎన్నో వృత్తిపరమైన, సాంకేతిక నైపుణ్యాల్లో అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించేలా చేస్తుంది. రెండేళ్లకోసారి జరిగే ఈ పోటీ అంతర్జాతీయ ప్రమాణాలను ప్రోత్సహిస్తుంది. విజ్ఞాన మార్పిడిని సులభతరం చేస్తుంది. యువకులు నైపుణ్యంతో కూడిన కెరీర్‌ను ఎంచుకునేలా స్ఫూర్తినిస్తుంది.

భారత బృందం గెలిచిన పతకాలు, మెడల్ ఆఫ్ ఎక్సలెన్స్ విజేతల పూర్తి జాబితా

బెస్ట్ ఆఫ్ నేషన్: స్మృతి నంబియార్ - బేకరీ (రజత పతకం).

 

రజత పతక విజేతలు

క్రమసంఖ్య

నైపుణ్య విభాగం

పోటీదారులు

1

బేకరీ

స్మృతి నంబియార్

2

డెంటల్ ప్రోస్థటిక్స్

మొహమ్మద్ సలాం

3

డిజిటల్ ఇంటరాక్టివ్ మీడియా డిజైన్

కోవిద్ అజయ్ గంగ్రాడే

4

ఇండస్ట్రియల్ డిజైన్ టెక్నాలజీ

పార్థ్ వోహ్రా

5

రవాణా, సరకు సరఫరా వ్యవస్థల నిర్వహణ

మెహరున్నీసా బేగం

6

రిటైల్ సేల్స్

సానియా జోషి

 

మెడల్ ఫర్ ఎక్సలెన్స్

క్రమసంఖ్య

నైపుణ్య విభాగం

పోటీదారులు

1

ఇంటెలిజెంట్ సెక్యూరిటీ టెక్నాలజీ

రాగుల్ కాంతమ్మ బల్ రాజ్

2

మెకాట్రానిక్స్

దీపు ముదిగెరెపాళ్య శ్రీనివాస; జయంత్ కరియప్ప

3

మొబైల్ అప్లికేషన్స్ డెవలప్‌మెంట్

అర్జున్ సుమతి విజయబాస్కర్

4

విద్యుత్ వ్యవస్థాపనలు

ధనుష్ మధుగిరి గోవిందరాజు

5

ప్లాస్టరింగ్, డ్రైవాల్ వ్యవస్థలు

సురెంతిరన్ మణి

6

పేయింటింగ్ అండ్ డెకరేటింగ్

ముస్కాన్

7

అటానమస్ మొబైల్ రోబోటిక్స్

ఆదిత్య ప్రకాశ్, దేబాశిశ్ పాండా

8

కేబినెట్ మేకింగ్

యశ్వంత్ చారి కేశోజు

9

ఆభరణాలు

జోయ్ దాస్

10

బ్యూటీ థెరపీ

తాహెసిన్ సబీర్ సుతార్

11

ఫ్యాషన్ టెక్నాలజీ

విధి నీరవ్ కుమార్ సుతార్

12

ఆటోమొబైల్ టెక్నాలజీ

ఎండీ సెరాజ్

13

కార్ పెయింటింగ్

కైఫ్ ఖాన్

14

ఐటీ నెట్‌వర్క్ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ (ఐటీఎన్ఎస్ఏ)

ఖుష్‌రాజ్ నిమేశ్ రాథోడ్

15

గ్రాఫిక్ డిజైన్ టెక్నాలజీ

రాజీబ్ లోచన్ చంద్

16

ఆరోగ్యం, సామాజిక భద్రత

విష్ణుప్రియా సునీల్

17

ఇండస్ట్రీ 4.0

మల్లినాథ్, సుహాన్ మస్కరేన్హాస్

18

కెమికల్ లాబొరేటరీ టెక్నాలజీ

సంపద దేశాయి

19

అడిటివ్ మాన్యుఫ్యాక్చరింగ్

పవన్ భద్రావతి సురేష

20

రోబోట్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్

అభిషేక్ సోమన్న శిగ్నల్లి, వినయ్ ముత్తయ్య హిరేమఠ్

 

***


(రిలీజ్ ఐడి: 2316025) సందర్శకుల సూచీ సంఖ్య : : 13
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Odia