రైల్వే మంత్రిత్వ శాఖ
వడోదర విభాగంలో అల్కాపురిలో రోడ్డు ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ. 166.5 కోట్లను ఆమోదించిన భారతీయ రైల్వే
ప్రస్తుత అల్కాపురి రహదారి అనుసంధానం మెరుగుదల, ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి నాలుగు లైన్ల గ్రేడ్-సెపరేటెడ్ రోడ్డు సౌకర్యం
నాడు పోస్టు చేయడమైనది:
24 SEP 2026 3:21PM by PIB Hyderabad
పశ్చిమ రైల్వే పరిధిలోని వడోదర విభాగం అల్కాపురిలో రోడ్డు ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబీ) నిర్మాణానికి భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఖర్చును పంచుకునే విధానంలో ఈ ప్రాజెక్టును మొత్తం రూ.166.5 కోట్ల వ్యయంతో చేపట్టనున్నాయి.
ఈ ప్రాజెక్టు ఖర్చును అటు భారతీయ రైల్వే, ఇటు రాష్ట్ర ప్రభుత్వం సమానంగా భరిస్తాయి. రైల్వే వాటా సుమారు రూ.83.2769 కోట్లు కాగా, రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా దాదాపు రూ.83.2769 కోట్లుగా ఉంటుంది.
ప్రస్తుత రోడ్డు అనుసంధానాన్ని మెరుగుపరిచేందుకు నాలుగు లైన్ల రోడ్డు ఓవర్ బ్రిడ్జి
వడోదర రైల్వే స్టేషన్ సమీపంలోని ప్రస్తుత అల్కాపురి రోడ్డు అండర్ బ్రిడ్జి (ఆర్‌యూబీ).. వడోదర నగరంలోని అల్కాపురి, కాలాఘోడా ప్రాంతాల మధ్య తూర్పు-పడమర రహదారి అనుసంధానానికి కీలక మార్గంగా కొనసాగుతోంది. అయితే ప్రస్తుత ఆర్‌యూబీ ఎత్తు కేవలం 3.0 మీటర్లు మాత్రమే ఉండటంతో పెద్ద వాహనాల రాకపోకలపై ఆంక్షలు ఉన్నాయి. వర్షాకాలంలో తరచుగా నీరు నిలిచిపోవడం కూడా సమస్యగా మారుతోంది.
ఈ అడ్డంకుల కారణంగా ట్రాఫిక్ రద్దీ, రహదారి నిర్వహణలో ఇబ్బందులు తలెత్తడంతోపాటు ప్రయాణికులు సైతం అసౌకర్యానికి గురవుతున్నారు. కొత్త నాలుగు లైన్ల రహదారి వంతెన సదుపాయం అందుబాటులోకి రావడం వల్ల ప్రస్తుత రోడ్డు క్రాసింగ్ వ్యవస్థ సామర్థ్యం, పనితీరు మెరుగుపడనున్నాయి.
ప్రధాన రవాణా సదుపాయాలకు మెరుగైన అనుసంధానం
రైల్వే కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా, మరింత మెరుగైన, సమర్థవంతంగా రహదారి దాటే సదుపాయాన్ని ఈ రోడ్డు ఓవర్ బ్రిడ్జి అందిస్తుంది. వడోదర రైల్వే స్టేషన్, జీఎస్ఎఆర్‌టీసీ బస్ స్టేషన్, రాబోయే హైస్పీడ్ రైలు (బుల్లెట్ రైలు) స్టేషన్‌లకు కూడా ఇది ముఖ్యమైన అనుసంధానాన్ని కల్పిస్తుంది.
పెరుగుతున్న ట్రాఫిక్ అవసరాలకు పరిష్కారం
ట్రాఫిక్ అంచనా ప్రకారం, రద్దీ సమయాల్లో గంటకు 1,600కు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు, పాదచారులకు సరైన సదుపాయాలు లేకపోవడం వంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. దీంతో ప్రస్తుత ఆర్‌యూబీ ఆ ప్రాంతంలోని ప్రస్తుత, భవిష్యత్తు ట్రాఫిక్ అవసరాలను తీర్చడానికి సరిపోవడం లేదు.
ప్రస్తుత ఆర్‌యూబీ కార్యాచరణ పరిమితులను తొలగించడంతో పాటు, వడోదరలోని కీలక ప్రాంతాల్లో రహదారి అనుసంధానాన్ని ఈ నాలుగు లైన్ల రహదారి వంతెన సదుపాయం మెరుగుపరుస్తుంది.
ఈ ప్రాజెక్టు వడోదర రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో రహదారి అనుసంధానాన్ని బలోపేతం చేస్తుంది. మరింత సమర్థవంతమైన రహదారి దాటే సదుపాయాన్ని అందిస్తూ, ప్రస్తుత అల్కాపురి ఆర్‌యూబీలో ఉన్న పరిమితులను తొలగిస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 2314467)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4