పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఒపెక్-భారత్ ఇంధన చర్చల 7వ ఉన్నతస్థాయి సమావేశం


సెప్టెంబర్ 22న న్యూఢిల్లీలో జరిగిన ఒపెక్-భారత్ ఇంధన చర్చల 7వ ఉన్నతస్థాయి సమావేశం

నాడు పోస్టు చేయడమైనది: 22 SEP 2026 2:38PM by PIB Hyderabad

కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుశాఖ మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరీ, ఒపెక్ (పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ-ఓపీఈసీ) ప్రధాన కార్యదర్శి శ్రీ హైథమ్ అల్ ఘైస్ సహ అధ్యక్షతన ఒపెక్-భారత్ ఇంధన చర్చల 7వ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో చమురు మార్కెట్ స్థిరత్వం, ఇంధన భద్రత, చమురు పరిశ్రమ వ్యాప్తంగా సకాలంలో పెట్టుబడులు పెట్టడం వంటి అంశాలపై చర్చించారు. ప్రపంచ ఆర్థిక విస్తరణ, ఇంధన డిమాండు వృద్ధిలో భారత్ పోషిస్తున్న కీలక పాత్రను ప్రస్తావిస్తూ.. స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక భవిష్యత్తు అంచనాలను ఇరుపక్షాలు సమీక్షించాయి.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరీ మాట్లాడుతూ.. భారత్, ఒపెక్ మధ్య పరస్పర సహకారం, ప్రయోజనకరమైన సంబంధాలు ఉన్నాయన్నారు. ఈ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఒపెక్ ప్రధాన కార్యదర్శి అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. ఒపెక్, దాని సభ్య దేశాలతో భారత్‌కు ఉన్న దీర్ఘకాలిక సంబంధాలకు ఎంతో ప్రాధాన్యత ఉందని, ఇవి కీలక ఇంధన అంశాలపై పరస్పర అవగాహన, సహకారాన్ని గణనీయంగా పెంచాయని ఆయన పేర్కొన్నారు.

‘‘ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటి. రాబోయే దశాబ్దాల్లో ప్రపంచ ఇంధన డిమాండు పెరుగుదలకు భారత్ కీలకంగా నిలుస్తుంది’’ అని శ్రీ హర్దీప్ సింగ్ పూరీ పేర్కొన్నారు. పెట్టుబడులను ప్రోత్సహించడం, ఇంధన రంగ సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యాన్ని బలోపేతం చేయడం, ప్రపంచ ఆర్థిక వృద్ధి, అభివృద్ధికి విశ్వసనీయమైన ఇంధన సరఫరాలను నిర్ధారించడం కోసం ఉత్పత్తిదారులు, వినియోగదారుల మధ్య నిరంతర చర్చలు అవసరమని ఆయన అన్నారు.

భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, మార్కెట్‌లో ఒడిదుడుకులు నెలకొన్న సమయంలో ప్రపంచ ఇంధన మార్కెట్లలో స్థిరత్వం, పారదర్శకతను ప్రోత్సహించేందుకు ఒపెక్ చేస్తున్న కృషిని శ్రీ పూరీ ప్రశంసించారు. సమతుల్యమైన, స్థిరమైన, ఊహించదగిన ప్రపంచ ఇంధన మార్కెట్‌ను అభివృద్ధి చేయడానికి ఒపెక్, భారత్ కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఒపెక్ ప్రధాన కార్యదర్శి శ్రీ హైథమ్ అల్ ఘైస్ మాట్లాడుతూ.. ‘‘భారత్‌తో చర్చలు ప్రాధాన్యత కలిగిన అంశం. ప్రస్తుత ప్రపంచ ఇంధన పరిస్థితుల్లో భారత్‌కు ఉన్న ప్రాముఖ్యతను మేము గుర్తిస్తున్నందున.. రాబోయే దశాబ్దాల్లో ఈ ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది’’ అని ఆయన అన్నారు. ‘‘2015లో న్యూఢిల్లీలో ప్రారంభమైన ఒపెక్-భారత్ ఇంధన చర్చలు 11 సంవత్సరాలుగా ఎంతో బలంగా కొనసాగుతున్నాయి’’ అని పేర్కొన్నారు.

ఇంధన సవాళ్లను పరిష్కరించడంలో భారత్ అనుసరిస్తున్న సమతుల్యమైన, వాస్తవికమైన, ఆచరణాత్మక విధానాన్ని ఒపెక్ ప్రధాన కార్యదర్శి శ్రీ హైథమ్ అల్ ఘైస్ ప్రశంసించారు. ‘‘భారత్ ఇంధన రంగానికి సంబంధించిన అనేక ప్రాధాన్యతలు ఒపెక్ ప్రాధాన్యతలతో సమానం’’ అని పేర్కొన్నారు.

అంతర్జాతీయ సహకారం, చర్చల పట్ల భారత ప్రభుత్వం చూపిస్తున్న దృఢమైన నిబద్ధతను కూడా శ్రీ అల్ ఘైస్ ప్రశంసించారు. ‘‘ప్రస్తుత కాలంలోని ప్రధాన సవాళ్లను పరిష్కరించడానికి దౌత్యం, చర్చలే మార్గాలని భారత ప్రభుత్వం నిరంతరం ప్రోత్సహిస్తుండటం తమ చర్చల్లో ప్రత్యేకంగా సంతోషం కలిగించే అంశం’’ అని తెలిపారు.

విలువైన సహకారాన్ని అందించినందుకు సమావేశంలో పాల్గొన్న వారందరికీ శ్రీ అల్ ఘైస్ కృతజ్ఞతలు తెలిపారు. ఒపెక్ ప్రతినిధి బృందానికి ఆతిథ్యం అందించిన శ్రీ హర్దీప్ సింగ్ పూరీకి ఒపెక్ సెక్రటేరియట్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ చర్చల పరిధిలో ఇప్పటివరకు సాధించిన పురోగతిని, సాంకేతిక స్థాయిలో సాధించిన అభివృద్ధిని కూడా సమావేశం ప్రశంసించింది. ఒపెక్, భారత్ మధ్య మరింత లోతైన ఇంధన సహకారాన్ని పెంపొందించడం ఎంతో ముఖ్యమని ఇరుపక్షాలు అంగీకరించడంతో సమావేశం ముగిసింది.

ఒపెక్-భారత్ ఇంధన చర్చల 8వ ఉన్నతస్థాయి సమావేశాన్ని ఆస్ట్రియాలోని వియన్నాలో పరస్పరం అనుకూలమైన తేదీన నిర్వహించాలని నిర్ణయించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2313497) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Assamese , Gujarati , Kannada