ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ఏబీ పీఎం-జేఏవై పథకానికి ఎనిమిదేళ్లు, ఏబీడీఎంకు అయిదేళ్లు పూర్తయిన సందర్భంగా ఆరోగ్య మంథన్ 2026ను ప్రారంభించిన కేంద్ర వైద్యశాఖ మంత్రి శ్రీ జేపీ నడ్డా
విస్తరిస్తున్న భారత్ డిజిటల్, ఆరోగ్య భరోసా వ్యవస్థను ప్రతిబింబిస్తున్న ఏబీ పీఎం-జేఏవై, ఏబీడీఎం కార్యక్రమాలు : శ్రీ జేపీ నడ్డా
ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య భరోసా కార్యక్రమంగా ఏబీ పీఎం-జేఏవై.. 60 కోట్లకు పైగా లబ్ధిదారులకు భరోసా: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి
నేషనల్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్ రిజిస్ట్రీ మొబైల్ యాప్, సురక్షిత డేటా వాతావరణం, ఏబీ పీఎం-జేఏవై కోసం స్వయంచాలక క్లెయిమ్ పరిష్కార వ్యవస్థ సహా పలు డిజిటల్ ఆరోగ్య, ఆరోగ్య భరోసా కార్యక్రమాలను ప్రారంభించిన ఆరోగ్య మంథన్ 2026
వివిధ విభాగాల్లో ఏబీ పీఎం-జేఏ, ఏబీడీఎం అమలులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆరోగ్య మంథన్ 2026లో గుర్తింపు
నాడు పోస్టు చేయడమైనది:
25 SEP 2026 3:18PM by PIB Hyderabad
కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమం, రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి శ్రీ జేపీ నడ్డా నేడు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఆరోగ్య మంథన్ 2026ను ప్రారంభించారు. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీ పీఎం-జేఏవై) ఎనిమిదేళ్లు పూర్తి చేసుకోవడం, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎం) అయిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏ) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సీనియర్ ప్రభుత్వ అధికారులు, ఆరోగ్య సేవల ప్రదాతలు, బీమా సంస్థల ప్రతినిధులు, సాంకేతిక, డిజిటల్ ఆరోగ్య నిపుణులు, విద్యావేత్తలు, అభివృద్ధి భాగస్వాములు, ఇతర భాగస్వామ్య వర్గాలు హాజరయ్యారు. భారత్ ఆరోగ్య భరోసా, డిజిటల్ ఆరోగ్య వ్యవస్థలో సాధించిన పురోగతి, తదుపరి దశలో చేపట్టాల్సిన ప్రాధాన్యతలపై ఈ కార్యక్రమంలో చర్చించారు.
సమావేశాన్ని ఉద్దేశించి కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమం, రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి శ్రీ జేపీ నడ్డా మాట్లాడుతూ.. ఏబీ పీఎం జేఏవై ఎనిమిదేళ్లు, ఏబీడీఎం అయిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా భాగస్వామ్య వర్గాలందరికీ అభినందనలు తెలిపారు. మైలురాళ్లుగా నిలిచే ఈ కార్యక్రమాలు ఇప్పటివరకు సాధించిన పురోగతిని సమీక్షించుకోవడంతో పాటు, పేదలు, సమాజంలోని అణగారిన వర్గాల సంక్షేమం పట్ల మన నిబద్ధతను పునరుద్ధరించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయని అన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ “సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్” దార్శనికతకు అనుగుణంగా ఈ కృషిని కొనసాగించాలని ఆయన పేర్కొన్నారు.
ఏబీ పీఎం జేఏవై ప్రారంభమైనప్పటి నుంచి గణనీయంగా విస్తరించిందని శ్రీ నడ్డా పేర్కొన్నారు. 60 కోట్లకు పైగా లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరిందని, 13 కోట్లకు పైగా ఆసుపత్రి చేరికలకు వీలు కల్పించి, రూ.2 లక్షల కోట్లకు పైగా విలువైన చికిత్సను అందించిన ఏబీ పీఎం జేఏవై ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య భరోసా కార్యక్రమంగా అవతరించిందని తెలిపారు.
సామాజిక, ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా 70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వృద్ధులందరికీ ఈ పథకాన్ని ప్రభుత్వం మరింత విస్తరించి, వారిని కూడా పథకం పరిధిలోకి తీసుకువచ్చిందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా వలస కార్మికులకు పథకం కింద సేవలను ఎక్కడైనా పొందే సౌలభ్యం ముఖ్యమని ఆయన వివరించారు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో రాష్ట్ర ప్రభుత్వాలు, ఆరోగ్య సేవల సంస్థలు, ఇతర భాగస్వామ్య వర్గాలు అందిస్తున్న సహకారాన్ని ఆయన అభినందించారు.
ఏబీ పీఎం-జేఏవై, ఏబీడీఎం ప్రయాణం ఆరోగ్య రంగంలో సాంకేతికత పోషిస్తున్న పరివర్తనాత్మక పాత్రను స్పష్టంగా చూపించిందని కేంద్ర మంత్రి తెలిపారు. వివిధ ప్రాంతాల్లో డిజిటల్ వ్యవస్థలు ధ్రువీకరణ, అనుమతులు, చికిత్సకు అందుబాటును సులభతరం చేస్తున్నాయని పేర్కొన్నారు. ఏబీడీఎం కింద సాధించిన పురోగతిని ప్రస్తావిస్తూ.. ఇప్పటివరకు 97.8 కోట్లకు పైగా అబా (ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్-ఏబీహెచ్‌ఏ) కార్డులు అందించారని, 121 కోట్లకు పైగా ఆరోగ్య రికార్డులు అనుసంధానమయ్యాయని తెలిపారు. ఏబీడీఎం వ్యవస్థలో 5.6 లక్షలకు పైగా ఆరోగ్య సదుపాయాలు, సుమారు 11 లక్షల మంది ఆరోగ్య సేవల నిపుణులు నమోదు చేసుకున్నారని వివరించారు. ఆసుపత్రులు, బీమా సంస్థలను ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకురావడమే లక్ష్యంగా అభివృద్ధి చేస్తున్న జాతీయ వైద్య క్లెయిమ్స్ ఎక్స్ఛేంజ్‌ను కూడా ఆయన ప్రస్తావించారు.
ఆరోగ్య మంథన్ 2026లో ప్రారంభించిన కార్యక్రమాలను గురించి శ్రీ జేపీ నడ్డా మాట్లాడుతూ.. ఇవి డిజిటల్ ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేయడంతో పాటు, ఆరోగ్య డేటాను సురక్షితంగా వినియోగించేందుకు, ఆరోగ్య పరిశోధన, ఆవిష్కరణలు, డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడంలో కొత్త అవకాశాలను సృష్టించేందుకు దోహదపడతాయని అన్నారు. జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏ) కృషిని ఆయన అభినందించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు, ఆరోగ్య నిపుణులు, ఎంపానెల్ చేసిన ఆసుపత్రులు, ఆయుష్మాన్ మిత్రలు, ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు, సాంకేతిక భాగస్వాములు, ఇతర భాగస్వాముల పాత్రను ఆయన గుర్తించారు.
ఈ ప్రయాణం నిరంతరం కొనసాగాలని శ్రీ జేపీ నడ్డా పేర్కొన్నారు. ఆరోగ్య సేవలను మరింత అందుబాటులోకి, సమర్థవంతంగా, రోగి కేంద్రీకృతంగా మార్చేందుకు డిజిటల్ సాంకేతికతను వినియోగించడంపై నిరంతరంగా దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఆరోగ్య మంథన్ 2026లో జరిగే చర్చలు కార్యాచరణకు దారితీసే ఫలితాలను అందిస్తాయని, భారత్ ఆరోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు మానవాళికి సేవ చేయడంలో మరింతగా దోహదపడతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా జాతీయ ఆరోగ్య సంస్థను నీతి ఆయోగ్ సభ్యుడు (వైద్య) డాక్టర్ ఎం శ్రీనివాస్ అభినందించారు. ఏబీ పీఎం-జేఏవై తీసుకువచ్చిన మార్పును ప్రస్తావిస్తూ.. ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన ప్రజలు మరింత విశ్వాసంతో, తక్కువ ఆర్థిక భారంతో ఆరోగ్య సేవలను పొందేందుకు ఈ పథకం వీలు కల్పించిందని అన్నారు. తదుపరి దశలో రోగుల చికిత్సలో నిరంతరత, నాణ్యత, రోగి కేంద్రీకృత ఆరోగ్య సేవలను బలోపేతం చేయడంపై దృష్టి సారించాలని ఆయన చెప్పారు. ముఖ్యంగా ప్రత్యేక వైద్య చికిత్స అవసరమైన రోగులకు అంతరాయం లేకుండా రిఫరల్ సేవలు అందించే వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.
డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ..అబాను మరింత విస్తృతంగా వినియోగంలోకి తీసుకురావడం, ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, పౌరుల సమ్మతి, తగిన భద్రతా చర్యలతో డిజిటల్ ఆరోగ్య రికార్డుల పరస్పర అనుసంధాన సామర్థ్యాన్ని బలోపేతం చేయాల్సిన అవసరాన్ని వివరించారు. అధిక నాణ్యత, ప్రామాణీకరణ, పరస్పర అనుసంధాన సామర్థ్యం కలిగిన ఆరోగ్య డేటా ఆరోగ్య పరిశోధనను ముందుకు తీసుకెళ్లడానికి, ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధను బాధ్యతాయుతంగా వినియోగించడం కీలకమని ఆయన పేర్కొన్నారు. జాతీయ ఆరోగ్య క్లెయిమ్‌ల మార్పిడి వేదికను బలోపేతం చేయడంతో పాటు, క్లెయిమ్‌లు, ముందస్తు అనుమతి ప్రక్రియలను మరింత సులభతరం చేయాలని, ఆరోగ్య భరోసా, డిజిటల్ ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహనను విస్తృతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఆయుష్మాన్ భారత్ పీఎం జేఏవై విజయాన్ని ఐఆర్‌డీఏఐ చైర్మన్ శ్రీ అజయ్ సేథ్ ప్రస్తావించారు. ఈ పథకం ద్వారా పొందిన అనుభవం దేశ ఆరోగ్య బీమా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు అవకాశాన్ని కల్పిస్తోందని అన్నారు. పౌరులు, ఆసుపత్రులు, బీమా సంస్థలు, సాంకేతిక సేవల ప్రదాతలు సహా అన్ని భాగస్వామ్య వర్గాలకు విలువ చేకూర్చేలా, ఆరోగ్య సేవల్లో నాణ్యత, అందుబాటు ధర, ప్రాప్యతను నిర్ధారించాల్సిన అవసరాన్ని ఆయన చెప్పారు.
ఆరోగ్య బీమాలో ప్రామాణీకరణ, పారదర్శకత ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ.. ఆరోగ్య బీమాకు గుర్తింపుగా అబాను వినియోగించడం, చికిత్సల కోడీకరణ, ప్రామాణిక బిల్లింగ్ విధానాలు, ప్రామాణిక చికిత్సా విధానాలు, మార్గదర్శకాలు వంటి కీలక డిజిటల్, కార్యాచరణ వ్యవస్థలను మరింత విస్తృతంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని శ్రీ సేథ్ పేర్కొన్నారు. మరింత మెరుగైన పరస్పర అనుసంధాన సామర్థ్యాన్ని సాధించడంలో, అనుసంధానిత ఆరోగ్య బీమా వ్యవస్థను అభివృద్ధి చేయడంలో భారతదేశ డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, జాతీయ ఆరోగ్య క్లెయిమ్‌ల మార్పిడి వేదిక ఎన్‌హెచ్‌సీఎక్స్) కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన వివరించారు. “సాధ్యమైనంత విస్తృత ప్రజానీకానికి అందుబాటు ధరలో, నాణ్యమైన, సమర్థవంతమైన ఆరోగ్య సేవలను అందించడం మన పరిధిలోనే ఉంది” అని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్, డీహెచ్‌ఆర్ కార్యదర్శి డాక్టర్ రాజీవ్ బహల్ మాట్లాడుతూ.. ఆయుష్మాన్ భారత్ పీఎం-జేఏవై ఎనిమిదేళ్లు పూర్తి చేసుకోవడం, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎం) అయిదేళ్లు పూర్తి చేసుకోవడం ప్రాధాన్యతను వివరించారు. ఆయుష్మాన్ భారత్ పీఎం-జేఏవై ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య భరోసా పథకంగా అవతరించిందని, 60 కోట్లకు పైగా పౌరులకు ప్రయోజనం చేకూరుస్తోందని తెలిపారు. ఇకపై ఆరోగ్య సేవల నాణ్యతను మరింత మెరుగుపరచడం, పౌరులకు మరింత ప్రయోజనం చేకూరేలా పరిధిని విస్తరించడంపై దృష్టి సారించనున్నట్లు ఆయన చెప్పారు.
హెచ్ఆర్, ఐసీఎంఆర్, ఎన్‌హెచ్‌ఏల మధ్య సహకారాన్ని ప్రస్తావిస్తూ.. రెండు కీలక రంగాల్లో జరుగుతున్న పనిని డాక్టర్ రాజీవ్ బహల్ వివరించారు. చికిత్సా విధానాల ప్రామాణీకరణపై మాట్లాడుతూ...ప్రామాణీకరించిన అల్గారిథమ్‌ల ఆధారంగా చికిత్స అందించడం ద్వారా ఆరోగ్య సేవల్లో మరింత స్థిరత్వం, నాణ్యతను నిర్ధారించవచ్చని తెలిపారు. ఐసీఎంఆర్ ఇప్పటికే 150కి పైగా ప్రామాణిక చికిత్సా విధానాలు, మార్గదర్శకాలను అభివృద్ధి చేసిందని పేర్కొన్నారు. ఆరోగ్య సేవల్లో వ్యయ-సామర్థ్యం ప్రాముఖ్యతను కూడా ఆయన వివరించారు. డీహెచ్‌ఆర్ ఆధ్వర్యంలోని భారత్‌లో ఆరోగ్య సాంకేతికతల మూల్యాంకన కార్యక్రమం (హెచ్‌టీఏఐఎన్) ఆరోగ్య సాంకేతికతలు, జోక్యాల వ్యయ-సామర్థ్యాన్ని మూల్యాంకనం చేస్తుందని తెలిపారు.
ఆయుష్మాన్ భారత్ పీఎం-జేఏవై ఎనిమిదేళ్లు, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అయిదేళ్లు పూర్తి చేసుకొని రెండు కీలక మైలురాళ్లను సాధించినందుకు అన్ని భాగస్వామ్య వర్గాలకు ఎన్‌హెచ్‌ఏ సీఈఓ శ్రీ సునీల్ కుమార్ బర్న్‌వాల్ అభినందనలు తెలిపారు. ఈ రెండు కార్యక్రమాల విస్తృతి, చేరువను ఆయన వివరించారు. దేశవ్యాప్తంగా 49 కోట్లకు పైగా ఆయుష్మాన్ కార్డులు, సుమారు 98 కోట్లకు అబా ఐడీలు జారీ చేసినట్లు తెలిపారు.
భవిష్యత్తు కార్యాచరణను ప్రస్తావిస్తూ.. ఆయుష్మాన్ భారత్ పీఎం-జేఏవై ఇప్పటివరకు 13 కోట్లకు పైగా రోగుల ఆరోగ్య రికార్డులను సృష్టించిందని, ఇది పరిశోధన, అభివృద్ధి, ఆరోగ్య విశ్లేషణలకు విలువైన సమాచార నిధిగా ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. రోగుల గుర్తింపును భద్రపరుస్తూనే, ఇటువంటి డేటాను బాధ్యతాయుతంగా వినియోగించేందుకు సురక్షిత డేటా వాతావరణం దోహదపడుతుందని చెప్పారు. అలాగే స్వయంచాలక క్లెయిమ్‌ల పరిష్కార విధానాన్ని ప్రారంభించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. సాంకేతికత, డేటా ఆధారిత ప్రక్రియల ద్వారా ఏబీ పీఎం జేఏవై కింద క్లెయిమ్‌ల పరిశీలన, పరిష్కార ప్రక్రియను మరింత సరళీకరించి, బలోపేతం చేయడం ఈ విధానం లక్ష్యమని తెలిపారు.
భారత్ ఆరోగ్య భరోసా వ్యవస్థకు డిజిటల్ పునాదులను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా చేపట్టిన పలు కార్యక్రమాలను ప్రారంభించడం ఆరోగ్య మంథన్ 2026లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. వీటిలో జాతీయ ఆరోగ్య సేవల ప్రదాతల నమోదు జాబితా (ఎన్‌హెచ్‌పీఆర్) మొబైల్ యాప్, చెల్లింపుదారుల కోసం ఎన్‌హెచ్‌సీఎక్స్ అమలు మార్గదర్శిని, మోడల్ డిజిటల్ వైద్య సదుపాయం కోసం మార్గదర్శక పుస్తకం, సురక్షిత డేటా వాతావరణం అప్లికేషన్, ఏబీ పీఎం జేఏవై కింద స్వయంచాలక క్లెయిమ్‌ల పరిష్కార విధానం ఉన్నాయి.
బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ) సహకారంతో జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏ) అభివృద్ధి చేసిన సురక్షిత డేటా వాతావరణం, ఏబీ పీఎం జేఏవై, ఏబీడీఎంకు సంబంధించిన ఆరోగ్య డేటాను యాక్సెస్ చేయడానికి, విశ్లేషించేందుకు నియంత్రిత వాతావరణంగా రూపొందించారు. అనుమతి పొందిన సంస్థలు వ్యక్తిగత గుర్తింపును తొలగించిన డేటాతో పని చేయడం లేదా ఎన్‌హెచ్‌ఏకు చెందిన ప్రత్యేకంగా వేరుచేసిన వాతావరణంలో కోడ్‌ను అమలు చేయడం వీలవుతుంది. విడుదలకు ముందు రూపొందించిన ఫలితాలను సమీక్షించే విధానం కూడా ఇందులో ఉంటుంది. వ్యక్తిగత డేటా రక్షణకు అవసరమైన భద్రతా చర్యలను కలిగి ఉండే ఈ కార్యక్రమం ఆరోగ్య పరిశోధన, కార్యక్రమాల ప్రణాళిక, ఫలితాల విశ్లేషణ, బాధ్యతాయుతమైన కృత్రిమ మేధ ఆవిష్కరణలకు దోహదపడేలా రూపొందించారు.
ఆరోగ్య మంథన్ 2026లో జరిగిన చర్చలు ఆరోగ్య సేవల సామర్థ్యం, నాణ్యత, వివిధ డిజిటల్ వ్యవస్థల మధ్య పరస్పర అనుసంధానాన్ని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించాయి. “ఆరోగ్య బీమా ప్రక్రియలను సరళీకరించేందుకు ఎన్‌హెచ్‌సీఎక్స్” అంశంపై జరిగిన సమావేశంలో ఆరోగ్య బీమా ప్రక్రియలను సరళంగా, ప్రామాణికంగా, సాంకేతికత ఆధారంగా నిర్వహించడంలో జాతీయ ఆరోగ్య క్లెయిమ్‌ల మార్పిడి వేదిక పోషించే పాత్రను పరిశీలించారు. పరస్పర అనుసంధాన సామర్థ్యం కలిగిన డిజిటల్ క్లెయిమ్‌ల మౌలిక వసతులు సామర్థ్యాన్ని ఎలా మెరుగుపరుస్తాయి, ఆరోగ్య బీమా వ్యవస్థలోని వివిధ భాగస్వామ్య వర్గాల మధ్య సమన్వయాన్ని ఎలా బలోపేతం చేస్తాయి, ఆరోగ్య రంగానికి అవసరమైన ఆర్థిక వనరుల సమీకరణలో కొత్త అవకాశాలను ఎలా కల్పిస్తాయనే అంశాలపై చర్చించారు.
అనంతరం ఏబీ పీఎం జేఏవై, ఏబీడీఎం విభాగాల కింద సమాంతర సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో ఆయా కార్యక్రమాల అమలు, ఆరోగ్య సేవల అందజేత, డిజిటల్ పరివర్తనకు సంబంధించిన ముఖ్యమైన అంశాలను పరిశీలించారు.
ఏబీ పీఎం జేఏవై విభాగంలో “క్లెయిమ్‌ల ప్రాసెసింగ్ నుంచి ఇంటెలిజెంట్ అస్యూరెన్స్ వరకు: ఏబీ పీఎం జేఏవైలో పరివర్తన” అంశంపై సమావేశం జరిగింది. ఇందులో క్లెయిమ్‌ల ప్రాసెసింగ్‌ను, కార్యక్రమం సమగ్రతను మరింత బలోపేతం చేసేందుకు సాంకేతికత, డేటా, డేటా విశ్లేషణలను ఎలా ఉపయోగించాలనే అంశాలను పరిశీలించారు. “నాణ్యత, వ్యయ-సామర్థ్య దృక్పథంలో వ్యూహాత్మక కొనుగోళ్లు” అనే అంశంపై జరిగిన సమావేశంలో ఆరోగ్య సేవల నాణ్యతను మెరుగుపరచడంతో పాటు, అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించే విధానాలపై చర్చించారు.
ఏబీడీఎం విభాగంలో ‘‘ఆరోగ్య సేవల అందుబాటును మెరుగుపరచడంలో యూహెచ్‌ఐ పాత్ర’’ అంశంపై చర్చలు జరిగాయి. ఆరోగ్య వ్యవస్థలో సేవలను మరింత విస్తృతం చేయడానికి, భాగస్వామ్యాన్ని పెంచడానికి డిజిటల్ వేదికలు ఏ విధంగా తోడ్పడతాయనే దానిపై ఇందులో ప్రధానంగా దృష్టి సారించారు.దీంతో పాటు ‘‘మెరుగైన ఆరోగ్య సేవలను అందించడానికి ప్రమాణాల వినియోగం’’ అంశంపైనా చర్చించారు. ఆరోగ్య సమాచారాన్ని ఒక వ్యవస్థ నుంచి మరో వ్యవస్థకు సులభంగా, అంతరాయం లేకుండా మార్పిడి చేసేందుకు ఉమ్మడి ఆరోగ్య డేటా ప్రమాణాల ప్రాముఖ్యతను పరిశీలించారు. ఇవి ఆరోగ్య సేవలను నిరంతరంగా, మెరుగైన నాణ్యతతో అందించేందుకు ఎలా దోహదపడతాయనే అంశంపైనా చర్చించారు.
ఏబీ పీఎం జేఏవై, ఏబీడీఎం కార్యక్రమాల అమలులో వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కూడా ఈ కార్యక్రమంలో గుర్తించారు. ఏబీ పీఎం జేఏవై, ఏబీడీఎం కింద పెద్ద రాష్ట్రం, చిన్న రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం అనే విభాగాల్లో వరుసగా ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, అంగన్‌వాడీ సహాయకులు లబ్ధిదారుల్లో అత్యధిక ఆయుష్మాన్ కార్డులు పంపిణీ చేసినందుకు గానూ ఆంధ్రప్రదేశ్, సిక్కిం, జమ్మూ కశ్మీర్‌లను గుర్తించారు. అలాగే రాష్ట్రాల మధ్య పోర్టబిలిటీ కింద క్లెయిమ్‌ల పరిష్కారంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలుగా ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, గుజరాత్‌లను గుర్తించారు.
ఏబీడీఎం పథకం కింద జిల్లా జనాభా ఆధారంగా రూపొందించిన విభాగాల్లోని మోడల్ జిల్లాల పనితీరు ఆధారంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుగా బిహార్, లడఖ్, దాద్రా, నగర్ హవేలీలను గుర్తించారు. అలాగే చిన్న రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం, మధ్యస్థ రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం, పెద్ద రాష్ట్రం అనే విభాగాల్లో ఏబీడీఎం అనుసంధానమైన ఆరోగ్య నిర్వహణ సమాచార వ్యవస్థలు (హెచ్‌ఎంఐఎస్)ను ఉపయోగిస్తున్న సబ్-సెంటర్ల అత్యధిక సంఖ్యను కలిగి ఉన్నందుకు వరుసగా చండీగఢ్, అస్సాం, ఉత్తరప్రదేశ్‌లను గుర్తించారు.
***
(రిలీజ్ ఐడి: 2315136)
సందర్శకుల సూచీ సంఖ్య : : 12