ఆర్థిక మంత్రిత్వ శాఖ
ముంబై విమానాశ్రయంలో సుమారు రూ. 15 కోట్ల విలువైన 9.40 కిలోల విదేశీ బంగారాన్ని పట్టుకున్న డీఆర్ఐ - ముగ్గురు అరెస్టు
పాల పొడి, ఓట్స్, బియ్యపు పిండి, కేక్ మిశ్రమం వంటి ఆహార పదార్థాల్లో బంగారం పొడిని చాకచక్యంగా కలిపి అక్రమ రవాణా
నాడు పోస్టు చేయడమైనది:
25 SEP 2026 4:43PM by PIB Hyderabad
బంగారం అక్రమ రవాణాను అరికట్టే పటిష్టమైన చర్యల్లో భాగంగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) ముంబై జోనల్ యూనిట్ కచ్చితమైన సమాచారం ఆధారంగా ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ముగ్గురు భారతీయ ప్రయాణికులను అడ్డుకుంది. దుబాయ్ నుంచి ముంబై విమానాశ్రయానికి 23.09.2026 తెల్లవారుజామున చేరుకున్న వారిని. ముంబై విమానాశ్రయ కస్టమ్స్ విభాగానికి చెందిన ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఏఐయూ) సహకారంతో డీఆర్ఐ అధికారులు తనిఖీ చేశారు.



వారి లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేయగా, బంగారం స్మగ్లింగ్ కోసం వారు ఉపయోగించిన అత్యంత సంక్లిష్టమైన, వినూత్నమైన మార్గం బయటపడింది. అధికారుల తనిఖీల నుంచి తప్పించుకోవడానికి విదేశీ బంగారాన్ని మెత్తటి పొడిగా మార్చి అదే రంగు, పరిమాణం, ఆకృతి కలిగిన ప్యాక్ చేసిన ఆహార పదార్థాలలో చాలా తెలివిగా కలిపినట్లు తేలింది.
పాల పొడి, ఓట్స్, పలు రకాల పిండి, నుటెల్లా, కొబ్బరి పాల పొడి వంటి సాధారణమైనవిగా కనిపించే అనేక ఆహార ప్యాకెట్లలో ఈ బంగారు పొడి దాచినట్లు కనుగొన్నారు. ఈ ముగ్గురు ప్రయాణికుల లగేజీ నుంచి మొత్తం సుమారు 33.50 కిలోల బంగారు పొడి కలిపిన ఆహార పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
జాగ్రత్తగా వేరుచేసి, నాణ్యతా పరీక్షలు నిర్వహించిన తర్వాత, కస్టమ్స్ చట్టం, 1962లోని సంబంధిత నిబంధనల ప్రకారం సుమారు రూ. 14.81 కోట్ల విలువైన 9.40 కిలోల విదేశీ బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. విచారణ సమయంలో, ఒకే వ్యవస్థీకృత బంగారం అక్రమ రవాణా ముఠా తరఫున పనిచేస్తున్నట్లు ఈ ముగ్గురు ప్రయాణికులు అంగీకరించారు. వారిని కస్టమ్స్ చట్టం, 1962 కింద అరెస్టు చేశారు.
డీఆర్ఐ నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో బంగారం అక్రమ రవాణాకు పాల్పడుతున్న కొత్త, అత్యంత అధునాతన పద్ధతి వెలుగులోకి వచ్చింది. సాధారణ తనిఖీల్లో గుర్తించకుండా తప్పించుకునేందుకు బంగారు పొడిని వివిధ రకాల ప్యాక్ చేసిన ఆహార పదార్థాల్లో చాకచక్యంగా కలిపి తరలిస్తున్నట్లు బయటపడింది.
***
(రిలీజ్ ఐడి: 2314998)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11