కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
నిబంధనలు పాటించని నిధి కంపెనీల అధిక రాబడి హామీల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించిన ఎంసీఏ
ఎన్‌డీహెచ్ - 4 దాఖలు తప్పనిసరి.. ఇప్పటివరకు 395 సంస్థలకే నిధి కంపెనీలుగా గుర్తింపు
నిధి కంపెనీల్లోని డిపాజిట్లకు డీఐసీజీసీ బీమా రక్షణ లేదని స్పష్టీకరణ
నాడు పోస్టు చేయడమైనది:
24 SEP 2026 5:11PM by PIB Hyderabad
నిధి కంపెనీలు, వాటి కార్యకలాపాలపై కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంసీఏ) ప్రజలను అప్రమత్తం చేసింది. ముఖ్యంగా అధిక రాబడులు ఇస్తామంటూ హామీ ఇచ్చే సంస్థల్లో సరైన నేపథ్య పరిశీలన లేకుండా పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవద్దని ప్రజలను హెచ్చరించింది.
ఎన్‌డీహెచ్ - 4 దరఖాస్తులను పరిశీలించే సమయంలో, అనేక నిధి కంపెనీలు సంబంధిత చట్టం, దాని కింద రూపొందించిన నిబంధనలను పూర్తిస్థాయిలో పాటించడం లేదని ఎంసీఏ గుర్తించింది. అలాగే, నిధి నిబంధనల ప్రకారం నిర్దేశించిన గడువులోగా నిధి కంపెనీలుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న అనేక సంస్థలు ఎన్‌డీహెచ్ - 4 దరఖాస్తును దాఖలు చేయలేదని కూడా గుర్తించింది.
‘నిధి’గా పనిచేయాలనుకునే ప్రతి కంపెనీ, తనను ‘నిధి’గా ప్రకటించేందుకు లేదా ఆ హోదాను నవీకరించేందుకు ఎన్‌డీహెచ్-4 ఫారంలో దరఖాస్తు దాఖలు చేయాలి.
అసాధారణంగా అధిక రాబడులు ఇస్తామంటూ ఏజెంట్లు చేసే హామీలు లేదా అనధికారిక భరోసాలపై మాత్రమే ఆధారపడి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవద్దని ప్రజలకు సూచించారు. సంబంధిత కంపెనీని కేంద్ర ప్రభుత్వం ‘నిధి’గా ప్రకటించిందో లేదో స్వయంగా నిర్ధారించుకోవడంతో పాటు, పెట్టుబడి నిబంధనలు, కాలవ్యవధిని జాగ్రత్తగా పరిశీలించాలి.
అసాధారణ స్థాయిలో అధిక రాబడులు ఇస్తామని ఆశచూపి అనేక కంపెనీలు తమ సభ్యులను ప్రలోభపెడుతున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. ఏజెంట్లు ఇచ్చే అసాధారణ రాబడుల హామీలపైగానీ, అనధికారిక వాగ్దానాలపైగానీ ఆధారపడి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవద్దని కేంద్ర ప్రభుత్వం ప్రజలను హెచ్చరిస్తోంది. తాము పెట్టుబడి పెట్టే కంపెనీని కేంద్ర ప్రభుత్వం 'నిధి' కంపెనీగా గుర్తించిందో లేదో స్వయంగా సరిచూసుకోవాలని, దానికి సంబంధించిన నియమ నిబంధనలను, కాలపరిమితిని క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించింది.
నిధి కంపెనీలు స్వీకరించే డిపాజిట్లకు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) బీమా రక్షణ ఉండదని, కంపెనీ విఫలమైనా లేదా మోసానికి గురైనా డిపాజిట్ చేసిన మొత్తాన్ని తిరిగి పొందడం చాలా కష్టంగా మారవచ్చు లేదా పూర్తిస్థాయిలో రికవరీ కాకపోవచ్చునని ఎంసీఏ స్పష్టం చేసింది.
నిధి కంపెనీలు పరస్పర ప్రయోజనం కోసం ఏర్పాటైన సంస్థలు. కంపెనీల చట్టం, 2013, నిధి నిబంధనలు, 2014 ప్రకారం కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంసీఏ) వీటిని నియంత్రిస్తుంది. ఇవి తమ సభ్యుల నుంచి మాత్రమే డిపాజిట్లు స్వీకరించి, సభ్యులకు మాత్రమే రుణాలు అందించగలవు.
గతంలో అమల్లో ఉన్న 1956 కంపెనీల చట్టంలోని సెక్షన్ 620ఏ నిబంధనల ప్రకారం, 'నిధి' కంపెనీలుగా పనిచేయాలని భావించే సంస్థలను కేంద్ర ప్రభుత్వం "నిధులు"గా ప్రకటించేది. అయితే, కంపెనీల చట్టం 2013 లోని సెక్షన్ 406 ప్రకారం, మొదట్లో ఒక కంపెనీ నిధి కంపెనీగా నమోదై పనిచేసే అవకాశం ఉండేది; కానీ అది 'నిధి నిబంధనలు, 2014' కింద పేర్కొన్న పలు నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి వచ్చేది.
అయితే, 15.08.2019 నుంచి అమలులోకి వచ్చేలా సెక్షన్ 406 ను, నిధి రూల్స్ (2014)ను సవరించారు. దీని ద్వారా 1956 కంపెనీల చట్టం తరహాలోనే, ఒక కంపెనీని 'నిధి' కంపెనీగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలనే నిబంధనను తిరిగి ప్రవేశపెట్టారు.
కంపెనీల చట్టం 1956/2013 నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వం 'నిధి' కంపెనీలుగా ప్రకటించిన 395 కంపెనీల జాబితాను సాధారణ ప్రజల సమాచారం కోసం ఇప్పటికే ఎమ్‌సిఏ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. దీనికి సంబంధించిన సమాచారం కోసం, 03.11.2025న ఎమ్‌సిఏ పోర్టల్‌లో ప్రచురించిన క్రియాశీల నిధి కంపెనీల జాబితా కోసం (https://www.mca.gov.in/bin/dms/getdocument?mds=J1d7pR2ZnYPDVBpl1gFu4w%253D%253D&type=open). లింక్‌ను చూడవచ్చు
***
(రిలీజ్ ఐడి: 2314703)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6