రైల్వే మంత్రిత్వ శాఖ
దక్షిణ మధ్య రైల్వేలో మొదటిసారి కవచ్ 4.0 వ్యవస్థను ప్రారంభించిన భారతీయ రైల్వే.. ఇది రైల్వే భద్రత దిశగా ఓ కీలక ప్రగతి సూచిక
హైదరాబాద్ డివిజన్.. మల్కాజ్‌గిరి- కామారెడ్డి సెక్షన్లో 108 రూట్ కిలోమీటర్ల మేర కవచ్ 3.2 వెర్షన్ ఉండగా, దానిని కవచ్ 4.0 వెర్షన్ స్థాయికి ఉన్నతీకరణ
ప్రాంత సంబంధిత కచ్చితత్వ సమాచారం పెంపు..
పెద్ద యార్డుల్లో మెరుగైన సిగ్నల్ సంబంధిత సమాచారం..
భద్రతను, విశ్వసనీయతను బలోపేతం చేయడానికి స్టేషన్ నుంచి స్టేషన్ వరకు ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఇంటర్‌ఫేస్‌తో పాటు డైరెక్ట్ ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ ఇంటర్‌ఫేస్ సదుపాయాలు
నాడు పోస్టు చేయడమైనది:
23 SEP 2026 12:18PM by PIB Hyderabad
రైలు భద్రతలో ఓ కీలక అధ్యాయానికి భారతీయ రైల్వే నాంది పలికింది. కవచ్ వెర్షన్లో 4.0 స్థాయిని దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్)లో మొదటిసారి విజయవంతంగా అమల్లోకి తీసుకువచ్చింది. హైదరాబాద్ డివిజన్.. మల్కాజ్‌గిరి-కామారెడ్డి సెక్షన్లో 108 కిలోమీటర్ల కన్న ఎక్కువ మార్గంలో కవచ్ 3.2 వెర్షన్ అమల్లో ఉండగా, దాని స్థానంలో కవచ్ 4.0 వెర్షన్‌ను అమర్చే పనిని విజయవంతంగా పూర్తి చేశారు.
దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్)లో 1,465 కి.మీ. మార్గంలో కవచ్ 3.2 వెర్షన్‌ను జయప్రదంగా నిర్వహించి సంపాదించిన అనుభవాన్ని ఆధారంగా చేసుకొని, నూతన వెర్షన్లో మరింత మెరుగైన సాంకేతికతను జతపరిచారు. కవచ్ 4.0 అధిక భద్రతనూ, ఉన్నత సాంకేతికతనూ, అధిక విశ్వసనీయతనూ, రైళ్ల రాకపోకల నిర్వహణలో సురక్షనూ సమకూరుస్తుంది. దీనిని భారతీయ రైల్వేలో విస్తృత స్థాయిలో అమలు చేయాలని సంకల్పించారు.
భారతదేశంలో వివిధ రైల్వే నెట్‌వర్కులకు కవచ్ 4.0 తో ఉన్నత స్థాయి భద్రత సౌకర్యాలు అందుబాటులోకి
కవచ్ వెర్షన్ 4.0ను పలు విధాలుగా అభివృద్ధిపరిచి, పరీక్షించారు. ఇక దీనిని భారతీయ రైల్వే ఆధ్వర్యంలో ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ (ఏటీపీ) వ్యవస్థగా ఉపయోగంలోకి తీసుకువస్తున్నారు. భారతీయ రైల్వే నెట్‌వర్కుకు చెందిన వివిధ కార్యకలాపాలకు సంబంధించి నిర్వహణ పరమైన, సాంకేతిక పరమైన అవసరాల్ని తీర్చడానికి అవసరపడే ముఖ్యమైన మెరుగుదల చర్యలను తాజా వెర్షన్‌లో ఇమిడ్చారు.
కవచ్ 4.0లో జతపరిచిన కీలక అంశాలు ఈ కింది విధంగా ఉన్నాయి:
ప్రాంతాన్ని గుర్తించడంలో కచ్చితత్వాన్ని పెంచారు.. దీంతో రైళ్లు ఎక్కడున్నదీ మరింత పక్కాగా నిర్ధారించడం సాధ్యపడుతుంది.
పెద్ద యార్డుల్లో సిగ్నల్ సంబంధిత అంశాలను మెరుగ్గా తెలుసుకొనే సౌకర్యం.. దీని వల్ల రైలు రాక పోకల కాలంలో ఏ సమయంలో ఎక్కడ ఉందన్న అవగాహన పెరుగుతుంది.
ఇది వరకటితో పోలిస్తే అభివృద్ధి పరిచిన కమ్యూనికేషన్, సిస్టమ్ ఏకీకరణ కోసం ఆప్టికల్ ఫైబర్ కేబుల్ (ఓఎఫ్‌సీ) మాధ్యమం ద్వారా స్టేషన్‌కూ స్టేషన్‌కూ మధ్య కవచ్ ఇంటర్‌ఫేస్‌ను కల్పించారు.
ఇప్పటి ఎలక్ట్రానిక్ సిగ్నలింగ్ సిస్టమ్‌తో నేరుగా ఇంటర్‌ఫేస్ సదుపాయాన్ని కల్పించారు. దీనివల్ల ప్రస్తుత సిగ్నలింగ్ సంబంధిత మౌలిక సదుపాయాలతో మెరుగైన ఏకీకరణ సాధ్యపడింది.
ఈ మెరుగుదల పనులతో కవచ్ 4.0 దేశంలో స్వదేశీ ఆటోమేటిక్ ట్రయిన్ ప్రొటెక్షన్ టెక్నాలజీలో ఓ ప్రధాన పురోగతి చోటు చేసుకుంది. దీనితో భారతీయ రైల్వేలో విస్తృత స్థాయిలో ఉపయోగించడానికి ప్రబల సాంకేతిక పునాది పడింది.
దేశీయంగా అభివృద్ధిపరిచిన కవచ్‌తో రైలు భద్రత మెరుగుదల
దేశీయంగా అభివృద్ధిపరిచిన ఆటోమేటిక్ ట్రయిన్ ప్రొటెక్షన్ సిస్టమే కవచ్. దీనిని రైళ్ల రాకపోకల్లో భద్రతను పెంచే లక్ష్యంతో రూపొందించారు. లోకో రైళ్లను నిర్ధారిత వేగ పరిమితిని మించకుండా ఉంచడంలో ఈ వ్యవస్థ పైలట్లకు సాయపడుతుంది. ఈ పనిని చేయడంలో లోకో పైలట్ విఫలమైన పక్షంలో, అవసరం అయినప్పుడు ఈ వ్యవస్థ తనంతట తనే బ్రేకులను వేయగలుగుతుంది.
అపాయకర స్థితిలో సిగ్నల్‌ను దాటి వెళ్లే (సిగ్నల్ పాసింగ్ ఎట్ డేంజర్.. ఎస్‌పీఏడీ) ఘటన నుంచి కాపాడటానికీ, క్లిష్ట పరిస్థితుల్లో రైలు వేగాన్ని అదుపు చేయడానికీ, ప్రమాదాలకు లోనయ్యే ముప్పును తగ్గించడానికీ కవచ్‌ను రూపొందించారు. ఈ వ్యవస్థ అననుకూల వాతావరణ స్థితిలో కూడా రైలును సురక్షితంగా నడపడంలో సాయపడుతుంది.
అత్యధిక సాంకేతిక ఆధారిత భద్రత వ్యవస్థగా తీర్చిదిద్దిన కవచ్.. అత్యున్నత స్థాయి సురక్ష ధ్రువీకరణపత్రం ‘సేఫ్టీ ఇంటెగ్రిటీ లెవెల్-4’ (ఎస్ఐఎల్-4)ను అందుకోవలసి ఉంటుంది.
కవచ్‌ను రంగంలోకి దింపడానికి విస్తృత స్థాయిలో మౌలిక సదుపాయాలు అవసరం
కవచ్ వ్యవస్థను అమల్లోకి తీసుకురావడానికి రైల్వే సెక్షన్లలో అనేక సాంకేతిక విజ్ఞాన సంబంధిత కాంపొనెంట్లతో పాటు కమ్యూనికేషన్ కాంపొనెంట్లను వినియోగించవలసి వస్తుంది. వాటిలో ఈ కింద ప్రస్తావించినవి భాగంగా ఉంటాయి:
• స్టేషన్లలో, బ్లాక్ సెక్షన్లలో స్టేషన్ కవచ్‌ను ఏర్పాటు చేయడం.
• ట్రాక్ పొడవునా ఆర్ఎఫ్ఐడీ ట్యాగులను అమర్చడం.
• పూర్తి సెక్షన్లో కమ్యూనికేషన్ టవర్లను నెలకొల్పడం.
• రైల్వే ట్రాక్‌తో పాటే ఆప్టికల్ ఫైబర్ కేబుల్‌ను వేయడం.
• భారతీయ రైల్వేలో సేవలందిస్తున్న ఇంజన్లలో లోకో కవచ్ సదుపాయాన్ని జోడించడం.
దక్షిణ మధ్య రైల్వేలో కవచ్ 4.0ను విజయవంతంగా ప్రారంభించడంతో, స్వదేశీ రైల్వే భద్రతాపరమైన సాంకేతికత ను పటిష్ఠపరచడంతో పాటు భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో ఆధునిక ఆటోమేటిక్ ట్రయిన్ ప్రొటెక్షన్ సామర్థ్యాలను విస్తరించే దిశగా ఒక కీలకమైన అడుగును వేసినట్లయింది.
***
(రిలీజ్ ఐడి: 2314019)
సందర్శకుల సూచీ సంఖ్య : : 13