కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మోసపూరితంగా సిమ్ కార్డుల జారీ, టెలికాం ఐడెంటిఫైయర్ల దుర్వినియోగం, ఐఎంఈఐ నంబర్ల ట్యాంపరింగ్ పట్ల ప్రజలను అప్రమత్తం చేసిన టెలికమ్యూనికేషన్ల విభాగం ఇలాంటి దుర్వినియోగానికి పాల్పడితే మూడేళ్ల జైలు శిక్ష, రూ.50 లక్షల జరిమానా విధింపు


మొబైల్ కనెక్షన్లు, హ్యాండ్‌సెట్ల ధ్రువీకరణ, సురక్షితంగా ఉంచుకునేందుకు సంచార్ సాథీ పోర్టల్, మొబైల్ యాప్‌ను వినియోగించాలని పౌరులకు సూచన

నాడు పోస్టు చేయడమైనది: 21 SEP 2026 12:23PM by PIB Hyderabad

నకిలీ సిమ్ కార్డుల జారీపై భారత ప్రభుత్వ టెలి కమ్యూనికేషన్ల విభాగం (డీఓటీ) మధ్యప్రదేశ్ (ఎంపీ) ఎల్ఎస్ఏ కఠిన చర్యలు చేపట్టింది. పౌరుల ప్రమేయం, అనుమతి లేకుండా వారి గుర్తింపు పత్రాలను ఉపయోగించి ఛత్తీస్‌గఢ్‌కు చెందిన పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) ఏజెంట్ చట్టవిరుద్ధంగా 25 మొబైల్ కనెక్షన్లను యాక్టివేట్ చేసినట్లు సైబర్ క్రైమ్ దర్యాప్తులో వెల్లడైంది.

డీఓటీ, టెలికాం సేవా సంస్థలు (టీఎస్‌పీలు) కలిసి సంబంధిత పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) కేంద్రాలను బ్లాక్ లిస్టులో చేర్చాయి. దీనివల్ల భవిష్యత్తులో ఎలాంటి మొబైల్ కనెక్షన్లను (సిమ్ కార్డులను) జారీ చేసేందుకు వీలుండదు. 25 మొబైల్ కనెక్షన్లను టెలికాం శాఖ డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫారమ్ (డీఐపీ) ద్వారా పరిశీలించి, అనుమానాస్పదంగా ఉన్నవాటిని పునఃపరిశీలించారు. పునఃపరిశీలనలో సరిగాలేని నంబర్లకు సేవలను వెంటనే నిలిపివేశారు.

డీఓటీ అడ్వైజరీ

టెలికమ్యూనికేషన్ల చట్టం-2023 ప్రకారం... నకిలీ, మోసపూరిత సిమ్ కార్డులను జారీ చేయటం, టెలికాం ఐడెంటిఫైయర్ల దుర్వినియోగం, ఐఎంఈఐ నంబర్లతో తారుమారు చేయటం శిక్షార్హమైన నేరమని టెలికమ్యూనికేషన్ల విభాగం స్పష్టం చేసింది. ఇటువంటి ఉల్లంఘనలకు పాల్పడితే మూడేళ్ల జైలు శిక్ష, రూ. 50 లక్షల వరకు జరిమానా విధించవచ్చు. టెలికమ్యూనికేషన్లకు సంబంధించిన మోసాలను అరికట్టటానికి, పౌరులను రక్షించేందుకు, సురక్షితమైన, విశ్వసనీయమైన టెలికాం వ్యవస్థ కోసం టెలికమ్యూనికేషన్ల చట్టం-2023 నిబంధనలను పాటించటం అత్యంత ముఖ్యం.

సైబర్ మోసాల్లో టెలికాం వనరుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు, సురక్షితమైన సమాచార వాతావరణాన్ని ఏర్పరచేందుకు, ఒక వ్యక్తి పేరిట జారీ చేసిన సిమ్ కార్డులను ఇతరులకు బదిలీ చేయటం, పంచుకోవటం వంటివి చేయవద్దని హెచ్చరించారు. సిమ్ దుర్వినియోగం జరిగితే, దానికి ఎవరైతే అసలు వినియోగదారుడో, వారిపై చట్టపరమైన బాధ్యత ఉంటుంది. తమను రక్షించుకునేందుకు పౌరులు సంచార్ సాథీ పోర్టల్ (www.sancharsaathi.gov.in), మొబైల్ యాప్ ద్వారా మొబైల్ కనెక్షన్లను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవాలని సూచించారు. ఈ వేదిక సంబంధిత వినియోగదారుల పేరిట జారీ చేసిన అన్ని మొబైల్ నంబర్లను తనిఖీ చేసేందుకు, అనవసరమైన, తమవి కాని నంబర్లను బ్లాక్ చేసేందుకు అనుమతిస్తుందిభారతదేశంలో మొబైల్ కనెక్టివిటీ, డిజిటల్ సేవల వేగవంతమైన విస్తరణతో పాటు, సిమ్ కార్డుల దుర్వినియోగం, టెలికమ్యూనికేషన్ ఐడెంటిఫైయర్లు, మొబైల్ పరికరాల ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ (ఐఎంఈఐ) నంబర్‌ వంటి వాటి ట్యాంపరింగ్ తీవ్రమైన ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఇటువంటి దుర్వినియోగం పౌరుల భద్రతను ప్రమాదంలో పడేయటమే కాక, టెలికమ్యూనికేషన్ వ్యవస్థల భద్రత, సమగ్రతకు ముప్పును కలిగిస్తుంది. ప్రత్యేక టెలికమ్యూనికేషన్ ఐడెంటిఫైయర్ల ట్యాంపరింగ్‌ను, దుర్వినియోగాన్ని నిరోధించేందుకు భారత ప్రభుత్వం కఠినమైన చట్టపరమైన నిబంధనలను అమల్లోకి తెచ్చింది.

పౌరులు చేయకూడని పనులు

పలు అంశాలపై పౌరులను హెచ్చరించిన టెలికమ్యూనికేషన్ల విభాగం (డీఓటీ):

  • ట్యాంపర్ చేసిన లేదా మార్పులు చేసిన ఐఎంఈఐ నంబర్లు గల మోడెమ్‌లు, మాడ్యూల్స్, సిమ్ బాక్స్‌లు, ఇతర పరికరాలను వినియోగించటం, కొనుగోలు చేయటం లేదా అమర్చటం.

  • తప్పుడు పత్రాలు, మోసం, వేషధారణ ద్వారా సిమ్ కార్డులను పొందటం.

  • తమ పేరు మీద తీసుకున్న సిమ్ కార్డులను, వాటిని దుర్వినియోగం చేసే అవకాశం ఉన్న ఇతరులకు బదిలీ చేయటం, విక్రయించటం, అప్పగించటం.

  • కాలింగ్ లైన్ ఐడెంటిటీ (సీఎల్ఐ), ఇతర టెలికాం ఐడెంటిఫైయర్లను మార్చేందుకు మొబైల్ అప్లికేషన్లు, వెబ్‌సైట్లు, ఇతర మార్గాలను ఉపయోగించటం.

  • సొంత పేరుపై సిమ్ కార్డులను పొంది, తద్వారా సైబర్ మోసాలు, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో దుర్వినియోగం చేసేందుకు ఆ సిమ్ కార్డులను అద్దెకు ఇవ్వటం, ఇతరులు వినియోగించుకునేందుకు ఇవ్వటం. ఇలా చేస్తే అసలు వినియోగదారుడిపైనే చట్టపరమైన చర్యలు ఉంటాయి.

  • ట్యాంపరింగ్ అయిన ఐఎంఈఐ నంబర్లున్న పరికరాలను వినియోగించటం, మోసపూరిత మార్గాల ద్వారా సిమ్ కార్డులను పొందటం, దుర్వినియోగం చేసే వ్యక్తులకు సిమ్ కార్డులను బదిలీ చేయటం వంటివి తీవ్రమైన చట్టపరమైన పరిణామాలకు దారితీస్తాయి.

సంచార్ సాథీ ద్వారా వెరిఫికేషన్, రిపోర్టింగ్

టెలికమ్యూనికేషన్ వనరుల దుర్వినియోగాన్ని నివారించేందుకు, భారతదేశ టెలికమ్యూనికేషన్ వ్యవస్థ భద్రతను బలోపేతం చేయటానికి ప్రభుత్వం పటిష్టమైన చర్యలను అమలు చేసింది. పౌరులు మొబైల్ కనెక్షన్లను, పరికరాలను ధ్రువీకరించుకునేందుకు, రక్షించుకునేందుకు సంచార్ సాథీ కార్యక్రమం ద్వారా అందుబాటులో ఉన్న వివిధ సేవలను ఉపయోగించుకోవచ్చు. మొబైల్ హ్యాండ్‌సెట్లను ధ్రువీకరించేందుకు, సురక్షితం చేసుకునేందుకు పౌరులు అప్రమత్తంగా ఉండాలని, సంచార్ సాథీ ద్వారా లభించే డిజిటల్ సాధనాలను సద్వినియోగం చేసుకోవాలని డీఓటీ కోరింది..

మొబైల్ హ్యాండ్‌సెట్ ఐఎంఈఐ వివరాలను సంచార్ సాథీ వేదికలో... మీ మొబైల్ హ్యాండ్‌సెట్ ప్రామాణికతను తనిఖీ చేయండి అనే ఆప్షన్ ద్వారా ధ్రువీకరించవచ్చు. పౌరులకు బ్రాండ్ పేరు, మోడల్ పేరు పరికరానికి సంబంధించిన తయారీదారు సమాచారం వంటి వివరాలను తనిఖీ చేయటానికి ఇది వీలు కల్పిస్తుంది.

వేదికపై అందుబాటులో ఉన్న వివిధ పౌర-కేంద్రీకృత సేవలను పొందేందుకు www.sancharsaathi.gov.in లోని సంచార్ సాథీ పోర్టల్‌ను పౌరులు సందర్శించాలని లేదా సంచార్ సాథీ మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని ప్రోత్సహిస్తున్నారు.

ఆండ్రాయిడ్ మొబైల్స్ కోసం: https://play.google.com/store/apps/details?id=com.dot.app.sancharsaathi

ఐఓఎస్ మొబైల్స్ కోసం: https://apps.apple.com/app/sancharsaathi/id6739700695

మరిన్ని వివరాల కోసం డీఓటీ హ్యాండిల్స్‌ను ఫాలో అవ్వండి:

ఎక్స్ - https://x.com/DoT_India

ఇన్‌స్టాhttps://www.instagram.com/department_of_telecom?igsh=MXUxbHFjd3llZTU0YQ==

ఎఫ్‌బీ- https://www.facebook.com/DoTIndia

యూట్యూబ్‌: https://youtube.com/@departmentoftelecom?si=DALnhYkt89U5jAaa


(రిలీజ్ ఐడి: 2313256) సందర్శకుల సూచీ సంఖ్య : : 11
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Gujarati , Tamil , Kannada