వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

14వ తూర్పు ఆసియా దేశాల ఆర్థిక మంత్రుల సమావేశంలో, 23వ ఆసియాన్-భారత్ ఆర్థిక మంత్రుల సంప్రదింపుల్లో పాల్గొన్న భారత్


2025-26లో 128.38 బిలియన్లకు చేరుకున్న భారత్-ఆసియాన్ వాణిజ్యం

నాడు పోస్టు చేయడమైనది: 24 SEP 2026 7:32PM by PIB Hyderabad

వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి శ్రీ నితిన్ కుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత ప్రతినిధి బృందం ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరిగిన 14వ తూర్పు ఆసియా దేశాల శిఖరాగ్ర సదస్సు ఆర్థిక మంత్రుల సమావేశం (ఈఏఎస్-ఈఎంఎం), 23వ ఆసియాన్-భారత్ ఆర్థిక మంత్రుల సంప్రదింపుల్లో పాల్గొంది.

ఈ సమావేశంలో బ్రూనై, కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, తైమూర్-లెస్టె, వియత్నాం... మొత్తం 11 ఆసియాన్ దేశాల ఆర్థిక మంత్రులు, వారి ప్రతినిధులతో పాటు భారత్, ఆస్ట్రేలియా, చైనా, జపాన్, న్యూజిలాండ్, కొరియా, రష్యా, యునైటెడ్ స్టేట్స్ వంటి ఈఏఎస్ భాగస్వామ్య దేశాలు పాల్గొన్నాయి.

ప్రస్తుత ప్రాంతీయ, ప్రపంచ ఆర్థిక పరిణామాలపై వివిధ దృక్పథాలను పరస్పరం పంచుకునేందుకు ఈ సమావేశాలు దోహదపడ్డాయి. వాణిజ్యం, పెట్టుబడులపై ప్రభావాల గురించి 2027 సంవత్సరానికి సంబంధించి ప్రాంతీయ, ప్రపంచ ఆర్థిక దృక్పథంపై ఆసియాన్ సెక్రటేరియట్ వివరణను ఇచ్చింది.

"ఈఏఎస్ ప్రాంతం తదుపరి వృద్ధికి ఊతం: ఇంధన భద్రత, పారిశ్రామిక సమూహాల కోసం సమగ్ర విధానం" పేరుతో ఎకనామిక్ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్ ఫర్ ఆసియాన్ అండ్ ఈస్ట్ ఆసియా (ఈఆర్‌ఐఏ) పత్రాన్ని సమర్పించింది. ఇంధన మౌలిక సదుపాయాలు, డిజిటల్, పారిశ్రామిక డిమాండ్, సమన్వయంతో కూడిన వాణిజ్య, పెట్టుబడి విధానాలను ఒకచోట చేర్చుతూ ఇంధన భద్రత, పారిశ్రామిక సమూహాల కోసం సమగ్ర విధానాన్ని ఈ పత్రం రూపుపొందించింది.

ఆసియాన్-భారత్ ఆర్థిక మంత్రుల సంప్రదింపుల సందర్భంగా బలమైన వాణిజ్య భాగస్వామ్యాలను పెంపొందించేందుకు, ప్రాంతీయ వాణిజ్య ఒప్పందాలు పరస్పరం ప్రయోజనకరంగా ఉండేలా చూడటానికి భారత్ నిబద్ధతను స్పష్టం చేసింది. ఈ చర్చల్లో భాగంగా వాణిజ్య అసమతుల్యతలను పరిష్కరించేందుకు, మెరుగైన వాణిజ్య రాకపోకలను సులభతరం చేసేందుకు ఉద్దేశించిన ఆసియాన్-ఇండియా వస్తువుల వాణిజ్య ఒప్పందం (ఏఐటీఐజీఏ) కొనసాగుతున్న సమీక్షపై ప్రత్యేక దృష్టి సారించింది.

2025-26లో భారత్-ఆసియాన్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 128.38 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంది. భారతదేశ మొత్తం ప్రపంచ వాణిజ్యంలో ఆసియాన్ వాటా 10.55 శాతంగా ఉండటం... భాగస్వామ్య ప్రాముఖ్యతను స్పష్టం చేస్తోంది.

ఏఐటీఐజీఏ సమీక్ష ఫలితం ఇరువర్గాలకు పరస్పర ప్రయోజనకరంగా ఉండేలా చూస్తామని భారత్ నిబద్ధతను స్పష్టం చేసింది. ఈ ఒప్పందాన్ని మరింత సమర్థవంతంగా, ప్రభావవంతంగా, వినియోగదారులకు అనుకూలంగా, వ్యాపారాలకు సులభతరంగా మార్చటమే దీని లక్ష్యం.

ఈ సమావేశాల సందర్భంగా ఫిలిప్పీన్స్‌లో వ్యాపారాలు నిర్వహిస్తున్న భారత పారిశ్రామికవేత్తలతో సెప్టెంబర్ 22, 2026న భారత ప్రతినిధి బృందం సమావేశమైంది. వస్తు, సేవల ఎగుమతిలో వారు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చలు జరిపింది. సెప్టెంబర్ 23, 2026న నిర్వహించిన ఆసియాన్-ఇండియా బిజినెస్ ఫోరం-2026లో కూడా ఈ ప్రతినిధి బృందం పాల్గొంది.

 

***


(రిలీజ్ ఐడి: 2314727) సందర్శకుల సూచీ సంఖ్య : : 21
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Marathi , Malayalam , English , Urdu , हिन्दी , Bengali , Gujarati