సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
‘స్వచ్ఛతా హీ సేవా 2026’లో భాగంగా జాతీయ మీడియా సెంటర్‌లో వైద్య పరీక్షల శిబిరం ఏర్పాటు
పీఐబీ ఢిల్లీకి చెందిన అధికారులు, సిబ్బంది, సఫాయి మిత్రల కోసం శిబిరం నిర్వహణ
నాడు పోస్టు చేయడమైనది:
22 SEP 2026 3:54PM by PIB Hyderabad
‘స్వచ్ఛతా హీ సేవా (ఎస్‌హెచ్ఎస్) 2026’లో భాగంగా ఢిల్లీలోని పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ) అధికారులు, సిబ్బంది, సఫాయి మిత్రల (పరిశుభ్రతా సిబ్బంది) కోసం నేడు న్యూఢిల్లీలోని జాతీయ మీడియా కేంద్రంలో వైద్య పరీక్షలు, సూచనల శిబిరాన్ని నిర్వహించారు.

న్యూఢిల్లీలోని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా (ఆర్ఎంఎల్) ఆసుపత్రి సహకారంతో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శిబిరానికి హాజరైన అధికారులు, సిబ్బంది, సఫాయి మిత్రలకు ఆర్ఎంఎల్ ఆసుపత్రికి చెందిన వైద్యుల బృందం వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్య సలహాలు అందించింది.


పీఐబీ సిబ్బంది సాధారణ ఆరోగ్యం, సంక్షేమాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సఫాయి మిత్రల ఆరోగ్యం, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించారు. శిబిరంలో పాల్గొన్నవారికి వైద్య పరీక్షలు నిర్వహించుకునే అవకాశం కల్పించడంతో పాటు, వైద్యుల నుంచి అవసరమైన సలహాలు పొందేందుకు వీలు లభించింది.
‘స్వచ్ఛతా హీ సేవా 2026’లో భాగంగా ‘సఫాయిమిత్ర సురక్షా ఏవం సమ్మాన్ శిబిరం’ కార్యక్రమం కింద చేపడుతున్న కార్యకలాపాల్లో భాగంగా ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ద్వారా నివారణాత్మక వైద్య పరీక్షలు, ఇతర సహాయక చర్యలతో పరిశుభ్రతా సిబ్బంది సంక్షేమం, ఆరోగ్యంపై దృష్టి సారిస్తున్నారు.
‘స్వచ్ఛతా హీ సేవా 2026’ కార్యక్రమాన్ని కేంద్ర గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ, జల్ శక్తి మంత్రిత్వశాఖ పరిధిలోని తాగునీరు, పారిశుద్ధ్య విభాగం (డీడీడబ్ల్యూఎస్) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. పరిశుభ్రత కోసం ప్రజల సమష్టి భాగస్వామ్యం, స్వచ్ఛంద సేవలను బలోపేతం చేయడం, స్వచ్ఛ భారత్ స్ఫూర్తిని మరింత పెంపొందించడం ఈ ప్రచారం లక్ష్యంగా పెట్టుకుంది.

జాతీయ మీడియా కేంద్రంలో నివారణాత్మక వైద్య పరీక్షల శిబిరాన్ని నిర్వహించడం ద్వారా పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన, అనుకూలమైన పని వాతావరణాన్ని ప్రోత్సహించడంలో పీఐబీ తన నిబద్ధతను చాటింది. కార్యాలయంలో పరిశుభ్రత, పారిశుధ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తున్న సఫాయి మిత్రల ఆరోగ్యాన్ని, సంక్షేమాన్ని, గౌరవాన్ని కాపాడటానికి ఇది దోహదపడుతుంది.
***
(రిలీజ్ ఐడి: 2313594)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10