సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
ప్రధానమంత్రికి వచ్చిన జ్ఞాపికల ఈ - వేలం 2026లో గుజరాత్ సాంస్కృతిక వారసత్వం, సమకాలీన విజయాల ఆవిష్కరణ
ప్రధాని జ్ఞాపికల ఈ - వేలం 8వ విడతలో గుజరాత్ సంప్రదాయ కళలు, వాస్తుశిల్ప వారసత్వం, ఆధునిక ఆవిష్కరణలకు ప్రత్యేక స్థానం
నాడు పోస్టు చేయడమైనది:
21 SEP 2026 6:44PM by PIB Hyderabad
ప్రధాని జ్ఞాపికల ఈ - వేలం (2026) ఎనిమిదో విడతలో గుజరాత్‌కు చెందిన విభిన్న జ్ఞాపికల సమాహారాన్ని ప్రదర్శిస్తున్నారు. రాష్ట్ర సుసంపన్న సాంస్కృతిక వారసత్వం, సంప్రదాయ కళలు, హస్తకళలు, వాస్తుశిల్ప వారసత్వం, వస్త్ర కళలు, సమకాలీన విజయాలకు ఈ జ్ఞాపికలు ప్రతిబింబంగా నిలుస్తున్నాయి. గుజరాత్ సాంస్కృతిక ప్రత్యేకతను ప్రతిబింబించే విశిష్ట రూపాలను ఈ సమాహారం ఒకచోటకు తీసుకొచ్చింది. ఆధునిక భారత్‌కు అందిస్తున్న సేవలతో పాటు రాష్ట్రంలో తరతరాలుగా కొనసాగుతున్న సంప్రదాయాలను ఇవి చాటిచెబుతున్నాయి.
ఆధునిక భారతంతో గుజరాత్ సుసంపన్న సాంస్కృతిక వారసత్వం మేళవింపు
గుజరాత్ జ్ఞాపికల సమాహారంలో రాష్ట్ర వాస్తు కళా వారసత్వం, సంప్రదాయ వస్త్ర కళలు, స్వదేశీ చిత్రకళా సంప్రదాయాలు, క్రీడా విజయాలు, సాంకేతిక ప్రగతిని ప్రతిబింబించే జ్ఞాపికలు ఉన్నాయి.
17వ శతాబ్దానికి చెందిన వడ్నగర్ హట్కేశ్వర్ మహాదేవ్ ఆలయ నిర్మాణ శైలిని ప్రతిబింబించే జ్ఞాపిక ఇది. ఆలయ విశిష్ట అలంకరణలతో పాటు రామాయణం, మహాభారతంలోని ఘట్టాల స్ఫూర్తితో రూపొందించిన అంశాలు ఇందులో కనిపిస్తాయి.
కామన్వెల్త్ క్రీడలు, ఆసియా ఛాంపియన్‌షిప్‌లతో సహా పలు అంతర్జాతీయ పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన గుజరాత్ టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు మానవ్ ఠక్కర్ అందించిన క్రీడా జ్ఞాపిక.
సంప్రదాయ ‘మాతా-ని-పచేడి – ట్రీ ఆఫ్ లైఫ్’ వస్త్ర చిత్రకళ: జ్ఞానం, శక్తి, సౌభాగ్యం, సమస్త జీవరాశుల పరస్పర అనుసంధానాన్ని ప్రతిబింబించే సంప్రదాయ ‘మాతా-ని-పచేడి – ట్రీ ఆఫ్ లైఫ్’ వస్త్ర చిత్రకళ.
మధ్య గుజరాత్‌లోని రాథ్వా, భిల్, భిలాలా వర్గాల సంప్రదాయాలతో ముడిపడిన ఫ్రేమ్‌డ్ పిథోరా చిత్రకళ: పిథోరా కళకు సంబంధించిన సాంస్కృతిక, విశ్వాస సంప్రదాయాలను ప్రతిబింబించే గుర్రాలు, దేవతలు, వివిధ ఆకృతులు ఇందులో చిత్రించారు.
గుజరాత్ వారసత్వాన్ని, సౌరశక్తి రంగంలో భారతదేశం సాధిస్తున్న పురోగతిని ఒక్కటిగా అనుసంధానిస్తూ మోధేరా సూర్య దేవాలయ చెక్కడాలతో రూపొందించిన భారత మొట్టమొదటి సోలార్ టైల్ (సౌర ఫలకం).
గుజరాత్ సాంస్కృతిక వారసత్వం, అభివృద్ధిని ప్రతిబింబించే మరిన్ని జ్ఞాపికలు కూడా ఈ వేలంలో ఉన్నాయి. వీటిలో అంబాజీ ఆలయం, సోమనాథ్ ఆలయం, ద్వారకాధీశ్ జీ ప్రతిరూపాలు, సంప్రదాయ భుజోడి శాలువా, లిప్పన్ కళ, ఎయిమ్స్ రాజ్‌కోట్ ప్రతిరూప నమూనా, అడలాజ్ మెట్ల బావి నిర్మాణ శైలిని ప్రతిబింబించే పొరలతో రూపొందించిన చెక్క జ్ఞాపిక, టాటా ఎలక్ట్రానిక్స్ రూపొందించిన చర్ఖా టు చిప్స్ పేరుతో ఉన్న స్మారక సెమీకండక్టర్ ఫలకం ఉన్నాయి.
ఈ ఏడాది ఎనిమిదో విడత ప్రధాని జ్ఞాపికల సెప్టెంబర్ 17న ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా మొత్తం 1,498 జ్ఞాపికలను ఈ వేలంలో అందుబాటులో ఉంచారు. దేశంలోని విభిన్న కళా సంప్రదాయాలు, సంప్రదాయ హస్తకళలు, సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంప్రదాయాలు, క్రీడా విజయాలకు ఈ జ్ఞాపికలు ప్రతిరూపాలుగా నిలుస్తున్నాయి.
న్యూఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ (ఎన్జీఎంఏ) ద్వారా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఈ - వేలాన్ని నిర్వహిస్తోంది. వివిధ సందర్భాల్లో ప్రధానమంత్రికి లభించిన ప్రత్యేక జ్ఞాపికలను సొంతం చేసుకునే అవకాశాన్ని ఈ కార్యక్రమం ప్రజలు, సేకరణదారులు, సంస్థలు, కళాభిమానులకు కల్పిస్తోంది.
ప్రధాని జ్ఞాపికల ఈ - వేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని గంగా నది, దాని పర్యావరణ వ్యవస్థ పరిరక్షణ, పునరుజ్జీవనం, సంరక్షణ కోసం చేపట్టిన జాతీయ కార్యక్రమం ‘నమామి గంగే’కు వినియోగించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా భారత సాంస్కృతిక వారసత్వాన్ని కీలకమైన జాతీయ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంతో అనుసంధానిస్తున్నారు.
2019 జనవరిలో ప్రారంభమైన ప్రధాని జ్ఞాపికల ఈ - వేలం ద్వారా గతంలో నిర్వహించిన విడతల్లో ఇప్పటివరకు ‘నమామి గంగే’ ప్రాజెక్ట్ కోసం రూ.50 కోట్లకు పైగా నిధులు సమకూరాయి.
ప్రధాని జ్ఞాపికల ఈ - వేలం 2026 ను అధికారిక పోర్టల్ https://pmmementos.gov.in/#/ ద్వారా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు.
***
(రిలీజ్ ఐడి: 2313264)
సందర్శకుల సూచీ సంఖ్య : : 3